కథ

ఫైండింగ్ డోరీ

జూన్ 2017

వారంలో రెండు రోజులు నా సొంతమని ప్రతీ వారం అనుకుంటాను. భ్రమ కాకపోతే ప్రవాహంలో పడ్డాక మన ప్రమేయం ఏముంది? తెల్లవారకుండానే సెల్ మ్రోగుతుంటే నిద్ర కళ్ళతో తీసి చూసాను, సేథీ నుండి ఫోను, “శికూ! అర్జెంట్ పని మీద హ్యూస్టన్ వచ్చాను, తిరిగి మధ్యాహ్నం వెనక్కి వెళ్లిపోవాలి కాస్త గలేరియా దగ్గర స్టార్బక్స్ కి రాగలవా?” అనడిగాడు. వేరొకరయితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడిని, ఫోన్ చేసింది సేథీ! “రాగలవా…ఏమిటి? అరగంటలో అక్కడుంటాను.” అని లేచాను.

“మాడ్రిడ్ కాన్ఫరెన్స్ అద్భుతంగా జరిగింది!”, “అమెజాన్ అడవులలో నేను, అనూ…”, “మై స్వీట్ హోమ్ ఇన్ బ్లూమ్ ఫీల్డ్…” అంటూ సేథీ ఫెస్బుక్ పలకరింపులు తప్ప కొంత కాలంగా మా మధ్యన మాటలు లేవు. ఇలా ఉన్నట్టుండి అర్జెంట్ పనంటూ రావడం అయోమయంగా అనిపించింది. మేము కలిసి ఎనిమిదేళ్లు దాటినా, ఇంకా నిన్న మొన్నటిలానే అనిపిస్తోంది

***

అమెరికా కొత్తగా వచ్చిన రోజులు; ఒంటరితనం, పరిసరాలు వింతగా భయపెడుతుంటే ఎన్నో సార్లు తిరిగి వెళ్లిపోవాలని బలంగా అనిపించేది. సేథీ నా పక్క క్యూబ్ లో కనిపించినా మాట్లాడేవాడిని కాదు. ఓ రోజు తనే కలుపుకోలుగా వచ్చి పలకరించాడు. ఊహ తెలిసినప్పటి నుండి ఎప్పుడూ నా పక్కన బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఒకడుండేవాడు, సేథీ చాలా తక్కువ సమయంలో ఆ వెలితిని తీర్చాడు.

బాచిలర్ అంటే సహజంగా ఉండే సాఫ్ట్ కార్నర్ అనుకుంటాను, తరచుగా సేథీ, అతని భార్య అను భోజనానికి పిలిచేవారు. పానకంలో పుడకలా ఎందుకని తప్పించుకుని తిరిగేవాడిని. అలా ఎంత కాలం సాగుతుంది, అసలే నార్తిండిన్లు చొరవగా వెంటపడి, వేధిస్తే వెళ్లక తప్పేది కాదు.

అలా మా మధ్య రాకపోకలు పెరగడంతో స్నేహం గట్టిపడింది. వీకెండ్ కలుసుకున్నామంటే స్తంభించిన కాలం ఒళ్లు విరుచుకుని రేసు గుర్రంలా పరిగెట్టేది. మా మధ్య ఎన్నో జ్ఞాపకాలు ఉన్నా, డిసెంబర్ నెల మాత్రం మర్చిపోలేను! రంగురంగుల లైట్ల అలంకరణ, శాంటా- రుడాల్ఫ్ బొమ్మలు, పరుచుకున్న లేత మంచుతో ఇళ్లు అందంగా మెరిసిపోయేవి. బ్లూమ్ ఫీల్డ్ లాంటి సంపన్నమైన కమ్యూనిటీ అయితే అసలు చెప్పక్కర్లేదు, గ్రీటింగ్ కార్డులు పక్కపక్కగా పేర్చినట్టు ఉండేవి. అనుకి ఆ పరిసరాలు ఎన్ని సార్లు చూసినా తనివితీరేది కాదు. క్రిస్మసు ముగిసే దాకా ప్రతి రాత్రి అక్కడే తిరిగేవాళ్లం.

