ఆవలి తీరం

ప్రవాస జీవితమే కథలు రాయించింది: శేషు శర్మ

మార్చి 2013

నేను విజయనగరం లో పుట్టి పెరిగేను. చిన్నప్పటి నుండి సంగీతం, నాట్యం నేర్చుకోవడంతో వాటిమీద చాలా మక్కువ. ద్వారం భావనారాయణ రావు గారు సృష్టించిన సంగీత-నృత్య నాటికలలో అతి చిన్నతనం నుండి పాల్గొనడంతో, అటువంటి ప్రక్రియలంటే నాకు విపరీతమయిన అభిమానం.

మా నాన్నగారు కీర్తిశేషులు వడ్లమాని అన్నపూర్ణేశ్వర రావు గారి అధ్వర్యంలో రాఘవ నాటకోత్సవాలలో , విజయరామ నాట కోత్సవాలలో, లెక్కలేనన్నినాటకాలను చూసాను. రావూజీ నటనలో చాతుర్యం , గణేష్ పాత్రో మాటల్లో పటుత్వం నన్ను ముగ్ధురాల్ని చేసేవి. దాంతో నాకు డ్రామా అంటే ప్రాణం. అతి పిన్న వయస్సులోనైనా యన్నార్ నంది నాటకాలు చూసినప్పుడు నేను అనుభవించిన ఉద్వేగం మాటల్లో చెప్పలేను.

విజయనగరంలో తరచుగా కవి సమ్మేళనాలు, సాహితీ సదస్సులు జరుగుతూండడం పరిపాటి. వాటికి విసుగు విరామం లేకుండా వెళ్ళే దాన్ని. సి. నారాయణ రెడ్డి గారి కవిత్వం విని మైమరచిపోయేదాన్ని. నేను చదివిన మొట్ట మొదటి కధ అవసరాల సూర్యారావు గారి “ఊరేగింపు” . అది చదివినప్పుడు మనసంతా వికలమయ్యి పోయింది. కధ అలా ఉండాలి అనుకునే దాన్ని. చందమామలో ఎప్పుడో ప్రచురింపబడ్డ “జ్ఞాపకార్ధం” అనే కధ , శంకరమంచి సత్యం గారి “ఒక రోజు “…ఎప్పుడో, ఎవరో వ్రాసిన కధ “కుక్కతోక”, అలాంటి కధలు నాకు చాలా ఇష్టం. సోమర్సెట్ మామ్, డాస్టావస్కీ, మాపసా వాళ్ళ కధలు, నవలలు అంటే నాకు చాలా ఇష్టం.

బాలమురళిగారి గానం నాకు అమృతం . వెంపటి వారి నృత్యం నాకు స్వర్గం. సూక్ష్మం గా చెప్పాలంటే నాకు మంచి కధ చదవడమన్నా , మంచి సినిమా చూడడమన్నా , మంచి పాట వినడమన్నా చెప్పలే నంత సంతోషం. పాటల్లో మంచి సాహిత్యాన్ని మళ్ళీ, మళ్ళీ విని ఆనందించడం అలవాటు నాకు. “మనసున మనిషై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమో, అదే స్వర్గమో”.. ” అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే , శోకాలా మరుగున దాగి సుఖమున్నదిలే’…లాంటి సాహిత్యాలు వింటూంటే గొప్ప అనుభూతి కలుగుతుంది నాకు.. అలాంటి సాహిత్యాలలో ఏదో ఒకటి నా మెదడులో నిత్యం మ్రోగుతూనే ఉంటుంది.

ఇకపోతే రచయిత్రిగా ఆలోచిస్తే, చిన్నప్పుడు చాలెంజ్ గా చంధోబద్ధం గా పద్యాలు వ్రాయాలని అనిపించేది. ఏవో కొన్ని పద్యాలు వ్రాసేను. అంత చెప్పుకోదగ్గవేవీ కావు. కధలు అంటూ ఎప్పుడూ వ్రాయలేదు. మెడికల్ కాలేజీ లో చేరడం, పెళ్లి చేసుకోవడం, ట్రైనింగ్ పూర్తవకుండా అమెరికా రావడం జరిగి పోవడంతో, సాహిత్యం, సంగీతం అన్నీ మూల పడ్డాయి. అమెరికాలో ట్రైనింగ్, పిల్లల్ని కనడం, పెంచడం,

గైనికాలజిస్టు గా పని, మెడికల్ స్టూడెంట్స్ కి చెప్పే పాఠాలు.. వీటితో రోజులు గడ చిపోయేవి. ఒక రొటీన్ అయిపోయింది జీవితం. నాకు వీలయినంతగా, సంగీత కార్యక్రమాలని, నృత్య ప్రదర్శనలని నిర్వహిస్తూ ఉండేదాన్ని.

