అనగనగా ఒక ఊరిలో ఒక నది ప్రవహిస్తూ ఉండేది. దాని పక్కన మూడువందల సంవత్సరాల వయస్సు కలిగిన ఓ పెద్దచెట్టు ఉండేది. దూరం నుండి చూస్తే, అది విచ్చుకున్న పెద్ద గొడుగులా ఉండేది. ఆ చెట్టు తొర్రలో పాములు నివసిస్తూ ఉండేవని ఊరివాళ్ళు చెప్పకునేవారు.
ఆ చెట్టు పక్కన మురాద్ అనే పిల్లవాడు నివసిస్తుండేవాడు. రహమత్ అనే పిల్లవాడు మురాద్ ఇంటి పక్కన ఉండేవాడు. మురాద్, రహమత్లు ప్రాణస్నేహితులు. రహమత్ అపరాధ పరిశోధన పుస్తకాలు అవీ బాగా చదువుతుండేవాడు. పెద్దయ్యాక అపరాధ పరిశోధకుడు అవ్వాలని కలలు కనేవాడు.
ఓ రోజు ఇద్దరు పిల్లలు అతి కష్టంమీద చెట్టు ఎక్కారు. దాని తొర్రలోకి తొంగిచూశారు. అది తేమగా, చీకటిగా ఉంది. ఊరి జనాలు చెప్పినట్టు అక్కడ ఏ పామూ లేదు. చివరికి పురుగులు కూడా లేవు.
ఆ చెట్టు కింద మట్టితో సహజంగా ఏర్పడిన మట్టిదిమ్మె ఉండేది. అది కూర్చోటానికి అనుకూలంగా ఉండేది. ఆ మట్టి దిమ్మె మురాద్ వాళ్ళ పూలతోట చుటూ ఉన్న మట్టి గోడకు ఆనుకొని ఉండేది.
సలీం అనే ముసలయ్య పొద్దున్నుండి రాత్రి వరకు ఆ మట్టిదిమ్మె మీద కూర్చుని, తన వీపుని చెట్టుబోదెకు ఆనించి, తీక్షణంగా ఓ పుస్తకం చదివేవాడు. అది పాత అరబిక్ కవిత్వ పుస్తకం. చాలాసేపు ఎదురుగా ప్రవహిస్తున్న నదిని చూసూ గడిపేవాడు. అప్పుడప్పుడూ తన ప్లాస్ములో నుండి తేనీరు, పింగాణీ పాత్రలో వంచుకుని తాగేవాడు. ఇది ప్రతిరోజు అతని దినచర్య.
పిల్లలకు వేసవి సెలవులిచ్చారు.
సలీం తాతయ్య అక్కడే కూర్చుని నిద్రపోయేవాడు. అప్పడప్పుడు నదిలోని చేప పిల్లల్ని చూస్తూ గడిపేవాడు. అతని దినచర్య పిల్లలకి వింతగా అనిపించింది. ఇంట్లో మెత్తని పరుపు ఉండగా, చెట్టు క్రింద కూర్చుని ఎందుకు నిద్రపోతున్నాడో అర్థమయ్యేది కాదు.
“మురాద్! నా కళ్ళతో చూశాను. నిన్న సాయంత్రం నుండి ఈ రోజు పొద్దునదాకా సలీం తాత అలాగే చెట్టకింద నిద్రపోతున్నాడు. నాకేదో అనుమానంగా ఉంది. ఆ చెట్టులో ఏదో రహస్యం దాగి ఉంది. ఆ రహస్యాన్ని కాపాడటానికే సలీం తాతయ్య రోజంతా ఆ చెట్టు వద్దే గడుపుతున్నాడు” అన్నాడు రహమత్.
‘అవును. మా నాన్న కూడ అనేవాడు. ఆ చెట్టుకి ఎంతో చరిత్ర వుందని? అన్నాడు మురాద్.
“అయితే ఆ రహస్యం ఖచ్చితంగా మట్టి దిమ్మె కిందే దాగి వుంటుంది” అన్నాడు రహమత్.
“అయితే మనం ఆ రహస్యాన్ని ఎలాగయినా కనిపెట్టాలి” అన్నాడు మురాద్.
“ఆ రహస్యాన్ని కనిపెడితే, గొప్ప శాస్రవేత్తలుగా ఊరిలో, మన పాఠశాల్లో దేశంలో ఎంతో పేరొస్తుంది” అన్నాడు రహమత్.
“కానీ ఎలా? సలీం తాతయ్య ఎప్పుడూ చెట్టు కింద నుండి కదలడుగా? అన్నాడు మురాద్.
