నీరెండ మెరుపు

చంద్రునికొక పూల తావి

22-ఫిబ్రవరి-2013

చంద్రునికొక పూల తావి
 ———————-
ఆ పాపకు తన స్నేహితురాలెవరో
ఒక రహస్య సందేశాన్నందించినట్టుగా
మిన్నల్ అంటే చందమామ మరియూ పువ్వు అని రాసి అతి జాగ్రత్తగా మడత పెట్టి నెమలి కన్నును ఉంచే చోట కాగితం పుటలలో దాచి ఇచ్చింది.

బడి భారాన్ని భుజాల నుండి పక్కకు నెట్టి
కాసేపు టీవీ చానెళ్ళను టకటకా తిప్పేసి
ఏదో గుర్తుకు వొచ్చిన దానిలాగా తనకు ఆ రోజుటికి వీడ్కోలుగా అందిన ఆ చీటీని ఆత్రంగా బయటకు తీసి
పసి బిడ్డలకు మాత్రమే చేతనయిన ఇంకా వొక పద్ధతికంటూ అలవాటు పడని అక్షరాల పేర్పును కాసేపు తదేకంగా తల పంకించి చదువుకొని
ఆ పాప తిరుగు జవాబుగా ఏదో రాయడం మొదలు పెట్టింది.

కొన్ని స్థితులలో చాపల్యం మాదిరిగా
ఒక్కొక్క పూవునూ జాగ్రతగా ఎంచి ఏరి తీసినట్టుగా పిల్లలకు పేర్లు పెట్టగలం గానీ
అ ఆపురూపమైనదేదో సదా తలదాల్చలేని శాపగ్రస్తులం కదా మనం
ఊహకు ఆవల నిలుచున్న బంధీలం కదా మనం
గీతల నడుమ వొదిగి తల వొంచి అనేకసార్లు గిడస బారిన గూనితో వొదిగిన అక్షరాలుగా పలకరించుకునే మనుషులం కదా మనం

బహుశా తన లేత వేళ్ళతో
తన స్నేహితురాలిలాగే ఇంకా వొదిగీ వొదగని అక్షర పంక్తుల పేర్పుతో తిరిగి ఆ పాప ఇచ్చే జవాబును మనం వొక నాటికైనా ఊహించగలమా
కనీసం ఊహగానైనా

-అవ్వారి నాగరాజు

***
” Poetry is what makes me laugh or cry or yawn, what makes my toenails twinkle, what makes me want to do this or that or nothing.” థామస్ గారన్నట్లు కవిత్వమంటే అది నవ్వించాలి లేదా ఏడిపించాలి లేదా నోరు వెళ్ళబెట్టించాలి. మునివ్రేళ్ళ గ్రోళ్ళు మెరిపించాలి, అదో ఇదో ఏదో ఒకటి చేయనివ్వాలి లేదా మనల్ని ఏమీ చేయకుండా నైనా చేయాలి. ఈ కవిత చదివాక ‘అభిరామి’ అనే ఒక మలయాళి బాల‌ కవియత్రి రాసిన ‘ఆశ చెకెన్ స్టాల్’ అనే కవిత బాగా గుర్తొచ్చింది.
భీబత్సరస ప్రధానమైన కవితలు. ఒక్కో వాఖ్యం గంపెడంత స్పష్టత ను తెచ్చుకొన్నాయి. విషయం చాలా స్వల్పమైనది. ” తనతోటి స్నేహితురాలు ఒక వాఖ్యాన్ని “మిన్నల్ అంటే చందమామ మరియూ పువ్వు” అని ఒక‌ పేపర్ లో రాసి, ఒక పాప పుస్తకంలో పెట్టడం, దాన్ని ఆ పాప‌ ఇంటికి వచ్చి తీరిగ్గా చదువుకొని తిరిగి జవాబు రాయడానికి పూనుకోవడం,” ఇదీ వస్తువు. ఈ లోగా కవి తన ఉదాత్తమైన సామాజిక స్పృహను ఎలుగెత్తి చాటారు. మనిషి లో అంతర్లీన౦గా నెలకొన్న సంఘర్షణ, కుత్సితత్వాన్ని అతి సునిశితంగా చెప్పారు. కాలమాన పరిస్థితుల్లో మనిషి ఎలా కుబ్జ స్వరూపుడవుతున్నాడో ఈ పదాల్లో తెలిపారు.

“ఊహకు ఆవల నిలుచున్న బంధీలం కదా మనం
గీతల నడుమ వొదిగి తల వొంచి అనేకసార్లు గిడస బారిన గూనితో వొదిగిన అక్షరాలుగా పలకరించుకునే మనుషులం కదా మనం”
కవి నాగరాజు తన విభిన్నశైలిలో చివరగా, ఆ పాప ఏమి రాస్తుందో ఊహించగలమా? అనే ప్రశ్న కలుషితమైన సమాజాన్నిప్రశ్నించడమే.
పాఠకుడనే కాన్వాస్ పై కవి తన అక్షరాలతొ వేసే దృశ్యమే నిజమైన కవిత. కవి నాగరాజు దృశ్యాన్నే కాకుండా దృశ్యకావ్యాన్ని అందించారు.

Poetry is artistically rendering words in such a way as to evoke intense emotion or an Ah Ha! experience from the reader.. కవిత చదివిన పాఠకుడు ఆహా!హా! అనే అనుభవానికి లోను కావాలంటారు.
తనను మెచ్చుకొన్న వారికి, ఎలాంటి భెషిజాలు లేకుండా, స్వచ్చంగా, నిష్కల్మషంగా , కొన్ని కృతజ్ఞతాపూర్వకమైన మాటలు కూడా రాసుకోలేని స్థితి మనిషి అలోచనల్లో నెలకొనిందని చెప్పడం ఒక ఎత్తైతే, ఆ అంశాన్ని గుర్తించడమే కాక, సమాజంలో ఎవరికీ లేదని నిష్కర్షగా చెప్పి కవి తన నిబద్దతను చాటుకొన్నారు. సామాజిక దుస్థితి ని ఎత్తి చూపటానికి ఈ కవితను కవి తన స్వచ్చమైన వాహిక గా ఉపయోగించుకొన్నాడు. సమాజ భవిష్యత్తును చక్కగా చూడగలిగినా , ఆగామి ఆశావాదాన్ని తగలలేదు. భవిష్యత్తు ఇంతకంటే ఘోరమైనదిగా ఉండొచ్చన్న ఊహను అలా పాఠకులకు వదిలేశాడు.

“బహుశా తన లేత వేళ్ళతో

తన స్నేహితురాలిలాగే ఇంకా వొదిగీ వొదగని అక్షర పంక్తుల పేర్పుతో తిరిగి ఆ పాప ఇచ్చే జవాబును మనం వొక నాటికైనా ఊహించగలమా

కనీసం ఊహగానైనా ”

కవి తనలోకి తాను చూసుకోవడం తో పాటు, దొపిడి చేయబడుతున్న మనిషిని కాపాడటం, నిద్రపోతున్న మనిషిని నిద్ర నుండి లేపడం, ఇలా ప్రజా హితాన్ని ఖచ్చితంగా సృజించినప్పుడే మంచి కవిత.కవి విజయవంతంగా సృజించాడు. కవి హృదయోద్రేకానికి చక్కని ప్రతిబింబం ఈ కవిత.

“If you really want to know what poetry is, read it. Read it carefully. Pay attention. Read it out loud. Now read it again”

 

 

 

 

 

(సి.వి.సురేష్)