ముఖాముఖం

అందరూ ఒకేరకంగా ఎందుకు రాయడం? – కన్నెగంటి చంద్ర

ఏప్రిల్ 2017


న రచనల్ని ప్రచారం చేసుకోటం అలా వుంచి అవి ఎక్కడ అచ్చయ్యాయన్నది కూడా చెప్పడు – గుచ్చి గుచ్చి అడిగితే తప్ప. అచ్చయిన తన పుస్తకాలు ‘మూడో ముద్రణ’, ‘వాన వెలిసిన సాయంత్రం’ ఎక్కడున్నాయో తనకే తెలీని అయోమయం. World Wide Web లో పడి దేనికోసమో ఎందుకో వెతుకులాడుతున్నప్పుడు గూగుల్ క్రాలర్‌కి కూడా దొరకని ఓ మారుమూల పేజీలో తామర తూడులా పాకుతూ తన కవితో, కథో, తుమ్మముల్లులా గుచ్చుతూ వెంటపడి మన స్వానుభవంలోకి చొచ్చుకొస్తుంది.తెలుగు కథలా అనిపించని ఓ కొత్త కథా నిర్మాణం, ఊహించశక్యం కాని ఇమేజరీ కవిత్వం ఇతను మనవాడేనా అన్న సందేహంలో ముంచినా, తనతో సంభాషించిన మరుక్షణం ఇతనొక అచ్చ తెలుగు రచయిత/కవే కాని, మనకాట్టే పరిచయంలేని మరొక తలంలో చరిస్తున్న సాహిత్య సృజనాకారుడని తెలిసిపోతుంది. అలాంటి కవీ కథకుడూ ‘కన్నెగంటి చంద్ర’ తో ‘వాకిలి’ జరిపిన ఇంటర్వ్యూ ఇది. మరిన్ని వివరాలు తన గొంతుతోనే వినండి.

***

మీ పేరు అనుకోగానే గుర్తొచ్చే కథ “ఏం లేదు.” మనుషులు తమ గురించి తాము చెప్పుకునేది, ఒక్కోసారి మనస్పూర్తిగా నమ్మేది కూడా అబద్ధమో, భ్రమో అయ్యుంటుంది. ఈ విషయాన్ని చాలా సరళంగా అన్ఫోల్డ్ చేసిన కథ. ఏ సందర్భంలో, ఎందుకు రాయలనిపించింది ఈ కథ?

ఒక ప్రత్యేక సందర్భమనేం లేదు. ఎప్పటి నుంచో గమనిస్తూ వస్తున్నదీ, నాకు ఆశ్చర్యాన్నీ, ఇబ్బందినీ కలగజేసేదీ. అయితే అది అసహజమేమీ కాదు. అందరికీ తమనూ, తమ కుటుంబ సభ్యులనూ వీలయినంత ఉన్నతంగా చూపించుకోవాలనే ఉంటుంది. కొన్ని సార్లు తెలిసీ, కొన్ని సార్లు తెలియకుండా అదే నిజమని నమ్ముతూనూ. అందుకు ఎవరినీ కించపరచాలనీ కాదు, చిన్న గమనింపు మాత్రమే.

మీరు ఫలానా నారేటివ్ టెక్నిక్ లో కథ రాయాలి అనుకుని రాసినవేమైనా ఉన్నాయా? ఉంటే వాటి గురించి కాస్త వివరంగా చెప్తారా?

ఇలాంటి టెక్నిక్ అని అనుకుని రాసిందేదీ లేదు. కొన్ని సార్లు కథ ఏం రాయాలో అనుకున్నతర్వాత టెక్నిక్ కోసం వెతుక్కుంటే, మరికొన్నిసార్లు కథా, టెక్నిక్ రెండూ ఒకేసారి జత పడతాయి.. మొదటి దానికి పోయిన యేడు రాసిన ‘ఏం జీవితం’ ఉదాహరణ అయితే రెండో దానికి మీరు ప్రస్తావించిన ‘ఏం లేదు’ ఉదాహరణ.

కొన్ని ముగింపులు” మెటాఫిక్షన్ తరహాలో రాయదల్చుకున్నారా? లేక ఒకే ఇతివృత్తం మీద కొద్ది తేడాలతో వస్తున్న చాలా కథల్ని చూసి విసుగనిపించి ఒక చురక అంటించారా?

