కవిత్వం

అంతర్ ‘శ్లోకం’

22-ఫిబ్రవరి-2013

తెలవారుజాములు,సందెపొద్దులు ఒక మాదిరులు
మిట్టమధ్యాహ్నాలు, నడిరాత్రులే విపరీతాలు
ప్రతీక్షణం బరువయినప్పుడే
అన్నివేళలు లెక్కకొస్తాయి
ఎదురుచూపులు ఎక్కువయినప్పుడే
అన్ని ఋతువులు పరిశీలనకొస్తాయి

ఆకాశమూ, సముద్రము,మనసూ కలిస్తేనే కదా
కల,కధా,కవితా కదిలేది
మనిషీ, మోహమూ, మరుపు మిగిలేది
కాలం పరుగులెడుతున్నా
పరిసరాలన్నీ నిశ్శబ్ధాన్ని నింపుకుంటాయి
ప్రపంచం గిర్రున తిరుగుతున్నా
కాళ్ళెందుకో నిశ్చలంగా నిలబడతాయి

ఎన్ని ఊసులో, పంచుకోవాల్సిన ఊహలో
పరదా వెనకే ఆగిపోతాయి
అగ్గి రాజేసుకుంటాయి
ఒక్కమాటతో విడిపోయే పరదానే
ఆమాటకు అక్షరాలు పేర్చడమే అతిక్లిష్టం
ఆపై శబ్ధాన్నీ, స్వరాన్ని అందించడం బహుకష్టం

ప్రతి అంతరంగంలో అతిశయాన్ని మించే
ఓభావముంటుంది
దాన్ని పూరించే
ఘడియ కూడా ఒకటుంటుంది
అదొక్కటే నిజం
ఆ ముందెనకంతా నాటకమే !!