కవిత్వం

కుట్టి రేవతి కవితలు

సెప్టెంబర్ 2017

చిత్తం

ఆకాశంలో వేలాడే మేఘాలు
అంతరమధ్యన ఊగుతుండగా
రాయడానికి కూర్చుంటాను

కిటికీ తలుపులను గాలి తడుతుండగా
అది తీసే ముందు
కాగితాలను సర్దుకుంటాను

ఏనుగంత వాన దృశ్యం
కిటికీ చట్రంలో నిండిపోగా
గూడు చేరని పక్షులకు
ఎంతకష్టమోనని కుమిలిపోతూ
ఏదీ రాయలేను

వేదనల అడుగుజాడలేవో
కాగితానికి అంటుకోగానే
రాసింది చాల్లెమ్మని
లేచి వెళ్ళిపోతాను

(మూల కవిత: చిత్తం)

****

చన్నులు నాలుగు – దేహపు తలుపు

ఒళ్ళంతా నీటి మొగ్గలతో ఆమె నడిచి వస్తుండగా
ఒక మొగ్గకూడా విరగకుండ నాలకతో తెంపి
పళ్ళుగా మాగబెట్టి తింటాను.

నీటి అలలు గట్టెక్కి విరిగిపడినట్టు
ఆమె గుండెలోని దీర్ఘశ్వాసం
రొమ్ములపైకి ఉబికి ఉబికి మణుగుతుంది

ఆరచేతుల్ని బార్లా తెరిచి
ఆకుదొన్నెలా జఘణము పైకెత్తి అందిస్తుంది

చిలకముక్కుకి చిక్కిన పండులా
తన దేహాన్ని తానే తెచ్చి
నా పెదవులకి అందిస్తుంది.
ఒకరి పరవశపు మధుపానంలో మరొకరం ఆనందిస్తాము

పొగలుకమ్మిన కురులలో కూరుకుపోయి
దిక్కు తోచక గాలాడక ఎప్పటికో బయటపడతాను నేను.

నేలమీదంతా అడుగుల ముగ్గులేస్తున్నట్టే ఉంటుంది
ఎప్పుడు దిగుతుందో నీటిలోకి మరి
పాములా శరవేగంతో!

భారమైన తడితొడలతో పరుగున వచ్చి
పువ్వుల చిత్తడి చేసుకుంటూ ఒకరినొకరం …

ఆమె తేనె తుట్టె చుట్టూ ఎగిరి
హోరు చేస్తుంది నా ఊపిరి గాలి

ప్రతివేకువ జాము వేళకీ
చనుమొనలు నాలుగూ
విరిసిన తామరపువ్వుల్లా
తేలిగ్గా నవ్వుతాయి!

(మూల కవిత: ములైకళ్ నాన్గు – ఉడలిన్ కదవు)

****

మునుపొకరాత్రి

రాత్రినంతా
ఒక చేదు రంగు అలముకొని ఉంది

కన్నీరు
అలలా ఎగసియెగసి చిక్కబడింది
దట్టమైన అడవిలా

ఆకాశం
నిక్కినిక్కి ఎదగడానికి
ఎత్తులను వెతుకుతోంది

కలలబుడగ
రెప్పల్లో రెపరెపలాడి
యథార్థపు గాలికి పగిలి
నీరై కారిపోయింది

నిర్జనవీధి
తన అందాన్ని ముసలినత్త అడుగు జాడలతో
చిత్రం గీయించుకుంటుంది

మరణం
కదిలే రాక్షస నీడలా
తలుపు చాటున దాక్కుని ఉంది

నా హృదయం
రాలిన ఈకెలా జీవంలేక పడి ఉంది
నీ పరుపుపైన.

(మూల కవిత: మున్బు ఓర్ ఇరవు)

****

నాటిముద్దు మీద నేడు సాలెగూళ్ళు

అతణ్ణి కలసిన రోజే పుట్టిన
ఆ ముద్దు మీద
ఇప్పుడు నిప్పుల బూడిద అలముకుంది

అప్పుడే పుట్టిన ప్రాణపు పాకులాటలా
అతని దేహమంతా చనుబాల వాసన విరజిమ్మగా
నా దగ్గర అలాంటి ముద్దొకటుందని
బయటపడటానికే మోహమాటమనిపించింది.

జరీ రిబ్బన్‌లు కట్టిన పెట్టెలో పదిలపరచి
వేరెవ్వరికీ కానుకగా ఇవ్వలేని ఆ ముద్దు
నాలోనే తిరుగుతూ ఉంది
గాజు పెట్టెలో చేపలా
మోజులు రేపుతూ దాని కదలికల అలలు
నన్ను హింసిస్తూనే ఉండేవి

ముద్దుని కాపాడుకోవడం పెద్ద ప్రయాసే
నదిని చూసిన క్షణాన
సుడిగాలికి కొట్టుకెళ్ళిన గొడుగులా
వెల్లకిలా తేలి
ఈ ముద్దు – నన్ను ఇరుకున పెట్టిన తరుణాన
మర్యాదగీత దాటిన మాటలను
తూర్పారబట్టినప్పుడు
ఆ ముద్దు నాకు దూరమైందని గ్రహించాను

ఎంత గట్టిగా కేక వేసి పిలిచినా
వినబడనంత దూరంలో ఉన్న ఆ ముద్దుమీద
నేడున్నవి జ్ఞాపకాల సాలెగూళ్ళే
అనుదినం తూటాలు తొలిచే ప్రపంచంలో
ఇక ముద్దుల అవసరం లేదన్నాడు అతను.

(మూలకవిత: ఇండ్రుముత్తత్తిన్ మీదు పడర్న్‌దిరుక్కిఱదునూలాంబడై)

****

అనువాదం: అవినేని భాస్కర్
మూలం: కుట్టి రేవతి



కుట్టి రేవతి అన్న పేరుతో కవితలు రాస్తున్న కవయిత్రి పేరు రేవతి స్వయంబులింగం. స్త్రీవాద కవయిత్రిగా తమిళ సాహిత్యంలో ప్రసిద్ధురాలు. పనిక్కుడం అన్న సాహిత్య పత్రిక సంపాదకురాలు. ఈ పత్రికలో స్త్రీ రచయితల రచనలు మాత్రమే ప్రచురించబడుతాయి. ఈవిడ కొన్ని డాక్యుమెంటరీ సినిమాలు తీశారు. మెయిన్ స్ట్రీమ్ తమిళ సినిమాలు కొన్నిటికి కథనంలోనూ, దర్శకత్వంలోనూ సహాయకురాలిగా పనిచేశారు. తమిళ సినిమా గేయ రచయిత్రిగానూ గుర్తింపుపొందారు.

ఈమె రచనలు స్త్రీ సెక్సువాలిటీ గురించి, బాడీ పాలిటిక్స్ గురించినవి గావున, 2000వ సంవత్సరంలో విడుదలైన ఈమె తొలి కవితా సంకలనం “పూనైయైప్ పోల అలైయుం వెళిచ్చం” (పిల్లిలా తచ్చాడే వెలుగు) తమిళ సాహిత్య ప్రపంచంలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది.

రేవతి గారి కొన్ని కవితా సంకలనాలు:

పూనైయైప్ పోల అలైయుం వెళిచ్చం (2000)
ములైగళ్ 2001
తనిమైయిన్ ఆయిరం ఇఱక్కైగళ్ (2003)
ఉడలిన్ కదవు (2006)
యానుమిట్ట తీ (2011)
మామద యానై (2012)
ముత్తత్తిన్ అలగు (2012)
కాలవేగ మదయానై (2016)

**** (*) ****