కథ

ఫోర్ స్క్వేర్

మే 2017

1

పార్థీ బస్తీ.

శుక్రవారం, నవంబరు 11.

రాత్రి 11 గంటలా 11 నిమిషాలు.

*

తలకాయ కూర వండుతోంది తిత్లి.

పొయ్యి వెలుతురులో తిత్లి ముఖం స్మితాపాటిల్ లా వుంది.

నాలుగు రోజులయ్యింది స్నానం చేసి.

కూర గిన్నెలోకి వంగి గంటె తిప్పి ఎడమ చేతిలో వేసుకుని రుచి చూస్తున్నప్పుడు ఆమె ఇరు స్తనాలు నానో సెకండ్ వింత వత్తిడికి లోనయి పచ్చని జాకెట్లోంచి బయటికి తొంగి చూసి నానా రూపాల్లోకి మెలికలు తిరిగి మళ్ళీ చెమటలో తడిసి ముద్దయిన ఎర్రని బ్రా వెనక్కి నక్కివెళ్ళి దాక్కున్నాయి.

నాలుకకి తగిలిన ఫ్రై కర్రీ కారానికి తిత్లి కళ్ళు రెప్పేసాయి.

అవి తేనె కళ్ళు.

సరిగ్గా 74 ఏళ్ళ క్రితం బుందేల్ ఖండ్ నుంచి దిగుమతి అయ్యాయి లాంగిసీ జీన్స్ రూపంలో అవే కళ్ళు.

తిత్లి వాళ్ళ నాయనమ్మే లాంగిసి.

లాంగిసి వాడిన కత్తి ఇంకా తిత్లి వుండే గుడిసె చూరులో దాగే వుంది.

ఆ కత్తి కనీసం 9 గొంతుల గుండా మెత్తగా కదిలే వుంటుంది.

ఆడా, మగా, పిల్లా, ముసిలి, మొగుడూ తేడా తెలియని కత్తి అది.

గండుపిల్లి తలకాయ కూర ఫ్రై దించింది.

పిల్లి పులుసు పొయ్యి మీద పెట్టింది తిత్లి.

పులుసు కోసం పడిగాపులు కాయనక్కర్లేదు. అదే అయిపోతుంది.

లేచింది.

కోబా కోసం చూసింది.

ఇప్పటికే రావాలి.

తిత్లితో పాటు తలకాయ వేపుడూ కోబా కోసం కాచుక్కూచ్చున్నాయి.

తిత్లి.

సికిందరాబాద్ స్టేషన్ ముందు రకరకాల పూసల దండలు, దువ్వెనలు, చిన్న సంతూరు సబ్బులూ, సబ్బు బాక్సులు, చెక్క రోకలి, సంత సత్తు గిన్నెలు, చెక్క ఈర్వెన, ఇనుప జల్లెడ, ముగ్గు జాలీ పోతలు, పౌడర్ డబ్బాలు అమ్ముతుంటుంది.

గంజాయి కూడా.

అయితే గంజాయిని ‘మాల్’ అంటాడు కోబా.

‘పత్తే’ అంటుంది తిత్లి.

ఉత్తరాంచల్ నుంచి, నల్లమల నుంచీ, బెంగళూరు నుంచి ‘మాల్’ తీసుకువచ్చేది మాత్రం బోజి.

తన రెండో మొగుడు తింగేత్ సోక్లా కూడా గంగపుత్ర కాలనిలో జరిగిన దాడిలోనే దారుణంగా చనిపోయిన తర్వాత బోజిని వుంచుకుంది లాంగిసి.

అప్పుడు బోజికి 38 ఏళ్ళుంటాయేమో!

బోజి – లాంగిసి సహజీవనం రెండేళ్ళే.

కానీ బోజి ఈనాటికీ ఒక పెద్ద దిక్కులాగే వుంటున్నాడు కోబా ఇంట్లో ఇంకా.

కాకరవిట్టా నుంచి బోజి ఆ రాత్రే ‘పత్తే’ తీసుకుని వస్తాడని తిత్లి అస్సలు ఊహించలేదు.

నక్సల్బరీ దగ్గరే కాకరవిట్ట. నేపాల్ సరిహద్దే.

సిలిగురి – జలపాయ్ గురి ట్రైన్ లో రోజుల తరబడి ప్రయాణం తర్వాత బోజి ‘మాల్’ తెచ్చాడు.

తిత్లి స్నానం చేసేసింది.

పొయ్యి పైన గండుబిల్లి పులుసు వుడికింది.

కోబా ఇంకా రాలేదు.

తిత్లి తల ఆరబోసుకుంది. విరగబూసిన పున్నాగలా వుంది తిత్లి నగ్నదేహం.

కోబా గురించి బెంగా మొదలయింది.

పులుసూ దించేసింది.

బోజి మెల్లగా పేపర్ లో చుట్టుకుని కొంచెం కొంచెమే పీల్చుతున్నాడు ‘పత్తే’. అంటే గ్రేడింగ్ చేస్తున్నాడు. అలా కనీసం నాలుగు సిగరెట్ల మందం ‘పత్తే’ పీల్చేస్తాడు. కుప్పలు పెడతాడు. ఇక దేన్నిఎంతకి అమ్ముకోవాలో తిత్లి, కోబాల ఇష్టం.

