కొత్త పుస్తకం కబుర్లు

నర్సింగాపురం పిలగాని కతలు

నవంబర్ 2017

‘చింతకింది మల్లయ్య ముచ్చట’ పూడూరి రాజిరెడ్డి కథల పుస్తకం- గడిచిన పది, పదిహేనేళ్ళ కాలంలో రాసిన పన్నెండు కథల సంకలనం. ‘‘నేను కానిది నేను ఏమీ రాయలేను’’ అని ఇంట్రోలో రచయిత చెప్పిన మాట, సాహిత్య సృష్టి పట్ల ఆయన నిబద్ధతని తెలియజేస్తుంది. ‘‘ఈ కథలన్నీ ఇదివరకు అచ్చు అయినవే. ఈ సంకలనంగా వేస్తున్నప్పుడు మళ్ళీ కొన్నింట్లో మార్పులు, కొన్నింట్లో చేర్పులు చేశాను’’ అనే వివరణ రచనా వ్యాసంగం ఎడల విధేయతని చూపుతుంది. ఈ రెండు సుగుణాలు సృజనకారుడికి ఆవశ్యకమని నేను కూడ విశ్వసిస్తాను. అందుచేతనే ఈ పుస్తకాన్ని ఇష్టంగా చేతుల్లోకి తీసుకున్నాను. ఆమూలాగ్రం చదివాను.

‘చింతకింది మల్లయ్య ముచ్చట’ అద్భుతమైన కథ. మల్లయ్య ఓ చిన్నకారు రైతు. ‘చింతకింది మల్లిగాడురా పనోడంటే’ అనిపించుకుంటాడు. ‘మాట మీద నిలవడుతడు, వాడురా మనిషి’ అని పేరుతెచ్చుకుంటాడు. అతని కథని రచయిత రాయాలనుకుంటాడు. మల్లయ్య నోటమ్మటే కథని చెప్పించుకుంటాడు. తల్లిలేని, ఆటపాటల్లేని బాల్యం గురించీ; యవ్వనం, భార్య మరణం గురించీ; వ్యవసాయం, పిల్లల చదువుసంధ్యలూ సాధక బాధకాలన్నీ చెబుతాడు. ‘‘నాలుగు బర్లున్నయి. నాలుగు ఆవులున్నాయి. గొర్రె, మాక. బూమి. బాయి. దానికి కరంటు. మా నాయిన నాకు కశ్కెడు బూమి ఇయ్యలె. నేను దాన్ని నాలుగెకురాలు జేసిన. నేను వెట్టిన చింతచెట్లు కాతకచ్చినయి. నేను నీళ్ళు వోసిన మామిడిచెట్ల కాయలు తొక్కులకు వనికత్తున్నయి. పోరగాండ్లకు తినేటన్ని జామకాయలు. రొండు దింటెనే కడుపునిండె అరటిపండ్లు. నాకు ఇంకేం గావాలె?’’ అని ఏకరువు పెడతాడు. మల్లయ్య మాటల మధ్యేమధ్యే కథలోకి రచయిత వచ్చివెళుతుంటాడు. కథనంలో తన వ్యాఖ్యానంతో కదలిక (Movement) తీసుకొస్తాడు. ఈ కథనశైలి (narrative style) ఒక సామాన్యమైన ఇతివృత్తాన్ని ప్రభావవంతమైన కథగా మలిచింది. అందుకు పాత్రోచితమైన భాష కలిసివచ్చింది. రచనలలో మామూలుగా కనిపించే నాటకీయత పట్ల ఈ కథలో రచయిత తన నిరసనని ప్రకటించాడు. జీవితంలోని సరళ, సౌందర్యాలని అసాధారణంతో కప్పిపుచ్చకుండా వాస్తవమూ సంభవమూ మాత్రమే చిత్రించాడు. ఆఖరికి ‘‘జీవితాన్ని జీవితంలా చూడకుండా నాటకీయంగా ఉండాలనుకునే వాళ్ళకు మల్లయ్య జీవితం ప్రత్యేకించి ఏమీ చెప్పదు’’ అని అంటాడు.

