రవయిత: సుజాత
అనువాదం: అవినేని భాస్కర్
కాలేజినుండి తిరిగొస్తుండగా వర్షం బలపడి, చివరి ఫర్లాంగ్ లో ముద్దగా తడిసిపోయింది రాజ్యలక్ష్మి. ఇది చాలదన్నట్టు రయ్యిమని పోతున్న సిటీబస్సొకటి బురద నీళ్లని వంటిమీద చిమ్మేసిపోయేసరికి ఇల్లు చేరేసరికి కోపం నషాళానికంటింది. పాలవాడు రాలేదు. మేనక ఇంటికి తాళం వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంట్లో టెలిఫోన్ ఆగకుండా మోగుతోంది. అమె కళ్ళల్లో కోపం తాండవిస్తోంది. గుప్పిళ్ళు బిగించడంతో, రక్తం స్థానచలనం చెంది మణికట్టు పాలిపోయింది.
రాజ్యలక్ష్మీ, కోపాన్నితగ్గించుకో. లేకపోతే బ్లడ్‌ప్రెషర్ తగ్గదు. పాలురాకపోతే పోనీ? మేనక లేట్ గా వస్తే రానీ? ఫోన్ అలా మోగి చావనీ..
మేనక భయపడుతూ సైకిల్ దిగింది.
రాజ్యలక్ష్మి కోపాన్ని ఇంకా పెంచింది. ఆ అమ్మాయి వేసుకున్న పాంటూ, గుండీలూ ఎగాదిగా పెట్టుకున్న షర్టు!
“ఎప్పుడొచ్చావమ్మా?”
“ఫోన్ మోగుతోంది.. తలుపు తియ్యి” అదిలించింది.
“ఈజీ మమ్మీ!”
“సరే పోవే.. తలుపు తియ్యి ముందు.. తర్వాత పెద్దవాళ్ళకి పాఠాలు చెప్దువుగానీ”
“లుక్ అట్ దిస్! నేనేం పాఠాల్చెప్పానని?”
తలుపు తీసి ఫోనుకోసం పరుగెట్టి తీసేలోపు మూగబోయింది.
“ఛా..”అని అసహనంగా సోఫాలో కూలబడింది.
“రిలాక్స్ అమ్మా! ముందు ఆ తడిచీర మార్చుకుంటావా?” అంది.
అంత కోపంలోనూ నల్లత్రాచులాంటి పొడవైన మేనక జడ రాజ్యలక్ష్మిని భయపెట్టింది. పెళ్ళి చెయ్యాలి. మంచి అబ్బాయిని చూసి.. నా మొగుడి లాంటివాడు కాకుండ.
ఫోన్ మళ్ళీ మోగింది. మేనక తీసింది.
“……?”
“రాంగ్ నంబర్” అంది.
అవతలివాళ్ళు మళ్ళీ ఏదో అడిగారు. మేనక, “అవును.. నంబర్ కరెక్టే. మీకెవరు కావాలి?”
“……?”
“మిసెస్ రామచంద్రన్ అని ఎవరూలేరిక్కడ”
“తప్పుకోవే..”అని ఫోన్ లాక్కుంది రాజ్యలక్ష్మి…
“ఎవరమ్మా మిసెస్ రామచంద్రన్?”
“రామచంద్రన్ మీ నాన్న పేరు” మేనకతో చెప్పి ఫోన్ అందుకోగానే రాజ్యలక్ష్మికి చేతులు వణికాయి.
“హలో… ఎవరు?”
“మిసెస్ ఏ.వీ. రామచంద్రన్ ఇల్లాండీ? నంబర్ ఇచ్చారు” అని వినిపించింది, మధ్యవయస్సు ఆడ గొంతులో.
“అవును. మీరు ఎవరు?”
“నేను ఎం.ఆర్. హాస్పిటల్‌నుండి మేట్రన్ ని మాట్లాడుతున్నాను”
“ఏంటి విషయం?”
“మీ హస్బెండ్ ఇక్కడ అడ్మిట్ అయ్యి, గత వారం రోజులుగా స్పృహలేకుండ పడి ఉన్నారు. అడ్మిషన్ రిజిస్టర్ లో అడ్రస్సూ ఫోన్ నెంబరూ ఉన్నాయి. చార్జీలేవీ ఎవరూ కట్టలేదు.. అందుకనే..”
“ఆయనకేమైంది?”
“త్రాంబోసిస్. స్పృహలేకుండ ఉన్నారు. టోమోగ్రఫి స్కాన్ తీయమని రాశారు డాక్టర్. అయితే, ఎవరూ డబ్బు కట్టలేదుకాబట్టి..”
మేనక రాజ్యలక్ష్మికేసి పరీక్షగాచూస్తూ ఉంది..
“అడ్రస్ చెప్పండి”
“ఎం.ఆర్. హాస్పిటల్ తెలియదా? పూందమల్లి హైరోడ్ లో ఈగా థియేటర్ దాటగానే…”
“రూం నెంబర్? ”
“పద్నాలుగులో పడుకున్నారు. వస్తున్నారా? క్యాష్ గా తీసుకొస్తే మంచిది.”