2

ఈ దేశం వచ్చిన మొదట్లో కథలు వ్రాయాలన్న ఆలోచన అంతగా ఉండేది కాదు. కాని, అమెరికాలో స్థిరపడ్డ ఆంధ్రుల ఆచారాల్లో తేడాలు, అలవాట్లలో మార్పులు , పిల్లల తరంతో కలిగే ఇబ్బందులు, దంపతుల మధ్య జరిగే మధనాలు… ఇవన్నీ చూసినప్పుడు, మనస్సులో జనించిన ఆలోచనలే నా కధలకు నాంది పలికించేయి. ఆ ఆలోచనలకు రూపకల్పనలే నా కధలు.

నేను ఈదేశం వచ్చిన పదేళ్ళకనుకుంటా ; అప్పుడే పెళ్లి చేసుకుని మొట్టమొదటిసారిగా భర్తతో అమెరికా వచ్చిన ఇరవై ఏళ్ళ యువతి నాకు తారస పడింది. ఒక్క పదేళ్ళ తేడా లోనే, నాలాగే తెలుగు దేశంలో పెరిగిన ఆ యువతి ఆలోచనా విధానం, క్రొత్త దేశం వచ్చినా కూడా, ఎటువంటి చీకు, చింతా లేకుండా ప్రవర్తిస్తున్న ఆమె తీరు చూసి, నాకు ముచ్చటేసింది; ఆశ్చర్యం కలిగింది. పదేళ్ళ క్రితం అదే పరిస్థితుల్లో అమెరికా వచ్చిన నాకు, ఆ పిల్లకి ఎంత తేడాయో , అనుకున్నా. అప్పుడు, నా మొదటి కధ “దృక్పథం” వ్రాసా. అప్పటినుండీ, అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వారి జీవితాల్లో నా దృష్టికి వచ్చిన ఎటువంటి సమస్య అయినా, నేను అటువంటి పరిస్థితులను ఎదురుకోవలసి వస్తే ఏం చేస్తాను? అని దీర్ఘంగా అలోచించి, ఆ సమస్యకి పరిష్కారం ఏమిటి అని శోధించి, కథ వ్రాసేదాన్ని. ఏ కథ వ్రాసినా, ఒక వ్యక్తి గురించి కాదు. సంఘపరం గా మన తెలుగు వారి సమస్యగా ఆలోచించి, కథ వ్రాసేదాన్ని. ఆ కథ లో ఏ సమస్య గురించి వ్రాస్తున్నానో, అటువంటి సమస్యని ఇంకొకరేవరైనా ఎదుర్కుంటూ ఉంటే , వాళ్ళకి ఊరట కలిగే టట్టు, వాళ్ళ మనస్సుకు ఉపశమనం కలిగేటట్టు నా కథ ఉండాలని నా ఆశయం.

అయితే, నా కథలు చదివిన కొంతమంది, స్వంతంగా ఇతివృత్తం అల్లడం చేతకాక, నాకు తెలిసిన వ్యక్తుల జీవితాలని బట్టబయలు చేస్తున్నాను, అని ఆరోపించడం నేను వినకపోలేదు. నా కధలు చాలా నిరాశగా  ఉంటాయి. అవి చదువుతే మూటా ముల్లే కట్టుకుని ఇండియా పారిపోవాలని అనిపిస్తుంది అని నా ముఖం ముందే అన్నవాళ్ళు లేకపోలేదు. నా కథలు చదువుతూంటే, ఇంకా చదవాలని, శైలి సులువుగా, ఎవరో కధ చెప్పుతున్నట్టు ఉంటుందని అన్నవాళ్లు చాలామంది ఉన్నారు.

