కవిత్వం

నిద్రాహారాలు

జూన్ 2017

ది యిది అని కాదు
యేదయినా ఫరవా లేదు
కుంచెం అన్నం కావాలి
కప్ప కాళ్లతో చేసిన కూరయినా
యే జంతువు మాంసమయినా
అన్నం తిని యెంచక్కా నిర్భయంగా
పీడకలల్లేకుండా కాసేపు నిద్దరోవాలి

యిప్పడు యీ యిళ్లన్నీ వున్న చోట్లలో
వొకప్పడు యిళ్లు లేవు
చిన్నవీ పెద్దవీ గుడిసెలు కూడా లేవు
పొదలలో కుందేళ్లు బిక్కుబిక్కుమనేవి
చెట్ల మీద కొండచిలవలు జారుతుండేవి
యెండుగడ్డిలో చిరుతలు పొంచి వుండేవి

అప్పుడూ యిదే యావ
కుంచెం అన్నం పచ్చి పచ్చిదే మాంసం
యే జంతువుది అని చూసుకున్నానా
వొక పండు ఎందరో తిని చనిపోతే గాని
ఫలానా తిన గూడదని నియమం లేదు
తినడంలో, తినగా మిగిలిన చర్మాన్ని
చుట్టుకోడంలో, దాని యెముకలను
చేతికి మరో చెయ్యిలా పట్టుకోడంలో
గాలికి రేగి ఆడే జటాజూటంలో
వొక సౌందర్యం, సంగీతం, ధీరం, గంభీరం
లలితం, వీరం, మగతనం, ఆడతనం
అన్నీ ఆ కాసింత స్థలంలోనే ఆ కాసింత
మనస్సుతోనే

వొకటే భయం
యెప్పుడు యే మృగం మీద పడుతుందో
దేనికి అన్నం అవుతామో
కూర్చున్న చెట్టు కొమ్మను
ఏ పిడుగు నిట్ట నిలువుగా చీల్చేస్తుందో
ప్రేమ కన్న యెక్కువగా…. భయంతో
వొకర్నొకరం కావిలించుకుని నిద్దరోయే వాళ్లం
చెట్ల కొమ్మల మీదనో కొండ గుహల్లోనో

యిప్పుడు నాకు అన్నీ వున్నాయి
నా కుటుంబం యిపుడు చాల చాల పెద్దది
అందరం తిన్నా మిగిలిపోయే బువ్వ వుంది
అందరం కట్టుకున్నా చాలే బట్ట వుంది
సరిగ్గా వాడుకోడం లేదు గాని అందరం
తల దాచుకోడానికి తగినన్ని యిళ్లున్నాయి

అయనా భయం
నేను నిజంగా యేమనుకుంటున్నానో
యెవరితో యేమి చెప్పుకోవాలన్నా భయం
అప్పట్లా ఒక బర్రెను పడగొట్టి కోసి
తెలిసిన అందరం తిని యేటి నీరు తాగి
యే డొక్క దొరికితే ఆ డొక్కలో దూరి
వొకరి వెచ్చదనంలో వొకరం నిద్ర పోలేం

యెవర్ని కావిలించుకోవాలన్నా భయం
యెవరితో యేం చెప్పుకోవాలన్నా భయం

యిప్పుడిలా మీతో కూడా…

 
 
 
Painting: Hristo Lalev