ప్రతి స్నేహానికి ఒక రన్ వే ఉంటుంది! ఒకటి కాదు, రెండు కాదు, ఏడేళ్ల స్నేహం డిట్రాయిట్ వదిలి వచ్చాకా ఫేస్బుక్ లైక్ లకి, ఐదు నిముషాల హ్యాపీ న్యూ ఇయర్ కాల్స్ కి పరిమితమయ్యింది. ఒకటి మాత్రం నిజం…ఎప్పుడు మాట్లాడినా మా సంభాషణకి ఓ కంటిన్యుటీ ఉండేది. మా మధ్యన కొంత కాలంగా మాటలు లేవు, దానికి పెద్దగా ఏ కారణం లేదు.

***

స్టార్బక్స్ లో అడుగుపెట్టగానే తాజా కాఫీ గుబాళింపు బలంగా తాకింది. చుట్టూ ఉన్న మొహాలలో ఏ తొందరా లేదు. సావకాశంగా కాఫీ సేవిస్తున్నారు. కబుర్లాడుతున్నారు. అనువైన చోట కూర్చుని అలవాటుగా సెల్ తెరిచి చూసాను. ఏదో వీడని భ్రమ తప్ప కొత్త సందేశాలేవీ లేవు. ముస్తాబైన ఓ వృద్ధ జంట, ఎదురుగా ఉన్న ఫౌంటైన్ దగ్గర ముచ్చటగా కూర్చుని ఉంది. ఆ పక్కగా చిన్న పిల్లలు పెంపుడు కుక్కతో కేరింతలు కొడుతున్నారు.

అరగంట దాటినా సేథీ జాడ లేదు, మాటిమాటికీ పార్కింగ్ కేసి చూస్తూ గడుపుతున్నాను.

సందడితో సతమతమయినా సేథీ, అనులని శ్రద్ధగా గమనించేవాడిని. అనూ కసురుకుంటూ, గారంగా పెత్తనం చేసేది. సేథీ ఇష్టంగా నసుక్కుంటూ, చెప్పిన పనులు చేసేవాడు. ఆఫీసునుంచి గంటకొకసారి తాజా సమాచారం తెలియజేసి ‘ఐ లవ్ యు’ అని ఫోన్ పెట్టేవాడు. సందర్భం కాకపోయినా ఒకరి ప్రస్తావన లేకుండా ఇంకొకరు మాట్లాడేవారు కాదు. అందమైన మనుషులని, అరుదైన కెమిస్ట్రీ ని అతి దగ్గరగా చూస్తుంటే లీలగా ఓ ఆలాపన వినిపించేది. గాలిలో ఓ వింత పరిమళం సోకేది. అప్పుడే పెళ్లిపై నా అభిప్రాయం తిరగరాసుకున్నాను.

నా ఎదురుగా ఉన్న ఖాళీ కుర్చీని చూపించి తీసుకోవచ్చా అని ఓ కస్టమర్ సైగ చేసాడు, ‘వెయిటింగ్ ఫర్ ఏ ఫ్రెండ్’ అనడంతో భంగపడి జనంలో కలిసిపోయాడు.

పెళ్లైన కొత్తలో, ఓ సాయంత్రం సన్నటి జల్లు కురుస్తుంటే మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేసి కూర్చున్నాను. ఎన్నిసార్లు విన్నా తాజాగా అనిపించే పాటలు మెల్లిగా ప్రవహిస్తున్నాయి. కొండలు, కోనలు దాటి ఎక్కడో దారి తప్పి తిరుగుతూ నా భార్య సుజాతని పిలిచాను. హడావిడిగా నాకేసి చూసి “ఈ పాత చిత్రహార్ పాటలేమిటి?” అని వెళ్లిపోయింది. ఆ క్షణం ఓ సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఊగిసలాడే ఊహలు శాశ్వతంగా విడిచి వెళ్లిపోయాయి.

సేథీ, నేనూ ఒకే చోట కెరీర్ ప్రారంభించినా, చీలిన పాయల మధ్య దూరం పెరిగినట్టు మా స్థాయిలో అంతరం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఏ పోలికా లేదు. నేను కీ బోర్డు వదలలేదు, సేథీ బోర్డు రూము దాకా ఎదిగాడు. అతని జాబ్ టైటిల్స్ మారడం ఎప్పటికప్పుడు లింక్డ్ ఇన్ లో గమనించేవాడిని.