“ఎంత కట్టాల్సి ఉంటుంది?”
“సుమారు పదిహేడు వందలు”
“సరే.. వస్తాను” అంది రాజ్యలక్ష్మి.
“ఎవరమ్మా?”
“మీ నాన్న”
“ఏంటట?”
“హాస్పిటల్లో స్పృహలేకుండ ఉన్నారట”
“అయితే?”
“డబ్బులు కట్టాలంట.. డిస్చార్జ్ చేయించుకుని..”
“ఏంటి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఎవడు వాడు? వాడిగురించి నీకు ఫోన్ చెయ్యడం ఏంటి?”
“వాడు వీడు అని అనకు.. ఎంతైనా మీ నాన్న”
“నో మమ్మీ, నో… ఆ మనిషి నిన్ను వదిలేసి ఎన్నేళ్ళైంది?”
అప్పుడు మేనక మూడేళ్ళ పాప.
“వాడి ముఖం కూడా తెలీదమ్మా. నిన్ను దిక్కులేనిదానిగా వదిలేసి.. ఎవతితోనో.. దాని పేరేదో చెప్పావే.. ఏంటి?”
“పునీతవల్లి”
రాజ్యలక్ష్మి తడిచీర మార్చుకుని, గబగబా తలదువ్వుకుని, పర్స్ లో డబ్బులు లెక్కపెట్టి, చెక్ బుక్ తీసి దగ్గర పెట్టుకుంది.
“మా, నేను చెప్తున్నది వినిపించట్లేదా?”
“ఏంటి?”
“అక్కడికి వెళ్తున్నావా?”
“అవును. నువ్వు కూడా వస్తున్నావు!”
“నో వే! అది ఈ జన్మలో జరగదు”
“మేనకా, ఈ చర్చలూ వితండవాదాలూ తర్వాత చెయ్యొచ్చు. ఇప్పుడు నాతో రావలసిందే. లోపలికొచ్చి చూడకపోయినా పరవాలేదు. హాస్పిటల్ వరకు రా”
“మమ్మీ, నీకు పిచ్చిపట్టిందా?”
పవుడర్ పూసుకుంటూ నుదుటిబొట్టుని కాస్త పెద్దది చేసుకుంటూ, “చూడు, మీ నాన్నో, నా మొగుడో కాదు ఒక స్ట్రేంజర్ అనుకుందాం..”
“మమ్మీ, యూ ఆర్ అన్బిలీవెబుల్! భారత నారి! ఏంటీ మదరిండియా వేషం?– పదిహేనేళ్ళుగా పట్టించుకోని వెధవకి”
“అంతకు ముందు పదిహేనేళ్ళుగా పరిచయం!”
“ఇది పిచ్చితనమే. నేను భరత్ కి ఫోన్ చేసి చెప్తాను”
“తర్వాత చెప్పొచ్చు. వస్తున్నావా, నేనొక్కదాన్నే వెళ్ళనా?”
ఆటోలో వెళ్తుండగా ఆగకుండ కురిసే వర్షానికి కాళ్ళ దగ్గర చీర కొంచం తడిచింది.మిట్లపల్లాలలో ఆటో కుదిపేస్తోంది, వర్షపు హోరు మధ్యలో మేనక చిరాగ్గా సణుగుతూనే వచ్చింది.
“అలాంటి మనిషికి ఇలాంటి పెళ్ళాం”
“వాగుడాపు. వెళ్ళి పరిస్థితేంటో కనుక్కుందాం ముందు”
“చచ్చుంటాడు. ఖాళీ గ్లాసు”
ఎందుకోసం అతన్ని చూడాటానికి వెళ్తున్నాను? నన్ను పెట్టిన హింసలకి, చేసిన ద్రోహానికి భగవంతుడు ఇచ్చిన శిక్షని స్వయంగా చూసి ఋజువు చేసుకోవాలనా? లేకుంటే, అపకారం చేసినవారు సిగ్గుపడేలా ఉపకారం చెయ్యడానికా.. ఎందుకిలా తాపత్రయపడిపోతున్నాను? ఎందుకని పదిహేనేళ్ళుగా చూడని భర్తకోసం వెళ్తున్నా?
“ఈ ఉత్తరం ఎవరు రాశారు? ”
“చదివావుగా.. చివర్లో ఏం రాసుంది – పునీతవల్లి అనేగా? ”
“ఎవరీ పునీతవల్లి?’’
“ఎవరైతే నీకేంటి?”
“ ఫ్రెండా?”
‘ఇప్పటికి అంతే’
‘తర్వాత?’
‘పెళ్ళి చేసుకునే చాన్స్ ఉంది.’