యీ సారి పేర్చిన పత్తే కుప్పలని చూసి 5 లక్షల పైమాటే అనుకున్నప్పుడు తిత్లీ తేనె కళ్ళు మరింత దర్పంగా మెరవడం బోజి కన్ను అరసెకనులోనే ముసిముసిగా గమనించింది.

తిత్లి తేనె కళ్ళకి మేలురకం మాల్ మీద వాలడమొక్కటే తెలుసు. తన ఎనిమిదవ ఏటే ఈ పరీక్ష పాసయ్యింది ఆ కన్ను. బోజీ ఇచ్చిన సర్టిఫికేట్ మరి అది.

కోబా ఇంకా రాకపోవడం తిత్లి కి చెడు శకునం.

సరిగ్గా పదేళ్ళ క్రితం తిత్లిపై అనుమానంతో 11 నెలల పసికందును ‘తనకు పుట్టలేదు’ అని రైలు పట్టాలపైన పడేసి వచ్చినవాడు కోబా.

తిత్లి బెంగ గాభరా అయ్యింది. డిస్ప్లే లేని తన వర్జిన్ డ్యుయల్ సిమ్ మొబైల్ నుంచి కోబాకి కాల్ చేసి కట్ చేసింది. సారా తాగింది. బోజి నుంచి తలకాయ ఫ్రై కూరని కాపాడాలి. మొత్తం తినేసేలా వున్నాడు. ఇక పిల్లి దవడ ఫ్రై కూడా మిగలదు.

పిల్లి కళ్ళంటే కోబాకి చచ్చేంత ఇష్టం. ఆవురావురుమని తినేస్తాడు. ఇంకేమీ పట్టించుకోకుండా.

వేపుడు దాచింది.

తనకోసం బోజి కూర్చిన స్పెషల్ పత్తే సిగరెట్ ని తడబాటులో ఊదేసింది జుఫ్ మని. పులుసు ముక్కలను బోజికి, తనకీ తెచ్చి మరో గ్లాసు సారా పోసుకుంది తిత్లి.

తిత్లి ఎడమ కాలి సత్తు కడియాన్ని చేత్తో ఒడిసి పట్టుకున్నాడు బోజి. అచ్చం కత్తి పిడిలా. నేర్పుగా… అలా… లాగాడు.

అమాంతం బోజి అధీనంలోకి వచ్చింది స్నానం చేసిన ఆ సంతూర్ దేహం.

తిత్లి తన అధీనం మరోసారి కోల్పోయింది.

బోజితో సెక్స్ తిత్లికి చాలా ఇష్టం. బోజికి కూడా. ఇద్దరికీ చాలా రోజులయ్యిందనీ తెలుసు.

రెండు నెలల కింద తనే ఉతికిన బోజి ఆకుపచ్చని జుబ్బాని కసిగా చించేసింది తిత్లి. అది ఆరో జుబ్బా.

మొదటి ఎర్ర చిన గళ్ళ జుబ్బా చిరిగినప్పుడు తిత్లి వయసు 15 ఏళ్ళు. అది రేప్ అని తిత్లి కి తెలుసు. కానీ తర్వాత అలా అనుకోలేదు తిత్లి. లాంగిసికి అది రేప్ అని ఇక తెలియదు.

అమిత ఇష్టమైన తిత్లి పొడవాటి వంకీల జుత్తునంతా పోగేసి తన గుప్పిట పట్టుకుని ఆమె కదలికలని నియంత్రిస్తూ పైకి ఉసిగొలుపుతున్నాడు బోజి.

ఎప్పుడొచ్చాడో తెలియదు కోబా. ఎలా వచ్చాడో తెలియదు. ఎందుకు వచ్చాడో కూడా.

చూరు నుంచి లాంగిసి దాచుకున్న కత్తిని తీసి ఎప్పుడు తిత్లి తల నరికేసాడో తెలియదు.

అంతా క్లిక్ లో జరిగిపోయింది.

తల తెగిన తిత్లి మొండెం అలా… వాలిపోయింది.

మెలివేసిన వంకీల జుత్తు బోజి చేతిలో వుండిపోవటంతో తెగిన తిత్లి తల అలా… గిర్రున తిరిగి వచ్చి బోజి తల వెనకే పడింది.
కోబా ఎత్తిన ఆ కత్తి బోజి బొడ్డు కింద దిగి ఇసుర్రాయిలా తిరిగి పట్టు తప్పింది.

పార్థీ బస్తీకి పోవాలంటే పోలీసులకు వుచ్చ పడుతుంది.

2

డంగిపేట.

నవంబరు 11.

రాత్రి 11 గంటలా 10 నిమిషాలు.

*

రెయిన్ పబ్, 11 వ అంతస్తు.

DJ జోసఫ్ లివింగ్ స్టోన్. ‘’చార్ బోతల్ ఓడ్కా…’’ యోయో నంబర్ నడిపిస్తున్నాడు జో.