అంతా కలలు కంటారు, కొందరు వాటిని సాకారం చేసుకుంటారు. దానికి అదృష్టం, అవకాశం అంటూ పేర్లు పెడతారు. నన్నడిగితే సరైన తోడుంటే చాలని సేథీని చూపిస్తాను.

ఆలోచనల్లో ఉండగా సేథీ వచ్చాడు.

ఒకప్పటి బక్క పల్చటి కోలీగ్ కి, ఎదురుగా నిలుచున్న మనిషికి ఏ పోలికా లేదు. బ్రౌన్ బ్లేజర్, పల్చబడిన గిరజాల జుట్టుతో హుందాగా అనిపించాడు. ఎదురెళ్లి చిన్నగా హత్తుకున్నాను. పలకరింపులు కాగానే, కంపెనీ లో వత్తిడి విపరీతంగా పెరిగిందని అందుకే టచ్ లో లేనని, ఏమీ అనుకోవద్దని అన్నాడు.

“వారం క్రితం పిల్లలని ‘ఫైండింగ్ డోరీ’ సినిమాకి వెళ్లాను. ఆ రోజంతా నిన్ను, అనుని చాలా సార్లు తలుచుకున్నాను.” అనగానే “ఎందుకు?” అని పరధ్యానంగా అడిగాడు. సినిమా చెప్పగానే సందర్భం తడుతుందని ఆశించాను, అలా ఏమీ జరగలేదు.

“మనమంతా డాలర్ థియేటర్ లో ‘ఫైండింగ్ నీమో’ చూసాం. మర్చిపోయావా?, ఇది దాని సీక్వెల్” అన్నాను.

“రియల్లీ సారీ! అవును మనమంతా చూసాము.” అని నొచ్చుకున్నాడు.

మేము ఇలా అనుకోకుండా కలుసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. నాతో పాటు టెక్సస్ లో స్థిరపడిన స్నేహితుల వివరాలు చెబుతుంటే విన్నాడు. పెద్దగా ఆసక్తి చూపించినట్టు అనిపించలేదు.

మనుషుల్లో రెండు రకాలు; గతపు మగత వదుల్చుకోని మొదటి రకం; ముందు చూపు తప్ప వేరే ధ్యాస లేని రెండో రకం. మా సంభాషణ రెండు వర్గాల మధ్య మెత్తని సంఘర్షణలా అనిపించింది.

పక్క టేబుల్ చుట్టూ ఎత్తుగా, బలంగా బాస్కెట్ బాల్ ఆటగాళ్లలా ఉన్నారు. గట్టిగా నవ్వుతూ, గొడవ చేస్తున్నారు. మా మాటలు వారి గోలలో కొట్టుకుపోతుంటే అటు వైపు సూటిగా చూసాను, ఏ మార్పూ లేదు. ఇక గత్యంతరం లేక కాస్త దూరంగా వెళ్లి కూర్చున్నాము.

నాకు తెలిసిన వ్యక్తి సమయానుకూలంగా సందడి చేస్తాడు, సంభాషణ సొంతం చేసుకుంటాడు, అలాంటిది వచ్చిన నిముషం నుండి స్తబ్ధుగా, మాటిమాటికి సెల్ కేసి చూస్తూ, ఏదో ఆలోచనల్లో మునిగినట్టు అనిపించాడు. పాత మనిషిని వెలికి తియ్యాలని రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను.

“ఆ మధ్యన ఫేస్బుక్ లో అనుకుంటా, మీ అమెజాన్ ట్రిప్ ఫొటో లు చూసాను, భలే ఉన్నాయి.”

“శికూ! ఆ ఫొటో నవ్వులు నిజమనుకోకు, మేమిద్దరం విడిపోతున్నాము.” అన్నాడు.

సరిగ్గా విన్నానో, లేదోనని కాస్త ముందుకి జరగగానే లాటే చుక్కలు ప్యాంటుపై పడ్డాయి.

“సోమవారం డైవర్స్ నోటీస్ పంపింది. ఓ ఫ్రెండ్ రెఫర్ చేస్తే అటార్నీని కలవడానికి మీ ఊరొచ్చాను.” అన్నాడు.