‘ఇలా గుండెల్లో పొడిచినట్టు తాళికట్టిన పెళ్ళానికే సూటిగా చెప్తున్నారు.. సిగ్గులేదూ? ఇదేమైనా న్యాయంగా ఉందా? మీకు నేను ఏం తక్కువ చేశానని?
‘ఏం తక్కువ చెయ్యలేదు రాజి.’
‘మరి ఇదేంటి?’
‘అదొక అవసరం రాజీ. నీకు చెప్పినా అర్థం కాదు. నీకు ఎలాంటి లోటూ లేకుండ..’
‘మీ నాన్నకి టెలిగ్రాం ఇచ్చి పిలిపించండి’
‘వెంటనే రప్పిస్తాను. నాకేం భయంలేదు’
‘నాకు దిక్కు లేదు, ధైర్యం లేదు, చదువు లేదు, సమర్థత లేదు.. ఒక ఉద్యోగం సద్యోగం చేసే వీల్లేదనేగా మీరిలా చేస్తున్నారు’
‘బీ రీజనెబుల్. దీనివల్ల నీకేం ఇబ్బంది రాదు. నీలో లోపం ఉందని కూడా నా ఉద్దేశం కాదు. ఎంతోమంది ఇద్దరు పెళ్ళాలతో సంతోషంగా ఉన్నారు, తెలుసుకదా? ఏడుకొండలవాడే శ్రీదేవి, భూదేవి అని..’
‘దీనికి నేనొప్పుకోను’
‘ఐనా ఇప్పుడు ఎవరు పెళ్ళి చేసుకుంటానన్నారు? మాటవరసకన్నానంతే. పిచ్చిదానా… వెళ్ళు, మొహం కడుక్కుని గుడికెళ్ళిరా..’
‘దయచేసి నాకు ద్రోహం తలపెట్టకండి. నాకు అమ్మానాన్నలు లేరు. అన్నయ్య ఇంట్లో నాకు చోటు లేదు. ఒంటరిగా ఈ సమాజంలో జీవించలేను. ప్లీజ్! నన్ను వదిలెళ్ళకండి.’
‘చీ, అలా ఏం జరగదు. పైకి లే.. కాళ్ళు పట్టుకోకు!’
మేనక రిసెప్షన్ లో ఉంటాను అంది. “నేను ఎవరినీ చూడాలనుకోవట్లేదు. అర్ధగంట సేపు కూర్చుంటా, అంతే” అంది.
“ఎక్కడికీ వెళ్ళకే బంగారం. ప్లీజ్, ఈ ఒక్క రోజు నా మాట విను”
“ఏడవకు, వెళ్ళు”
14వ నంబర్ గదిని చేరుకుంది రాజ్యలక్ష్మి. ఫ్యాన్ గాలికి ఊగుతున్న తెల్లని తెరకి అవతల, డ్రిప్ పెట్టి దుప్పటి కప్పిన మనిషి పడుకుని ఉన్నాడు. నోట్లో ట్యూబ్ పెట్టి ఉంది. గదిలో ఇంకెవరూ లేరు. రాజ్యలక్ష్మి బెడ్ దగ్గరకి వెళ్ళింది. తనకి తెలీకుండానే కళ్ళు చెమర్చాయి రామచంద్రన్ ని చూడగానే. వారంరోజుల మాసినగడ్డం. ఇంజెక్షన్ కోసం చాలా చోట్ల పొడిచిన గాయాల్లో రక్తపు మరకలు నల్లగాకనిపిస్తున్నాయి. నోరు తెరచుకుని ఉంది. ఊపిరి పీల్చుకునే శబ్దం వినిపిస్తుంది. కళ్ళు మూసుకుని ఉన్నాయి.
‘ఈ ముఖమా.. ఈ ముఖమేనా.. ఇతనేనా నన్ను తరిమేసిన భర్త?’
‘నేను ఎక్కువ రంగా? నువ్వు ఎక్కువ రంగా? చెప్పు?’
‘మీరేనండి. సందేహం దేనికి.’
‘చిన్నతనంలో చెవులకి పోగులేసుకుని.. సాగిపోయుంటాయి వజ్రాల బరువుకి. మా నాన్న పాపనాశం మైనర్. పేరుగాంచిన సరసుడు. వెయ్యి ఎకరాలు కరిగించేశాడు.’
“వచ్చేశారా?” అన్న మాట వినిపించి తిరిగింది. ఒక నర్స్ పరుగుకీ నడకకి మధ్య స్థాయిలో లోపలికొచ్చింది. ఆవిడ గర్భవతిలా ఉంది.
“ఇతనే.. ఇతనే..”
“మీరేనా అతని భార్యా?”
“అవునండీ”
“రాజ్యలక్ష్మి అంటే మీరేగా?”
నర్స్ చార్ట్ తీసుకుని చేయిపట్టుకుని గడియారం చూసుకుంటూ నిలబడింది.
“ఇప్పుడెలా ఉంది?”
