కథ

బినామి

మార్చి 2013

ఆరోజే మద్దిరావమ్మ సంబరం.

పొరుగూళ్ల నుంచి వచ్చిన చుట్టాలతో నిండిపోయి ఊళ్లో యిళ్లన్నీ విరగకాసిన వేరుశెనగగుత్తుల్లా ఉన్నాయి. పెరళ్లలో పూలతోటలన్నీ కళ్లింతలు చేసుకుని సంబరం చూడడానికి వీధిగుమ్మాల్లో పొందిగ్గా కూచున్నట్టు రంగురంగుల ముగ్గులు.
వాళ్లమ్మతో పాటు చీకట్నే నిద్రలేచి పొదీషనుగా తలంటుస్నానం చేసేసింది బుజ్జి. తల తుడుస్తుంటే చారుమతి నడుంచుట్టూ చుట్టి తలెత్తి మొహంలోకి చూస్తూ ” అమా.. అమా.. ఇవ్వాళ కూడా మనిద్దరమేనా?..మనింటికెవరూ రారా…?!” దిగులుగా అడిగింది. చారుమతి విననట్లుగా మొహం పెట్టి తల తుడిచిన పాత చీరను గట్టిగా దులిపి తీగ మీద ఆరేస్తూ “జుట్టిరబోసుకుని బైటకు వెళ్లమాకు. తలారేవరకూ వరండాలో నిల్చో” అంది.
బుజ్జికి కోపం వచ్చింది.

నడుస్తుంటే గొడుగులా విచ్చుకుంటున్న తుర్రపిట్ట రెక్కల రంగు పట్టులంగా కుచ్చిళ్లను విసురుగా తన్నుకుంటూ వరండాలోకి వచ్చింది. వరండా చీడీలకి కుడిచేతివైపునున్న పూలమొక్కలు రమ్మని తలలూపాయి. సీతమ్మవారి జడబంతుల మొక్క దగ్గరికి వెళ్లి ఒక పువ్వు మీదికి మొహం వంచి ” స్నానం చేసావా?” అంది. మొఖమల్‌ మెరుపుల పువ్వు గాలికి వయ్యారంగా వూగింది.

“చేసేసావా? సరే.. ఓయ్‌.. ఒంటిరెక్క మందారం.. రాధాకృష్ణ పూలచెట్టూ.. విరజాజులూ…కనకాంబరాలూ ..శంఖుమల్లీ..యిట్టా రండి…యివాళ సంబరం కదా! జాంచెట్టు పిన్నివాళ్లింటికి వెళ్లి ఆడుకుందాం పదండి.” బుజ్జి పిలవంగానే పువ్వులన్నీ వొచ్చి ఒళ్లో వాలాయి. వీళ్లను చూడగానే జాంచెట్టు పిన్నిగారు నీడచాప పరిచి జాంపళ్ల ఫలహారం పెట్టింది. అరగంటసేపు బహుపూలపాత్రాభినయం చేసేసరికి విసుగొచ్చి గభాలున లేచి వంటింట్లోకి పరిగెత్తి “అమా.. జుట్టారిపోయింది” అంది.

“జడేస్తాను…పా..దువ్వెన తెచ్చుకో” ఉత్తరపేపు గుమ్మం పైమెట్టు మీద కూచుంది చారుమతి. దువ్వెన, రిబ్బన్లు, కాటుక, ఎనిమిది రంగుల తిలకంబాక్సు తెచ్చుకుంది బుజ్జి.

జుట్టు చిక్కులు తీస్తూ ” పెళ్లయిన ఎన్నో ఏళ్లకి ఎన్నో పూజలుచేస్తే నువ్వు పుట్టావు. నువ్వు యింతున్నపుడు మీ నాన్న పోయాడు. వూరంతా అప్పులే… అన్నీ పోనూ ఏం మిగిలింది? ఈ రెండెకరాలుతప్ప. ఏలూర్లో కాపరం పెట్టమన్నారంతా.. ఆళ్లమాటే యినుంటే ఈ పాటికి అయిక్కిమనిపోయేవాళ్లం. అల్లాలూ బిల్లాలూ చేసి, వున్నది కూడా కాజేత్తారని చుట్టాలెవరినీ జేరనివ్వడంలా”. చారుమతి చెప్పేదంతా బుజికి కంఠోపాఠమే. సగం సగం వింటూ రిబ్బన్ని గులాబీ పువ్వులా చేయడానికి మడతలుపెడుతోంది.

“… నీకు ఒంటిమీదికి ఎనిమిదేళ్లువచ్చాయి. లొడబుచ్చకాయలా వాగుతూ అటూ యిటూ తిరక్కూడదు. అమ్మ చెప్పినట్లు వినాలి. అంతో యింతో చదువు చెప్పించి, నీ పెళ్లిగానీ చేశానంటే…అదుగో..మొగుడు లేకపోయినా చారుమతి కూతురు పెళ్లి ఘనంగా చేసింది అనుకోవాలందరూ”. జుట్టుని ఈతపాయల జడేసి రిబ్బను కుచ్చులు పోస్తూ అంది చారుమతి. ఎప్పటిలాగే తలూపింది బుజ్జి.

ఎడంచేత్తో లేతబుగ్గలు రెండూ ఒత్తి చూపుడు వేలుతో కింది రెప్పలాగి, కుడిచేతి ఉంగరం వేలితో అత్తారుబతంగా కాటుక దిద్దుతుంటే చారుమతి వీపు చుట్టూ చేతులు వేసి, నొక్కుకుపోయిన బుగ్గలతోనే..”అమా..షుట్టాలెవలూ ..లాలా? నిజ్జిమేనా?…” దింపుడు కళ్లం ఆశలా మళ్లీ అడిగింది.

విసుగ్గా చూసింది చారుమతి.

“పాడిందే పాటరా.. పాచిపళ్ల దాసరా.. అని

అదే పట్టుకుంటావే.. ఆయశుద్ధమయిన మాటొక్కటి రాదు నీకు”. ” వేలికి మిగిలిన కాటుక తలకు రాసుకుని, బుజ్జి తల మీద గట్టిగా మొట్టి ” వెళ్లు.. వెళ్లి ఆడుకో ఫో..” అంది.
కాటుకకళ్ల నుంచి కన్నీటిబొట్లు బుగ్గలమీదకి టపటపా జారాయి. ” ఎవళ్లతో ఆడుకోవాలీ..?” గట్టిగా అరిచి పరిగెత్తుకుంటూ వరండాలోకి వచ్చింది. ఓ పక్కగా ఎండుగడ్డితో చుట్టలు చుట్టిన ఎంటిక్కాయ కనిపించింది. కసిగా కాళ్లతో తన్నుతూ, దొర్లిస్తూ, వడ్లపురి చుట్టూ తిరిగింది కాసేపు.
చారుమతి తెచ్చిచ్చిన పాలు బుద్ధిగా తాగేసి, మూతి శుభ్రంగా తుడుచుకుంటూ, ” అమా..మరీ..సరోజిని వాళ్లింటికి వెళ్లి కూసేపు ఆడుకుని ఎమ్మటే వచ్చేత్తానేం…? లయగా కాదనడానికి నోరు రానంత జాలిగా అడిగింది మళ్లీ…
” అక్కడికెందుకే?” ఆళ్లు పిండొంటల బట్టీ పెట్టారు. మళ్లా మీ అమ్మేం వండిందని కూపీలు లాగుతారు. వద్దులే..అయిమావతి వచ్చిందేమో అమ్ములత్తని అడుగు పనయ్యాక అలా బైటకి తీసికెళుతుంది…”

ఖాళీ గ్లాసు తీసుకొని లోపలికి వెళ్లిపోయింది చారుమతి.

అయిమావతి పక్కింటి అమ్ములత్త వాళ్లింట్లో పైబాట్లకి చేస్తుంది. పెళ్లయి కాపురానికి వచ్చింది లగాయితు ఇరవయేళ్లుగా ఆ యింట్లోనే పొద్దుట్నుంచీ సాయంత్రం దాకా రాట్టంలాగా ఆ పని ఈ పనీ చేస్తూ నమ్మకంగా ఉంటోంది. ఆళ్లాయన ఎల్లమంద నేతపని బాగున్నపుడు బాగానే వుండేవాడు. తర్వాత తాగడానికి డబ్బులేనప్పుడే కూలికి వెళతాడు. మిగతా టయిమంతా సాలిపేట మర్రిచెట్టు కింద చీట్లాట కాలక్షేపం చేస్తాడు.