పార్టీ ఇస్తోంది సోహెయిల్ ఇస్మాయిలి, గిరికృష్ణ చౌదరి.

కారణం: రేపటి నుంచి గిరి బ్యాచలర్ కాదు.

మాస్క్ కాన్సెప్ట్ తో జరిగే పార్టి అది. అంతా పావురం ఈకలతో తయారు చేసిన సీతాకోకచిలుకల్లాంటి కళ్ళద్దాలు పెట్టుకోవాలి. 29 మంది దాదాపు. ఇవాళో, రేపో హీరోయిన్లు అవబోతున్న అమ్మాయిలూ, ప్రముఖ టివి చానళ్ళలో పేరుతెచ్చుకున్న లేడీ యాంకర్లూ, పెళ్ళి అయిన వాళ్ళూ, కాని వాళ్ళూ వున్నారు.

విడాకుల కోసం అప్లై చేసిన బడ్డింగ్ యాంకర్ అంజలి సోమిరెడ్డి కూడా.

వీళ్ళను పటాయించిన, పటాయించబోతున్న, పటాయించేసామనుకుంటున్న మగవాళ్ళదే తక్కిన సంఖ్య.

రెండేళ్ళ మ్యారిటల్ లైఫ్ తర్వాత సోమవారం ప్రేమ్ తో విడాకులు తీసుకోబోతోంది అంజలి.

‘’Red or White?’’ ఆఫర్ చేసాడు సోహెయిల్, టివి చానల్ లో యాంకర్ గా ఒక వెలుగు వెలుగుతున్న స్వాతి శర్మకీ, ఆమె పక్కనే వున్న అంజలికీ కలిపి.

“Mind not to get a military screwdriver for me … my dear సో’… సో!’’ సోహెయిల్ సొట్ట బుగ్గని సుతారంగా గిల్లింది స్వాతి.
స్వాతిని ‘Spa’ అంటాడు సోహెయిల్.

‘’What about you? My angel?’’ జైరెట్ చేస్తూ అడిగాడు అంజలిని.

పబ్లిక్ లైఫ్ లో ఏంజిల్ అంటాడు అంజలిని. ప్రయివేట్ లో ‘Ritz’ అంటాడు. వాళ్ళిద్దరి మధ్యా ఇంకా చాలా కోడ్స్ వున్నాయి. ‘Fish’ అంటే లిప్ కిస్. సోహెయిల్ ఎప్పుడు ఫిష్ అన్నా తన రెండు పెదాలని Rohu చేపలా చేసేస్తుంది అంజలి.

గిరికీ, అంజలికీ ఇలాంటి కోడ్స్ కొన్ని వున్నాయి.

‘Deal’ అని గిరి అన్నాడంటే నేరుగా అంజలి బ్రెస్ట్ మీద కిస్ అనే. ‘Chaco bar’ అంటే ఓరల్ అనీ, ‘Black rose’ అంటే లవ్ మేకింగ్ అనీ.

ఇవేవి సోహెయిల్ కి తెలియవు. సోహెయిల్ కి ‘Candy crush’, ‘Dip lock’ అంటేనే తెలుసు.

వ్యవహారం అదే. టాగ్స్ వేరు. మనుషులు వేరు. అంతే!

కానీ రెండు రకాల కోడ్స్ తెలిసింది ఒక్క అంజలికే.

గిరి ఇస్తున్న ఈ బ్యాచిలర్ పార్టీకి తనే స్పెషల్ అట్రాక్షన్ అని అనుకుంటోంది అంజలి. అదంతా గిరి బిస్కట్, బిల్డప్. ఈ పార్టీ నిజానికి రియల్టర్ షణ్ముఖ రెడ్డి కోసం. ఈ మతలబు సోహెయిల్ కి కూడా తెలియదు.

అంజలికి బెస్ట్ ఫ్రెండ్, మెంటర్ గిరి. ఫేస్ బుక్ లో కూడా అదే వారి కెమెష్ట్రీ.

సోహెయిల్ ని తన soulmate అనే పరిచయం చేస్తుంది అంజలి అందరికీ. పేరెంట్స్ కి కూడా. అలా పరిచయం చేసిన ప్రతిసారీ “ సిరఫ్ సో…ల్ మేట్… నహీ… రే… హో…ల్ … భీ” అని అంజలి చెవిలో చెబుతాడు. అలా వీలుకాని వేళల్లో బయటికే “సోహోల్ మేట్!” అనేస్తాడు. ఇలా రెండు మూడు సందర్భాల్లో సోహెయిల్ అన్న తర్వాతే దాని అర్థం అడిగి తెలుసుకుని “ఛీ… కోతి!” అనేసుకుంది అంజలి.

‘’వైట్ స్క్రూ డ్రైవర్… బాగుంటుందా? రెడ్డా? బావా!’’ తన అనుమానం తీర్చుకుంది తొలిసారి పబ్ కొచ్చిన అంజలి గుసగుసగా.

సోహెయిల్ తన జీవితంలో అంత అలితిగా, అంత చచ్చేంతగా ఎన్నడూ నవ్వ లేదు.