“డాక్టర్ చెప్తార్లెండి. అయినా, వారం రోజులుగా ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఎవరో ఏంటో ఎలా తెలుస్తుంది మాకు? టోమోగ్రఫి స్కాన్ తీయాలని న్యూరాలజీ ఎన్.ఎస్. అరుస్తున్నారు”
“ఇప్పుడు పరిస్థితేంటి?”
“అదే చూస్తున్నారుగా. బెడ్‌సోర్స్ రాకుండ చూసుకుంటున్నాం అంతే”
“మాట్లాడుతారా?”
“గుండెలమీద కొంచం అదిమిపెట్టి రుద్దితే కళ్ళు తెరుస్తారు. ఆవిడ ఎవరు? ఈయన్నిక్కడ అడ్మిట్ చేశారే?”
రాజ్యలక్ష్మి జవాబివ్వలేదు.
“డిస్చార్జ్ చేయించి ఇంటికి తీసుకెళ్ళిపోవడం మంచిది. ఇక్కడ రోజుకి రెండువందలా యాభై అవుతుందిగా?”
“రామూ సార్” అని బలవంతంగా రామచండ్రన్ ని చాతిపైన గట్టిగా రుద్ది కదిలించింది నర్స్. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు.
“నేను వచ్చాను” అంది రాజ్యలక్ష్మి.
“దిండు మార్చేద్దామా?” అడిగింది నర్స్.
కళ్ళు చెమర్చాయి. చిక్కిపోయిన చేతులు పట్టుకుంది.
“రాజీని వచ్చాను” అంది.
కళ్ళు ఆమెను గుర్తుపట్టే ప్రయత్నం చేశాయా, గుర్తుపట్టాయా, గుర్తుపట్టాక దుఃఖించాయా.. ఏదీ స్పష్టంకాకుండానే మళ్ళీ మూసుకున్నాయి.
“మాట్లాడగలరా?” నర్స్ వైపు చూసి అడిగింది.
“లేదండి. మాటలు, కదలికలు ఏం లేవు. లంబార్ పంక్చర్ చేసినప్పుడు రక్తం క్లాట్ అయ్యి గడ్డలుగా ఉంది.”
“ఆహారం..?”
ఆన్నీ ట్యూబ్ ద్వారానేనండి. ఎన్.ఎస్. వచ్చాక అడగండి. డిస్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళి ఒక నర్సుని పెట్టుకోవడం మంచిది.”
“వాళ్ళు ఎవరూ రాలేదా?”
“ఎవరు? అడ్మిట్ చేసెళ్ళారు అంతే. ఒక తెల్లటి వ్యక్తి ఆవిడతో వచ్చాడు. వాళ్ళలోవాళ్ళే మాట్లాడుకున్నారు. ‘దాన్ని రమ్మని అప్పజెప్పేయ్’ అని వాదులాడుకున్నారు. వాళ్ళతో మేము కాస్త కటువుగా కూడా మాట్లాడాల్సివచ్చింది.. ఆవిడ పేరేదో చెప్పింది. రామూ రామూ అని పిలుస్తూనే ఉది.”
“పునీతవల్లి”
“ఇద్దరు భార్యలా? రామూ సార్, మీరు గొప్పోళ్ళండి” అని రామచంద్రన్ చెంపలమీద మెల్లగా తట్టింది నర్స్. తల కాస్త ఊగింది.
“మీరు మొదటి భార్యా?”
“అవును”
“ఎన్నాళ్ళనుండి ఇలా?”
రాజ్యలక్ష్మి ముఖం పక్కకి తిప్పుకుని మెల్లగా ఏడవసాగింది.
“ఎన్.ఎస్. వచ్చే టైం. ఏడవకండి. కోప్పడతారు”
కళ్ళు తుడుచుకుని “కింద నా కూతురు ఉంది, పేరు మేనక. రమ్మని చెప్తారా?”
“వార్డ్ బాయ్ తో కబురు చేస్తాను. డిస్చార్జ్ చేసికుని తీసుకెళ్ళిపోండి… ఖర్చుతగ్గుతుంది. నాకెందుకో పెద్ద నమ్మకం లేదు. బ్రెడ్ ఏమైనా కావాలంటే చెప్పండి”
“ఇతనా మా నాన్న?” అన్న మాటలు విని వెనక్కి తిరిగింది. అక్కడ మేనక నిల్చుని ఉంది.
“ఇతనేనా ఆ మనిషి?”
“గట్టిగా మాట్లాడకండి. పక్క గదుల్లో పేషెంట్లున్నారు. ఆమ్మాయీ, నువ్వు ఇతని కూతురివా?”
“నాకూ ఇప్పుడే తెలిసింది. మమ్మీ చూసేశావుగా? ఇక వెళ్దామా? లేట్ అయితే ఆటోలు, బస్ లు ఏవీ దొరకవు”
“ఉండు మేనకా. డాక్టర్ వస్తున్నారట. ఒకసారి కలిసి….”
“కలిసి..?”
“పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి. ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలిగా?”
