కవిత్వం

పుస్తకానికో నివాళి

ఏప్రిల్ 2017

పుస్తకాన్ని మూసేసి జీవితాన్ని తెరిచిన క్షణాన
ఓడరేవులనుంచి పీలగొంతుల అరుపులు,
ఇసుకలో తవ్వుకుంటూ స్వదేశానికి సాగిపోయే రాగితెడ్ల చప్పుళ్ళు
వినపడతాయి.
రాత్రిళ్ళు ద్వీపాల మధ్యన మా సముద్రం
ఎగిరిదూకే చేపలతో తుళ్ళిపడుతుంది,
దేశపు పాదాల్ని తాకి, తొడలమీదుగా పైపైకి ఎగబాకి,
పాలిపోయిన పక్కటెముకల్ని చేరుతుంది.
రాత్రంతా తీరాన్ని కావలించుకు పడుకుని,
తెల్లారేసరికి గిటార్ తీగల్ని ఉన్మత్తపరిచే
పాటలతో నిద్రలేస్తుంది.

అదిగో.. ఆ మహా తరంగం పిలుస్తోంది.
ఆ సముద్రపు గాలి పిలుస్తోంది.
నా సావాసగాళ్ళు, తోటి ఉద్యమకారులు పిలుస్తున్నారు.
మైన్ యూనియన్ నుండి ఒక ఉత్తరం వచ్చింది.
నాకు అత్యంత ప్రియమైన ఒక మనిషి (పేరు రహస్యం),
నన్ను మా దేశానికి వచ్చెయ్యమని రాసింది.

ఏ పుస్తకమూ కాగితపు బంధనాలతో నన్నుచుట్టెయ్యలేదు.
అచ్చు అక్షరాల ఆడంబరంతో నాలోపలి ఖాళీల్ని నింపలేదు..
తన అందచందాలతో నా కళ్ళని కట్టిపడెయ్యలేదు.

పుస్తకాల్లోంచి బయటపడి మానవోద్యానవనాల్లోకి,
నా బొంగురుగొంతు పాటల్తో వచ్చి చేరతాను.
మండే లోహాలతో పని చెయ్యటానికి,
కొండవాలున పొయ్యిగట్టు మీద
పొగవాసనల మధ్య,
కాల్చిన మాంసాన్ని తినడానికి
ఈ జనాల్లో చేరతాను.
నాకు పుస్తకాలన్నా, సాహసాలన్నా ఇష్టం.
అడవులు, అగాధాలు, మంచుసోనలు, ఆకాశ వీధులూ- వీటిని చూపించే పుస్తకాలంటే..
కానీ యువకుల్ని ఈగల్లా చుట్టుముట్టి రొద చేసేవీ.,
తప్పుడు తలపులతో, విషపు తీగల ఉచ్చులో వేయ్యజూసేవీ అంటే మాత్రం కంపరం.

పురాణ గాధల్ని విదిలించుకుని
చెప్పులనిండా దుమ్ముతో నేను నా దారిలో ఉన్నాను.
పుస్తకాలన్నిటినీ అలమరల్లోకి తోసేసి,
వీధుల్లోకి నడచి పోతున్నాను.
నేను జీవితం గురించి జీవితాన్నుంచే నేర్చుకున్నాను.
ఓక గాఢమైన ముద్దు నుంచే ప్రేమంటే ఏమిటో తెలుసుకున్నాను.
కాబట్టి, నేనెవరికీ ఏమీ బోధించలేను.
కానీ కొన్నున్నాయి;
మనుషుల్లో ఒకడిగా కొన్నాళ్ళు బ్రతికిన సంగతి
వాళ్లతో పోరాడిన సంగతి
వాళ్ళు చెప్పలేని మాటల్ని నా బొంగురు పాటలో పాడిన సంగతీ…
వీటిని మాత్రం గొంతెత్తి చెప్పుకోగలను.

Original: Ode to the Book (Elemental Odes) by Neruda
అనువాదం: స్వాతికుమారి