గెస్ట్ ఎడిటోరియల్

హైదరాబాద్ చరిత్ర పుటల మధ్య సంచారం!

డిసెంబర్ 2017

1

వొక పుస్తకం చదివి, వారం రోజులపాటు జ్వరంతో తీసుకున్నట్టు అనిపించడం— యీ మధ్యకాలంలో యిదే మొదలు!

కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు ప్రతి యేటా నిర్వహించే వాళ్ళ సెమినార్లో వొక ప్రధాన వక్తని అతిథిగా ఆహ్వానిస్తారు. యీ సారి నన్ను ఆహ్వానిస్తూ, నేను ప్రస్తుతం రాస్తున్న పుస్తకంలో వొక అధ్యాయం మీద మాట్లాడమని అడిగారు. సరే, పాత సంగతులే మాట్లాడడం యెందుకు అని నేను వొక కొత్త టాపిక్ చెప్పగానే వాళ్ళు సంబరపడిపోయారు. నా ఉత్సాహమూ, వాళ్ళ సంబరమూ బాగానే వున్నాయ్ కాని, ఆ టాపిక్ కోసం ప్రసిద్ధ ఉర్దూ రచయిత్రి జీలానీ బానో హైదరాబాద్ చరిత్రని ప్రధాన అంశంగా తీసుకొని రాసిన నవల – ఐవానే గజల్- మరోసారో చదవడం మొదలెట్టాను.

గతంలో హైదరాబాద్ లో వున్నప్పుడు యీ నవల వొకసారి చదివాను. గుర్తుంది. కాని, యిన్నేళ్ళ తరవాత యిప్పుడు చదవడం మొదలెడితే, వొంట్లో జ్వరం మొదలయింది. చెప్పొద్దూ, నాకు జ్వరం అంటే భయం! అది వస్తే వొక పట్టాన వదలదు కనుక! దాని పేరు మీద క్లాసులు ఎగ్గొట్టి మంచం పట్టుకొని వుండడం నాకు నచ్చదు కనుక!

చదవడం మొదలెట్టాక ఆ చదువు అనేది నా అదుపాజ్ఞలలో లేనే లేదని అర్థమైపోయింది. పేజీలు వెళ్ళిపోతున్నాయి, వొళ్ళు వెచ్చవెచ్చగా అనిపిస్తూనే వుంది. మొత్తం మీద నవల చదివేశాను, జ్వర భయం వదులుకొని!

2

“ఐవానే గజల్” నిజానికి హైదరాబాద్ లోని వొక ముస్లిం జమీందారు వాహిద్ హుసేన్ కథ. ఆశ్చర్యంగా కథ అతనితో మొదలై, అతని నలుగురు మనవరాళ్ళ జీవితంతో కొనసాగి, వొక రాజకీయ నవలగా ముగుస్తుంది. వాహిద్ హుసేన్ కి కవిత్వం అందునా గజల్ అంటే ప్రాణం. కాని, అతని గజల్ సంప్రదాయ గజల్. ఎంత సంప్రదాయమంటే కొత్తగా వచ్చిన గడియారాలని కూడా అతను అంగీకరించడు. సూర్యుడి నీడని బట్టే కాలాన్ని కొలుస్తూ వుంటాడు. ఇస్లాం కట్టుబాట్లని తూచాతప్పక పాటిస్తాడు. నిజాం నవాబు మాత్రమే యీ భూమికి అధిపతి అని నమ్ముతూ వుంటాడు. స్త్రీ అంటే సాంప్రదాయిక గజల్ లా వుండాలని, వొద్దికగా వుండాలనీ కోరుకుంటాడు. అతని భవనం స్త్రీలకూ ఖైదు కొట్టమే. వాళ్లకి బయటి ప్రపంచం తెలీనే తెలీదు.

వాహిద్ హుసేన్ యింకా ఆ కలల ప్రపంచంలో విహరిస్తూ వుండగానే 1940 లలో హైదరాబాద్ ముస్లిం జీవితంలో అనేక మార్పులు వస్తాయి. అందులో ముఖ్యమైంది 1948 పోలీసు చర్య!