“మమ్మీ, మనం ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం మంచిది కాదు. నేను కింద రిసెప్షన్ లోఎన్క్వైరీ చేశాను. మూడు రోజులకి పేమెంట్ చేశారట. ఆ తర్వాత ఎవరూ రాలేదట. బాలెన్స్ ఇంకా పదిహేడు వందలు ఉంది. ఆది కడితేనే డిస్చార్జ్ చేస్తారు.”
“డబ్బు పెద్ద విషయం కాదు మేనకా”
“ఆవిడ వచ్చారా?” అని నర్స్ ని అడిగింది రాజ్యలక్ష్మి.
“చెప్పాను కదండి. మొదటి రోజు వచ్చారు. ఇద్దరూ ఏవేవో వాగ్వాదం చేసుకున్నారు. తర్వాత ఎవరూ రాలేదు ఇక్కడికి”
“వాళ్ళ అడ్రస్ ఉందా?” మేనక అడిగింది.
“రెజిస్టర్ లో లేదు”
“రెజిస్టర్లో మన అడ్రస్, ఫోన్ నంబర్ అంతా కరెక్ట్ గా ఇచ్చారమ్మా. క్లెవర్ గాచేశారంతా. ఆ పునీతవల్లి ఎక్కడుంటుందో తెలుసుకోవాలిప్పుడు”
“మైలాపూర్ లో ఎక్కడో. ఇప్పుడు ఎందుకు తెలుసుకోవడం?”
“ఎందుకంటావేంటి? ఈ మనిషిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి గుమ్మందగ్గర పడేసి రాడానికి”
“ఏంటి మేనకా?”
“అవునమ్మా. చెప్తున్నా విను. వీడ్ని ఇంటికి గింటికి తీసుకురావాలన్న ఆలోచనేమైనా ఉంటే ఈక్షణమే మానుకో. దొంగతనంగా మన ఇంటి అడ్రస్ ఇచ్చేసి మనమీద బాధ్యత వేసి ఎలావెళ్ళిపోతారు? దిస్ ఈజ్ నాట్ ఆన్.”
“మేనకా, ఈ సమయంలో వీటన్నిటి గురించి ఆర్గ్యూ చెయ్యడం అనవసరం అనిపిస్తుంది” అని నర్స్ వంక ఓర కంట చూస్తూ అంది రాజ్యలక్ష్మి.
“ఆర్గ్యూమెంట్కి కూడా ఆ ప్రసక్తే లేదు సిస్టర్. ఈ మనిషి మా అమ్మని ఎలా ట్రీట్ చేశాడో తెలుసా? మా అన్నయ్య భరత్ చెప్పాడు. అప్పుడు నాకు మూడేళ్ళట. వర్షంలో నిజంగానే సినిమాలో చూపించినట్టే వీధిలోకి తోసేసి తలుపేశాడట. ఒక మెడికల్ షాపులో వర్షం ఆగేంతవరకు తల దాచుకున్నామట. రాత్రి తిండిలేదు. వీళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళి తలుపు తడితే అతని పెళ్ళాం తలుపు తియ్యకుండానే వెళ్ళగొట్టిందట. ఇదంతా ఇమేజిన్ కూడా చేసుకోలేరు మీరు. రా మమ్మీ, వెళ్దాం.”
“అవునా రామూ సార్, అలాంటి మనిషివా నువ్వు?” అని నర్సు అతని చెంపమీద తట్టింది. అనువుగా తల ఆడించాడు.
“ఏ ధర్మం ప్రకారం ఈ మనిషిని మేం తీసుకెళ్ళాలో చెప్పండి”
“ఇప్పుడు ఇతను వేటికీ జవాబిచ్చే స్థితిలో లేడు. ఒక బస్తాలాగ ప్లాట్ఫారమ్మీద వదిలేసినా పడివుంటాడు అంతే”
“చెవులువినిపిస్తాయా?” – మేనక చార్ట్ చూసింది. బోలెడన్ని పేపర్లు, పది రోజుల చరిత్ర రాసుంది. సెరిబ్రల్ త్రాంబోసిస్.. ఎంబాలిజం అని ఏవేవో.
“వినిపించదు” – నర్స్ ఉన్నట్టుండి మాటలాపి చీఫ్ డాక్టర్ వస్తున్నట్టు సైగ చేసింది.
చీఫ్ డాక్టర్ కి పెద్ద వయసేమీ ఉండదు. ముప్పైఐదు ఉండచ్చు. తెల్లకోటు జేబు పక్కన ‘జీ. ఆర్. గోపినాథ్’ అని ఉంది. “హలో! అట్లాస్ట్ సంవన్.. ఏంటమ్మా ఈ మనిషిని అలా వదిలేసి వెళ్ళిపోయారు?”
“ఈమె మొదటి భార్య డాక్టర్”
“ఎవరైతేనేం రోజూ ఎవరో ఒకరు చూసుకోవాలి. అండర్‌స్టాండ్? మీరు డాటరా?”
మేనక తలూపింది.