:-) అలాంటి కథలు విరివిగా వస్తునప్పుడు ఒక కథకి ఎవరో పాఠకుడు ‘ఎప్పుడూ ఇవే కథలా?’అంటూ విసుగుతో పెట్టిన కామెంట్ చూసినప్పుడు తట్టిన కథ అది. అన్ని కథలనూ ప్రస్తావించవలసినప్పుడు ఇక అది మెటాఫిక్షన్ కాక మానదు. నేను అందులో కొత్తకథలేమీ చెప్పలేదు; ఉన్న వాటికి ఫ్రేం మార్చాను, అంతే. అయితే ఇకపై వివాహేతరసంబంధం పై ఎవరయినా రాస్తే కొత్తకథ రాయక తప్పని స్థితి కల్పించాలన్న ఆశ కూడా లేకపొలేదు. కావాలనే, పాఠకులను ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అవకుండా దూరంగా ఉంచడం, పాత్రలపై సానుభూతి కలిగించడానికి రచయితలు తరచూ వాడే టెక్నిక్స్ ప్రదర్శనకు పెట్టాలన్న ప్రయత్నమూ ఉంది.

ఏం జీవితం” కథ రెండు భాగాలుగా ఉంటుంది కదా! మొదటి భాగమంతా అతని కోరిక లేక “ఐడియల్ సిచువేషన్”. రెండో భాగం/ ముగింపు వాస్తవం అని చెప్పదలచుకున్నారా? ఈ కథని రకరకాలుగా అర్థం చేసుకోవచ్చా? వీళ్ళిద్దరు రెండు వేర్వేరు పరిస్థితుల్లోని ఇద్దరు మనుషులు అనిపించేలా కూడా ఉంది. పాఠకురాలిగా నాకనిపించిన మరొక గమనింపు ఏంటంటే- పిల్లలు తండ్రి గురించి చెప్పేవి అన్నీ చాలా పాజిటివ్ మెమరీస్ లానే ఉన్నాయి. ఎలాగూ చనిపోతున్నాడు కాబట్టి ఆ సమయం లో అందరం అలానే మాట్లాడతాం అనే లౌకిక దృష్టితో అలానే ఉంచేశారా?

ఏ కథనయినా రకరకాలుగా అర్థం చేసుకోవచ్ఛు :-) . ముగింపు తప్ప రెండు భాగాలూ అతని సంధికాలపు ఆలోచనలే. ఇక్కడ చనిపోయాక వాళ్ళ మెమోరియల్ సర్వీసులో వాళ్ళ గురించిన జ్ఞాపకాలను తలపోసుకుని ఒక జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. చావు అంత దుఃఖదాయకంగా ఉండనక్కర్లేదనీ, ఒక ఆత్మీయమైన వీడ్కోలుతో ముగించవచ్చనీ అనుకుని రాసింది. వాళ్లు ఆ సమయానికి తగినట్టు మాట్లాడారు, అంతే.

మరొకటి- మిగతా పాత్రల సహజ సంభాషణల మధ్య రచయిత గొంతులోంచి మరొక సమాంతర వ్యాఖ్యానం నడుస్తూ ఉంటుంది. అది ఈ పాత్రల తాలూకు లౌకికతని, మర్యాదని, మెరమెచ్చుమాటల్ని దాటి నిజాయితీగా, విస్తృతంగా లోతుగా, వివరంగా ఒక మనిషి జీవితాన్ని తరచి చూపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి “ఆశపడ్డావు. నిరాశ చెందావు. పేరాస పడ్డావు. మోసం చేశావు, త్యాగం చేశావు. న్యాయం చేశావు, అన్యాయం చేశావు” లాంటి వాక్యాలు. నా ప్రశ్న ఏంటంటే ఈ కథలో రచయిత రెండు ప్లేన్స్ లో పని చేశారు. ఒక్కో ప్లేన్ లో రచయితగా అనుభవించే ఉద్వేగం, చాలెంజ్, బయటి చూపు, లోచూపు వేర్వేరుగా ఉంటాయి. వాటి గురించి కాస్త చెప్తారా?

ఆ రెండో గొంతు రచయితది కాదు, పాత్రదే. (నా కథల్లో రచయిత తొంగి చూడకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను.) ఈ రెండు కోణాలూ ఒక వీడ్కోలూ, ఒక విస్తృతజీవితాన్ని మూల్యాంకనం చేసుకుని సాఫల్యతను గుర్తించడం మాత్రమే గానీ మర్యాదా, దాన్ని దాటిన నిజాయితీలకు సంబంధించినవి కావు.

“నాన్నా, నీకు చాలా ఓపిక. నాకు లెక్కలు కష్టంగా ఉంటే అర్ధరాత్రి దాకా కూచోబెట్టి చెప్పేవాడివి. ఎన్నిసార్లు లెక్క తప్పు చేసినా మళ్లీ మళ్లీ చెప్పేవాడివే కానీ కోప్పడేవాడివి కాదు.” వంటి వాక్యాలు చాలామంది కథల్లో చదివినవే. ఆ రొటీన్నెస్ ధ్వనించడం కోసమే, ఎన్ని కుటుంబాల్లో, ఎన్ని కథల్లో చూసినా దాదాపు ఇవే మాటలు ఉంటాయి కాబట్టి అలానే ఉంచేశారా? తండ్రీ కొడుకుల అనుబంధాన్ని చూపిండానికి మరేదైనా కొత్త ఉదాహరణ, కాస్త ఫ్రెష్ గా ఉంటూనే వాస్తవికంగా ఉండేది ప్రయత్నించాలి అనుకోలేదా?