పోలీసు చర్య తరవాత హైదరాబాద్ స్టేట్ స్వరూపమే మారిపోయింది. దాంతోపాటు అందరి జీవితాలూ మారిపోయాయ్, ముఖ్యంగా స్త్రీల జీవితాల్లో చెప్పలేనంత మార్పు వచ్చింది. యీ మార్పు అకస్మాత్తుగా వచ్చిందని కాదు. అంతకుముందు పదేళ్లుగా నలుగుతూన్న మార్పు. హైదరాబాద్ ముస్లిం స్త్రీలు పరదా వ్యవస్థ నించి బయటపడుతూ ఇస్లామిక్ చదువు మాత్రమే కాకుండా బయటి చదువుల కోసం వెళ్తున్న కాలం. ఈ నవలలో వొక పాత్ర అన్నట్టు: “ముస్లిం సమాజానికి ఇవి ఇక చివరి రోజులు. ప్రళయం ఎంతో దూరాన లేదు!” ఉస్మానియా యూనివర్సిటీ మధ్య తరగతి వున్నత తరగతి ముస్లిం స్త్రీల జీవితాల్లో పెద్ద కుదుపు. అభ్యుదయ భావాలు రాజభవనాల గోడల్ని బద్దలు కొడుతున్న రోజులు. తెలంగాణా సాయుధ పోరాటం ప్రపంచ తిరుగుబాటు ఉద్యమాలకు దిక్సూచి అయిన కాలం.

అలాంటి రోజుల్లో వాహిద్ హుసేన్ మనవరాలు చాంద్ సుల్తానా అబ్బాయిలతో కలిసి మెడికల్ కాలేజీ చదువులకి వెళ్తుంది. సంగీతం, నాట్యం, నాటక రంగాల మీద ప్రేమ పెంచుకొని, సంజీవ అనే వుద్యమకారుడి ప్రేమలోనూ పడుతుంది. కాని, అప్పటికీ చాంద్ లో ఇంకా సంప్రదాయ అవశేషాలు వుండడం వల్ల సంజీవ కమ్యూనిష్టు భావాలను ఆమె పూర్తిగా వొప్పుకోదు. అది సరైన మార్గం కాదని ఆమె అనుకుంటూ వుంటుంది. చివరికి వొంటరి స్త్రీగానే మిగిలిపోతుంది. చాంద్ కథ అలా వుంటే, వాహిద్ హుసేన్ యింకో మనవరాలు యింకో అడుగు ముందుకేస్తుంది. నాటకరంగంలో స్థిరపడుతుంది. కాని, ఆ రంగంలో స్థిరపడి వున్న పురుషాహంకారాన్ని దిక్కరిస్తుంది. యింకో ఇద్దరు మనవరాళ్ళు – కైజర్, క్రాంతి- దాకా వచ్చేసరికి మొత్తం కథే మారిపోతుంది. కైజర్ తెలంగాణా సాయుధ పోరాటంలోకి వెళ్లి, అజ్ఞాత వాసంలో వుండిపోతుంది. కైజర్ కూతురు నక్సల్ ఉద్యమం వైపు మొగ్గు చూపడంతో నవల ముగుస్తుంది.

నవలలో కథాంశం అలా వుంచితే, నా ప్రధానమైన ప్రశ్న: చరిత్రని వొక కాల్పనిక రచన ఎంతవరకు పట్టుకోగలదు? అని!

3

ఇంగ్లీషు సాహిత్యంలో నవలల తొలి రోజుల్లో నవల అనేది సాహిత్య దురవస్థకి, నైతిక దివాళాకి పరాకాష్ట అని వొక వాదం వుండేది. యీ నవలలు చదవడం వల్లనే అప్పటి తరంలో నైతిక విలువలు క్షీణించడం మొదలయిందని Vicesimus Knox అనే అప్పటి ఆంగ్ల సాహిత్య విమర్శకుడు అన్నాడు. 1778 లో అతని వ్యాసంతోనే నవలా వ్యతిరేక వాదన ఆరంభమైంది. అక్కడితో ఆగలేదు అతను. యింకా యిలా అన్నాడు:

There is another evil arising from a too early attention to Novels. They fix attention so deeply, and afford so lively a pleasure, that the mind, once accustomed to them, cannot submit to the painful task of serious study. Authentic history becomes insipid. The reserved graces of the chaste matron Truth pass unobserved amidst the gaudy and painted decorations of fiction.

