కవిత్వం

ఎనిమిదో అడుగు

జూన్ 2017

పుడా కెమ్మోవి తేనెల సోనై
ఊరించడం లేదు
యవ్వనపు పొంగులేవీ
కెరటాలై చుట్టేయడంలేదు.
హంసతూలికా తల్పాన విస్తరించిన
సుకుమార సౌందర్య జ్వాలలో
దహింప బడేందుకు
మనసు ఏ కోరికల కట్టెనూ
ఎగదోయడం లేదు.
ఒక తెలియని దుఃఖమేదో ఆవేదనై
మనసును ముంచెత్తుతోంది.

ఒక్కొక అహంకారపు ఆభరణాన్నీ
ఆభిజాత్యపు వస్త్రాన్నీ తొలగిస్తూ,
తననే మాత్రమూ కదిలించని
నిదురిస్తూన్న ఆ సౌందర్యప్రవాహాన్నీ
పక్కనే అమాయికపు పొత్తిగా కలలుగంటున్న
పసితనాన్నీ
నిర్వికారంగా చూస్తున్నాడతను.

ఇపుడే ముఖాన్ని చూస్తున్నా కలవరమే
ప్రతి శరీరమూ కోరికల తుట్టే,
వ్యాధి పీడిత కళేబరమే!

*

తెరలు తెరలుగా వ్యామోహ మాలిన్యాల్ని
తెలియకుండానే వదిలించుకుంటూ
మనసూ, శరీరమూ, ఘనీభవించిన చీకటీ

అడుగు బయటకు పెడుతూ
వెను తిరిగి చూడాల్సిన
చివరి అవసరాన్నీ
వెలివేసిన ఆతని హృదయమూ

ఎటుచూసినా
వుసూరుమంటున్న వ్యధార్తులూ…

కర్తవ్య కంకణం గుండె చుట్టూ
మరింత గట్టిబడుతోంది
సత్యాన్వేషణలో
తలపు తర్వాతి తలపుల
తలుపులను
తెరుచుకుంటూ
చీకటిని చీలుస్తున్న దారుల
వెలుతురులను పరుచుకుంటూ
కన్నీటి సంద్రాల మూలాలను వెదుకుతూ
సంఘాన్ని బోధి వృక్షాన్ని చేసికుని
సమస్యల అంతర్వలయాలను ఛేదించేందుకు
ఒంటరిగా
బద్ధుడై
‘సిద్ధా’ర్ధుడైన బుద్ధుడై …

 
 
 
painting: Anita Mihalyi