ఒక మామూలు, సగటు మనిషి బతుకే తీసుకోవాలనుకున్నాను. మనం చదువుతూ ఉంటాం కనక మనకు రొటీన్ కానీ ఆ పాత్రలకు అవి అపురూపంగా తలుచుకోవలసినవే అని.

సెలవురోజు మొదటి ఆట” కథ గురించి మాట్లాడటం మొదలెడితే ఇంటర్వ్యూ మొత్తం దాని గురించే అడగాల్సి వస్తుంది. ఆ ప్రమాదాన్నుండి తప్పించుకోడానికి మీరే ఏదైనా చెప్పండి ఆ కథ గురించి. దీనికి ప్రేరణ ఎక్కణ్ణుంచి వచ్చింది? “ఎంజాయ్ చేసావా?” అనే చివరి ప్రశ్న చాలా విషయాల్ని గుర్తు చేస్తుంది. హారర్ సినిమాలు, రోలర్ కోస్టర్ రైడ్లు, చేదు, ఘాటు ద్రావకాలు కిక్ కోసం గొంతులో పోసుకోవడాలు, ఇతరుల్ని బాధించి ఆనందించడాలు, ఇతరుల బాధను చూసి బాధ పడి ఆ బాధపడినందుగ్గానూ తమని తాము అభినందించుకుని ఆనందించడాలు… ఇలా రకరకాలు.

ఇందులో కథలూ కొత్తవేం కాదు. తరచుగా వినిపించే కంప్లెయింట్ ఏమిటంటే ఒకే సమస్యలపై అవే కథలు మళ్లీ మళ్లీ రావడం. ఆ కథల్ని కొత్తగా ఎలా చెప్పొచ్చన్న ఆలోచనే ఈ కథకి మొదటి ప్రేరణ. ఈ కథలన్నీ ఈ సమస్యలు తీరిపోవడానికి ఉద్దేశించే రాస్తూ ఉన్నారు కానీ ఆ మార్గం నిష్ప్రయోజనమన్న విషయం అర్థం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. అయితే అవి రాసీ, చదివి జాలిపడీ అపరాధభావన నుంచి తప్పించుకోవడం, ఏదో చేసిన తృప్తి పొందడం జరుగుతూనే ఉంటుంది. మనం దయార్ద్రహృదయులమని మనకి మనమే ధ్రువపర్చుకుని ఉన్నతంగా భావించుకునే సమూహంలో చోటు చేసుకునే వీలూ, ఇంకేమయినా చేయడాన్నుంచి తప్పించుకోవడానికి సాకూ కలిపించుకుంటున్నాము. . కథలు చదివీ, సినిమాలు చూసీ జాలిపడి కార్చిన కన్నీరు ఎమోషనల్ హై పొందిన గుర్తు మాత్రమే.

ఒక్కోసారి కథావిమర్శల్లో వింటుంటాం- “ఈ కథలో శైలికన్నా శిల్పానికి పెద్దపీట వేశారు, ఈ కథకుడు కథాంశం మీద కన్నా కథనం మీద ఎక్కువ దృష్టి పెట్టారు” ఇలాంటి కామెంట్లు. ఐతే కథకుడు ఒక వండ్రంగిలాగా కుర్చీ కాళ్ళెంత పొడవుండాలి, దానిపై ఏ నగిషీలుండాలి, ఏ రంగు చెక్క వాడాలి అని పనిగట్టుకుని ఎంచుకుని కథ రాయడం ఎంతవరకూ జరుగుతుంది? ఒక కథ రాసేప్పుడు రచయిత వ్యక్తిత్వాన్ని, అనుభవాన్ని, అంతర్దృష్టినీ బట్టి ఇవన్నీ వాటికవే సహజంగా ఒనగూడుతాయి కదా?

ఏవి ఎంత మోతాదులో ఉండాలో ప్రతి రచయితకీ ఒక అంచనా ఉంటుందనుకుంటాను. అవి సహజంగా సమకూరతాయా, పనిగట్టుకుని ఎంచుకోవాలా అనేది ఒక్కొక్కరికీ ఒక్కో తీరుగా ఉంటుందేమో! ఎవరయినా తమకు నచ్చే కథో లేక పాఠకులకు నచ్చుతుందనుకున్న కథో రాయాలనుకుంటారు కదా!