నా హావభావాలు పెద్దగా పట్టించుకున్నట్టు లేడు. మిచిగన్ ‘నో ఫాల్ట్’ స్టేట్ అని, డైవర్స్ అడగడానికి ఏ కారణం చూపక్కర్లేదు అన్నాడు. కేసులో దశలు, డెడ్ లైన్స్, అలీమొనీ అని ఓ ప్రాజెక్ట్ ప్రణాళికలా వివరిస్తుంటే మెదలకుండా చూస్తున్నాను. కొలీగ్ గా ఉన్నప్పుడు ఇచ్చిన ప్రతీ ప్రాజెక్ట్ పద్ధతిగా ప్లాన్ చేస్తాడు, పకడ్బందీగా చేయిస్తాడని సేథీకి మంచి పేరు. ఇప్పుడు డైవర్స్ కి అదే ధోరణి అవలంబించడం విస్తుపోయేలా చేసింది.

“అప్పర్ మానేజ్మెంట్ లో ఎక్కువగా డైవర్సీలు ఉండడం చూసి, ఇది క్యాలిఫికేషన్ అనుకుంటా! అని జోక్ చేసేవాడిని. ఇప్పుడు చూడు.” అని బలహీనంగా నవ్వాడు.

ఆ నవ్వు చూడగానే ఎందుకో తెలియదు, పనిని వ్యసనంగా చేసుకున్న పాత మేనేజర్ గుర్తొచ్చాడు. “నీ వల్ల తెలియకుండా ఏమైనా పొరపాట్లు జరిగాయా?..అని కాస్త జాగ్రత్తగానే అడిగాను.

“శికూ! ఓ స్థాయి చేరుకున్నాకా కంపెనీ మనని దత్తత తీసుకుంటుంది. పనిని జీవితంగా మలచుకోవడం తప్ప పెద్దగా చాయిస్ ఉండదు. అక్కడకీ ఇద్దరం పరిగెడితే కుటుంబం అశ్రద్ధ అవుతుందని అనూని రిసైన్ చేయమని ప్రపోస్ చేసాను…రిసైన్ చేసే ప్రసక్తి లేదు!” అని నిక్కచ్చిగా చెప్పింది. అన్నాడు.

చిన్నపుడు చీకట్లో మెరిసే నక్షత్రాలని చూస్తూ అక్కడక్కడా ఆకారాలని ఊహించుకుని మురిసేవాడిని. అలవాట్లు రూపం మార్చుకుంటాయి తప్ప మాయమవవు కాబోలు, బ్లూమ్ ఫీల్డ్ గృహప్రవేశం ఫోటోలు, విహారాల వివరాలు చూసి అనుకున్నవి సాధించారని అనుకున్నాను.

వచ్చిన గంటన్నరకి అనుకుంటాను, సేథీ వాచీ కేసి చూస్తూ “అపాయింట్మెంట్ టైం అవుతోంది.” అంటూ లేచాడు. గొంతు పెగుల్చుకుని “ఏ సహాయం కావాల్సినా, మీడియేషన్ అవసరమయినా తప్పక కాల్ చెయ్యి.” అని మాత్రం అనగలిగాను. లేచి, భుజం తట్టి వెళ్లిపోయాడు. వెళ్లిన వైపు చూస్తున్నాను.

ఇంటికి డ్రైవ్ చేస్తున్నంత సేపూ సేథీ చెప్పిన మాటలు చెవిలో గింగిరాలు తిరుగుతున్నాయి.

ప్రపంచం విశాలమయ్యే కొద్దీ మా మధ్య ఇరుకు పెరిగింది. వాదించుకోవడం తప్ప మాట్లాడుకోవడం మర్చిపోయాము. ఇంటిమేట్ విషయాలు చెబితే ఇబ్బంది పడతావు. మేము ఒకే మంచంపై పడుకుని చాలా నెలలయింది.