“లుక్ యంగ్ లేడీ. యువర్ ఫాదర్ ఈజ్ రియల్లీ సిక్. కంట్రోల్ చెయ్యలేని డయాబెటీస్. హైపర్ టెన్షన్, ఆర్టీరియల్ తికెనింగ్, త్రాంబోసిస్ – బ్లడ్ క్లాట్ అయింది. అఫేషియా ఉంది. అన్ని కలగలిపి ఒక పక్కన అంతా పెరాలిసిస్ వచ్చేసింది. చాలా క్లాట్స్ ఉన్నాయి. అన్నిట్నీ కరిగించడానికే ఆపకుండ మందులిస్తున్నాము. ఒక సీ.టీ. స్కాన్ తీయాలి. ఎంత డామేజ్ అని తెలుసుకోడానికి.. ఇతని తాలూకువాళ్లు ఎవవరనిచూస్తే, అడ్మిట్ చేసినవాళ్ళు అసలు కనిపించట్లేదన్నారు. విచిత్రంగా ఉంది!”
“నేను చెప్తాను డాక్టర్”
“మేనకా, నువ్వూరుకో. డాక్టర్, ఇతని ప్రాణానికి ప్రమాదమా?”
“అలా ఏంలేదు. బెడ్ సోర్ లేకుండా చూసుకుని, మందులతోబాటు పూటపూటకీ ఆహారం పెట్టామంటే, పదిరోజుల్లో కొన్ని ఫేకల్టీస్ ని వెనక్కి తెచ్చుకోవచ్చు. లేచినడవలేకపోయినా రైట్ హ్యాండ్ కంట్రోల్లోకి వస్తుందని నమ్మకం ఉంది.
“డాక్టర్, దిస్ బాస్టర్డ్ ట్రీటెడ్ మై మదర్ లైక్ షిట్” అని చెప్పడం మొదలుపెట్టిన మేనకని నెమ్మదిగా తిరిగి చూసి, “లుక్ ఈ మనిషి నా దృష్టిలో ఒక పేషెంట్. ఇతను పర్సనల్ లైఫ్ లో ఎలా ఉండేవాడన్నది నాకనవసరం. ఒక హంతకుడు బెయిల్ మీద వచ్చినా నేను ఇదే ట్రీట్మెంట్ ఇచ్చేవాణ్ణి. నాకు ఇతను ఒక పల్స్, ఒక ఊపిరి, ఒక ఎక్స్‌రే, ఒక స్కాన్ ఇమేజ్, ఒక సిండ్రోం.. అంతే”
“స్కాన్ అని ఏదో అన్నారు. అది తీయడానికి ఎంత ఖర్చవుతుంది?”
“ఆఫీసులో అడగండి, చెప్తారు. రేపు తీయొచ్చు. ఇతణ్ణి ఇంకో పది రోజులైనా ట్రీట్ చేస్తే స్పృహ వస్తుంది. ఇప్పటీకే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఛాతిపైన గట్టిగా రుద్దితే లేచి చూస్తాడు”
డాక్టర్, “రమచంద్రన్ వేక్ అప్ రామచంద్రన్. వేక్ అప్. ఎవరు వచ్చారో చూడండి, వేక్ అప్” అని మొరటుగా కదిపాడు.
“పది రోజుల తర్వాత తను మాట్లాడుతాడా?” అడిగింది మేనక.
“మాటలు రావడానికి కొన్ని రోజులు పట్టొచ్చు”
“చెప్పింది అర్థం చేసుకోగలడా?” రామచంద్రన్ రెప్పలు తెరచుకుని కనుబొమ్మలు కదిలాయి.
“ఇప్పుడే చూచాయగా అర్థం అవచ్చు. ఏంటి రామచంద్రన్, ఈ అమ్మాయెవరో, చెప్పండి. మీ డాటర్”
“అతను పదిహేనేళ్ళుగా చూడలేదు డాక్టర్”
“అవునా? ఎక్కడైనా అమెరికాలో ఉండేదా?”
“లేదు. అశోక్ నగర్ లో” అంది మేనక.
ఇప్పుడు మేనకని పరీక్షగా చూసిన డాక్టర్, “సారీ, పర్సనల్ ట్రాజెడీలా ఉంది. కోలుకున్నాక నిలదీద్దాంలెండి” అన్నాడు.
డాక్టర్ వెళ్ళగానే నర్స్, “ఇతనేనండి ఇండియాలోనే పెద్ద న్యూరో సర్జన్. ఎంత యంగ్ గా ఉన్నారో చూడండి.” మేనక వినిపించుకోకుండ “మమ్మీ, వెళ్దామా?” అంది.
“లేదు. రాత్రికి నేనిక్కడే ఉంటాను. నువ్వెళ్ళి నాకు బట్టలు తీసుకురా. కాలేజీకి ఫోన్ చేసి చెప్పేయ్ నేను రావట్లేదని”
ఏం చెప్తున్నదో వినకుండా మేనక తల్లిని ఆశ్చర్యంగా చూస్తూ నిలుచుని “దిస్ లేడీ ఈజ్ అన్ బిలీవెబుల్” అంది.