స్వాతి చాలా గాభరాగా వచ్చింది బిక్క చచ్చిన అంజలి దగ్గరికీ, పగలబడి నవ్వుతున్న సోహెయిల్ దగ్గరికీ.

యాంకర్ హనీఫాకి తాజా బిస్కట్ వేస్తున్న గిరికి కూడా క్యూరియాసిటీ పెరిగి అంజలి వైపే వచ్చాడు.

చేతిలోని గ్లాస్ గిరాటేసి నవ్వుతున్న సోహెయిల్ ని కొట్టినంత పనిచేసి ‘Whatzup! What the fuck is going on here’’ వెటకారంగా అరిచాడు గిరి.

‘‘గిరి… హరియప్… రే… స్క్రూ … she is asking red… or white… screw driver! Whatz yours? Black… isn’t it? బ్లా…క్… నా? … then it’s your turn.” ఆపుకోలేని నవ్వులోంచి వింక్ చేసాడు సోహెయిల్.

అంజలి కళ్ళు కప్పుతూ, రంగురంగుల పావురం ఈకల సీతాకోకచిలుక మాస్క్. అయినా ఆమె బిక్కచచ్చిపోయి వుందని చెబుతోంది ఆ బాడీ లాంగ్వేజ్. రెండు నెలల నుంచి పబ్ కు రమ్మని విసిగిస్తున్నా దాటేసింది. డైవర్స్ సెంటిమెంట్ తో.

‘’Easy man… easy… why are you after her? ఛోడోనా?’’

‘’క్యా….come again! క్యా… ఛో…ఛో… what?’’

“Don’t scare her. Fuck off!’’

‘’రే… బారాత్ కీ గోడా… తూ… కైకు… జల్ రైరే?’’

‘’I said enough! సోహీ… బస్ … అబ్ …బస్ కరోనా… చల్… పార్టీ మూడ్ మే అబ్ కంకర్ మత్ డాల్… హట్!…’’ సుతారంగా తోసేసాడు సోహెయిల్ ని గిరి.

అంతే నవ్వుతూ, అంతే తూలుతూ ‘’మాకీ…. కిరి…కిరి… గిరి సాలా …తేరా దుకాన్ బంద్… అబ్…తూ… బీచ్ మే నై గిర్ నేకా… fucker!’’ అంటూ గిరికి వార్నింగ్ ఇస్తున్నట్టు ఇకిలిస్తూ వాలిపోయాడు.

‘’This మాదర్చోత్ is already fucking high… had three joints… And now gulped fucking four large Johnnie Walkers. Shit! … man!’’ అని గిరి అరిచేసినప్పుడు అంతా సోహెయిల్ ని వదిలేసారు.

‘Life in a Metro’ సినిమాలో ‘అల్విదా’ నంబర్ ప్లే చేస్తున్నాడు కావాలనే గిరిని ఉడికించడానికి DJ జోలిస్టో.

సోహెయిల్ పడినప్పుడు టేబుల్ అంచుకు తల తగిలింది.

గాజు మొన దిగింది. కుప్పకూలిపోయాడు.

ఉలుకూ పలుకూ లేదు.

సోహెయిల్ చనిపోయి 11 నిమిషాలయ్యిందని అంజలికి కూడా తెలియిదు.

3

కాచిగూడ రైల్వే స్టేషన్.

నవంబరు 11, 23 గంటలా 09 నిమిషాలు.

*

వెన్నెల రాత్రి.

పట్టాలలో వుడుకు రాజేసి వెళ్ళిన ఇందాకటి రైలు ధర్మవరం జంక్షన్ కు వచ్చి 11 నిమిషాలయ్యి వుంటుంది. చేరి వుంటే.

అరగంట అయ్యింది వారు తమ సరంజామా సర్దుకుని. ఆ అరగంట తర్వాతే రద్దీ కాస్తే తగ్గుతుంది రోజూ.

రెండు గోనె సంచీలు. టార్చి లైటు. ఎక్స్ ట్రా బ్యాటరీలు నాలుగు, వాటర్ బాటిల్ రెండు లీటర్లు. మూడు పరోటాలు. ఒకటి సాంగ్లీకి.
రెండు తమ్ముడు మొయిలుకి.

ఈ రోజు చట్నీ లేదు. కానిస్టెబుల్ రాంకుమార్ ఇచ్చిన మూడొందలు తీసుకుని ఆదరాబాదరాగా వచ్చేయడంతో పరోటాలోకి ఇచ్చే చట్నీ లాంటి కర్రీ మర్చిపోయింది.

సాంగ్లి.

15 సంవత్సరాలు.

పాచిపెంటలో పుట్టి వుండవచ్చు. సవతి నాన్నకొట్టిన దెబ్బలు తట్టుకోలేక చీపురుపల్లిలో ఈస్ట్ కోస్ట్ ఎక్కేసింది. అప్పుడు సాంగ్లి పేరు సాంగ్లి కాదు. వయసు మాత్రం ఎనిమిదే.

కలకత్తాలో 12 సంవత్సరాల వయసులో నాలుగు సార్లు రేప్ కి గురయ్యింది. అందులో ఒకరు పోలీసు. ఒకరు రైల్వే కూలీ. ఇద్దరు ఖరగ్పూర్ వాసులు.