“మీ పూలతోట చివరి నుండి, చెట్టకింద వున్న మట్టి దిమ్మె వరకు ఓ చిన్న సొరంగం తవ్వదాం. ఏదన్నా విలువైన సంపద దొరకవచ్చు, చెట్టు రహస్యం తెలుసుకోవచ్చు. ఒకవేళ ఏమీ దొరకలేదనుకో, మనం తవ్విన దాన్ని తవ్వినట్టే పూడ్చేద్దాం” అన్నాడు రహమత్.
“భలే వుంది ఆలోచన, నేను సిద్ధం” అన్నాడు మురాద్.
తరువాతి రోజు ఉదయాన్నే పెద్దవాళ్ళంతా పనులకెళ్ళాక, పిల్లలిద్దరూ పలుగు, పార పట్టుకొని సొరంగం తవ్వటం మొదలుపెట్టారు. తవ్వే క్రమంలో వీళ్ళ ముఖాలు మట్టితో నల్లగా మారిపోయాయి.
ఒకరిని చూసి ఒకరు పడి పడి నవ్వుకున్నారు.
అలా ఓ ఐదు రోజులు, ఎలుకలు కలుగు తవ్వినట్లు, ఇద్దరు స్నేహితులూ చిన్న సొరంగం తవ్వారు.
మొదట్లో గట్టిమట్టి బయటకు వచ్చేది. తరువాత మెత్తటి బంకమట్టి వచ్చేది.
అయిదో రోజు ఉన్నట్టుండి గట్టిగా ఏదో తగిలింది.
తవ్వటం ఆపేశారు.
చెయ్యి పెట్టి బంకమట్టిని బయటకు తీశారు. విరిగిన పింగాణీ పాత్ర, మేక ఎముక దొరికాయి.
పురావసు ఆవిష్కరణల వైపు గర్వంగా చూశారు. ఇంతలో రహమత్ ఆ సొరంగమార్గంలో ఇరుక్కుపోయాడు.
మురాద్ రహమత్ కాళ్ళను పట్టుకుని వెనక్కి లాగాడు. క్షేమంగా బయటపడ్డాడు రహమత్, పిల్లలిద్దరూ భారంగా ఊపిరి పీల్చుకున్నారు.
మురాద్ సొరంగంలోకి తొంగిచూశాడు. సలీం తాత చెట్టు కింద వున్నాడో లేడో అని.
వాళ్ళ అదృష్టం తాతయ్య అక్కడ లేడు.
మధ్యాన్న భోజనానికి ఇంటికి వెళ్ళినట్టున్నాడు. చెట్టు కింద వున్న ಮಿಲ್ಲಿದಿಬ್ಬ పగిలిపోయి ఉండడం మురాద్ గమనించాడు. ఆ విషయాన్ని రహమత్తో చెప్పాడు. పిల్లలిద్దరూ మూడుగంటలు కష్టపడి సొరంగమార్గాన్ని మట్టితో పూడ్చేశారు. తవ్విన ఆనవాళ్ళు కనిపించకుండా దానిపై చెత్తాచెదారం పలచగా చల్లారు.
కొద్దిసేపటి తర్వాత సలీం తాతయ్య మెల్లగా నడుస్తూ చెట్టు వైపుకి వస్తున్నాడు. కర్ర సాయంతో నేలను చూస్తూ, పెద్ద చెట్టు వైపు నడుస్తున్నాడు.
కూలిపోయిన మట్టిదిమ్మెను చూసి ఆశ్చర్యపోయాడు. చేతితో మట్టిని తాకాడు. అలా కూలిన దిమ్మెను చూస్తూ కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు. దిగులుగా ఇంటికి వెళ్ళిపోయాడు.
సలీం తాతయ్య కూర్చున్న మట్టిదిమ్మెను పాడుచేసినందుకు, పిల్లలిద్దరూ ఎంతో బాధపడ్డారు. తర్వాత రోజు తాతయ్యకు జ్వరం వచ్చింది. మురాద్, రహమత్ తల్లిదండ్రులు సలీం తాతయ్య బాగోగులు చూడ్డానికి వెళ్లారు.
పిల్లలు తమ తప్పకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నారు. తమ వద్ద వున్న చిల్లర పైసలు జమచేసి, తాతయ్యకు ఇష్టమైన మిరాయిలు కొన్నారు. తరువాత రోజు ఉదయం దాన్ని తీసుకుని బయలుదేరారు. దారిలో లారీ ఎదురొచ్చింది. దాంట్లో రహమత్ వాళ్ళ నాన్న మురాద్ వాళ్ళ నాన్న వున్నారు.