మీ “కథ కథ” చదువుతుంటే పూర్ణిమ తమ్మిరెడ్డి “ఒక కథ చచ్చిపోయింది” గుర్తుకొచ్చింది (రెండిటికీ స్థూలంగా పెద్ద పోలిక లేకపోవచ్చు కూడా). ఇందాక మనం అనుకున్నట్టు ఇవి ఏదోక కోణంలో మెటాఫిక్షన్ కాక తప్పదు. ఐతే “కథలిలా ఉండాలి, ఉందకూడదు, కథ నుంచి ఇవి ఆశించాలి ఆశించకూడదు.” అనే అభిప్రాయాలకి, చర్చలకి సమాధానంగా మీరీ కథ రాశారనిపిస్తుంది. కథ ఎలా ఉందక్ఖర్లేదో చెప్పడమే ఈ కథ ఉద్దేశమా?

అవును, రెంటికీ సంబంధం లేదు. :-) అవును, అదే ప్రధాన ఉద్దేశం.

ఒక నేను, కొన్ని నువ్వులు” గురించి. చాలా హృదయ విదారకమైన కథ. తనని ప్రేమించానని నమ్మించి ఎక్కడో అమ్మేసిన వాడు రోజుకో రూపంలో తన దగ్గరకి వస్తున్నాడని నమ్మే “తిక్కలదాని” కథ. ఇలాంటి కథలు ఎన్నో ఉంటాయి కానీ, ఇలాంటి కథనం ఎక్కడా చూళ్ళేదు. దీన్లో ఆ అమ్మాయి విచిత్రమైన మానసిక స్థితిని చిత్రించడం కథలో ముఖ్యంగా అనిపిస్తుంది. ఆ చిత్రణతో పాటు కథ చివరి సంభాషణ చాలా తెలివిగా సాగటం చూస్తే రచయిత టెక్నిక్ మీద, చివర్లోని కొసమెరుపు పట్లా ఆశ్చర్యం కలుగుతుంది. ఐతే ఈ ఆశ్చర్యం, విషాదపు రుచిని అధిగమించినట్టు కూడా అనిపిస్తుంది. ఇలాంటి కథలు రాయటం కత్తిమీద సాము కదా? రచయిత ఈ సవాలుని ఎలా ఎదుర్కున్నాడు?
మరో మాట- ఈమాట పత్రికలో ఈ కథకి వచ్చిన ఒక కామెంట్ ఇలా ఉంది- “కానీ మళ్ళీ చివరి పేరాలో కొత్త ప్రేమకథ ఏంటి? ఇంకో పిల్ల వెంటపడ్డాడా?”. ఇక్కడ నిజంగానే కాస్త అస్పష్టత ఉంది. ఏమంటారు?

మరీ విషాదంలో ముంచేసేంతగా పాఠకుణ్ణి ఎమోషనల్ గా మానిప్యులేట్ చేయబుద్ధి కాదు నాకు. అట్లా అనిపించినా అంత కష్టపడి రాసిన కథ ఏమీ కాదు ఇది.

నిజానికి చివరి సంభాషణలోని ఆలోచనతోనే ఈ కథ పుట్టింది. ఇది లినియర్ కథనం కాదన్న దృష్టితో చదివితే చివరి ప్రశ్న తలెత్తదు. అది తర్వాత వేరే కథ అనుకున్నా నష్టమేమీ లేదు.

మీరు రాసిన “ఇంకో సాయంత్రం” కవిత ఒక పూర్తిస్థాయి కథలా ఉంటుంది. మీరు కథ రాయాలనుకుని కవితో లేక కవిత రాయాలనుకుని కథో రాసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?

ఒకటి రాయాలనుకుని మరొకటి కాదు గానీ, ఈ కవిత విషయంలో మాత్రం కథా, కవితా అని ఆలోచించిన గుర్తు. సాధారణంగా కవిత రాయాలనో, కథ రాయాలనో పూనుకున్న తర్వాతనే తతిమావన్నీ ఆలోచించడం.

మీ వూరి గురించి, చిన్ననాటి సంగతులు, సాహిత్యం మీద ఆసక్తి కలగటం, ఆరోజుల్లో ఉన్న ప్రభావాలు ఆ ప్రయాణం….