సంవత్సరం అయ్యింది కాచిగూడలో కనిపించబట్టి సాంగ్లి. అక్కడే మొయిలు కలిసాడు. తన తమ్ముడనుకుంది.

మొయిలు.

మహబూబ్ నగర్ జిల్లా గౌరారం. పదకొండు సంవత్సరాలు. ఇంటినుంచి పారిపోయి వచ్చాడు. కారణాలు ఎంత అడిగినా చెప్పలేదు. కానీ వాడి కుడిచేతికి బొటన వేలు లేదు. చెత్త ఏరుకునే గౌస్ గ్యాంగ్ తో మూడేళ్ళ సావాసం. తర్వాత కాచిగూడ స్టేషన్ లో సాంగ్లి పరిచయం.

అంతే ఇద్దరూ రాత్రి డ్యూటీకి కుదురుకున్నారు.

సాంగ్లి, మొయిలు పట్టాలపైన చెరో పక్కా నడుస్తున్నారు కలిసి. టార్చ్ లైట్ అవసరమా? అని అడుగుతున్నట్టు వుంది ఆ రాతిరి ఆకాశం… నడి సంద్రం నల్లగా మెరిసే బూడిద సున్నా ఎగరేసిన పడవలా.

ఆ వెన్నెలలో పట్టాల మధ్య పోసిన కంకర రాళ్ళు ఒక దానిమీద మరొకటి నీడలనీ కుప్ప పోసుకుంటున్నాయి ఒక వైపు మెరుస్తూ.

దూరంగా మొరీన్ ఇరానీ కేఫ్ నుంచి ఫరీదా ఖానుమ్ ‘’ఆజ్ జానేకి జిద్ నా కరో’’ అని చిల్లాయిస్తోంది. ఆ పాటని చెరిపేస్తున్నాయి తరచూ వచ్చే రైలు కదలికల రవాలు.

రాళ్ళపైనే అలవోకగా, అలవాటుగా పడుతున్నాయి పగిలి చీలికలయి బండబారిన సాంగ్లి, మొయిలుల పాదాలు పట్టాల వెంటే అటూ ఇటూ.

వాళ్ళ కాళ్ళకు కళ్ళున్నాయి. అవి కంకరనీ, పీతికుప్పలనూ జల్లెడ పట్టగలవు. ఆ కొద్ది సేపటి డ్యూటీలో వారి చెవులూ, ముక్కూ పని మానేస్తాయి. లేదా వాటి పని మాన్పిస్తారు.

రైలు పట్టాల మధ్యన విచ్చలవిడిగా పడిన పీతిని అస్సలు తొక్కని నేర్పు ఆ ఇద్దరి పాదాలదే. రోజూ రాత్రి ఇలానే గంభీరంగా మొదలవుతుంది ఈ ఇద్దరి నడక. గంట నడిచిన తర్వాత ఆగుతాయి ఆ నాలుగు పాదాలు… ఇక సిసలు వేటకి సిద్ధపడుతూ.

‘’తింటవా… మోలూ?’’

‘’వల్ల… ఎంకసిరికి తింటలే.’’

‘’వల్ల వల్ల అంతడు మొయిలి గాడు …
నే వొల్ల అంతాడు మొయిలి గాడు.
నాకొల్ల అంతడే మొయిలి గాడు …
నేనొల్ల అంతాడు మొయిలి గాడు.’’
సాంగ్లి మాటలు అలా పాటలయిపోతాయి.

‘’నా ఎంట పడతవేందే ఓ సాంగిలి…
నాకొల్ల నేనొల్లే ఓ జాంగిరి.’’
వద్దనడం కూడా పాటలోనే.

బలవంతంగా వాడి నోట్లో ఒక పరోటా ముక్క కుక్కేసింది.

ముక్క నములుకుంటూ నడక వేగం పెంచి ఆటని రక్తి కట్టించాడు మొయిలు.

వాళ్ళ నడక పరుగు అయ్యేందుకు రోజూ ఇలాంటిదే ఏదో ఒక కొత్త ఆట కనిపెడుతూనే వుంటారు. ఇవాళ్టి ఆట వాళ్ళకు అర నిమిషం ముందు వరకూ మెదలలేదు.

మూడు పరోటాలు అయిపోయాయి.

నీళ్ళు సగం.

నడక, పరుగు గంటలు దాటింది.

అప్పుడు కనిపించింది మొదటి బేరం.

కాలు.

ఎడమది.

మగ మనిషిది.

గోనె సంచిలో వేసుకున్నాడు మొయిలు.

‘’ఓకా…! కాలు ఇంగోటి ఈడ్నే వుండాల్ల… బిరీన ఎతుకు. నేను ముందుకు ఉరుకుత’’ ఉల్లాసంగా వెళ్ళాడు.

పట్టాలకు కొంచెం దూరంగా ఫారం కంపల్లో టార్చిలైట్ తో చూస్తే కానీ సాంగ్లికి కనిపించలేదు మరో కాలు. అది కుడిది. మగది.