రోజులాగే పిట్టగోడకి యివతలున్న రోటిమీదకి ఎక్కి గోడమీదుగా అమ్ములత్త వాళ్లింటివైపు చూసింది బుజ్జి. విశాలమైన మండువాలోగిలి యిల్లు. యింటికి వంటింటికి మధ్య నాపరాళ్ల చప్టా. రోజూ పొద్దున్నే అయిమావతి అక్కడే చల్ల గుంజకి కట్టిన మజ్జిగ కవ్వానికున్న తాడు రెండు కొసలు పట్టి ముందుకీ వెనక్కీ లాగుతూ…
” కాశికెడదామంటే కదలవే నా కాళ్లూ..
ఢిల్లి కెడదామంటే తిరగదే నా మనసూ..
అదె నా రాచ పుట్టింటికెడదామూ అంటే
నాకాళ్లు పన్నిన్న రథములై నడుచు
నా చేతులుయ్యాల చేరులై వూగు…” అంటూ
వెన్నరాసిన గొంతుతో పాడుకుంటూ ఉంటుంది. చిలుకుడి పని అవ్వగానే ఉసిరికాయంత వెన్నముద్ద తెచ్చి పిట్టగోడకు పూసిన చందమామ నోట్లో పెడుతుంది. గుటుక్కున మింగేసి ” ఎపుడూ ఇదే పాట పాడతావేంటీ?” అంటుంది బుజ్జి. ” మా అమ్మోళ్లింటికి వెళ్లి ఏడు సమ్మచ్చరాలు అయింది బుజ్జమ్మా!”

అంటుంది…అపుడుగానీ అయిమావతి గొంతు వింటే గొడ్లసావిడిలో గేదె పొదుగునుంచి బలవంతంగా లాక్కెళుతున్న పెయ్యిదూడ అరుపులా ఉంటుంది.
అమ్ములత్త వాళ్ళింట్లో చుట్టాల హడావిడి కనిపిస్తోంది గానీ అయిమావతి అలికిడి లేదు. కాసేపు చూసి
‘అయిమాతీ..అయిమాతీ..” పిలిచింది బుజ్జి. ఎవరూ పలకలేదు గానీ ఒకటిన్నర అడుగుల ఎత్తుతో, ఏడుమొగ్గల ఎర్రని తురాయి ఉన్న గోధుమ మచ్చల పందెం కోడిపుంజు తిరగడం ఆపి, కాళ్లు నేలకి నిగడదన్ని మెడదగ్గర ఈకల్ని విదిలించి బుజ్జిని అనుమానంగా చూసింది. రెండు మట్టిపెడ్డలు తీసుకుని దానిమీదకి విసిరి “పోవే కోడిముండా…?” కోపంగా అంది బుజ్జి.
ఇంతలో పెదబాబు మావయ్య బైటికొచ్చి కోడిపుంజునెత్తుకొని మెడ ఈకలు దువ్వి ” యావే బుజ్జీ! మారాజు పుంజుని మట్టిబెడ్డల్తో చంపేద్దావనే!!….” గోరోజినంగా అన్నాడు.
“అయిమాతి…” బిక్కుమని చూస్తూ అంది. పెదబాబు మామయ్య వెనకాలే వచ్చిన అమ్ములత్త.
” ఆ!…అయిమాతీ… చట్టుబండలూ… పనున్నరోజే ఎగ్గొట్టినట్టుంది…చూడూ.. ఏడ్చినదానికీ మొగుడొత్తాడు..ఏడ్వనిదానికీ మొగుడొత్తాడు అన్నట్టు యిద్దరిపనీ అవుతుంది. వెళ్లి అయిమావతిని పిల్చుకురా…” అంది.
” మా అమ్మ తిట్టుద్ది…” చక్రాల్లాంటి కళ్లు భయంగా తప్పింది బుజ్జి.
” మీ అమ్మకి నే చెప్తాలే … పో..”
కాళ్లకి అపుడే జీవం వచ్చినంత ఉత్సాహంగా రెండుచేతుల్తో పట్టులంగా కొద్దిగా పైకి ఎత్తి పట్టుకుని రోటిమీది నుంచి ఒక్క దూకు దూకి, ఎగిరి మండిగాలు దాటుకుని,వరండా మెట్ల మీద చకచకలాడి వీధిగుమ్మం తగలకుండా బైటకి గెంతి, నీటిబోదెలోకి అకస్మాత్తుగా వదిలిన పిల్లనీటిపాయలా జలజలలాడుతూ క్షణంలో సందుమొగకి, మరుక్షణంలో అయిమావతి యింటికి చేరుకుంది బుజ్జి. అలవాటుగా ఎగిరి చూరుకున్న ఎండుతాటాకును తెంపుతుంటే లోపల్నుంచి గట్టిగా ఏవో మాటలు వినబడి తుళుక్కుపడి పక్కనున్న మట్టి అరుగును ఆనుకుని నిలబడిపోయింది.
” ఇదిగో మీ చెల్లిగాని నీతో వత్తానంటే సుబ్బరంగా తీసికెళ్లు. నాకేం మనేద లేదు. కానీ తిరిగి రానక్కరలేదు. అక్కడే అట్టిపెట్టుకోండి. మొదలే బిడ్డాగడ్డాలేని గొడ్డుమోద్ది” ఎల్లమంద అయిమావతి వాళ్లన్నతో తెగేసి చెపుతున్నాడు.

“అవునయ్యో గద్దరిబావో!” మంచానబడ్డ మీ అమ్మాబాబుల్ని, పైసా యింట్లోకివ్వని నిన్నూ బిడ్డల్లా సాకుతోంది గదా గొడ్డుమోద్దే మరి! ఏడేళ్లాయి మా అడబిడ్డని మాకు గాకుండా చేశావు యిపుడు కూడా సంబరానికి కూడా తీసికెళ్ళ నివ్వడం లేదు..అసలకి పెదబాబుగోరు మిమ్మల్ని నమ్మే కదా పొలం అయిమావతి పేర్నపెట్టారు. తర్వాత అడిగినపుడు అది పొలం ఆరికి రాసివ్వకుండా బిగేయడం ధర్మమా? నీదిగాని సొమ్ము అమ్ముకుతింటానంటావ్‌ అది నాయమా? సంతకం పెట్టనందనేసి మా చెల్లిని నానా బాదలు పెడుతున్నావు. రాజా రాజా నీ రాజరికం మానతావా నీ వాజ (వాదం) మానతావా అంటే నా రాజరికం అయినా మానతాగానీ నా వాజ మాత్రం మాననన్నాడట వెనుకటికి ఒకడు. అట్టావుంది నీ యవ్వారం. అసలకి ఆళ పొలం మీద నీకేం కర్తీకం ఉందని యిదంతా?….” నిష్ఠూరంగా అన్నాడు అయిమావతి అన్న.

“అన్నో! కర్తీకవో… కట్టుబండలో.. యిరవయ్యేళ్లనించి ఆ ఇంట్లోబడి రెక్కలు ముక్కలు చేసుకుంటూనే వున్నాను. ఆళకున్న ముప్పయ్యెకరాలకి..సిండ..ఈ మూడెకరాలు ఒక లెక్కా?… నాయం,దర్మం, కర్తీకం నిర్ణయం జెయ్యడానికి మనమెవళం? పొలం అమ్మేసి వూరొదిలి పారిపోదావంటాడు మీ బావ. నా పేర్న పొలం పెట్టినా ఒక్క గింజ దాన్లోది తిన్న పాపాన బోయామా? పొలం అమ్మేసుకుంటే పెదబాబుగోరు సూత్తా వూరుకుంటాడా? సంపేసి శవం జోబీలోంచయినా లాగేసుకుంటాడు…” అయిమావతి మాట్లాడుతుంటే పళ్లు పటపటలాడిస్తూ కూర్చున్న ఎల్లమంద చివాలున లేచి
” నియ్యవ్వ.. యిదంతా పెదబాబుగోరి మీద జడుపే? వలపులు బోతున్నావు గదే వలపులు…” జుట్టు పట్టి వంగదీసి వీపుమీద గుద్దేడు. నేల మీద పడేసి కాళ్లూ చేతుల్తో తన్నుతుంటే అన్న అడ్డుపడబోయాడు. విసిరికొట్టాడు ఎల్లమంద.

” నేను అసుమంటి దాన్ని గాదు…” అయిమావతి దీనంగా ఏదో అనబోతుంటే లాగిపెట్టి మూతిమీద కొట్టాడు.

బొలబొలా రక్తం కారిపోయింది. అరుపులు, ఏడుపులు, పెడబొబ్బలతో యిల్లంతా గల్లంతుగా గోలగోలగా అయిపోయింది. అన్న తన గుడ్డల సంచి తీసుకుని “తల్లో! నీ మొగుడికో దండం, ముక్కదెప్పుళ్లతో ఆగేరకంకాదు ఈడు. నేనున్నానంటే నన్ను అడ్డుపెట్టుకుని నిన్నింకా సంపుకుతింటాడు.” రెండుచేతులె త్తి దండం పెడుతూ బయటికి పరుగుతీసాడు.

అయిమావతి అసాసురాలయిపోయింది. ” అన్నో! నన్ను వొదిలి ఎల్లకురో, నేనూ నీతో వత్తాను… అమ్మని జూడాలిరో..” ఎల్లమందని తప్పించుకుని లబలబలాడుతూ బయటకొచ్చి ‘ ఉయ్యాల చేరుల్లా’ ఊగుతున్న చేతుల్తో అన్న వెనకమాల పరిగెత్తింది.