గుంటూరు దగ్గర సౌపాడు మా ఊరు. వ్యవసాయ కుటుంబం. ఇంజనీరింగ్ అయిందాకా గొడ్ల కాడ పనులూ , పొలం పనులూ మామూలే. ఎందుకో తెలియదు కానీ మా తాతా, నానా ఐదో తరగతి దాటి చదవకపోయినా మా ఇంట్లో పుస్తకాలు చదివే అలవాటు ఉంది. మా తాత మా నాన్ డిటైల్డ్ పుస్తకాలు కొట్టం కాడికి తీసుకుపోయి చదివేవాడు. గుంటూరు నుంచి ఆంధ్రప్రభ కొని తెస్తూ ఉండేవాడు మా నాన. అందులో బాల ప్రభా, మా కజిన్ వాళ్ల ఇంట్లో చందమామా చదవడంతో మొదలు. మా అక్కాయకి కూడా బాగా చదివే అలవాటు కావడంతో నవలలూ ఇంటికి చేరేవి. తర్వాత డిటెక్టివ్ నవలలూ గట్రా. పత్రికలు కాకుండా కాస్త సీరియస్ సాహిత్యం చదివిందీ , కథలు రాసి పత్రికలకు పంపడం మొదలుపెట్టిందీ ఇంజనీరింగ్ లోనే. కవిత్వం అయితే చదవడం కూడా అప్పుడే. భిలాయిలో ఉద్యోగ పర్వం మొదలయ్యాక అక్కడ పెద్దగా రాసిందేమీ లేదు. ఇక్కడికొచ్చాకే న్యూస్ గ్రూప్ లో కవిత్వంపోస్ట్ చేయడమూ, ఈమాట మొదలయ్యాక కథలు మళ్ళీ రాయడమూ.

నాటకాలంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉందా?

మరీ ఎక్కువేం కాదు గానీ ఆసక్తి ఉంది. చిన్నప్పుడు నాటికలు వేసేవాళ్ళం. ఇక్కడ తెలుగు అసోసియేషన్ కోసం చిన్న స్కిట్స్ రాశాను. ఇక్కడి నాటకాలు పెద్దగా చూడ లేదు.

సాధారణంగా ఈరోజుల్లో వస్తున్న తెలుగు, తెలుగేతర కథల గురించి చెప్పండి. మీరు చాలా కథలు రివ్యూ చేస్తారు కాబట్టి, వాటిల్లోని టోన్, కొత్తగా వస్తున్న థీమ్స్ ఏంటి?

నేను చాలా కథలు ఏమీ రివ్యూ చేయను. మూసల్లోంచి బయటికి తొంగి చూసే కొత్తదనం కథల్లోనూ, కథనాల్లోనూ అనుకున్నంత కనబడ్డం లేదు. నేనూ ఇలా రాయగలిగితే బావుణ్ణు అనిపించే కథలు తక్కువే. మిగతా భాషల కథల్లోనూ ఈ తరం కథలు ముందటి తరం కథలంతగా ఆకట్టుకోవడం లేదు.

మీరు సౌపాడులో పెరిగారు కదా. ఆ ప్రాంతపు రైతుల మాటతీరు అక్కడక్కడా మీ కథల్లో కనిపిస్తుంది. ఇటువంటి యాస తెలుగు కథల్లో చాలా అరుదు. గుంటూరు, కృష్ణా తరహా వాడుకల గురించి మీ కథల్లోవి, ఇతరులవీ ఏమైనా గమనించారా? ఇంకో ప్రశ్న. ఆ ప్రాంతపు జీవితం, మనుషులను గురించి చూపిస్తూ రాసిన కథలేమైనా ఉన్నాయా?

గుంటూరు యాసా, మాట తీరూ నా కథల్లో తక్కువే కనిపిస్తుంది. చిన్నప్పటి పదహారేళ్ళ తర్వాత అక్కడ ఎక్కువగా గడిపింది లేదు. ఇప్పుడు రాయాలని ఉన్నా ఆ భాషలో రాయలేను. గుంటూరు మాండలికంలో రాసిన వాళ్లలో మా. గోఖలే ని చెప్పుకోవాలి. పాపినేని శివశంకర్ కథల్లో కూడా కనిపిస్తుంది. భాష ఆధిపత్యమూ, అణిచివేతా అని ఎవరన్నా బాధ పడాలంటే ముందు ఈ రెండు జిల్లాల వాళ్ళే పడాలి.

మీ మీద ఏ రచయితల ప్రభావం ఉంది? తెలుగు రచయితలెవరు? ఇంగ్లీష్ రచయితలు?

మొదట్లో చలం ప్రభావం ఉండేది. ఇప్పుడు పేర్లు చెప్పడం కష్టం. అదే పనిగా ఏ ఒక్కరినో ఫాలో కాలేదు.

తెలియకుండానే నచ్చినవేవో వచ్చి చేరతాయి.

సాహిత్యం రియలిజం , నాచురలిజం, సర్రియలిజం, మాజికల్ రియలిజం , పోస్ట్ మోడర్నిజం వంటి ప్రక్రియల మీదుగా నియో రియలిజం దగ్గరకు వచ్చిందంటున్నారు. దీని గురించి కొంచెం వివరిస్తారా?