బట్టలు లేని ఆడ మనిషి మొండెం కూడా సాంగ్లికే దొరికింది.గోనెసంచిలో కుక్కేసింది. ఆ ఆడ తలకూడా తనకే దొరుకుతుందని సాంగ్లి ఆశ.

చీకట్లోంచి పరిగెత్తుకుంటా వచ్చాడు కేరింతలు పెడుతూ మొయిలు. టార్చి లైట్ వెలుతురులో వరుసగా పేర్చిన మూడు తలల బ్రహ్మలా వున్నాడు. వాడి రెండు చేతుల్లో రెండు తలలు.

ఒకటి ఆడ.

మగ ఇంగొకటి.

గోనె సంచిల్లో కుక్కేసుకున్నారు.

ఈ రోజు డ్యూటీ అయిపోయింది.

నిజానికి ఇవాళ డబల్ ధమాకా. ఒక్క శవం పడితే చాలు. మూడొందలు. ఇవాళ రెండు. అంటే… ఐదొందలు.

‘’కో… రేపు సిన్మా… నాకు తెల్దు…ఆ…’’ తమ్ముడి కోరికని కన్నుల్లోంచి వచ్చే నవ్వుతోనే ఓకె చేసింది.

అంటే రేపటి రాత్రి తననొక్కదానిదే డ్యూటీ.

అలా వాడిని సినిమాకి పంపిన అనేక రాత్రిళ్ళు సాంగ్లి రేప్ కి గురయ్యింది.

గోనె సంచీలని సాంగ్లి పట్టాలపైన ఈడ్చుకుని పోతూవుంది. సరంజామాని మొయిలూ.

గోనెసంచీల్లో వున్న శవ శరీర భాగాలలో ఒకటి తిత్లిది, రెండవది బోజిది అని వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు.
అలాగే తిత్లి, బోజీ తన కన్నవారని తేనె కళ్ళ మొయిలుకీ.

4

చంచల్ గూడా జైలు.

నవంబరు 11, 11 గంటలా 08 నిమిషాలు.

*

బ్యారక్ నెంబర్ 4 లో నిద్ర రావడం లేదు రతన్ అగర్వాల్ కి.

రతన్ వచ్చి ఆరు నెలలు కావస్తోంది. 498(a) కింద వచ్చాడు. నిజానికి అతను 14 రోజుల రిమాండు ఖైదీ. తన తరపున ఎవరూ బెయిల్ పిటిషన్ వేయనందుకే జెయిలు.

ఇలాంటి బాపతులే చాలామంది.

రతన్ వాళ్ళ అమ్మ లుక్మి అగర్వాల్ , అక్క సరళ థాకూర్ ఎదురుగా వున్న చంచల్ గూడ మహిళా జైలు నుంచి బెయిలుపై విడుదలయి ఐదున్నర నెలలయ్యింది ఇదే కేసులో. ఈ వివరం రతన్ కి చేరవేసే వాళ్ళూ లేరు.

తన చివరి మూడు బీడీలు నలిచి ఆఖరి పొగాకూ రాల్చాడు.

కాస్త సున్నం దట్టించాడు.

అరచేతిలో పొగాకు నలిపిన ఆ పదకొండు నిమిషాలూ ఆలోచించేందుకు ఒక్కటంటే ఒక్క సంగతే లేనంతగా ఎండిపోయి వుంది రతన్ మెదడు.

ఆ బ్యారక్ లో 22 మంది వున్నారు. రకరకాల నేరాలలో అనుమానితులు.

రెండు గంటల క్రితం క్యారం బోర్డు రుపీస్ ఆడుతున్నప్పుడు కదిరి సోమశేఖరరెడ్డి బెయిల్ డబ్బులు అరేంజ్ చేస్తానని రతన్ కి ప్రామిస్ చేసాడు.

సోముకి సోమవారం బెయిల్ వస్తోంది.

సున్నం కలిపిన పొగాకు ముద్దని నేర్పుగా ఎడమ బుగ్గనే పెట్టుకున్నాడు రతన్. పొద్దునే మరో రెండు కట్టల తాజా గణేశ్ బీడీలు తన చేతిలో పడతాయన్న ధీమాని కూడా కలిపి నములుతున్నాడు బుగ్గల్లో.

నిశ్చింతగా నిద్రపోతున్న సోముని చూసాడు.

సోము.

సుపారి కిల్లర్.

బెంగళూరులో సెటిల్ అయిన నెల్లూరు రియల్టర్ షణ్ముఖరెడ్డిని లారీతో గుద్దించి చంపించాడు కొద్ది సేపటి క్రితం. అదే అతని నిద్రలోని సగం నిశ్చింతకి కారణం.

తన హైదరాబాదీ పార్ట్ నర్ గిరి ఇచ్చిన బ్యాచిలర్ పార్టీకి వెళ్ళి వస్తుండగా షణ్ముఖరెడ్డి ఈ యాక్సిడెంట్ కి గురయ్యాడు. ఆరు లక్షలు డీల్. షణ్ముఖ రెడ్డి చనిపోగానే హెచ్. కైరవాడి లోని తన భార్య కాని భార్య గ్రేస్ హెప్సి బాకి సొమ్ము ముట్టిందని కూడా సోముకు మెసేజ్ అందుతుంది. ఈ కేసులో తెల్లవారు ఝామునే లొంగిపోతాడు గ్రేస్ హెప్సిబా నాలుగవ చివరి ముద్దుల తమ్ముడు యాంజల్ సాయిలు.