అప్పటికే రోడ్డెక్కి వడివడిగా వెళ్లిపోతున్నాడు అన్న. ఆయిలో ప్రాణం సోయిలోకి వచ్చినట్టయి నేల మీద కూలబడి తల బాదుకోబోయి బిత్తరచూపులతో గోడకి అంటుకుపోయిన బుజ్జిని చూసి టక్కున ఆపేసింది అయిమావతి.

నల్లమేఘాలతో ఉబ్బిన ఆకాశంలాంటి మొహం, నెత్తుటి నిప్పులు గక్కుతున్న నోరు, చీకట్లో వూగుతున్న చెట్లనీడల్లా ఎదమీద, భుజాల మీద పరుచుకున్న జుట్టు.. అయిమావతిని చూసి బెదురుగా రెండడుగులు వెనక్కివేసి ” అమ్ములత్త,,,” మిగతా మాటల్ని గుటకవేసి మింగుతూ అంది బుజ్జి.

మౌనంగా లోపలికి వెళ్లి పదినిమిషాల్లో బైటకి వచ్చింది అయిమావతి. జుట్టు ముడివేసి మొహం కడుక్కుంది. బుజ్జికి కొంచెం ధైర్యం వచ్చి అయిమావతి దగ్గరికి చేరింది. యిద్దరూ చేతులు చేతులు పట్టుకుని బైలుదేరారు. నడుస్తూ మధ్య మధ్య అయిమావతి మొహం కేసి చూస్తోంది బుజ్జి. అకస్మాత్తుగా ఏ మాంత్రికుడో వచ్చి ఇందాకటి అయిమావతిలా మార్చేస్తాడా అన్నంత భయంతో చూస్తోంది. అయిమావతిలో గడ్డగట్టిన మౌనం, ఎప్పట్లా కవుర్లూ, కతలూ,నవ్వులూ లేవు. మొహం బిగదీసుకుని అట్లా ఉండడం బుజ్జికి నచ్చలేదు. ” ఈతపాయల జడేసింది మా అమ్మ…” కలకదెలుపుతూ అంది బుజ్జి. జడ పట్టుకుని చూసి తలూపింది. అదే మొహం… వానకి ముందు ఉమ్మరింపులా…

దిగాలుగా నడుచుకుంటూ అమ్ములత్త వాళ్లింటికి చేరారు. వీధరుగు మీద నలుగురయిదుగురు రైతులతో కలిసి కూర్చున్నాడు పెదబాబు. అయిమావతిని చూడగానే కళ్లెగరేసి ” వచ్చావెట్టా?! నాపసానిలాగా చీరకుచ్చిళ్లు జారిడిసి పన్లోకొచ్చావ్‌. అయినా నెరవతక్కువ చీరలు కట్టే ఖర్మ నీకేంట్లే… మూడెకరాల ఆసామివి కదా” ఎకసెక్కెంగా అన్నాడు. పక్కనున్నోళ్లు గొల్లున నవ్వారు.

ఆ వజాన అయిమావతి నిల్చున్నపాటుగా నిలువెల్లా జలదరించడం చేతుల లంకెలోంచి గ్రహించింది బుజ్జి. పెదబాబు మావయ్య ఏవన్నాడో అర్థం కాకపోయినా చెడ్డగా ఏదో అన్నాడని మాత్రం అర్థమయింది బుజ్జికి. పెదవి దాటని మాటలేవో గొణుగుతూ చీరకుచ్చిళ్లు బొడ్డున దోపి లోపలికి అడుగేసింది అయిమావతి.

వరండాలోంచి అమ్ములత్త ” వచ్చా?..బక్కచుక్కలు గుంకి బడాయి చుక్క పొడిసింది. అమ్మగారు తెమిలి వచ్చేసరికి” చేతులు బార్లాజాపి గయ్యిమంది.

“ఎల్మంద అయిమాతిని కొట్టాడు…” ఎవరి మీద ఎందుకు కోపమో అర్థం కాక ఉక్రోషంగా అంది బుజ్జి.
బయటి లోపలి గాయాల అయిమావతిని తేరిపార చూసింది అమ్ములత్త. ” ఆ! ఆ !.. వేలు మీద గోరుమొలిత్తే గోల్కొండ వరకు జాబులెల్లాయంట. మొగుడేదో యిట్టా అంటేనే వాసి మొక్కోయిందా? మరి మా బాధలు కడతేర్చేది. ఎవరు? హమ్మా.. హమ్మా.. వందా రెండొందలూ గారు.. మూడెకరాల పొలం.. ఎవరు తిన్నట్లు! నమ్మి నెత్తిన పెట్టుకుంటే తిన్నయింటి వాసాలు లెక్కబెట్టినట్లు ఏడేళ్ల నుంచీ మొగుడూ పెళ్లాలిద్దరూ నాటకాలాడుతున్నారు గదా? ఇదిగో రాసేత్తాను, అదిగో రాసేత్తానంటది. రిజ్రిస్టాపీసుకి రమ్మంటే కదల్దు. పండగపూట మా యింట నవ్వు లేకుండా చేసావు గదే! కులానికి పేదయినా గుణానికి పేదకానోళ్లని యిం…త మందిని చూశాం…” బొయోబొయోలాడుతున్న అమ్ములత్త, అమ్ములత్తలా కనపడలేదు బుజ్జికి.అపుడు ఆమె తనలా లేదు అయిమావతిలా లేదు. అమ్మలాగా కూడా లేదు. పాలేరు బుడ్డోడిని బండబూతులు తిడుతున్నపుడు పెదబాబు మావయ్య మూతిమీద అసహ్యంగా కదిలే మీసంలా వుంది అమ్ములత్త.

పొదుగు బరువుతోపాటు కాడి బరువు కూడా మోయాల్సి వచ్చిన నిస్సహాయమైన ఆవులా కాళ్లీడ్చుకుంటూ లోపలికెళ్లి పనులు అందుకుంది అయిమావతి. బుజ్జి యింటికి వచ్చేసినా మధ్య మధ్య పిట్టగోడమీద మొహం వాల్చి అక్కడేం జరుగుతుందో మూగగా చూస్తూనే వుంది… రోజూ పాడే పాట లేదు మాట లేదు.. అమ్ములత్త మాత్రం చీకుదోమల్లాంటి మాటల్తో అయిమావతి చుట్టూ ముసురుతూనే వుంది.
సాయంత్రం ఏడుగంటలకి సంబరాలు మొదలవుతాయి. ప్రభబండి ఎత్తుతారు. దాని వెనక గణాసార్లు, గ్రామదేవతలూ, భక్తులూ వూరంతా తిరుగుతారు. అయిమావతి సాయంత్రం పనయి యింటికి వెళ్లేముందు చారుమతి దగ్గరకు వచ్చింది. సంబరంలో బండి వెనకమాల తిరగడానికి సవాలక్ష జాగ్రత్తలు చెప్పి బుజ్జిని అయిమావతికి అప్పగించింది.

అయిమావతి యింటికి వెళ్తూ యిద్దరూ తోవలో వున్న సీమచింత గుబురుల దగ్గర ఆగారు. అలసిపోయినట్లు పక్కనున్న రాయిమీద కూర్చుంది అయిమావతి. ఇంకా గడ్డ కట్టిన అదే మొహం. అమ్మ కూడా అపుడప్పుడూ ఇంతే! ఎందుకుంటారో యిట్లా? రాలిపడిన సీమచింతకాయలు ఏరుకుంటూ అనుకుంది బుజ్జి. ఏం చేయాలో తోచక, ఈ లోకంలో లేనట్టుగా ఉన్న అయిమావతి చుట్టూ చక్కర్లు కొట్టింది. మొహంలో మొహం పెట్టి చూసింది. బుగ్గలు వాచిపోయి, కింది పెదవి పగిలి నెత్తుటిముద్దలా వుంది. లంగాలో దోపుకొని తెచ్చిన పౌడరు పొట్లం తీసి గాయం మీద నిమ్మిదిగా రాస్తూ
” అప్పుడు.. అప్పుడూ మనమేం జెయ్యాలంటే.. ఎంటిక్కాయని గా..ట్టిగా తన్నేయాలి. కోడిపుంజు మీద మట్టిబెడ్డలు యిసరాలి. యింకా అట్టా ఏమన్నా జెయ్యాలన్నమాట. అప్పుడు నెప్పేయదు. నమ్మకంగా చెప్పింది బుజ్జి.

పొద్దు వాటారుతోంది. ఆ రోజు సూర్యుడి ఆఖరికిరణం ఆకాశాన్ని ఖాళీచేసి, అయిమావతి మొహంలోకి వచ్చి చేరింది.
…….

సాయంత్రం ఏడు గంటలు.
ఇట్టా చీకట్లు కమ్మగానే అట్టా పెట్రోమాక్సు లైట్లు గుప్పున వెలిగాయి. వూరికి ఈ చివరనున్న మద్దిరావమ్మ గుడి నుంచి ప్రభ బండి ఊరేగింపు మొదలయింది. ఆ చివరనున్న గంగాణమ్మ గుడికి చేరేలోపు ప్రతి యింటివద్దా ఇచ్చే కానుకలూ మొక్కుబళ్లతో బండి నిండిపోతుంది. ఎడ్లబండికి వెదురుబొంగులతో బాగా ఎత్తులో ప్రభని నిలిపారు. ముస్తాబు చేసిన మైసూరెడ్లు మువ్వలు గణగణలాడించుకుంటూ ముందుకు కదిలాయి.

