కవిత్వం

హోళీ

ఏప్రిల్ 2017

డగడాలంటూ అసలు ఏమున్నాయ్
ఎవరికెవరం అని…
మనిద్దరం
రంగుల వానలో ఎదురైన అపరిచితులం.

ఎక్కడో ఉండే వుండొచ్చు కూడా
ఇంకొంచెం దూరం
అటో
ఇటో –
తప్పదని విధిగా వొచ్చిన చోటుకే తిరిగి వెళ్లి
నాటిరోజునే తలుచుకుంటూ
ఇలా నాలానే అందరిమధ్యనుంచి ఆ రంగుల్లోకి ఆలోచనలా అలా నువ్ తరలిపోయీ…

ఎక్కడసలు నువ్వుండేది
ఎలా నిన్ను తెల్సుకునేది…?
గుప్పెడు రంగేదో చల్లిపోయావ్.
ఇప్పుడు
ఎలా నిన్ను మరిచిపోవాలో, అద్దంలో నేనే అని నన్నెలా గుర్తుపట్టాలో…?

లోకంలోని ప్రతి రంగూ ఓనాటికి వెలిసిపోతుందని విన్న వాణ్ణి

రేపెప్పుడో ఏ ఊహించని ఏ మలుపులోనో ఎదురై చెప్పవుకదా…
ఆరోజు కూడా అలాంటిదే అని.