నీకు తెలిసిన అనూకీ, ప్రొమోషన్ మైకంలో కూరుకుపోయిన మనిషికీ ఏ పోలికా లేదు. అర్ధరాత్రి సీనియర్ డైరెక్టర్ తో గుసగుసలాడుతూ పట్టుబడింది. ఎదురుగా ఉంటేనే పట్టించుకోలేదు, ఇక నేను బిజినెస్ ట్రిప్ లో ఉంటే ఏం జరుగుతోందో ఊహించుకోగలవు. కేవలం బిట్టూ (ఆరేళ్ల కొడుకు) కోసం అన్నీ సహిస్తున్నానని అంటుంటే అతని గొంతు పూడిపోయింది.

సేథీ అంటే విపరీతమైన సానుభూతి కలిగింది.

***

వీకెండు ఆటవిడుపుగా లేదు, ఎవరో చిక్కుముడి బిగించి వేడుక చూస్తున్నట్టు ఉంది.

గదిలోకి వెళ్లి తలుపు దగ్గరగా మూసాను. బయట పిల్లల ఆటల అల్లరి వినిపిస్తోంది. బీరువా నుండి పాత ఆల్బం తీసి ఒక్కొక్క పేజీ తిప్పుతున్నాను. డిట్రాయిట్ లో ఉండగా తీసుకున్న ఫోటోలు. ఆల్బం మధ్యలో నేను తిరగేసిన ఫోటో ఉంది. సరిగ్గా అమర్చి దగ్గరగా చూసాను. మాకినా ఐలాండ్ పై తీసిన ఫోటో. ఆకాశపు నీలితెరపై తెల్లటి పక్షులు, సుందర హ్యూరాన్ జలాశయం, క్రూస్ పై టోపీలు పెట్టుకున్న అందమైన జంట, రెండు నవ్వులు!

సుజాత లోపలకి వచ్చి “అదేంటి సేథీని తీసుకురాలేదా? అని అడిగింది.

“ఏదో బిజీ పని మీద వచ్చాడు, తిరిగి వెళ్లిపోయాడు.” అని ముక్తసరిగా చెప్పి ఊరుకున్నాను. తను కదలకుండా నా చేతిలో ఫోటో ని చూస్తూ నిలబడింది. ఫోటో పైకెత్తి టూకీగా అసలు విషయం చెప్పాను, తను ఏ మాత్రం కంగు తినలేదు.

“సేథీ చాలా మెతకవాడు కాబట్టి ఇన్నాళ్లు నడిచింది.” అని కుర్చీ లాక్కుని ఎదురుగా కూర్చుంది.

“ఇండియాలో పెద్ద ఉద్యోగం వదిలి వచ్చాను, గ్రీన్ కార్డు వచ్చేదాకా ఇలా పంజరంలో చిలుకలా పడుండాలి!.” అని అను చెప్పిందే చెప్పి నస పెట్టేది, ప్రతీ పార్టీ లో చెవులు వాచిపోయేవి. “నీకు గుర్తుందా? ఎముకలు కొరికే చలిలో ఆ బ్లూమ్ ఫీల్డ్ చుట్టూ తిప్పి సరదా పడేది. ఆ సందడి పండుగ ఉత్సాహం చూడాలని కాదు. అనూకి సంపాదన, హోదా, లగ్జరీ కారులు అంటే వ్యామోహం! అనుకున్నట్టుగా మంచి ఉద్యోగం సంపాదించింది, మిగతావి సేథీ అమర్చిపెట్టాడు. ఇక అతని అవసరం ఏముంది?” అని పాత సంగతులు సందర్భానికి అనుగుణంగా కలిపి చెప్పింది.

ఎదురుగా లేని మనిషిని బోనులో నిలబెట్టి, దోషిగా నిరూపించింది.

నేనింకా ఫోటో గురించే ఆలోచిస్తున్నాను.

***

యాంత్రికంగా పనులు చేస్తున్నా ఏదో తప్పు చేసిన భావన మాత్రం సలుపుతూనే ఉంది. అనూని పరామర్శించలేదు, కనీసం మొహమాటంగా కూడా పలకరించలేదు. చీకటి పడింది. తెల్లారితే పని ఊపిరి సలపనివ్వదు. మళ్లీ వారం దాకా మాట్లాడడం వీలు పడదని ఫోన్ చేసాను.

“అనూ! ఎలా ఉన్నావు?” అని పలకరించాను.

“ఫైన్, మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు?” అని అడిగింది.