‘కాశెపుల్ల – నర్సింగాపురం పిలగాని డైరీ’ జ్ఞాపక కథ. రచయిత తన అమాయకమైన బాల్య స్మ ృతుల ఆధారంగా, ఏదైనా రాయాలనుకుంటాడు. దానికి చిన్నప్పుడు ఆడిన ఆట ‘కాశెపుల్ల’ అని శీర్షిక కూడ పెడతాడు. గొప్పగా రాయాలని ఉంటుంది. కాని ఏం రాస్తే గొప్పది అవుతుందో తెలియదు. అయితే ఈ సందిగ్ధం కొత్తది కాదు. పదేళ్ళ ప్రాయం నాటిది. అయిదో తరగతి దసరా సెలవుల్లో ‘బూరుగుపెల్లి సారు’ పిల్లలందర్నీ డైరీ రాసుకుని రమ్మంటారు. పిలగాడు దినచర్య రాయడం మొదలుపెడతాడు. ఎన్ని రోజులైనా ‘పశువులను కాచినాను’ తప్ప మరింకేమీ రాయలేకపోతాడు. అయితే డైరీ రాత పేరుతో అతని ఆటపాటలు, ఆ పాడిపంటలు, పువ్వులు, బంధువులు, ఇరుగుపొరుగు మనుషులు, అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం, బతుకమ్మ పండుగ, దసరా హడావుడి, ‘వనవాసి’ నవలలోని యుగళప్రసాద్‌ని పోలిన మొగుల్‌ సాబ్‌తో పాటు ఇంకా అనేకం మనోహరంగా వర్ణిస్తాడు.

ఇసుకలోంచి కాశెపుల్లను లాగినట్టుగా బాల్యంలోంచి అతని జ్ఞాపకాలను బొట్టుబొట్టుగా వర్తమానంలోకి చేదుతాడు. నా భాష పోయింది, నా యాస పోయింది, నన్ను పల్లెటూరి వాడిగా పరిచయం చేసుకునే ఏ లక్షణమూ లేదని బాధపడతాడు. కొన్ని వస్తువులకు కూడ ప్రాణం ఉంటుందనీ, వాటిని మినహాయించి ‘సాయమాను’నూ, ఇంటినీ ఊహించలేనను కుంటాడు. కడకి మనిషి ప్రేమస్వరూపుడు కావడం ఎంత కష్టభూయిష్టమో చెబుతాడు. ఇక్కడ ఓ సారూప్యం గుర్తుకొస్తుంది. 1840 నాటి రష్యన్‌ నవల ఎమ్‌.లేర్మొంతొవ్‌ ‘మన కాలం వీరుడు’లో కథానాయకుడు పెచోరిన్‌ డైరీలో ఇలా రాసుకున్నాడు: ‘‘నిజంగా చెడు అంత ఆకర్షణీయంగా ఉంటుందా?’’ మన పౌరజీవనంలోని వాస్తవమే 170 ఏళ్ళు పైబడిన తర్వాత కూడ దాదాపు అటువంటి వాక్యంగా పునరావృతమవుతుంది.

‘తమ్ముడి మరణం –1’ ఆర్ద్రమైన కథ. ‘‘అన్నా, నాకు ఆ అమ్మాయి ఎంతమాత్రం నచ్చలేదు. ఒళ్ళంతా ఒక రకమైన దుర్గంధం. ఇక నా వల్లకాదు’’ అని తమ్ముడి నుంచి ఫోన్‌కి మెసేజ్‌ వస్తుంది. అంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారమూ అందుతుంది. 28 ఏళ్ళ యువకుడు. అతనికి పెళ్ళయి నాలుగు రోజులు కూడా కాదు. అది ఇష్టం లేని పెళ్ళి కాదు. అలాగని ప్రేమ వివాహమూ కాదు. అన్న ఉన్నపళాన ఊరికి బయలుదేరతాడు. ఆత్మహత్యకు కారణం గురించిన అన్వేషణతోనే ప్రయాణం సాగుతుంది. ఒక్కడూ తమ్ముడి జ్ఞాపకాలతో, తనలో తను తర్జనభర్జనలు పడుతో ఇంటికి చేరుతాడు. తమ్ముడి మృతదేహాన్ని చూచి తల్లడిల్లిపోతాడు. ‘చెట్టుకొమ్మ పైకి ఎక్కి, అక్కడ కూర్చుని, ఉరి మెడకు పెట్టుకుని, అంతే… ఒక్కసారిగా దుంకేశాడు. బతుకులోంచి చావులోకి దుంకేశాడు’ అనుకుంటాడు.