చాలా రోజుల క్రితం నేను వ్రాసిన ” నిర్ణయం” అన్న కథ చదివి, బాగా తెలిసిన స్నేహితుడు ఫోన్ చేసి అందులో ముఖ్య యువకుడి పాత్రకి అన్యాయం చేసేనని, ఇండియా నుండి అమెరికా వచ్చిన యువకులు అలావుండరని నాతో వాదించేడు. అదే కధ చదివిన డెబ్భై యేళ్ళ మామ్మగారు చికాగో నుండి ఫోన్ చేసి, అందులోని ముఖ్య యువతి పాత్రకి న్యాయం చేకూర్చానని; అబ్బాయిల దారుణమైన ప్రవర్తనని నలుగురి ముందు ధైర్యంగా చూపించానని ఎంతో మెచ్చుకున్నారు.

వృద్దాప్యం లో కలిగే సమస్యలతో సతమత మవుతున్న తల్లిదండ్రులు ఇండియా లో ఉంటే , అమెరికాలో సెటిల్ అయిపోయిన పిల్లలు ఎదుర్కునే మానసిక ఘర్షణ ని చూపించే కథ “అగాధం”. ఈ కథ కి వంగూరివారి కథల పోటీలో మొదటి బహుమతి వచ్చింది. ఆ కథని  మట్టుకు ఎందఱో మెచ్చుకున్నారు. అమెరికాకి దశాబ్ధాల క్రితం వలస వచ్చి, ఇక్కడే రిటైర్ అయి, భార్య ఆరోగ్యం చెడిపోతే, అష్టకష్టాలు పడ్డ వృద్ధుడి కథ ” ముసురుచీకట్లో మెరుపుకిరణం”. ఈ కథకు కూడా మొదటి బహుమతి వచ్చింది. భార్య చనిపోతే, ఆరోగ్యం చెడిపోయి నర్సింగ్ హోం లో నానా కష్టాలు పడుతున్న వృద్ధుడి జీవితంలో “చిరుదీపం” లా వచ్చిన మనవడి కథకి  రెండవ బహుమతి వచ్చింది. ఏభై ఏళ్ళ వయస్సులో భర్త పోతే తోడుకోసం వెతుక్కుని, నిరాశకు పాలైన ప్రౌఢ కధ “ఎండ మావులు.

“వాన ప్రస్థాశ్రమం ” అన్న కధ చదివి, దానికి చలించి, తమిళంలోకి అనువాదం చేసేరు శ్రీమతి గౌరీ కృపానందన్ గారు. అది నాకు ఎంతో తృప్తి నిచ్చింది. ఫరవాలేదులే; నేనూ కథ వ్రాయగలను అనుకున్నాను ఆరోజు. చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మావ గారితో సతమతమవుతున్న అమెరికా తెలుగు ఇల్లాలి కథ అది.

నా “వేప పువ్వు” కధచదివి, ఎంతో ప్రసంశించారు ప్రొఫెసర్ శివుడు ప్రభాకర్ గారు. నాకు ఫోన్ చేసి, నా అనుమతి తీసుకుని , ఇంగ్లీష్ లోకి అనువాదం చేసి, సీపీ బ్రౌన్ అకాడమి వెబ్ సైట్ లో ప్రచురించారు ఆయన. కొడుకు gay అని తెలిసి తల్లడిల్లి పోయిన తల్లిదండ్రుల కథ అది.

పాతికేళ్ళ సంసార జీవితంలో తనది అంటూ ఏదీ లేకుండా బతికి, పిల్లలు వాళ్ళ జీవితాలు వాళ్లు గడుపు కుంటూ ఉంటే, భర్త ఒక పరాయివాడులా , కేవలం శా సించే వాడులా కనిపించగా, తెగింపుతో తన నిర్ణయం తీసుకున్న స్త్రీ కథ “సర్ప్రైజ్ “. ఈ కథ నాకు తెలిసిన ఒకాయనకి చాలా నచ్చి తన చేత ఎలాగైనా చదివించాలని ప్రయత్నించేడని అతని భార్య చెప్పింది నాతో.