సోముకు ఈ సుపారి ఇచ్చింది హైదరాబాద్ ఫర్నిచర్ వ్యాపారాన్ని ఏలుతున్న అల్తాఫ్ ఘనీ ఇస్మాయిలీ ఏకైక కుమారుడు సొహెయిల్ ఘనీ ఇస్మాయిలీ.

ఏడాది క్రితం హైదరాబాద్ లోని బడా బంగారు వ్యాపారి సుఖ్వీందర్ సందూని అపార్ట్ మెంట్ పైనుంచి తోసేసి చంపేసాడు సోము. సజావత్ ముంగేరితో కలిసి చేసాడు ఆ హత్య. ఇద్దరికీ సగం సగం, చెరో3 లక్షలు అందాయి. ఆ కేసు లోనే ఇప్పుడు జెయిలులో వున్నాడు.

అంతక ముందు గుంటూరు మాజీ జెడ్ పి టీసి దిరిసె దేవకృపమ్మ భర్త రేగుమళ్ళ మనోహర్ ని బండతో బాది చంపేసాడు సోము. ఆ కేసు బుక్ అయ్యింది మాత్రం మడకశిర ఓబులేశు పేరున.

ఈ సారి కావాలనే సాయిలుని లొంగిపొమ్మన్నాడు సోము. ఎందుకంటే షణ్ముఖ రెడ్డికి ముందే బాగా తాపించారు. కేసు ఎలాగూ పోతుంది.

‘బయటికి పోగానే డబ్బులు అరేంజ్ చేస్తా’ అని రతన్ కి మాట ఇచ్చిన వాళ్ళలో సోము మొదటి వాడేం కాదు.

***

సోమ వారం.

కొత్త బ్యాచ్ వస్తుంది.

‘’బ్యారక్ 4 అటేన్షన్… స్టాండరటీజ్’’ రతన్ అరుపులకి నిమ్మలంగా క్యూకట్టి నిబడ్డారు.

ఒక్క సోము తప్ప.

‘’సబ్ …ఏక్… దో… భోల్ నా…. చలో…షురూ!’’ అటూ ఇటూ తిరిగాడు ఎన్నడూ పట్టించుకోనట్టే.

మొదటి వాడు ‘ఏక్’ అన్నాడు బెంగగా.

‘సాత్’ తర్వాతి వాడికి హిందీలో ఎనిమిది తెలియనందుకు భయంతో బిక్కచచ్చిపోయాడు.

అంతా నవ్వారు.

దూరంగా రావిచెట్టుకింద బైబిలు చదువుతున్న ఒక్క సోము తప్ప.

మళ్ళీ తెలుగులో ఇదే తంతు.

11 దగ్గర ఆగింది లెక్క.

మళ్ళీ అంతా అవే నవ్వులు.

బైబిలు మూసేసిన ఒక్క సోము తప్ప.

‘’అరే… పోనీ ఇంగిలీస్ల చెప్పండిర భై’’ ఆడిన ఆటనే వారం వారం ఆడిన చికాకును రతన్ నోరు ఊసేసింది రెడ్ ఆక్సైడ్ లా. కానీ ఆ తంతూ మధ్యలోనే ఆగి పోయింది.

ఈ సారి నవ్వులు లేవు.

దూరంగా సోము ఒక్కడే బైబిలు అమ్మేస్తున్న స్మార్ట్ మార్కెటింగ్ ఎక్షెక్యూటివ్ లా చిరునవ్వుతున్నాడు. అతని నవ్వుకు కారణం వేరే వుంది.

ఇక ఖర్మ అనుకుని తల కొట్టుకుని తనే కౌంట్ చేసుకున్నాడు రతన్.

మొత్తం 21. సోముతో సహా.

ఎన్నడూ తన లెక్క లోకి రతన్ రానే రాడు.

అప్పుడే సరిపోతుంది లెక్క.

‘’1..2…1..2..1..2… ‘’ నంబర్ చెబుతూ 1 చెప్పిన వాళ్ళని ఒక అడుగు ముందుకు లాగాడు రఫ్ గా.

‘’1… వచ్చినోళ్ళు పోండి … ఇయ్యాల బ్యారక్, ఇంగ బయట క్లీనింగ్… ఫటాఫట్.’’

‘’దో నంబర్ … టాయిలెట్ క్లీనింగ్ పోవాల… ఫౌరన్.’’

ఐ – 10 కారు దొంగతనం కేసులో కన్విక్ట్ అయి ఆరు నెలల శిక్ష అనుభవిస్తున్న సాఫ్ట్ వేర్ ఎంఫ్లాయి ముమ్మడివరం రాజు వర్మ inmate యూనిఫాంలో పరిగెత్తుకుంటూ వచ్చి సోము చెవిలో ఏదో చెప్పాడు.