కథ ఆరంభదశలో అన్న స్వగతంగా అంటాడు: ‘‘అమ్మాయి అత్యంత మామూలుగా ఉంటుంది. అంటే చూడగానే బాగుంది అని ఒక్క మాటలో అనాలనిపించదు. అయినా ఎలా తిరస్కరించడం? ఆ అమ్మాయిని మనిషి అర్హత నుంచి ఎలా తగ్గించి మాట్లాడటం?’’ చిట్టచివరికి ‘‘ఏ స్త్రీత్వపు సౌకుమార్యం లేని, ఇకపై అది చిగురించేందుకు ఎంతమాత్రమూ అవకాశం లేని కొర్రాయి అయ్యుండాలామె’’ అని ఆక్షేపిస్తాడు లేదా నిర్ధారణకి వస్తాడు. ఆ దుర్గంధం మానసిక అంతరం. ఆ ప్రేమరాహిత్యపు అగాథమే తమ్ముడిని బలితీసుకుంది. ఇది కేవలం తమ్ముడి ఆత్మహత్య పూర్వాపరాల గురించిన కథ మాత్రమే కాదు. కలత చెందిన తమ్ముడిని కోల్పోయిన అన్న ఆవేదన కూడ ఈ ఏకపాత్ర సంభాషణలో ఆసాంతం అనుసరిస్తుంది.

పారిశుద్ధ్య కార్మికులు సమ్మె తలపెట్టినప్పుడు ఏమవుతుందనే ఆలోచనలోంచి అల్లిన కథ ‘రెండడుగుల నేల’. ‘‘మమ్మల్ని మీతో సమానంగా గౌరవించాలి’’ అన్న వారి అభ్యర్థన ఏనాటికైనా మన హృదయం వినగలుగుతుందా? కోటి రూపాయలు ఇస్తే మాత్రం నేను చేస్తానా ఆ పని? అని narrator తన మీదికే ప్రశ్నని ఎక్కుపెట్టుకుంటాడు. ఆ మధ్య పాకీపనివారి గురించి మేమొక సదస్సుని నిర్వహించాం. మానవ హక్కుల కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో వారు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. అంతా విన్న తర్వాత ప్రజాప్రతినిధి ఒకరు అసహనంతో విరుచుకుపడ్డాడు. అనాలోచితంగా అన్నాడు కదా: ‘‘మిమ్మల్ని పాకీపని ఎవ్వరు చేయమంటున్నారు? వృత్తి మానేయండి. వ్యాపారం చేసుకోండి. మీ పిల్లల్ని చదివించు కోండి.’’ పాపం, ఆ హితవచనాలకి వారు బిక్కచచ్చిపోయారు. నిజమే పారిశుద్ధ్య కార్మికుడు ఒక్కరోజు గైర్‌హాజరయితే, ఆ పని యంత్రం చేస్తుందా? అతడు కనీసం రోడ్డు పక్కన అరటి పళ్ళు అమ్మబోతే, ఎవరైనా కొనేందుకు ముందుకొస్తారా? ఆ పిల్లల్ని బడికి పంపితే సాటివారితో కలవనిస్తారా? అందుకనే ఆ అమానవీయ, అపాయకరమైన వృత్తి గురించి బెజవాడ విల్సన్‌ This is slavery based on caste అన్నది.

