ఎలా ఉన్నావో
మళ్ళీ నీ నవ్వు నేను
చూడగలనో లేదో
కనీసం నీ పేరైనా
నేనెప్పుడు అడగలేదు..
అమ్మకాలలో
ఆపూట తీరిక లేకనో
అసలు అమ్మకాలే లేకనో
ఇంత తిండైనా తిన్నావో లేదో
పొట్ట చేత్తో పట్టుకొని
పట్టణానికి బయలెల్లిన నువ్
నీ వాళ్ళను చూసి
ఎన్నాలైందో
టీవీలో వార్త చూసి
నిన్ను పోల్చుకోవటంలో
ఎంతటి క్షోభననుభిస్తున్నారో
నీవాళ్ళు నా సాటి మనుషులు ..
అవును మనలాగే
ఈ ఘటనా రచకుడు
మనిషే అంటావా?
ఏ రక్తం తో చేసాడో
ఏ మట్టి ముద్దలో
ఆ వైషమ్యాల ఊపిరిని
ఏ విధంగా ఊదాడంటావు
ఆ విధాత
నిజంగా విధాతే చేసాడందామా?
ఇప్పుడే వచ్చేస్తా
ఏం తేను నీకోసం
అక్కడన్నీ చవక
చెబుతూ వెళ్ళిన తనకి
తన ఊపిరి ని
పదిలంగా తెమ్మని
తనులేని వేళ
కనుల చెమ్మ ఆరదని
రద్దీ స్థలాల్లో
ప్రాణాలు చవకేనని
తెలియలేదాయే..
అవును మనలాగా
ఇవన్నీ తెలీకే
జరుగుతున్నాయంటావా?
మూలం తెలుసుకోలేనంత
మాయేమిటో
ప్రాణం తీసేంత
మర్మమేమిటో
చేసినవాడికైనా
చివరికి మిగిలేదేమిటో ??
చెక్కిళ్ళు తడపని కన్నీరు
మాటలుగా మారని
ఆలోచనల ఉప్పెన
చెబుతూనే ఉన్నాయి
ఇది ఊహించని ఉల్కాపాతమా
చేసినవాడు ఏలియనా
కాదే మతి తప్పినా మన వాడే
ఇప్పుడున్నది ఓకే ఒక ప్రశ్న
ఎలా జరిగిందని కాదు
ఇంకెన్ని ఏండ్లు ఇలా
ఇప్పుడు ఏం చేద్దామనే బేతాల ప్రశ్న?
***
హైదరబాద్ అంటే ఒక నగరం మాత్రమే కాదు, భిన్న సంస్కృతులు పూచిన పాదు. అనేక అనుబంధాల కూడలి. ప్రేమకి సంకేతం. మనిషికీ మనిషికీ మధ్య విరిసే స్నేహానికి ప్రతిరూపం. అలాంటి హైదరబాద్ మన కళ్ల ముందే మరో రూపం దాల్చడం…ఇది భరించగలమా? బాధ పడుతున్నాం సరే, ఇంకేమీ చేయలేమా? ‘తలపోత’లో మీరూ భాగం పంచుకోండి. మీ ఆత్మీయ నగరం గురించి మీ సంవేదనల్ని నలుగురికీ చెప్పుకోండి. నాలుగు శతాబ్దాల ప్రేమ పూరిత చరిత్రని గుర్తుచేయండి. ఈ రక్తపు మరకల్ని తుడిచేయండి. -సం.
మూలం తెలుసుకోలేనంత
మాయేమిటో
ప్రాణం తీసేంత
మర్మమేమిటో
చేసినవాడికైనా
చివరికి మిగిలేదేమిటో ??…………ఇప్పుడున్నది ఓకే ఒక ప్రశ్న
ఎలా జరిగిందని కాదు
ఇంకెన్ని ఏండ్లు ఇలా
ఇప్పుడు ఏం చేద్దామనే బేతాల ప్రశ్న?….భిన్న మతాల సహజీవనానికి ప్రతీక ,పీరీల పండుగ ఎ మతనిదో చెప్పలేని కలుపుగోలుతనం ,భిన్న సంస్కృతుల కూడలి ఇది నా హైదరాబాద్ .ఎట్లా కాపాడుకోవాలి? మిత్రమా ఈ భేతాళ ప్రశ్నల కీ ఎక్కడ?
very moving
హైదరాబాద్ భౌతిక స్థితి ఈ కవిత మానసిక స్థితి…రెండూ ప్రశ్నలే..