ప్రభబండి ముందు మద్దిరావమ్మ, గంగాణమ్మ, పోలేరమ్మ, చల్లాలమ్మ,మాల్చెమ్మ తల్లులు ఉల్లాసంగా ఆడుతున్నారు. భక్తులు గుగ్గిలం పొగతో వాళ్ల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నారు. పసుపు, బియ్యప్పిండి కలిసిన బండారు, లైట్ల వెలుగులో పసుపు మేఘంలా కమ్ముకుంది. శూలానికి కొమ్మలూ, రెమ్మలుగా యినపతీగలు కట్టి వాటికి నూనెలో ముంచిన గుడ్డలు చుట్టి వెలిగించిన ‘నారశూల’ దివ్యంగా వెలుగుతోంది. పులేషగాళ్లూ, డప్పులోళ్లూ, వాళ్ళ చుట్టూ మూగి చిందేస్తున్నవాళ్లతో వీధులు కిక్కిరిసిపోయాయి.

బండి వెనకమాల గుంపుతో కలిసి నడుస్తున్న బుజ్జి, అయిమావతి మొహాలు మెరిసిపోతునాయి. ఆ పూట అయిమావతి మొహానికి పసుపు రాసి యింత పెద్ద కుంకుమ బొట్టుపెట్టింది. చిలకాకుపచ్చ రంగు అంచున్న పండు మిరపరంగు నేతచీర కట్టి చేతుల్నిండా రంగురంగుల గాజులు వేసుకుని ఎర్రెర్రని కారంబంతి పూలచెండు తల్లో పెట్టుకుంది.

ప్రభబండి, అమ్ములత్త వాళ్ల యింటిముందు ఆగబోతుండగా బుజ్జి చేతిని విడిపించుకుని గుంపుని చీల్చుకుని తుఫాను గాలిలాగా ప్రభబండి ముందు ఆడుతున్న గ్రామదేవతల మధ్యకి దూకింది అయిమావతి.

” ఆపండ్రా..” ఒక్క పొలికేక పెట్టింది. దిక్కులు పిక్కటిల్లినట్లయి ఎక్కడి వాళ్లక్కడ ఆగిపోయి నిశ్చేష్టులయి చూశారు. గుభిల్లున నేల మీద కూలబడి ” ఊ.. ఊ..మ్‌మ్‌…మ్‌…” శరీరాన్ని గుండ్రంగా తిప్పుతూ వూగిపోతోంది అయిమావతి. ఆ ఉగ్రస్వరూపాన్ని చూసి గంగాణమ్మ మద్దిరావమ్మలు సైతం కంపించిపోయి వెనకడుగులు వేశారు.ముసలివాళ్లు ముందుకువచ్చి మోకాళ్లమీద కూలబడి ” అమ్మా! ఎవరు తల్లే!… నువ్వెవరో చెప్పమ్మా…?” వేడుకున్నారు.

“నే…ను.., నల్లమారెమ్మనురా.. మీ గొడ్డూగోదా పిల్లా మేకా అన్నింటిని నమిలి మింగేత్తానురా..” గింగుర్ల గొంతు గాలిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎక్కడి వాళ్లక్కడ పిడుగుపడ్డట్టయ్యారు. ముప్ఫయ్యేళ్ల తర్వాత నల్లమారెమ్మ వూరిమీద వాలింది. ఏం ముంచుకువత్తందోనని అందరూ భయంతో గుసగుసలు పోతున్నారు.

గణాసార్లు తేరుకుని ” ఓ అమ్ములమ్మో… నీ యింటి ముందే కూచుంది అమ్మతల్లి.. శాంతి చేయించకపోతే మీ యింటితోనే అశుభం మొదలవుద్ది.. రాండి… రాండి.. ” కేకలు పెట్టారు.
అమ్ములత్త, పిల్లలు, చుట్టాలు ఉరుకులు పరుగుల మీద వచ్చి పసుపు వేపాకు కలిసిన నీరు బిందెలతో తెచ్చిన నల్లమారెమ్మమ ముందు వారపోసారు. గుగ్గిలం వేసి బండారు జల్లి యింటిల్లపాదీ కాళ్ల మీద పడ్డారు. నల్లమారెమ్మ కనుగుడ్లు పెద్దవి చేసి వీధి గుమ్మం వేపు చూసింది. కదలకుండా అతిశయంగా నిలబడివున్నాడు పెదబాబు.

” ఏం పెదబాబూ.. నల్లమారెమ్మనే శంకిస్తావురా?!” గర్జించింది. ఆ దెబ్బకి అగ్గగ్గలాడుతూ వచ్చి మెడలో వేసుకున్న కండువాని నడుముకి కట్టి నీరు వారపోసి, ముందుకు వంగి జీరాడుతున్న నల్లమారెమ్మ చీరకుచ్చిళ్ల మీదుగా పాదాలనంటి దణ్ణం పెట్టారు.

కళ్లారా చూసింది నల్లమారెమ్మ.

” అమా.. నల్లమారెమ్మ బావుంది కదూ..” చారుమతి చెవిలో గుసగుసలాడింది బుజ్జి. భయంగా చూసి బుజ్జి నోరు అరచేత్తో మూసింది చారుమతి.

అప్పటికీ ప్రభ బండి ముందు నుంచి కదలకుండా వూగిపోతూనే వుంది నల్లమారెమ్మ ” నా ఆకలి తీరలేదురో.. నా ఆశ చావలేదురో.. నాకు తినడానికి యావయినా పెట్టండిరో..’ పంతం పట్టేసింది… ఏం చేయాలో తోచక గుంపునింపులు పడుతున్నారందరూ. డప్పులు లేవు, నృత్యాలు లేవు, వేషాలు లేవు… నల్లమారెమ్మ ధాటికి కకావికలయిపోయారందరూ.

” అమ్మా.. మారెమ్మ తల్లీ.. నువ్వు శాంతించి ముందుకు కదలకపోతే ఊరంతటినీ చల్లగా చూడాల్సిన నీ అప్పచెల్లెళ్లూ అలిగి మాయమయిపోతే మా గతేం కావాలి…?” గణాసార్లు ఆవేదనగా అన్నారు.

” అపచారి దొరకాలిరా.. దొరికిన వాడిని దండించాలిరా!…” రౌద్రంగా పలికింది నల్లమారెమ్మ.

” ఎవరుతల్లే అపచారి? చెప్పు తల్లే! యిట్టా గాదుగానీ మారెమ్మ తల్లే.. నివ్వులే… అపచారి అన్నోడు దొరకడు. మనమే ఎతకాల.. లే.. నారశూల చేతబట్టు. బూవి మీద పాదంమోపు. చిందెయ్యి, ఓరి రఖునాదవో.. ఆ నారశూల యిట్టా తెచ్చి.. మారెమ్మ కుడిచేత బెట్టు.. ఓరి మత్తేసో.. ఆ యాపమండల గుత్తులు ఎడమచేత బెట్టు.. లే మారెమ్మ తల్లీ…” గణాసార్లు నల్లమారెమ్మ మొహం మీదికి గుగ్గిలం పొగ వేసారు.

నల్లమారెమ్మ లేచి నిలబడింది.

వల.. వల.. వలా.. వల…. వల.. వలా… ఊరంతా ఘొల్లున ఘోష పెట్టింది.

భూమి పైకి ఎక్కుపెట్టిన బాణంలా కుడిమోకాలు వంచి గుండెలవరకూ లాగి అరచేయిలా విస్తరించిన గుండ్రని దృఢమైన పాదాన్ని నేల మీదికి మోపింది. .. బండారు కుప్ప లావాలా ఎగిసిపడింది.
” నల్లమారెమ్మ అడుగేసిందిరా! ఒరేయ్‌ మహాలక్ష్ముడూ.. ఓరి సిద్దప్పా… తియ్యండ్రా డప్పులు, కొట్టండ్రా అపచారి చెవులు బద్దలవ్వాలిరా ” గణాసార్లు ఆవేశంగా పలికారు. నల్లమారెమ్మ చేతిలోని వేపమండలు రవరవలాడాయి. ఒంటినున్న ఆభరణాలు గలగలలాడేయి. కాలు మార్చి కాలు మోపుతూ మారెమ్మ వేస్తున్న చిందుకి డప్పులోళ్లు తాళలేక శరీరాలను ముందుకీ వెనక్కీ మెలికలు తిప్పుతున్నారు.
థిం.. థిం… దిద్ధి.. నక.. థిం.. థి..దిద్ధి..నక..

వల.. వల… వలా.. వల..వల..వలా…

ఆరె యెయ్‌..యెయ్‌.. రేసెయ్‌..