“మేమంతా బావున్నాము. మీ విషయం తెలిసి చాలా షాకయ్యాను!” అను జవాబు చెబుతుంటే వెనుక నుండి ఒక మగ గొంతు వినపడింది, రిసీవర్ కి కాస్త దూరం జరిగి “జస్ట్ టు మినిట్స్!” అని బదులిచ్చింది.

రెండు నిముషాల్లో ఫోన్ పెట్టేస్తాననడం నాకు నచ్చలేదు.

“మీ ఇద్దరూ కెరియర్ని సీరియస్ గా తీసుకున్నారు కనుక ఎంతో కొంత స్ట్రెస్ తప్పదు. కాస్త ఇగో పక్కన పెట్టి ఆలోచించు.” అన్నాను.

“శికూ! నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను!” అని కరకుగా అంది.

ఇక అదే టాపిక్ మాట్లాడి ప్రయోజనం లేదనిపించింది. కాసేపు మామూలు విషయాలు మాట్లాడి ఫోన్ పెట్టేసాను. నేను మాట్లాడింది డిన్నర్ కి రమ్మని వెంటపడి పిలిచిన మనిషి కాదు. గలగల కబుర్లు చెబుతూ, కొసరి వడ్డించిన మనిషి కాదు, అను మారిపోయింది. చాలా శ్రమ పడి రెండు నిముషాలు మాట్లాడింది.

***

ఇది జరిగిన కొన్ని వారాలకి తిరుగు ప్రయాణంలో ఉన్నాను. అట్లాంటా ఎయిర్ పోర్ట్ చేరుకునేసరికి అర్థరాత్రి పదకొండు దాటింది. తగ్గిన వెలుతురులో టికెటింగ్ ప్రాంగణం ఆట ముగిసిన హాలులా ఉంది. వాక్ వే పై నిశ్శబ్దం వెంబడిస్తుంటే హెడ్ సెట్ చెవుల పైకి సర్దుకున్నాను, నిశ్చింతగా అనిపించింది.

ఎవరో వెనక నుండి తడితే తిరిగి చూసాను. ఆ వ్యక్తి “సారీ! పిలుస్తుంటే పలకలేదని తట్టాల్సివచ్చింది.” అన్నాడు. హెడ్సెట్ తీసి దగ్గరగా చూస్తే తెలిసిన మొహంలా అనిపించింది, కానీ పోల్చుకోలేకపోయాను. నా ఇబ్బంది గమనించి అతడే “గుర్తు పట్టినట్టు లేరు. మనం డిట్రాయిట్ అను దీదీ వాళ్ళింట్లో కలిసేవాళ్లం. మొన్నా మధ్యన మీరు ఫోన్ చేసినపుడు నేనక్కడే ఉన్నాను.” అన్నాడు. అప్పుడు వెలిగింది, అతను అనుకి కజిన్ వరస, పేరు రోహిత్. అప్పట్లో ఎమ్.ఎస్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలలో ఉండేవాడు. మనిషి ఒళ్లు చేసి, బాగా మారిపోయాడు.

ముందు ఫ్లైట్స్ కి వెళ్లడం కుదరదని, ప్రతీ వారం డిట్రాయిట్ కి రెడ్ ఐ తీసుకుంటానని అన్నాడు. ఇద్దరం కన్సల్టింగ్ వృత్తి సాధకబాధకాలు మాట్లాడుతూ నా గేటు దగ్గరకి చేరుకోగానే చుట్టూ మాలాంటి లాప్టాప్ బ్యాగులు మూగి ఉన్నాయి, అందరి చూపులు ఒకేలా ఉన్నాయి. ఏం చేస్తాం? వారమంతా చీకటి కొట్టపు బందీలుగా ఉంటాము. మూసిన తలుపులు భళ్లున తెరుచుకోగానే ఇంటి గుమ్మం కనిపిస్తుంది.

అను ప్రస్తావన వచ్చినపుడు మిగతా విషయాలు విని ఊరుకున్నా, కెరియర్ అంటే అంత పట్టుదలగా ఉండడం నచ్చలేదని మాత్రం కచ్చితంగా చెప్పాను. రోహిత్ కి నేనన్నది నచ్చినట్టు లేదు “కెరియర్ని సీరియస్ గా తీసుకోవడంలో తప్పేముంది?” అని వెంటనే అడిగాడు.