ఈ పుస్తకంలోని ‘మరణ లేఖలు’, ‘చింతకింది మల్లయ్య ముచ్చట’, ‘చినుకు రాలినది’, ‘కాశెపుల్ల’, ‘తమ్ముడి మరణం–1’ కథలు ప్రత్యేకమైనవి. ‘ఆమె పాదాలు’, ‘కథ కాని కథ’, ‘నాలో(కి) నేను’, ‘మంట’, ‘శ్రీమతి సర్టిఫికెట్‌’ కథలు ఒక తరహావి. ‘ఆమె పాదాలు’, ఓ తటిల్లత వంటి సౌందర్యవతి కథ. హైకూ చదివిన అనుభూతిని ఇస్తుంది. ‘నాలో(కి) నేను’, ఎన్నటికీ తన కళంక బింబం చూసుకోని వ్యక్తి కథ. సమాజంలోని, ఎదుటి మనిషిలోని తప్పొప్పులను పరికించే ఆసామి ఆ నిరర్థకమైన ఆలోచనలలో పడి కొట్టుకు పోతుంటాడు. ఆఖరికి అనుకుంటాడు: ‘‘అబ్బా! ఎన్నాళ్ళయింది నా ముఖం అద్దంలో చూసుకుని.’’ “రెక్కల పెళ్ళాం” కొత్త ఊహలతో గమ్మత్తుగా ఉంది. మొదటి రాత్రి భార్యని భర్త అడుగు తాడు: ‘‘దేవీ! నీకు రెక్కల్లేవా?’’ బదులుగా ఆమె అంటుంది: ‘‘పెద్ద! నీకేమైనా తురాయుందా?’’ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా వ్యవహారాలు, లక్ష్యాలు వేర్వేరనీ; రెక్కలు, తురాయి, కొమ్ములు తదితర ప్రతీకలతో కథ నడుస్తుంది. ‘మంట’ కథ చైతన్య స్రవంతి ధోరణిలో ఆసక్తికరంగా సాగుతుంది.

‘చింతకింది మల్లయ్య ముచ్చట’ సంకలనం మానవ మాత్రుడు కేంద్రంగా అతని విషాదోల్లాసపు జీవన జలధిలో అలలు, అల్పపీడనాలు, మరికొన్ని మహా సుడిగుండాలు అని అవగతమవుతుంది. ప్రవాహపు ఆటుపోట్లతో గవ్వలు, పిల్లనగ్రోవులు, ప్రేమలేఖలు, మృతస్వప్నాలు కూడ ఒడ్డుకి కొట్టుకొచ్చేయనిపిస్తుంది. అయితే అచంచలమైన జీవితేచ్ఛ మాత్రం ఎడతెగని హోరుగా వినవస్తుంది. సమకాలీన కథకులలో పూడూరి రాజిరెడ్డి రచనా ధోరణి (Voice) విలక్షణమయింది. రచయితకి దర్శనంలో భిన్నత్వం ఉంది. కథనంలో ఒక ఉరవడి అలవడింది. ఆత్మగత సంభాషణ, మనో విశ్లేషణలతో రచనా సంవిధానం (texture) కొనసాగింది. కొన్ని కథలలో యథాతథ వ్యక్తీకరణ (automatic writing) కనబడుతుంది. రచయిత ఒక పాత్రగాను పరిచయం అవుతాడు. పాత్ర కాకుండాను వ్యాఖ్యానిస్తాడు. ఈ శైలీ ప్రత్యేకత (mannerism) వల్ల ఎక్కువ కథలకి నూతనత్వం (novelty) సమకూరింది. ఇది ఒక్కోసారి ఉపసంహారం (epilogue) లాగ ఉపయోగపడింది. రచయిత మొగ్గుదల మేరకు రాతలో పెట్టిన పరాయికరణ ప్రభావం (alienation effect) సఫలమయింది. ‘చింతకింది మల్లయ్య ముచ్చట’ ఒక్కటే తెలంగాణ యాసలో చెప్పింది. తతిమ్మావన్నీ మామూలుగా రాసినవి. ప్రతి పదమూ ఆచితూచి పలికినట్టుంది. సందర్భానుసారంగా కొన్ని ‘అసభ్య’ పదాలను వాడటంలో వెనుకాడలేదు. నిశిత పరిశీలనతో అనేక సూక్ష్మాంశాలను సైతం వదిలిపెట్టలేదు.