ధింధిం దిద్ధినక ధింధిం దిద్ధినక..

యే.. ఏ..ఏ.. దిద్ధినక దిద్ధినక దిద్ధినక….డప్పుల శభ్దాన్ని చీల్చుకొని గుండెలవిసిపోయేలా వినిపించింది ఎవరిదో గొంతు.

” ఓరి ఎల్లమందో! నల్లమారెమ్మ నీకెల్లే గుడ్డురిమి చూత్తంది. ..నీ కాసే వత్తందిరోయ్‌.. లగెత్తరోయ్‌….”

 



89 Responses to బినామి

  1. nagu naidu
    March 1, 2013 at 1:43 am

    chalaa bagundi

  2. nagu naidu
    March 1, 2013 at 1:43 am

    baahundi

  3. March 1, 2013 at 2:19 am

    మల్లీశ్వరి గారూ – ఎంత బాగా వ్రాశారు ! ఎన్నెన్ని సొగసరి పదప్రయోగాలూ, ఎన్ని సామెతలు..పాటలు..నుడికారాలూ..ఎంత అద్భుతమైన ఉపమానాలూ – అన్నీ ఒక అందమైన కథలో ఇమడడం ఎంత బాగుంటుందో ఈ కథ చెప్పినట్టైంది.
    అసలా ఎంటిక్కాయా, కోడి ము.. ( :- ) బుజ్జితో ముడిపెట్టించి చెప్పించడం, దానిని నింపాదిగా వాడుకుంటూ కథ ముగించడం చాలా బాగుందండీ.

    నాకు నిజానికి మొదటిసారి చకచకా చదవడం అవ్వలేదు. రెండో సారి చదువుతుంటే “treasure hunt”లా ఉంది :) . మీ కథల సంపుటి సాధించి చదువుతానిక :) . Many Many thanks.

    • santosh
      March 1, 2013 at 5:26 am

      but words are difficult to understand..uneducated people use those words in villages…sorry if I am wrong…what I mean to say that story always easy to read & understand…

      • March 2, 2013 at 2:00 am

        సంతోష్ గారూ..
        మీ స్పందనకి ధన్యవాదాలు. మీరు చెప్పిన గ్రామీణ నిరక్షరాస్యుల భాషే అది.
        ”story always easy to read & understand…” నిజమే.. కానీ ఎట్లా సాధ్యం!!
        అయిమావతి తో ‘హాయ్ హౌ ఆర్యూ ‘నో..’ఏవండీ బాగున్నారా’నో అనిపించడానికి మనసు రాలేదండీ.

    • March 2, 2013 at 1:54 am

      ఒక కధా నిర్మాణం మొత్తాన్ని ట్రెజర్ హంట్ తో పోల్చడం చాలా షార్ప్ గా అనిపించింది మానసా..

  4. లలిత
    March 1, 2013 at 4:18 am

    చాలాబావుందండీ కథ .
    చివరి లైన్ చదవగానే ….ఎంటిక్కాయను కసితీరా కాలితో తన్నినట్టూ , కోడిముం…. మీద బలంగా మట్టిబెడ్డ విసిరినట్టూ రిలీఫ్ గా అనిపించింది .
    కథలో ఉపమానాలూ, సామెతలూ ప్రయోగం అద్భుతంగావుంది .

    • March 2, 2013 at 2:03 am

      లలిత గారూ,
      థాంక్ యూ..
      స్త్రీల నిస్సహాయ క్రోధాలకు చిన్న వ్యక్తీకరణే ఆ ముగింపు

  5. March 1, 2013 at 6:50 am

    కథ.. అద్భుతం గా ఉంది. నల్ల మారెమ్మ వచ్చాక ఏమవుతుందో లీల గా ఐడియా వచ్చినా ఎలా ముగిస్తారో అని ఆసక్తి గా చూశాను. అంచనా కి మించి ..ముగింపు చాలా బాగుంది.

    • March 2, 2013 at 2:06 am

      కృష్ణప్రియా,
      ప్రియమైన బ్లాగర్ కి కూడా నచ్చడం బావుంది

  6. nsmurty
    March 1, 2013 at 7:05 am

    జాజిమల్లి గారూ,

    మీ కథలో కొత్తదనం లేకపోయినా, కథనం మాత్రం అద్భుతంగా ఉంది. నా చిన్నప్పుడు విజయనగరంలో చూసిన అమ్మవారి పండుగ వాతావరణం ఒకసారి గుర్తొచ్చింది. కొన్ని పలుకుబడులు రసవత్తరంగా ఉన్నాయి. “పొదుగు బరువుతోపాటు కాడి బరువు కూడా మోయాల్సి వచ్చిన నిస్సహాయమైన ఆవులా” “చీకుదోమల్లాంటి మాటల్తో అయిమావతి చుట్టూ ముసురుతూనే వుంది” “గేదె పొదుగునుంచి బలవంతంగా లాక్కెళుతున్న పెయ్యిదూడ అరుపు” “చీకట్లో వూగుతున్న చెట్లనీడ” వంటివి కథనానికి చెప్పలేని అందం తెచ్చిపెట్టాయి.

    హృదయపూర్వక అభినందనలు

    • March 2, 2013 at 2:09 am

      మూర్తిగారూ..
      కధ విస్తరిల్లడం లో కొంచెం లోపం ఉంది. అందుకే అది పాతని ఒదుల్చుకోలేకపోయింది.
      కధనం నచ్చినందుకు ధన్యవాదాలు

  7. కామేశ్వరరావు
    March 1, 2013 at 9:04 am

    చాలా రోజుల తర్వాత చాలా మంచి కథ చదివిన అనుభూతి కలిగింది!

    • March 2, 2013 at 2:10 am

      కామేశ్వరరావు గారూ,
      మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు

  8. రమాసుందరి
    March 1, 2013 at 9:12 am

    ఎంత బాగా రాసారో! ప్రకాశం జిలా నుడికారం లా ఉంది. “పాలేరు బుడ్డోడిని బండబూతులు తిడుతున్నపుడు పెదబాబు మావయ్య మూతిమీద అసహ్యంగా కదిలే మీసంలా వుంది అమ్ములత్త.” క్లాసికల్ ఉపమానం.కధనంలో గొప్ప పరిణితి ఉంది. గొప్ప కధ.

    • March 2, 2013 at 2:14 am

      రమాసుందరి గారూ,
      పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణ మాండలికం…బహుసా కొంత భాష కోస్తాంద్ర లోని మరి కొన్ని జిల్లాల్లో కూడా ఉండొచ్చు
      మీరు చెప్పిన ఉపమానమే రాస్తున్నపుడు నాకు కూడా బావుంది అనిపించింది
      థాంక్ యూ..

  9. శ్రీవల్లీ రాధిక
    March 1, 2013 at 12:39 pm

    సారీ, పై వ్యాఖ్యలో రెండో భాగం వెనక్కి తీసుకుంటున్నా. ఒక పక్క చాట్ చేస్తూ మరో పక్కన కథ చదివిన దోషం…! బాగుందన్న మాట వెంటనే చెప్పేసి మరో పనికి వెళ్దామన్న ఆరాటం తో సరిగా చూసుకోకుండా రాశాను. ఇప్పుడు మళ్ళీ చదివాను. పేరు సరిపోయింది.

    • March 2, 2013 at 2:19 am

      శ్రీవల్లీ రాధిక గారూ,
      మీ వ్యాఖ్య నాకు సరిగా అర్ధం కాలేదు. శీర్షిక గురించి ఏమైనా చెప్పాలనుకున్నారా?
      బినామీ అంటే ఫాల్స్ ఐడెంటిటీ కదా
      నిస్సహాయులైన వారి వ్యక్తీకరణలు కూడా పూనకం లాంటి బినామీ వ్యక్తీకరణలుగానే ఉంటాయని ఆ శీర్షిక ఎంచుకున్నాను
      కధ నచ్చినందుకు థాంక్ యూ

  10. March 1, 2013 at 12:40 pm

    ఈ కధ, కధనం చదివాక… నాకయితే, నల్లమారెమ్మ పాత్రలో జాజిమల్లి గారే దూరిపోయినట్లనిపించింది.

    • March 2, 2013 at 2:22 am

      విశేఖర్ గారూ,
      పూనకం ఘటన యధాతధంగా జరిగింది రాసేసాను.
      జాగ్రత్తగా చూడండి నేను నల్ల మారెమ్మ పాత్రలో కాదు బుజ్జి పాత్రలో దూరిపోయాను. తప్పలేదు మరి..

  11. Krishna
    March 1, 2013 at 1:32 pm

    Very nice. As said in Manasa’s comment:
    ఎంత బాగా వ్రాశారు ! ఎన్నెన్ని సొగసరి పదప్రయోగాలూ, ఎన్ని సామెతలు..పాటలు..నుడికారాలూ..ఎంత అద్భుతమైన ఉపమానాలూ – అన్నీ ఒక అందమైన కథలో ఇమడడం ఎంత బాగుంటుందో ఈ కథ చెప్పినట్టైంది.