“ఇంట్లో వుండక, రోడ్లమీద ఏం చేస్తున్నారు??” అని గద్దించారు తల్లిదండ్రులు.
తాతయ్య కోసం బహుమతి తీసుకెళ్తున్నామని చెప్పారు పిల్లలు. తల్లిదండ్రులు నవ్వి, పిల్లల్ని లారీలో ఎక్కించుకున్నారు. లారీలో ఏముందని అడిగారు పిల్లలు.
“సలీం తాతయ్య మట్టిదిమ్మె దురదృష్టవశాతూ కూలిపోయింది. తనకోసం చక్కటి దిమ్మెను కట్టబోతున్నాం” అన్నారు తల్లిదండ్రులు.
మురాద్ వాళ్ళ నాన్న రహమత్ వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు.
“ఆ చెప్తున్నాను గదా! ఆ రోజుల్లో మురాద్ చంటి పిల్లవాడు. భారీ వాన కురిసింది. నది పొంగింది. మురాద్ వాళ్ళ అమ్మ, మురాద్ ఆ నీటిలో కొట్టుకుపోతుంటే, సలీం తాతయ్య వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు, నీటిలో దూకి ధైర్యంగా రక్షించాడు. కానీ, తను నీటిలోపడి చనిపోయాడు. ఆ యువకుడు మంచి కవి. చక్కటి అరబిక్ కవితల పుస్తకాన్ని కూడా ప్రచురించాడు. అప్పటి నుండి సలీం తాత, చివరికి కొడుకు జ్ఞాపకార్థంగా మిగిలిన ఆ ఒకే ఒక్క కవిత్వ పుస్తకాన్ని చదువుతూ, నదిని చూసూ, పెద్దచెట్టు కింద రోజంతా గడుపుతున్నాడు.”
రహమత్ వాళ్ళ నాన్న ఇలా అన్నాడు,
“ప్రస్తుతం ఆ పుస్తకం కనిపించటం లేదు. తన కొడుకు చివరి జ్ఞాపకం కనిపించకపోవడంతో సలీం తాత జ్వరంతో మంచాన పడ్డాడు.”
ఈ విషయాన్ని పిల్లలిద్దరూ విన్నారు. లారీ దిగాక, రహమత్ ఇలా అన్నాడు,
“మురాద్! మనం సొరంగం తవ్వటం వలన ఆ పుస్తకం మట్టిలో కూరుకుపోవచ్చు. మనకు దొరికిన పగిలిన పింగాణీ పాత్ర తాతది అయ్యుండొచ్చు.”
ఇద్దరు పిల్లలు వెళ్ళి చెట్టు కింద వున్న మట్టి దిమ్మెను జాగ్రత్తగా తవ్వారు. ఆశ్చర్యం! కవితల పుస్తకం చెక్కుచెదరకుండా అక్కడే ఉంది.
దానిపై వున్న మట్టిని జాగ్రత్తగా దులిపారు.
సలీం తాతయ్య ఇంటికి వెళ్లి, ఆ పుస్తకాన్ని తాత కోసం కొన్న మిరాయిల్ని బహూకరించారు. తాతయ్య ఎంతో సంతోషించాడు. దెబ్బకి తాతయ్యకి జ్వరం కూడా తగ్గిపోయింది.
ఆ తర్వాత కొన్నిరోజులకు పిల్లల తల్లిదండ్రులు ఇటుకలు, సిమెంటుతో చక్కటి దిమ్మెను కట్టారు.
ఎప్పటిలాగా సలీం తాతయ్య రోజంతా దిమ్మెమీద కూర్చుని, నదిని చూస్తూ, పుస్తకం చదువుతూ గడిపేవాడు. పిల్లలిద్దరూ అప్పడప్పడూ తాతయ్యను పలకరించేవారు.
ఇదండీ! చెట్టు వెనుక దాగిన “రహస్యం.
***
English Title: Secret of the Plane tree
Writer: Latif Makhmudov
English Translation: James Riordan
Latif Makhmudov (1933–present):
ప్రసిద్ధ రష్యన్ పిల్లల రచయిత ‘హిల్ ఆఫ్ టులిప్స్’ ఇతని ప్రసిద్ధ బాలకధా సంకలనం. కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు.
‘చెట్టు రహస్యం’ అనువాద కథ చాలా బాగుంది. చిన్న చిన్న వాక్యాలతో చక్కని విషయాన్ని అనువాదం ద్వారా అందించినందుకు అనిల్ బత్తుల గారికి ధన్యవాదాలు.