మాటలు, వాక్యాలు, పాత్రలు, ఆధిపత్యాలు, అంతరాలు, ఆంతర్యాలు, మానవ ప్రవృత్తుల వృత్తాంతాలన్నీ శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ కథలకి మూలాధారం రచయిత స్వస్థలపు (నర్సింగాపురం, తెలంగాణ) నేలగంధంలోనే ఉంది. ఆ పల్లెటూరి వేపు తిరిగి కలల రెక్కలు అల్లార్చకుండా, ఒకింత కన్నార్పక యోచించకుండా మధ్యంతర ప్రలోభమేదీ ఆయనకి సంకెల వేయలేకపోయింది. ఒక చోట అంటాడు: ‘‘మన కాళ్ళేమో పల్లెలో ఉంటాయి. చేతులేమో పట్నాన్ని కౌగిలించుకుంటాయి.’’ రచయిత అక్షరాలలోనే తన జాలిగుండె కొట్టుకులాడుతుం టుంది. ఈ నెత్తురోడే ప్రపంచం మీద ఏకకాలంలో ధిక్కారంతోను, కారుణ్యంతోను ఉద్వేగం ఉప్పొంగుతుంటుంది. కాశెపుల్ల కథలో narrator తనలో తను అనుకుంటాడు: ‘‘ఎంత కాలుష్యంలోనైనా, పూలచెట్టు తన పరిమళపు అస్తిత్వాన్ని నిలబెట్టుకుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనిషికి తన మనిషితనాన్ని నిలబెట్టుకునే అవకాశం లేదా?’’ ముగింపు మాటగా ఇంతకు మించిన మహత్తరమైన వాక్యాన్ని నేను పట్టివ్వలేను.

**** (*) ****

(పూడూరి రాజిరెడ్డి కథల సంపుటి ‘చింతకింది మల్లయ్య ముచ్చట’ పరిచయ సభలో చేసిన ప్రసంగం)



3 Responses to నర్సింగాపురం పిలగాని కతలు

  1. Sasikala
    November 1, 2017 at 12:05 pm

    రచయిత లోపలి దారాన్ని పట్టుకున్నారు.మంచి విషయాలు హైలెట్ చేసారు. బుక్ చదవాలి అనుకున్న వాళ్లకు
    ఈ పాయింట్స్ బాగా ఉపయోగపడతాయి.రచయితకు మీకు అభినందనలు.
    మీరు చెప్పినట్లు తనను పట్టించేవి ఈ వాక్యాలే……
    మన కాళ్ళేమో పల్లెలో ఉంటాయి. చేతులేమో పట్నాన్ని కౌగిలించుకుంటాయి.’’ రచయిత అక్షరాలలోనే తన జాలిగుండె కొట్టుకులాడుతుం టుంది. ఈ నెత్తురోడే ప్రపంచం మీద ఏకకాలంలో ధిక్కారంతోను, కారుణ్యంతోను ఉద్వేగం ఉప్పొంగుతుంటుంది. కాశెపుల్ల కథలో narrator తనలో తను అనుకుంటాడు: ‘‘ఎంత కాలుష్యంలోనైనా, పూలచెట్టు తన పరిమళపు అస్తిత్వాన్ని నిలబెట్టుకుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనిషికి తన మనిషితనాన్ని నిలబెట్టుకునే అవకాశం లేదా?’’ ముగింపు మాటగా ఇంతకు మించిన మహత్తరమైన వాక్యాన్ని నేను పట్టివ్వలేను.

  2. BUCHIREDDY gangula
    November 2, 2017 at 4:33 am

    వెరీ గుడ్ తెలంగాణ స్టోరీస్
    ========
    Reddy

  3. P C Narasimha Reddy
    November 11, 2017 at 7:46 pm

    Good

Leave a Reply to BUCHIREDDY gangula Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)