కవిత్వం

నిశ్శబ్దజిహ్వ

22-ఫిబ్రవరి-2013

ఆ ముఖంలో రుచి కనిపించక
నాలుకతో నిర్మించిన నిర్లిప్త నిరీక్షణే
అప్పటి వో కాలపు సాయింత్రపు
సూర్యశబ్దాల ఆఖరి నిశ్శబ్దజిహ్వకై
స్వప్నాసనాలు నేర్పిస్తుంటే
యెప్పటి వూపిరి యెముకల్లోకో
పర్వత పాదాలు తడవటానికి
అనుసరించే ఆలోచనలు

క్షీణత
పక్షవాతపు క్షీణత
వాసనల క్షీణత

తాబేటి తలలో నీడల్లేని మాటల వంతెన
నేలను తాకే కల
గుడ్డి నవ్వు

మోకరిల్లాలి జ్ఞాపకాల కాళ్ళపై
యెవరి ఆత్మో నీహత్య చేసేయ్
బ్లేడుతో పరాయి అద్దాన్ని కోసేయ్
లో అద్దాల లంగాల్ని లాగి పారేయ్
ప్రేమాంగాల్లో దూరిపో
గాల్లోని గాలిని గ్లాసులోకి గిరాటేయ్
ప్రాంతీయ అంధత్వం కెవ్వు కేక

నోట్లో ఆ అంగాలు తిరగకపోతే తప్పిపోతావ్
అనుభవాలు ఆలోచనల్ని నిరూపించేలోపే
కళ్ళకి నాలుకలు విషాన్ని తాపుతాయ్

నిధనము లభించు ఎల్లవేళలా