సాహిత్య వార్తలు

కవిత్వం – 2016

జూన్ 2017

2016వ సంవత్సరంలో వివిధ పత్రికలలో, అంతర్జాల సాహిత్య పత్రికలలో వెలువడిన 60 ఉత్తమమైన కవితలను ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్య సంపాదకత్వంలో ‘కవిత్వం – 2016’ పేరిట వరంగల్ కేంద్రంగా గల ‘కవన కుటీరం’ వెలువరించింది. దర్భశయనం గత 15 ఏళ్ళుగా ఈ వార్షిక కవితా సంకలనాలకు సంపాదకత్వం వహిస్తున్నారు.

‘కవిత్వం – 2016’ సంపుటిని 28 మే 2017 ఆదివారం ఉదయం, విప్లవకవి శ్రీ వరవరరావు గారు హైదరాబాద్ జవహర్ నగర్ లోని వారి ఇంట్లో కవిత్వ మిత్రుల నడుమ ఆవిష్కరించారు. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో సంపాదకులు శ్రీనివాసాచార్య తో పాటు కవులు రమణజీవి, బా రహమతుల్లా, కూర్మనాధ్, కోడూరి విజయకుమార్, కళాకారులు బ్రహ్మం, దక్షిణా మూర్తి పాల్గొన్నారు.

‘కవిత్వం – 2016’ విడుదల చేసిన సందర్భంగా వరవరరావు గారు తన తొలి కవితా సంకలనం ‘చలినెగళ్లు’ కు శ్రీశ్రీ ముందు మాట కోసం 5 సంవత్సారాలు ఎదురు చూసిన విషయాన్ని, ప్రజాకవి కాళోజీ, కథా రచయిత పొట్లపల్లి రామారావులతో తన అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. వరంగల్ కేంద్రంగా వార్షిక కవిత్వ సంపుటిని తేవడాన్ని ఆయన అభినందించారు. ప్రత్యేకించి, కొత్త కవులు జీవితాన్ని కవిత్వం చేస్తోన్న పద్ధతులను అబినందించి, ఒక ప్రాపంచిక దృక్పథాన్ని అలవరచుకోవడంలో కొంత లోటు వుందని అభిప్రాయపడ్డారు. పిల్లల ప్రేమలకు దూరమవుతున్న తలిదండ్రుల బాధల నుండి, రోహిత్ మరణాన్నీ, మహా శ్వేతా దేవి నిష్క్రమణనీ, ఏ ఓ బీ ఎన్ కౌంటర్ నీ కవిత్వం చేసిన కవులను ప్రత్యేకించి ప్రస్తావించారు.

దర్భశయనం శ్రీనివాసాచార్య
#2-324, వీధి నెంబర్ -5,
బ్యాంకు కాలనీ; విద్యారణ్యపురి,
హనుమకొండ – 506009
మొబైల్ : 9440419039