పోస్ట్ మోడర్నిజం తర్వాత పోస్ట్ పోస్ట్ మోడర్నిజం అంటున్నారు కానీ అందులో ఇంకా భిన్నాభిప్రాయాలు ఉన్నట్టున్నాయి. వాటి గురించి తెలుసుకోవడమే గానీ లోతుగా అధ్యయనం చేయలేదు.

మీరు మినిమలిస్ట్ రచయిత అంటే ఒప్పుకుంటారా? లేక మీరు నియో రియలిస్ట్ రచయితా?

నన్ను రచయిత అంటేనే నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా అదనపు బరువెందుకు? :-) ఈ లేబుల్స్ పట్టించుకోను.

రేమాండ్ కార్వర్ ప్రభావం మీ మీద ఎంత ఉంది?

ఎంతో కొంత ఉండే ఉంటుంది. ఒక కథ ఇట్లా ముగుస్తుంది – She kept talking. She told everyone. There was more to it, and she was trying to get it talked out. After a time, she quit trying. “ఏం జీవితం” కథ చివరి వాక్యం అక్కడనుంచే వచ్చింది. ఇదీ కథ అని చెప్పేట్టు గాకుండా కథ చదవడం తప్ప మార్గం లేని విధంగా రాయాలనిపించేలా చేసే మాటలు.

తెలుగు కథల్లో మీరు భిన్నమయిన పంథా ఎంచుకొన్నారు. మీ విలక్షణతకు సాహితీ లోకంలో తగిన స్థానం దొరికిందని భావిస్తున్నారా?

భిన్నంగా రాయాలనేగానీ ఒక పంధా అంటూ ఏమీ లేదు. అదేమీ పట్టించుకోవలసిన విషయం కాదు. రాసేశాక ఇంకా కథనెందుకు మోయడం? లేదా కథ నన్నెందుకు మోయడం? దేనికి దొరికిన స్థానం దానికి తగినదే అయి ఉంటుంది. దానితో నాకు పేచీ లేదు.

మీ ‘బతుకు‘ కథ రిసీవ్ చేసుకొన్న పాఠకులు మీ మిగతా కథల్నెలా స్వీకరించారు?

నాకు తెలియదు. నా కథలు అంత ఎక్కువమంది చదువుతారనీ, చదివినా అందరికీ నచ్చుతాయనీ నేననుకోను. వచ్చే కొద్ది ఫీడ్ బాక్ తోటి రచయితలనుంచే. ‘బతుకు’ కథ సంచికలో వచ్చింది కానీ అది అంత గొప్ప కథేం కాదు. వద్దన్నా వినిపించుకోలేదు. :-)

మీకు కథా వస్తువులెలా స్ఫురిస్తాయి? జీవితం? ఆలోచనలు? ఊహలు? స్వప్నాలు? లేక మరొక అనూహ్యమయిన వేరొక తలం? ఎక్కడినించి?

సరాసరి జీవితాన్నుంచి తక్కువే. ఎక్కువగా చదివే రకరకాల నాన్ ఫిక్షన్, రొటీన్ ఫిక్షన్ పట్ల విసుగూ మూలం ప్రస్తుతానికి.

కథ పూర్తవటానికి ఎంత సమయం పడుతుంది?

పూర్తి చేయడానికి మామూలుగా రెండు రోజులు. మొదలు పెట్టడానికి నెలలూ, ఒక్కోసారి ఏళ్ళూ. కొన్ని అట్లా మనసులో అప్పుడప్పుడూ మెదులుతూ ఉంటాయి. ఎప్పుడో బలవంతాన రాయడానికి కూచుంటాను.

కథను తిరగరాయటం?

తిరిగి ఎప్పుడూ రాయలేదు. ముగించాక కొన్ని వాక్యాలు తట్టినప్పుడు జోడిస్తాను.

మీ కథలు ఎక్కువగా వెబ్ పత్రికల్లో వచ్చాయి. మంచి కథలు చదివే పాఠకులకు కూడా వాటి సంగతి తెలియదు. ఆ రకంగా మీ కథా వస్తువుల్లాగే తెలుగు పాఠకులకు మీ కథలూ అందనివే. తెరవెనుక ఎందుకలా?

నా కథలు చాలామంది చదవాలనే కోరికేమీ లేదు నాకు. దాని వల్ల నాకు ఒరిగేదీ లేదు, చదవకపోవడం వల్ల వాళ్ళు నష్టపోయేదీ లేదు. ఎవరికి నచ్చే కథలు వాళ్ళు వెతుక్కుంటూనే ఉంటారు. ఇవి మెయిన్ స్ట్రీమ్ కథలు కావు. పత్రికల్లో అందరూ చదవడానికి తగినవి కాదు. ఎక్కువమంది తిట్టుకుంటారేమో కూడా. అదీ కాక నాకు లైమ్ లైట్ ఇష్టం ఉండదు. కీర్తికాంక్ష లేనివాడినన్న కీర్తి కోసం కాదు :-) నా స్వభావమే అంత. .