గత రెండేళ్లలో వ్రాసిన కధలు ” మట్టికుండలు”, “విముక్తి”. జీవితం బుద్బుద ప్రాయమని, “Live while you are alive” అని చెప్పే కధ “మట్టి కుండలు”. అంత్యేష్టి క్రియలకు ప్రాధాన్యం ఇచ్చే ఆంధ్రుడికి కలిగిన ఆదరణ “విముక్తి” లో కనిపిస్తుంది.

3

నేను ఏ కధ, ఎవ్వరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు. కానీ, “అమర ప్రేమ” అన్న కథ మాత్రం ఒక ఆదర్శ వనిత ని ఉద్దేశించి వ్రాసిన కథ. భర్త ముప్ఫైఐదు ఏళ్ళ వయస్సులో భయంకరమైన కేన్సరుతో చనిపోతే, ఇద్దరు పసిపిల్లల్ని, అత్తగారి సహాయంతో అమెరికాలో సాకుతూ , చూసే వాళ్ళందరికీ తన భర్త తనతో నే ఉన్నాడన్న అభిప్రాయం కలిగేటట్టు నవ్వుతూ, ప్రవర్తించే ప్రేమమూర్తి ఆమె . కధ వ్రాసేముందు, ఆమెను సంప్రతించి, ఆమె అంగీకారం తెలిపిన తరువాత వ్రాసిన కధ “అమర ప్రేమ”.

నిజానికి, నేను గొప్ప రచయిత్రిని కాను. కేవలం, నా కంటికి కనిపించిన ఘట్టాలను తీసుకొని, అవి నా మనస్సులో సృష్టించిన భావాలని ఒక కథ రూపంలో, అతి సరళమైన వాడుక భాషలో అప్పుడప్పుడు  చెప్పగల అతి సాధారణ కధకురాలిని మాత్రమే. ఎందరో మహా కవులు, రచయితలు, రచయిత్రులు. వారందరి ముందు నేను ఏమాత్రం??

 



4 Responses to ప్రవాస జీవితమే కథలు రాయించింది: శేషు శర్మ

  1. Chi
    March 1, 2013 at 12:10 am

    అమెరికాలో నా అభిమాన కథకులలో డా. శేషు శర్మ గారు ప్రముఖులు. ఈ వ్యాసంలో ప్రస్తావించిన కథలతో కలిపి ఆమె వ్రాసిన పాతిక కథలని “ప్రవాసాంధ్రుల ఆశా కిరణం” అనే మకుటంతో ఒక కథా సంపుటి గా ప్రచురించే అవకాశం మాకు కలిగింది. 2006 లో వెలువడిన ఆ సంపుటి మా 26 వ ప్రచురణ. అది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొంది, అమెరికాలో తెలుగు వారి జీవితాలకి ఒక దర్పణంగా నిలిచింది. అమెరికాలో కానీ, ఇండియాలో కానీ ఆ పుస్తక ప్రతి కావలిసిన వారు నన్ను సంప్రదించండి.

    ఇట్లు

    వంగూరి చిట్టెన్ రాజు
    వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా.
    E-mail: vangurifoundation@gmail.com

  2. March 8, 2013 at 6:54 pm

    బాగున్నది శేషు శర్మగారు, మీ కథల నేపథ్యం తెలిపిన తీరు.

  3. March 17, 2013 at 12:08 pm

    ఈ మధ్య కాలంలో డాక్టర్ రచయితలు ఎక్కువయ్యారు. బాగుంది.అయితే వాస్తవానికి కొంత కల్పన జోడిస్తేనే ఆర్ట్ అవుతుంది.కథలకు కావాల్సిన వస్తువు ఎక్కడనుంచో వూదిపడదు.అది మన కానీ మన చుట్టూ ఉన్నవాళ్ళ జీవితం లోంచే వస్తుంది. మీరు ప్లాట్ తీసుకుంటున్న విధానం సరియైనదే.keep going

  4. VOOLAPALLI,S.MURTY.
    March 20, 2017 at 5:28 pm

    మీ కథల నేపధ్యం ఇంత బాగుంటే మీ కథలు ఎంత మనసులను ప్రభావితం చేస్తాయో /దయ ఉంచి అవి ఎక్కడ లభిస్తాయో చెప్పగలరా //

Leave a Reply to Chi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)