కేవలం చరిత్ర పుస్తకాలు మాత్రమే కొత్త తరంలో నైతిక విలువల్ని ప్రోది చేస్తాయని తీర్పు చెప్పేశాడు కూడా. అతనలా తీర్పు చెప్పడం అలా వుంచితే, నవల అనే ప్రక్రియ యెంత త్వరగా గాఢంగా ప్రచారంలోకి వచ్చిందో మనకి అర్థమవుతుంది. నవలకీ, చరిత్రకీ మధ్య పోలిక కలపడం అనేది సాహిత్య సిద్ధాంత పరంగా చేసిన తొలి విమర్శకుల్లో అతనూ వొకడు. ఆ తరవాత యీ చర్చ చాలా దూరం వెళ్లి, యిప్పుడు మౌఖిక కథనాలు కూడా చరిత్రే అనే దాకా వెళ్ళింది. అయినా, నా ప్రశ్నకి సమాధానం సాధ్యమా?!

యీ మధ్య ప్రసిద్ధ నవలా రచయిత మొహసిన్ హమీద్ కొత్త నవల Exit West మీద మరోసారి అలాంటి చర్చ మొదలైంది. చరిత్రనీ, రాజకీయాలనీ, కొత్త అస్తిత్వ వేదనల్నీ నవలీకరించడంలో మొహసిన్ హమీద్ గొప్ప ప్రతిభాశాలి. అనుమానమేమీ లేదు, కాకపొతే, ఇలాంటి నవలల్లో చరిత్రకీ, వాస్తవికతకీ మధ్య దూరాన్ని కొలవడమే కష్టం! యెక్కడ చరిత్ర అంతమవుతుందో, యెక్కడ వాస్తవికత మొదలవుతుందో- యెక్కడ వాస్తవికత మొదలవుతుందో చరిత్ర అంతమవుతుందో గుర్తించడం కనాకష్టం! ఆ ప్రశ్నకి సమాధానం వెతికే పని యిప్పట్లో చేయలేను కాబట్టి, మరోసారికి వాయిదా వేస్తాను.

4

యీ నవల చదివిన అనుభవాన్ని కేవలం నాలుగు ముక్కల్లో చెప్పాలని అనుకున్నా కాబట్టి యెక్కువ వివరాల్లోకీ, విశ్లేషణలోకీ వెళ్ళడం లేదు. ఆ చర్చ అంతా యిప్పుడు నేను హైదరాబాద్ చరిత్ర మీద రాస్తున్న పుస్తకం కోసం అట్టిపెట్టుకుంటున్నా.

యీ నవల చదివిన అనుభవం నాలోపల జ్వరంలాంటి వేడిమిని పుట్టించిందని మొదటే చెప్పాను కదా!

అవును, నవల చదివాక ఆ నాలుగు స్త్రీల పాత్రలే కాదు. అప్పటి హైదరాబాద్ వీధులూ, ఇళ్ళూ, సంఘటనలూ వాటి మధ్య మనుషులు పడ్డ వేదనా గుర్తొచ్చింది. ఆ చరిత్ర అంతా యెవరూ రాయకపోవడం బాధ పెట్టింది. వొక నవలలో అంత చరిత్రనీ కుదించేసరికి లోపలంతా వొత్తిడిగా అనిపించింది. ముఖ్యంగా ఆ నలుగురు ముస్లిం స్త్రీల జీవన కథనం వెంటాడుతూ వుండిపోయింది.
చరిత్ర గురించి చెప్పడానికి నవల గొప్ప సాధనం కాదని యిప్పుడు యెవరైనా అనగలరా మరి?!

(ఇది కొలంబియా యూనివర్సిటీలో నవంబరు 27 నా ప్రధాన ప్రసంగంలోని వొక అంశం మాత్రమే! మిగతా అన్ని అంశాలూ చదవాలంటే నా కొత్త పుస్తకం వచ్చేదాకా వోపిక పట్టాల్సిందే!)

**** (*) ****