మీరు అమెరికాలో అనేక ఏళ్ళు ఉన్నప్పటికీ డయాస్పోరా రచనల జోలికి పోయినట్టు లేదు?

నిజమే. మూడు నాలుగు కథలకు మించి రాయలేదు. ఇక్కడ అంత జీవనవైవిధ్యం ఉండదు. ఊరికే రికార్డ్ చేయడానికి రాయబుద్ధి కాదు. రాయాలంటే బలవంతంగా రాయొచ్చు గానీ ఇక్కడి జీవితానికే పరిమితమై రాయవలసినవేమీ నాకు తట్టలేదు.

ఇక్కడ వస్తున్న తెలుగు కథా రచన పద్ధతికీ మీరు రాస్తున్న ధోరణికీ మధ్య చాలా అంతరం ఉంది. ఎందు చేత?

కొన్ని వదుల్చుకోలేని నమ్మకాలనుకుంటాను. కథకు సాంఘికప్రయోజనముండి తీరాలని నిరంతరమూ నూరిపోస్తుంటారక్కడ. పత్రికలు మూసలు తయారుచేసీ, రచయితలు వాటికనుగుణంగా రాసీ ఒక వలయం ఏర్పాటయింది. నాకు అటువంటి పరిమితులు లేవు. ఎవరి కోసమూ రాయను. నా పౌర బాధ్యతలు వేరు. కథారచయితగా అదనపు బాధ్యతలు ఏవీ మోయను. వెబ్ పత్రికల ప్రోత్సాహం, తోడు ఉన్నాయి.

కథా రచనకూ కవిత్వ రచనకూ మధ్య సృజనలో ఎలాంటి / ఎంత భేదం ఉంది? మీకు ఆ అంతరాల్ని దాటటం కష్టం కాలేదా?

నాణ్యత సంగతి అటుంచితే నా వరకూ కవిత రాయడం తేలిక. ఒక మంచి ఊహో, రెండు లైన్లో తడితే అల్లుకు పోవచ్చు. కథకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కనక కొంచెం ఎక్కువ కష్టపడాలి. ఏది రాసేప్పుడు ఆ ధోరణిలోనే ఆలోచిస్తాను కాబట్టి అదనంగా కష్టమేమీ లేదు.

నవల రాసే ఉద్దేశ్యం ఉందా? ఉంటే ఎప్పటికి పూర్తి చేస్తారు?

ఏదయినా రాయడానికి నాకు మోటివేషన్ ఏమీ లేదు. నాకున్న బధ్దకానికి కథలు రాయడమే ఎక్కువ. నవల ఎప్పటికయినా రాయడమనేది అనుమానమే.

తెలుగులో కొద్ది మంది రచయితలే ప్రయోగాత్మక కథలు రాస్తున్నారు. ప్రయోగాత్మక కథనం కథను ఎలివేట్ చేస్తుందా? లేక గురితప్పిన బాణమవుతోందా?

అందరూ ప్రయోగాత్మక కథలు రాయాలని నేను కోరుకోను. అన్ని రకాల కథలూ రావాలి. వార్త కథ ఎలా కాదో, ప్రయోగమూ అలాగే కథ కాదు. ఇంతకుముందు పలువురు రాసిందే మళ్ళీ రాయాలంటే కొత్తరకంగా రాయక తప్పదు. కథ స్వరూప స్వభావాలు మారుతున్నాయన్న విషయమూ గుర్తించాలి. చివరికి కథ పాఠకుడికి ఏ అనుభూతి మిగులుస్తుందన్నదే ప్రధానం. అది బౌద్ధికంగానో, ఔద్వేగికంగానో ఉత్తేజితం చేయాలి.

పాశ్చాత్య సాహిత్యం బాగా చదివిన వారు కూడా ఈ మధ్యన సాధారణ శైలికే పెద్ద పీట వేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. సాధారణ శైలిలో మామూలుగా రాయటం మంచిదన్న సూచన ఇస్తున్నారు. తెలుగులో మనం కూడా నియో రియలిజంకు దగ్గరకు చేరుతున్నట్టా? లేక రియలిజంకు మరలుతున్నామా?

రియలిజమూ, నియో రియలిజమూ తేడాలు నాకు తెలియవు కానీ సాధారణ శైలి అరుదయినప్పుడు అదే అసాధారణమవుతుంది. అందరూ ఒకేరకంగా ఎందుకు రాయడం? ఇదేమీ సీజన్ కు తగ్గట్టు మారే ఫ్యాషన్ కాదు కదా!

మీరు కథలుకూడా రాసే కవా, లేక కవిత్వంకూడా రాసే కథకులా?