“..అంటే అలా అని కాదు, గొడవ పెరుగుతుంటే ఎవరో ఒకరు తగ్గాలి కదా! ఆ మధ్యన సేథీని కలిసాను, పాపం తెగ నలిగిపోతున్నాడు.” అని చెబుతుంటే కొడుకు కోసం తపిస్తున్న తండ్రి గుర్తొచ్చాడు.

రోహిత్ అర్థం కానట్టు చూసాడు, “మీకు ఆయన ఏం చెప్పారో, ఎంత చెప్పారో నాకు తెలీదు” అన్నాడు. బోర్డింగ్ టైం దగ్గర పడుతుంటే చెకిన్ వరుస చిక్కబడుతోంది.

“తను అంతా చెప్పాడు. ఇప్పుడు మనకి వివరంగా మాట్లాడుకునే సమయం లేదు, నా బాధల్లా మనమంతా ఉండి ఏమీ చేయలేకపోతున్నామని…” అన్నాను.

“సర్! మనం ఇంత ఆత్రంగా ఎందుకు పరిగెడుతున్నాము?”

“ఫ్యామిలీ కోసం.”

“కరెక్ట్..వారం పొడుగూతా ఎంత గొప్ప పని చేసినా, ఇలా ఇంటికి వెళుతుంటే సంతోషంగా ఉంటుంది. మీరన్నట్టు ఎవరో మనకోసం వేచి ఉన్నారని వెళుతున్నాము. మనకోసం ఇంకొకరు….అనేది ఎంత గొప్ప అనుభూతి! ఏదో ఒక రోజు ఈ ప్రయాణం ఉంటుంది కానీ పలకరింపులు ఉండవని తెలిస్తే మీకెలా అనిపిస్తుంది?” అని అడిగాడు.

ప్రశ్న అర్థమయింది కానీ ఎందుకడిగాడో తెలియలేదు. అనౌన్స్మెంట్ లు పెద్దవవుతున్నాయి, అంత సీరియస్ గా అడిగేసరికి బలవంతంగా నిలబడక తప్పలేదు.

“సేథీ తన టీం లో పనిచేసే ఇంటర్న్ తో అఫైర్ పెట్టుకున్నారు. అదే విషయం దీదీ నిలదీసి అడిగితే అనవసరంగా అనుమానిస్తున్నావని అరిచేవారు. ఆ ప్రభావం బిట్టూపై పడి ప్రతి చిన్న విషయానికి భయపడేవాడు, అర్థరాత్రి లేచి ఏడిచేవాడు. దీదీ ఎంత కాలం భరిస్తుంది?” అన్నాడు.

“అఫెయిర్….”

“అవును అఫెయిర్…” అన్నాడు.

రోహిత్ తన ఫ్లైట్ టైం అయ్యిందని సెలవు తీసుకున్నాడు.

రెండు వైపుల ఒకటే కథనం విన్నాను…ఎందుకో అతికినట్టుగా అనిపించలేదు. ఎంతో ఇష్టంగా మెలిగిన మనుషులు ఎందుకు మారిపోయారు? మాములు అనుమానం పెరిగి పెద్దదై ఉండొచ్చు, స్తిమితంగా కూర్చుని మాట్లాడుకుందుకు అహం అడ్డుపడి ఉండొచ్చు. ఐ డోంట్ నో.. నా ఊహాగానంలో ఏ మాత్రం నిజమున్నా వారిద్దరూ విడిపోకూడదు.

నేను ప్రేక్షకుడిగా మిగిలిపోను. రేపే సేథీ, అనులతో మనస్ఫూర్తిగా మాట్లాడతాను. ఫోటో తిరగేసినా, ఆల్బం లో బంధించినా, అసూయ మాత్రం నిత్యం రగులుతూనే ఉంది. ఈ చివరి అవకాశం చేజార్చుకుంటే నన్ను నిలువునా దహించివేస్తుంది.

చెక్ ఇన్ వరుసని అనుసరిస్తూ అడుగులు వేస్తున్నాను.

ఆలోచనలు మాత్రం రేపటి చుట్టూ తిరుగుతున్నాయి.

**** (*) ****