  12. March 1, 2013 at 2:27 pm

    మల్లీశ్వరి గారు కథలో సామెతలు, ఉపమానాలు, భాష అద్భుతం. అణచివేతకు గురైన అంతరంగం అవకాశాన్ని వాడుకున్న విధానాన్ని ముగింపులో చక్కగా మలచారు.

    • March 2, 2013 at 2:26 am

      జ్యోతిర్మయి గారూ
      కధ సారాంశాన్ని బాగా చెప్పారు చిన్న సవరణతో ”అణచివేతకు గురైన అంతరంగం అవకాశాన్ని బినామీ వ్యక్తీకరణగా వాడుకున్న విధానాన్ని”…
      ధన్యవాదాలు

  13. March 1, 2013 at 9:35 pm

    చాలా చాలా బావుందండీ!

    ‘ఆ రోజు సూర్యుడి ఆఖరికిరణం ఆకాశాన్ని ఖాళీచేసి, అయిమావతి మొహంలోకి వచ్చి చేరింది.’ — అమేజింగ్ ఎక్స్‌ప్రెషన్!!

    • March 2, 2013 at 2:27 am

      నిషి గంధ,
      మీ పేరంటే నాకు ఎంత మోహమో!!
      కధ నచ్చినందుకు థాంక్ యూ

  14. March 2, 2013 at 9:23 am

    మల్లీశ్వరి గారూ,

    నేనన్నది కధ, కధనం గురించి. పాత్రల గురించి కాదు.

    అయిమావతి, నల్లమారెమ్మగా మారి ఎలా విజృంభించిందో మీరు కధ, కధనంలో అలా విజృంభించారని చెప్పాను. ఒక మామూలు అయిమావతిని పరిచయం చేసి, ఆమె కష్టాలు ఎరుకపరిచి, తర్వాత ఆమె నల్లమారెమ్మగా తిరుగుబాటుని ఆవహించి ఎల్లమందని లగెత్తించినట్లు చూపిన మీ కధ, కధనం అద్భుతం. ముఖ్యంగా కధలో ఉన్న సందేశం పరమాద్భుతం. స్త్రీలు అణచివేతను ఎదుర్కోవడానికి నల్లమారెమ్మలు కావాలని, దానికి పూనకం అవసరం లేదని అంతర్లీనంగా చెప్పారని నాకనిపించింది.

    • March 3, 2013 at 2:27 am

      విశేఖర్ గారూ,
      మీరన్న అంతర్లీన సందేశం ఏదైతే ఉందో అది విప్లవ కధల మూసలోకి వస్తుంది కనుక,ఈ కధ దానిని ధ్వనిస్తోంది కనుక అటువంటివి నేను రాయడంపట్ల ఒకరిద్దరు మిత్రులు అసంతృప్తిని ప్రకటించారు. ఎందుకు రాయకూడదన్నది వేరే ప్రశ్న. కానీ ఎంతటి నిస్సహాయత లోనూ బలహీనులకి కూడా కోపాలు ఉంటాయని అవి సమాజం ఆమోదించిన బినామీ రూపాల్లో నైనా బయటకి వస్తాయని చెప్పడం వరకే పరిమితి పెట్టుకున్నాను. పూనకాన్ని అట్లాంటి బినామీ రూపంగా ఎంచుకున్నాను.దానిని అధిగమించి కనపడుతున్న ప్రయోజనాలో,లోపాలో నాకు తెలీకుండా జరిగినవి.

      • March 4, 2013 at 1:59 pm

        మల్లీశ్వరి గారూ

        బహుశా విప్లవ కధలకి ఒక మూస అంటగట్టడం సరికాదని నా అభిప్రాయం. అలా మూసను అంటగట్టడానికి విప్లవ రచయితలు ప్రధాన కారణమేమో కూడా. విప్లవం అంటే మార్పు అన్నదే నిజం అయితే ఆ విప్లవాన్ని రచయితలు ప్రతి చిన్నా, పెద్ద సందర్భంలోనూ చూడగలగాలి.

        అయిమావతి విప్లవ పార్టీ కార్యకర్త కాకపోవచ్చు. కానీ ఆమె మార్పుని కోరుకున్న సామాన్యురాలు. విప్లవ పార్టీలు సామాన్యుల కోసమే ఉన్నట్లయితే సామాన్యులు కోరుకునే ప్రతి న్యాయమైన మార్పునీ విప్లవ కార్యకర్తలు తమవిగా చేసుకోవాలి. కాని ఆచరణలో ఆ విషయంలో చాలా వైఫల్యాలు దొర్లుతున్నాయని నాకు అనిపిస్తుంది.

        ఈ వైఫల్యాల వల్లనే, బహుశా, మీరు చెప్పిన మిత్రులు ‘విప్లవ కధలు’ అనే మూసను తిరస్కరిస్తున్నారనుకుంటాను. సమాజంలో జరిగే ప్రతిమార్పు కధల్లో కూడా అల్లా తుపాకి గొట్టం వరకూ వెళ్లి తీరాలనే మూఢ నమ్మకాలూ, తీర్పులు ఈ తిరస్కరణకు కారణం కావచ్చు. ఆ బంధనాలని విప్లవ కధకులు తెంచుకున్నట్లయితే, తద్వారా ప్రతి చిన్న మార్పుని కోరే రచనను కూడా పెద్ద మార్పులో భాగంగా చూడగలిగితే ఇటువంటి తిరస్కరణలు తప్పవచ్చు. తద్వారా మూస అనే ముద్రను కూడా తప్పించుకోవచ్చు అని నా భావన.

        సమానత వైపు అడుగు వేసే ప్రతి మార్పు వ్యక్తీకరణకు ప్రయోజనమే ఉంటుంది తప్ప లోపం ఎంత మాత్రం కాజాలదు.

        • March 5, 2013 at 2:54 am

          విప్లవ కధలకి మూస అని కాదు… మూసలో వస్తున్న విప్లవ కధలు అని నా అభిప్రాయం .
          మీరన్నట్టు అయిమావతి చాలా నిస్సహాయమైన స్త్రీ.అయినప్పటికీ ఇంటా బైటా సాగుతున్న హింస మీద ఎందుకు క్రోధం ఉండదు. కానీ పూనకం ద్వారా అది వెలుపలికి రావడాన్ని ప్రతీకారంగా అనుకున్నారు. అది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంట్లో గృహిణి తన వూపిరాడనితనం లోంచి వంటింట్లో గిన్నెలు ధడాలున ఎత్తేసి ఉపశమనం పొందొచ్చు. అదీ ప్రతీకారమేనా?నల్ల మారెమ్మ ‘నాకు ఆహారం కావాలిరో ‘అందంటే నిజంగా చంపి తినేస్తుందా! కధకి యధాతదార్ధం తీసుకోవడం వలన వచ్చిన అభిప్రాయం అనుకున్నాను.
          మీ వ్యాఖ్య పై ఇంకా పూర్తిగా వ్యాఖ్యానించలేదు కానీ
          ”సమానత వైపు అడుగు వేసే ప్రతి మార్పు వ్యక్తీకరణకు ప్రయోజనమే ఉంటుంది తప్ప లోపం ఎంత మాత్రం కాజాలదు.”అన్నది చాలా మంచిమాట. రచయితలు ఒక ప్రాపంచిక దృక్పధం కలిగి ఉన్నా ఆ ప్రాసెస్ లో ఉన్నా వారిపై కొన్ని ముద్రలు వేసి నిరాకరించే ధోరణి ఇటీవలి సాహిత్యంలో ఫేషన్ .

          • March 11, 2013 at 5:12 pm

            @కానీ పూనకం ద్వారా అది వెలుపలికి రావడాన్ని ప్రతీకారంగా అనుకున్నారు.

            ప్రతీకారమే అనుకున్నాను. తెల్లవారినుండి మళ్ళీ రోజువారి జీవనం సాగించాల్సిందే. అలాంటప్పుడు ప్రతీకారం తీర్చుకున్నది ఎక్కడా, మీరన్నది నిజమే.

            ఈ సంభాషణ చూసేవరకు ఇలాంటి పూనకాలు గురించి చిన్ననాటి చర్చలు గుర్తు వచ్చి నాక్కూడా కొంత సందేహం కలిగింది, మీరెలా ఇది వ్రాసారు అని.

  15. March 2, 2013 at 6:53 pm

    మల్లీశ్వరీ! చాలా చక్కని కథనం…మీరే కాదు ,పాఠకులనీ బుజ్జిలోకి పరకాయ ప్రవేశం చేయించారు.ఆ పల్లెటూళ్ళో పచార్లు చేయించారు! అభినందనలు !

    • March 3, 2013 at 2:31 am

      నాగలక్ష్మి గారూ,
      ఎన్నాళ్ళకి!! అపుడెపుడో కధతో ఒకరోజు సభలో పలకరించుకున్నాం మళ్ళీ ఇపుడు…
      కధ నచ్చినందుకు ధన్యవాదాలు.