చేతిలో ఓ కాగితం కూడా పెట్టాడు.

తన చెవికి అందిన కబురుకు లోపలే నవ్వి, చేతికి అందిన చిట్టీని విప్పుతూ కన్నింగ్ గా బయటికే నవ్వేసాడు సోము.

రాజు ఇచ్చిన ఆ చీటీని మడత పెట్టబోయేందుకు 11 సెకన్ల ముందు అందులో ఇదే మరో సారీ రాసి వుంటుందని తెలుసు సోముకు :

“మై డియర్ చిన్నూ…

నేను బయటికి వచ్చిన తర్వాత నీకే అన్ని వివరంగా చెప్తాను. నాకు తెలుసు, నిన్ను ఘోరంగా హర్ట్ చేసాను. కానీ నువ్వు ఈ రెండు నెలలు నా గురించి అస్సలు పట్టించుకోకుండా ప్రశాంతంగా వుండు.
ప్లీజ్… ప్లీజ్… ప్లీజ్…
నీ డెలివరీ కాగానే దాదాపు అదే టైమ్ కి నేనూ బయటికి వచ్చేస్తా. ఇక మనం బద్దంబాల్ రెడ్డి నగర్ లో ఎలా వుండే వాళ్ళమో అలానే వుండబోతాం త్వరలో.

నమ్ము.

Yours as always…

నీ బావ. నీ వజ్రా. నీ పికాచో. నీ మ్యాఛో మ్యాన్.
నీ… అదే… పాత… రారాజ్.”

కనీసం రాజు కళ్ళలో వుబికిన, ఆ రెప్పలు తరిమిన ధారను కూడా చూడకుండా పై చీటీని మడత పెట్టి తన బైబిలులో పెట్టుకుని లగేజితో రెడీ అయిపోయాడు సోము.

మత్తయ్య సువార్త 11 వ అధ్యాయంలోని పేజీలలో ఒదిగిపోయింది సదరు రాజు ఇచ్చిన ఆ చీటి.

రాజు ప్రాధేయపడుతూ “సార్… సోము సార్!…తప్పకుండా ఇస్తారు కదా?

ప్లీజ్….ప్లీజ్….ప్లీజ్…” బలహీనంగా మొక్కాడు.

సోమూ ఆ చీటీని చేరవరలసిన చోటికి చేర్చే అవకాశమే లేదు.

హెచ్. ఖైరవాడికే బయలుదేరుతాడు బయట కాలు పెట్టిన తక్షణం.

అంతే!

అందరూ డిస్ పర్స్ అవుతుండగా మరో నలుగురు కొత్తవాళ్ళూ వచ్చారు.

‘’ఏం పేరు?… నీది?

కార్డు సూపెట్టు…

ముకం… గికం కడుక్కోండి.. ఆ…డ..’’

ఆ నలుగురూ తమ కార్డులిచ్చి కుళాయి దగ్గరికి పిల్లుల్లా వెళ్ళిపోయారు.

రతన్ మాత్రం అపుడే వెళ్లిపోయిన సోము వంక చూస్తూ భరోసాగా నవ్వాడు ఇటుక రంగులో మరో ప్రయత్నంగా ఇంకోసారి నిండు దవడలతో.

వలుకూర్ మద్దిలేటి…498(a)

వాస్లేపూర్ కోబా…. 302

యాంజల్ సాయిలు … 302

గిరి కిషన్ చౌదరి … …302’’

రతన్ అరుపులా నమిలాడు.

కుళాయి దగ్గర ముఖం కడుక్కుని అందరూ గబగబా వచ్చేసారు. చివరగా ముఖం కడుక్కున్న గిరి తల ఎత్తి చూస్తే చాలా మసకగా
‘’కండోమ్ వాడండి’’ అన్న కలర్ పోస్టరు కనిపించింది కుళాయి ట్యాంకుపైన.

ఆ నలుగురితో 1… 2… చెప్పించాడు రతన్.

‘’హే! తుమ్ దో … తీన్ సౌ దో … పాయికానా క్లీనింగ్… ఇయ్యాల… అటు పోండి.. చల్!

రేయ్… మీ ఇద్దరు నా ఎంట రండి.’’, మద్దిలేటి, సాయిలు ఫాలో అయ్యారు వుమ్ముతున్న రతన్ ని.

రతన్ తన బెయిల్ గురించి మరో రోజు మరచిపోతున్నాడు.

కోబా, గిరి లను టాయిలెట్ క్లీనింగ్ బ్యాచ్ వైపు నడిపిస్తూ రాజు ఇంకో రోజునూ చెరిపేస్తున్నాడు.

**** (*) ****

Illustrations: Sriram Karanki



2 Responses to ఫోర్ స్క్వేర్

  1. sreeram velamuri
    May 8, 2017 at 8:53 pm

    అనంత్ గారూ .. మైండ్ బ్లోయింగ్ ..

  2. May 25, 2018 at 11:55 am

    చెప్పిన పధ్ధతి బాగుంది

Leave a Reply to sreeram velamuri Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)