“సిస్టర్, ఈ మనిషి పెట్టిన వాత తాలూకు మచ్చ ఉంది మా అమ్మ భుజమ్మీద”
“మేనకా, ఎక్కువ మాట్లాడకుండ వెళ్తావా లేదా?”
మేనక, పడుకునున్న రామచంద్రన్ ని చూసి “చూడవయ్యా భారతీయ సంస్కృతి.. డిస్గస్టింగ్!” అంటూ విసురుగా వెళ్ళిపోయింది.
మేనక వెళ్ళగానే నర్స్ “ఈ వయసులో అర్థం కాదులెండి” అని తన కడుపు తడిమి చూసుకుంది.
రోజూ ఉదయాన్నే మేనక ఆటోలో అవిష్కార్ రెస్టారెంట్ నుండి అమ్మకి టిఫిన్, కట్టుకోడానికి బట్టలు తెచ్చి ఇచ్చి కాలేజికి వెళ్ళేది. సాయంత్రం వచ్చేప్పుడు కాఫీ, టిఫిన్ తీసుకొచ్చేది. తల్లికీ కూతురికీ మధ్య పెద్దగా మాటలు లేవు. రాజ్యలక్ష్మి మాత్రం “ఈరోజు కళ్ళు తెరచి నన్ను చూశాడు” అని చెప్పేది. “గుర్తుపట్టినట్టు ఉన్నాడు. కళ్ళల్లో నీళ్ళొచ్చాయి!”
“మందుల రియాక్షన్ వల్ల అయుంటుంది మమ్మీ. నిన్నొకటి అడగాలి.”వాత మాట్లాడుకోవచ్చు. ముందు కోలుకుని లేచి నడవనీ”
“ఆ పునీతవల్లి గురించి ఏమైనా తెలిసిందా?”
“లేదు. ఆమె చేతులు దులుపుకుందనుకుంటాను”
“పీల్చిపిప్పి చేసి, ఈ మనిషిని అవతలకి ఉమ్మేసినట్టుంది. అది ఉమ్మేసినదాన్నిదాచుకుంటున్నావు మమ్మీ. నువ్వు ఏం నిరూపించుకోవాలని అనుకుంటున్నావు?”
“ఏం లేదు. మేనకా, ఏమీ నిరూపించుకోవాలని లేదు నాకు”
“ఇతను నిన్ను పెట్టిన హింసలన్నీ మరిచిపోయావా?”
“లేదు”
“మరెందుకు?”
“ఏదో ఒక అనాథకి చేస్తున్నా అనుకుంటున్నా. హ్యుమానిటీ అనుకోవచ్చు. దానికి తోడు పాత బంధం ఒకటుంది. అదేంటో మా జెనరేషన్ వాళ్ళకి అదొక తెగని బంధం అనిపిస్తుంది.”
“ఇన్‌క్రెడిబిల్ లేడీ” అని తల్లి దగ్గరకొచ్చి చెంపలు రాసుకుని వెళ్ళింది మేనక.
డాక్టర్ గోపినాథ్ ఊహించినట్టే ఎనిమిదో రోజు రామచంద్రన్ కి పూర్తి స్పృహ వచ్చి, కుడిచేయిని కదపడం వీలైంది. మనుషుల్ని గుర్తుపడుతున్నట్టు అతని చూపుల ద్వారా తెలుస్తోంది.
“నేనేవరో తెలుస్తోందా?” అంది రాజ్యలక్ష్మి.
కళ్ళల్లో నీళ్ళు కారుతుండగా తలమాత్రం ఆడించాడు.
“మాట్లాడలేరా?”
“మాటలు రావడానికి ఇంకా మూడు, నాలుగు రోజులు పట్టచ్చు”
అప్పుడే లోపలికొచ్చిన మేనకని చూసి డాక్టర్ నవ్వి, “మేనకా, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మీ నాన్నకి పూర్తి స్పృహ వచ్చింది. ఏవేవో అడగాలన్నావే? అడుగు. దిస్ మాన్ ఈజ్ లూసిడ్ నౌ.”
“సిస్టర్, ఈ రోజు వార్డ్ బాయ్ కి చెప్పి షేవింగ్ చెయ్యమనండి”
మేనక తండ్రిని కళ్ళార్పకుండ చూసింది.
“మాట్లాడుతున్నారా?”
“లేదు, అర్థం చేసుకుంటున్నారు. ఈమె ఎవరో గుర్తుపట్టారా?” నీళ్ళు తిరిగిన అతని కళ్ళు తేరిపారచూసి గుర్తుపట్టే ప్రయత్నం చేశాయి.
“మన మేనక! అప్పుడు మూడేళ్ళు. మీ కూతురు మేనక.. మేనక.”