  16. March 3, 2013 at 9:38 am

    ఒక మంచి కధను చదివిన అనుభవాన్ని ఇచ్చారు..అభినందనలు

    • March 4, 2013 at 7:12 am

      ప్రవీణ గారూ,
      థాంక్ యూ….
      కొత్త బాధ్యతలకి అభినందనలు .

  17. March 4, 2013 at 5:15 am

    కథ చాలా బాగుంది. “ఠహరావ్” అంటారు హిందీలో…అది కనిపించింది విషయంలోనూ శైలిలోనూ..

    • March 4, 2013 at 7:18 am

      ఠహరావ్ అంటే
      it came to a stop at the bottom of the hill అని గూగులమ్మ చెప్పింది. కొత్త పరిశీలన చేర్చినందుకు థాంక్ యూ మహేష్.

      • March 4, 2013 at 7:40 am

        @మల్లీశ్వరి: లిటరల్ మీనింగ్ అంత ప్రభావవంతం కాదులెండి. హిందీ సాహిత్యంలో “ఠహరావ్” అంటే చాలా విస్తృతమైన అర్థం ఉంది. సంగీతంలో కూడా అదే అర్థంలో వాడతారు. ఇంగ్లీషులో చెప్పాలంటే sustaining అనుకోవచ్చు. ఒక భావాన్ని అదేస్థాయిలో భాషతో సస్టెయిన్ చెయ్యడం. ఒక రాగాన్ని గొంతులో ఒక స్థాయిలో నిలబెట్టడం ఠహరావ్ అనుకోవచ్చు. అదొక పరిపూర్ణస్థితి. కళాకారుడికి ఒక స్థాయి మెచ్యూరిటీ వస్తేగానీ అది సాధ్యం కాదు. అలాంటి ఠహరావ్ ఈ కథలో కనిపించింది. అభినందనలు.

  18. జాన్ హైడ్ కనుమూరి
    March 4, 2013 at 1:18 pm

    abhinandanalu

    • March 5, 2013 at 2:33 am

      అవునండీ. యధాతదార్ధం కానిది నాకు తెలీలేదు. హిందీ సాహిత్యాన్ని హిందీ లో చదువుకున్న ఒక ఫ్రెండ్ ని అడిగితే ఇలానే చెప్పారు. మీ వివరణ ఇంకా బావుంది. థాంక్ యూ

    • March 5, 2013 at 2:34 am

      జాన్ గారూ,
      థాంక్ యూ

  19. సుజాత
    March 4, 2013 at 4:51 pm

    మీ కథలన్నింటిలాగే బినామీ కూడా ఎంతో బాగుంది మల్లీశ్వరి గారూ! అసలు పేరు అతికినట్లు ఎంత బాగా కుదిరిందో !

    ‘ఆ రోజు సూర్యుడి ఆఖరికిరణం ఆకాశాన్ని ఖాళీచేసి, అయిమావతి మొహంలోకి వచ్చి చేరింది_____________ As Nishi already said…its amazing …

    • March 5, 2013 at 2:37 am

      సుజాత గారూ,
      ముందుగా మీకు అభినందనలు. మంచి వచన సాహిత్యాన్ని మీరు వెలుగులోకి తేవాలని మనసారా కోరుకుంటున్నాను.మీరు దృఢ చిత్తులు కనుక ఈ పని చక్కగా నేరవేర్చగలరు.
      కధ పై మీ స్పందనకు ధన్యవాదాలు

  20. ram. 9440434880
    March 5, 2013 at 12:36 pm

    Maliswari Gaaru Mee Kadha Chadivaanu Baagundhi Naa Balyapu Gnapakala Graamadevathala Pandaga Naa Kallalo Marala Kadalaadindhi

    • March 6, 2013 at 12:42 pm

      రామ్ గారూ,
      మీ వూరు ఎక్కడో గ్రామదేవతల పండుగలు ఏం జరిగేవో ఒక జ్ఞాపకమైనా పంచుకున్నారు కాదు…
      కధ నచ్చినందుకు ధన్యవాదాలు

  21. Sireesha
    March 5, 2013 at 4:46 pm

    నమస్తే mam…ఎప్పటి లాగనే మీ కధ చాల చాల బాగుంది. “ఎంటిక్కాయని గా..ట్టిగా తన్నేయాలి. కోడిపుంజు మీద మట్టిబెడ్డలు యిసరాలి”…..మీ కలం నుండి పుట్టే ప్రతి అక్షరంలో ఒక కొత్తదనం, ఒక కొత్త అర్ధం చూపించడం మీకు ఎలా సాధ్యమో నాకు ఎప్పటికి ఆశ్చర్యమే! ఆడవారి నిస్సహాయాతని చూపించడానికి బినామీలు అవసరం లేని రోజు రావాలని కోరుకుంటూ….

    -మీ శిరి

    • March 8, 2013 at 1:50 am

      ”ఆడవారి నిస్సహాయాతని చూపించడానికి బినామీలు అవసరం లేని రోజు రావాలని కోరుకుంటూ….” ఎంత బాగా చెప్పావు శిరీషా!

  22. March 6, 2013 at 11:07 am

    ప్రతీ వాక్యాన్నీ ఫ్రేము కట్టించుకుని గోడకి తగిలించి రోజూ చదువుకునేలా ఉందండీ. ఎన్ని ఉపమానాలు, ఎన్ని సామెతలూ, ఎన్ని అద్భుతమైన పోలికలు….చాలా చాలా బాగుంది. చదువుతున్నకొద్దీ ఏరుకోవచ్చు మణులూ మాణిక్యాలు అన్నట్టు ఉంది మీ కథనం.

    • March 6, 2013 at 12:46 pm

      సౌమ్యా,
      రెండేళ్ళ క్రితం చచ్చిపోయిన మా అయిమావతిని ఇట్లా బతికించుకున్నాను. మీ హృదయం ఎంత కరగక పోతే ఈ వ్యాఖ్య పెట్టారు!!
      చాలా సంతోషం..

  23. March 6, 2013 at 12:59 pm

    ఏంటండీ, అయిమావతి ఇప్పుడు లేదా!!!!
    :( (((

    • March 6, 2013 at 1:22 pm

      నిషిగంధ,
      అయిమావతికి ఒక మూగమ్మ,మరి ఇద్దరు ఆడపిల్లలు,బావనార్షి(భావనరుషి)అనే కొడుకు ఉన్నారు. కధ కోసం కొన్ని మార్పులు చేసాను. మొత్తానికి నానా బాధలు పడుతూ కూడా ఇదుగో… కధ లో మాదిరి అపుడపుడూ మమ్మల్ని అబ్బురపరుస్తూ తన 72వ ఏట చనిపోయింది చాలా మామూలుగా…. చాలా మంది శ్రామిక మహిళలలాగానే.

  24. March 6, 2013 at 4:12 pm

    భావనరుషి — ఎంత చక్కని పేరు కదండీ!!
    హమ్మ్.. తన మరణం చిన్నవయసులోనే, అవాంఛనీయంగా సంభవించిందేమోనని అనుకున్నానండీ.. థాంక్స్ మల్లీశ్వరి గారు, వెంటనే వివరించినందుకు!

  25. March 7, 2013 at 3:36 am

    కోలపిల్లమ్మ జాతర మరల నా కళ్ళ ముందు నిలిపారు.అభినందనలు.
    దాట్ల దేవదానం రాజు , యానాం

    • March 8, 2013 at 2:00 am

      రాజు గారూ,
      కోలపిల్లమ్మ జాతర నేనూ చిన్నప్పుడు ఒకసారి చూసాను. మీ స్పందనకి ధన్యవాదాలు

  26. srinivas denchanala
    March 7, 2013 at 7:05 pm

    Congratulations malleeswari gaaru…

  27. జి.ఆశాజ్యోతి
    March 9, 2013 at 6:17 am

    జాజిమల్లి గారూ,
    పల్లెలు తెలియని నాకు మీ కథ ద్వారా చక్కటి పల్లెటూరి వాతావరణాన్ని
    చూపించారు. అయిమావతి బాగా నచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు విన్న సామెతలు గుర్తొచ్చాయి. అభినందనలు

  28. March 9, 2013 at 10:39 pm

    ఇంతమంది వ్యాఖ్యానం తర్వాత కధ అంతరార్ధం ఇంకాస్త విశదమయ్యింది, బినామి అన్నకదా పేరు చక్కగా ఉంది.

    @ ‘ఆ రోజు సూర్యుడి ఆఖరికిరణం ఆకాశాన్ని ఖాళీచేసి, అయిమావతి మొహంలోకి వచ్చి చేరింది’

    చాలా మంది చెప్పినట్లు ఈ వ్యాఖ్యం బాగుంది, ఇంకా చాన్నాళ్ళకి కాస్త ఉత్తరాంధ్ర నుండి మా దక్షిణాంధ్ర కధకి వచ్చారు :)

    ‘చారుమతి ‘ ని చూస్తూ చాలా మంది జ్ఞాపకానికోచ్చేరు.