:-) కవిత్వం రాసే కథకుడినే అనుకుంటాను. కవిత్వం చదవడం మొదలెట్టకముందే ఒక కథ ఆంధ్ర పత్రికలో పడింది.

మీ కథల్లో కవిత్వం కనపడుతుందని ఒప్పుకుంటారా?

కష్టం. కథలో కవిత్వం రాయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఒకటి రెండు కథల్లో తప్ప కవితాత్మకంగా రాయాలని ఎప్పుడూ అనుకోలేదు.

ఒంట్లో రక్తం లేని మనిషిని గురించిన కథలో ఉన్నది కవిత్వమా, మాజికల్ రియలిజమా, అబ్సర్డ్ నారేటివా, అవేవీ కావా?

కవిత్వం లేదు కానీ మిగతావి ఉన్నాయి. ఇంకా ఏమయినా కూడా ఉండి ఉండొచ్చు.

మీకు కథకుడిగా రావాల్సినంత గుర్తింపు రాలేదని మీకనిపించిందా?

లేదు. ఈ ప్రశ్న తరచూ వినిపిస్తోంది కనుక కొంచెం పొడిగిస్తాను. నాకు గుర్తింపు మీద మోజు లేదు. నా పేరు లేకుండా నా కథలు ప్రచురించబడినా నాకు సమ్మతమే. ఏదయినా అవార్డ్ లాంటిది వచ్చినా వచ్చిందని ఎవరికీ చెప్పను కూడా. నన్ను గర్వపరిచేదేదీ లేదు. ఇది వినమ్రంగానో, అతిశయంగానో చెప్పడం లేదు.

తెలుగు కథల్లో చాలామంది రచయితలు పూర్తిగా దూరిపోయి చెప్తారని కొంతమంది విమర్శకులు అంటుంటారు. మీ కథల్లో అలా కనపడే సందర్భాలు తక్కువ. అంత బయటనించి indifferent గా కథ చెప్పటం ఎలా సాధ్యపడింది మీకు?

ప్రయత్నపూర్వకంగానే. అది నా నైజం కూడా కనుక తేలిగ్గానే పట్టుబడింది.

ఏదో ఒక తాత్విక నిబద్ధత, నమ్మకం లాంటివేవో ఉండి, కథలన్నీ ఆ పరంగానే నడపాలీ అని చాలా సాహిత్య / రాజకీయ సంఘాలు చెప్తూ ఉంటాయి. మీ తాత్విక నిబద్ధత గురించి చెప్పండి. మీరు సామ్య వాదులా, సాంప్రదాయ వాదులా, సనాతన ధర్మ వాదులా? ఆ ప్రభావం మీ కథల్లో ఎక్కడ ఎలా కనపడింది?

మీరిచ్చిన కేటగిరీలలో అయితే సామ్యవాదినని చెప్పాలి గానీ అది మరీ జనరల్ కంపార్ట్ మెంట్. అన్వేషకుణ్ణే గానీ దేనికీ నిబద్ధుణ్ణి కాను. మౌలికమైన విలువలేవో ఉంటాయి కదా! నా కథల్లో ఏ తత్త్వమూ స్పష్టంగా కనపడదనుకుంటాను. కనపడి తీరాలనీ అనుకోను.

మీలా అమెరికా నించి రాసే రచయితల కథల్లో రీడెబిలిటీ ఎక్కువగా ఉంటుంది అని ఓ అభిప్రాయం ఉంది. అది మీరు గమనించారా? ఎందుకని అక్కడి రచయితలకి అది ఓ ప్రత్యేక లక్షణం అయింది?

ఈ అభిప్రాయం వినడం ఇదే మొదటిసారి. బహుశా మా భాష మేమిక్కడికి చేరేప్పటి కాలంలోనే ఉండిపోవడంతోనేమో!

స్త్రీ పురుష సంబంధాల గురించిరాసేటప్పుడు సజెస్టివ్ గా రాసే వాక్యాలు మీ కథల్లో కనపడతాయి. “నిన్ను గట్టిగా కౌగిలించుకుని ఎన్నాళ్ళయింది” “రెండ్రోజుల క్రితం అనుకుంటా” లాంటి సజెస్టివ్ క్రాఫ్ట్ దాటి ఇంకా సూటిగా తెలుగు కథ ఎందుకు రాలేక పోతోంది? అవసరం లేకనా, భయపడా?

నా వరకూ భయం కంటే అలవాటే కారణమనుకుంటాను. ఇప్పటి కాలపు యువకుడినయి ఉంటే రాసి ఉండేవాణ్ణేమో! అవసరమైనప్పుడు సూటిగా రాయడాన్ని ఆహ్వానిస్తాను. అసభ్యమని దాచి ఉంచనవసరం లేదు. ఒక హెచ్చరిక జతచేస్తే సరిపోతుంది.

**** (*) ****