రామచంద్రన్ కళ్ళు తన కూతుర్ని మెల్లగా చూపులతో తడిమాయి.
మేనక బెడ్ కి దగ్గరగా వచ్చి నిల్చుంది.
“చెప్పావామ్మా, ఎనిమిది రోజులుగా నువ్వు ఈయనకి చేసిన సేవలన్నీ? మలమూత్రాలతో సహా చూసుకున్నావని? చెప్పావా? నిన్ను నడివీధిలోకి గెంటేసినందుకు ఎలా మమ్మల్నిపెంచి పెద్ద చేశావో? చెప్పావామ్మా? ఎలా ఉద్యోగంలో చేరి మమ్మల్నిచదివించావో.. చెప్పమ్మా… ఈ మనిషికి బుద్ధొచ్చేట్టు చెప్పమ్మా!”
“మేనకా, అదంతా వద్దు. ఊరుకో”
రామచంద్రన్ చేయి మెల్లగా పైకెత్తి, మేనక చేతిలో వున్న నోట్ బుక్ ని చూపించాడు.
“ఏం చెప్తున్నాడు?”
“నోట్ బుక్ కావాలంటున్నాడు”
“పేపర్ కావాలని అడుగుతున్నట్టున్నాడు”
“ఏవైనా రాసిచూపించాలా?”
రామచంద్రన్ తలూపాడు. మేనక దగ్గర్నుండి నోట్ బుక్కూ పెన్నూ తీసుకుని అతని ఒడిలో పెట్టింది రాజ్యలక్ష్మి. రామచంద్రన్ వేళ్ళసందులో పెన్ను పెట్టగా, అతనుమెల్లగా రాశాడు.
“పునీతవల్లి ఎక్కడ?”
**** (*) ****
మూలం: ప్రముఖ అరవ రచయిత సుజాత రాసిన “ముదల్ మనైవి” కథ
రాయబడిన కాలం: 1989 (22.10.1989 – ఆనంద వికడన్ పత్రికలో వచ్చిన కథ. బొమ్మ సౌజన్యం: మరుదు, ఆనంద వికడన్)
ఏమిటి .నిజ జీవితం లో ఇలాంటి రాక్షసులు అరుదు గా ఉంటారు .కానీ రాజ్యలక్ష్మి లాంటి స్త్రీ మూర్తులు కోకోల్లలు ..ఆ క్షమా మూర్తుల వలన స్తీ జాతి కి గౌరవం రాదు .జాలి కలుగు తుంది .
సుజాత గురించి తెలియని వాళ్ళకి చెప్పాల్సి ఉంటుందేమో!
భాస్కర్ చక్కని కధని ఎన్నుకున్నావు. బాగుంది నీ అనువాదం. పునీతవల్లి / రామచంద్రన్ లాంటి పేర్లు లేకపోతే ఇది తెలుగు కధ. అక్కడక్కడ అప్పుతఛ్హులున్నాయి. ఈ సారి సరి చూసుకుంటే బాగుంటుంది. ఒక చిన్న సలహా. ఇదివరకు నువ్వు రాసిన స్క్రిప్ట్ చదవని వారికిస్తే వారి కళ్ళు మన అప్పుతఛ్హుల్ని ఇట్టే పట్టేస్తాయి. రాజ్యలక్ష్మి లాంటి వాళ్ళు ఆ తరంలో ఎక్కువైపొయ్యారు!
అనువాదం సాఫీగా , భావాలను అలాగే ప్రతిబింభించే విధంగా ఉంది. సుజాత గారు వాడిన ఆంగ్ల పదాలను తెలు గీకరించి ఉంటే బాగా ఉంటుందేమో.
పునీతవల్లి ఎక్కడ ? గుండె పగిలిపోయినట్లయింది. కళ్లనీళ్లు . మనుషుల జీవితాలే కథలు.
చక్కని కథ సోదరా! గుండెని తట్టే వాస్తవిక కథనం! ముగింపు ఊహించలేనట్టు ఉంది ఆలోచిమ్పజేసింది. అదే కథకి ప్రాణం! నీ అనువాదం బాగుంది!
Nice translation by Mr Bhaskar
అనువాదం చదువుతున్నట్లే ఉంది తప్ప, ఎక్కడా తెలుగు ఛాయలు కనిపించలేదు.
ఇవి ఓ పట్టాన మింగుడు పడలేదు.
- గుప్పెళ్ళు బిగించడంతో, రక్తం స్థానచలనం చెంది మణికట్టు పాలిపోయింది.
- డాక్టర్ వెళ్ళగానే నర్స్, “ఇతనేనండి ఇండియాలోనే పెద్ద న్యూరో సర్జన్. ఎంత యంగ్ గా ఉన్నారో చూడండి.” మేనక వినిపించుకోకుండ “మమ్మీ, వెళ్దామా?”
( ఇలాంటి అసంపూర్తి వాక్యాలు రెండు మూడున్నాయి. అందో, అన్నాడో చివర్న ఉండాలి కదా?)