    • March 12, 2013 at 2:17 pm

      మౌళీ,
      పూనకం పగ తీర్చుకునేది కాదు శ్రామిక మహిళల ఒత్తిళ్ళ కి సమాజం అనధికారికంగా ఆమోదించిన వ్యకీకరణ రూపం అందుకే రాయగలిగాను. మీ స్పందనకి థాంక్ యూ

  29. March 11, 2013 at 9:04 pm

    ఎంత బాగుంది అనే మాట వెనక చాలా వుందండి జాజిమల్లి గారు!
    ఉత్తినే ఏదీ చెప్పలేదు మీరు, అందమైన ఉపమానాలను వెంటేసుకొచ్చింది ప్రతివాక్యమూను.
    ఉదాహరణగా ఇది, నడుస్తుంటే గొడుగులా విచ్చుకుంటున్న తుర్రపిట్ట రెక్కల రంగు పట్టులంగా కుచ్చిళ్లను విసురుగా తన్నుకుంటూ వరండాలోకి వచ్చింది. – కళ్ళ ముందు ఖచ్చితంగా రీలు తిరిగింది :-)

    • March 12, 2013 at 2:18 pm

      మోహన తులసి గారూ,
      మీవాక్యాల్లో కవిత్వం ఉంది

  30. March 12, 2013 at 5:42 am

    కథ ఆసాంతం బిగువుగా సాగింది .నిస్సహాయులు దోపిడీ ,దౌర్జన్యాల పట్ల తమ కోపాన్ని వ్యక్తికరించడానికి అనేక మార్గాలు ఎన్నుకుంటారు .ఇక్కడ అయిమావతి పూన్కాన్ని ఎన్నుకున్నది.ఎల్లమంద మీద పగ తెర్చుకోధలచింది .బాగుంది. అయితే కథలో ఒకచోట పోదిశానుగా అని రాసారు,మరోచోట raattam(raatnam ani kaakunda)అని రాసారు. సంభాషణల్లో అయితే ఓకే ,కాని కథలో మీ మాటలు అట్లా అవసరం లేదనుకుంట .Anyhow congrats for a nice story.

    • March 12, 2013 at 2:25 pm

      లింగారెడ్డి గారూ
      మీ విశ్లేషణ కి థాంక్ యూ
      భాషా ప్రయోగాల మీద నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి.
      వాటిని అనుసరించే నేను కధల్లో వాడతాను

  31. ఈశ్వర్ శరత్
    March 13, 2013 at 5:39 am

    మల్లీశ్వరి గారు మీ కథ లో ఉపయోగించిన మాండలికపదాలు ఒక్క సారిగా పల్లెటూరిలో గడిపిన రోజులు గుర్తుకుతెప్పించినందుకు ధన్యవాదాలు

  32. కె . గణేష్
    March 13, 2013 at 6:27 am

    మల్లీశ్వరి మేడమ్ గారు
    కధ చాలా బాగుంది ముఖ్యంగా హైమావతి నల్లమారమ్మగా మారడం బాగుంది సమాజంలో ప్రతి స్త్రీ నల్లమారమ్మగా మారాలి
    “పాడిందే పాట రా పాచిపళ్ల దాసరా ” అనే సామెత చాలా బాగుంది.
    అభినంధనలు

    • March 16, 2013 at 12:10 pm

      గణేష్,
      తెలుగులో రాయడం నేర్చుకుని కధలు చదివేసి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారన్న మాట ముందుగా మీకు అభినందనలు

  33. మార్కొండ సోమశేఖరరావు
    March 15, 2013 at 11:41 am

    మల్లీశ్వరి గారు, మీ “బినామి” కధ చాలా బావుంది.

  34. March 18, 2013 at 12:41 pm

    చాలా బోలెడు ఆలస్యంగా మీ కథ చదివానండి… మరికాస్త ఆలస్యంగా ఇప్పుడు వ్యాఖ్య రాస్తున్నా:) చాలా బావుంది. ఆ రోజు ఇక్కడ నుండి మీ బ్లాగ్ కు వెళ్ళి అక్కడ కూడా కొన్ని కథలు చదివాను.. అన్నీ కూడా మనసుకు హత్తుకునేట్లుగా ఉన్నాయి. మరి కొన్ని మంచి కథలు మీ నుండి వెలువడాలని కోరుకుంటున్నాను.

  35. March 23, 2013 at 8:56 pm

    అద్భుతమైన భాషండీ! ఒక్కొక్క వర్ణనా, ఒక్కొక్క పోలికా చదువుతూంటే .. అబ్బబ్బ ఎంత రుచిగా ఉన్నాయో. కథన శిల్పం పరంగా రెండు మూడు చోట్ల కొంచెం మసకగా ఉంది (స్పష్టంగా లేదు). మీరు ఈ శైలిలో ఇంకేవైనా కథలు రాశారా? రాసి ఉంటే చెప్పండి, ప్లీజ్.

    • March 24, 2013 at 6:46 am

      నారాయణస్వామి గారూ,
      ‘రుచిగా ఉండడం’ అన్నమాట దాని లిటరల్ అర్ధం లో కాకుండా పలుచోట్ల అన్వయిస్తూ వాడటం నాకు చాలా ఇష్టం. మీ మాట దాన్ని గుర్తు చేసింది. కధ – 2007 లో ‘ఖాళీ’ కధ ప్రయోగాత్మక శైలి లోనే ఉంటుంది. ఈ శైలి అంటే చెప్పలేను గానీ ఉత్తరాంధ్ర మాండలికాన్ని ప్రస్తుతం ఆస్వాదిస్తూ రాస్తున్నాను.

  36. March 24, 2013 at 1:38 am

    Beautiful. కథలో ఒకచోట మీ బుజ్జి Ponyoని (http://en.wikipedia.org/wiki/Ponyo) గుర్తుకు తెచ్చింది. ఎన్నో ఇమేజరీస్…. కానీ ఈ కథ అయిమావతికి ఓ నివాళి.

  37. March 24, 2013 at 6:52 am

    ఇస్మాయిల్ గారూ,
    మీరిచ్చిన లింక్ లోకి వెళ్లి చూసాను…మీ పరిశీలన చాలా అర్ధవంతం ‘ponyo’ ఎంత ‘బుజ్జి’గా ఉందో!
    నిజం గా అయిమావతికి నివాళి గానే రాసాను.
    థాంక్ యూ…

  38. March 26, 2013 at 6:24 am

    జాజిమల్లి గారు ఈ వెబ్ సైట్ ఈరోజే ఫస్ట్ టైమ్ చూశాను. మీ కథ చాలా బాగుందండి. చాలా బాగా రాశారు. ఇటువంటి కథలు మరిన్ని రావాలని కోరుకుంటున్నా…

    • March 27, 2013 at 3:55 pm

      చంద్రజ గారూ
      థాంక్ యూ. వాకిలి లో మంచి కధలూ,కవిత్వం,వ్యాసాలూ ఉన్నాయి. మిగతావి కూడా చదివి ఉంటారని ఆశిస్తాను

  39. చందు శైలజ
    March 27, 2013 at 8:12 am

    లేటుగా చదివాను. సంతృప్తికరమైన విందులాంటి కథ. I enjoyed reading. మల్లీశ్వరి గారూ, థాంక్సండీ.

    • March 27, 2013 at 3:56 pm

      చందు శైలజ గారూ,
      నవ్వుల చందమామకి విందు చేయగలిగినందుకు సంతోషం.

  40. nagamani pagadala
    June 5, 2013 at 2:22 am

    http://telugu.tharangamedia.com/kathamalika/

    మీ కధ చదివానండి తరంగ లో,,, మీకు వీలైనప్పుడు వినగలరు. మీకు చెప్పకుండా చదివినందుకు క్షమించగలరు.

  41. Krishaveni
    March 10, 2014 at 4:17 am

    ఒక సంవత్సరం లేటుగా చదివేను. అది కూడా ఫేస్బుక్లో ఇచ్చిన లింక్ వల్ల. చాలా బాగుంది. :)

    • April 11, 2014 at 4:33 pm

      బినామీ కథ – 2013 కి ఎంపికైంది. బహుసా ఆ లింక్ చూసి ఉంటారు థాంక్ యూ

  42. March 10, 2014 at 6:14 pm

    అత్తారుబతంగా సదూకున్నాను … మీ మిగతా రచనలూ ఇంకా నుంచి సదూతాను మేడమ్

    • April 11, 2014 at 4:36 pm

      అత్తారుబతం అనే మాట ఇంట్లో చిన్నప్పటి నుంచీ అలవాటే గానే వడ్డెర చండీదాస్ నవలలో మొదటిసారి చదివాను ఆయన అస్తారుబతం అని వాడారు. థాంక్స్ కాశీ రాజు గారు

  43. Amjad
    March 31, 2015 at 4:45 pm

    ఆలస్యంగా spandinchaanani భావించకండి!
    ఈ వెబ్ చూడడం లో ఆలస్యమైంది. మీ కథ ఇప్పుడిప్పుడే చదివాను. కొంచం పెద్దగ అనిపించింది.మంచిగా కూడా అన్పించింది.
    చాల బాగా రాశారు. కంగ్రాట్స్.

Leave a Reply to నిషిగంధ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)