కవిత్వం

ఈసారి నువ్వొస్తే

ఫిబ్రవరి 2018

వచ్చేయకూడదా
చెప్పా పెట్టకుండా అయినా
అమావాస్య నాడైతే ఏం?
నా కన్నుల వెలుతురు చాలదూ నీకూ నాకూ

నువ్వొస్తే ఇప్పుడు వింటున్న ఈ పాట మళ్ళీ నీతో వినాలి
వింటున్నప్పుడు నిన్ను చూడాలి
ఎప్పటిలాగా ఉత్తినే నిను చూస్తూ
మరచిపోతానో మైమరచిపోతానో తెలీదుకానీ
ఆ ఊహ ఒకటి బావుంది

ఈ గోధుమరంగు అట్ట పుస్తకం ఇప్పుడే ఎదురుగా పెట్టేసుకోవాలి
నువ్వొచ్చే వేళకి మరచిపోతానేమో, పోయినసారిలాగా
కళ్ళెదురుగా ఉండికూడా కంటబడకపోతే ఆ నేరం నాదికాదురా
గంటలని గుప్పెట్లోకి తీసుకొని క్షణాలుగా మార్చి విసిరేస్తావే
నీది ఆ నేరం, ముమ్మాటికీ నీదే

నిన్న కాఫీ కప్పు పట్టుకొని ఈ పెరట్లో తిరిగేటప్పుడు
ఎంతలా అనుకున్నానో తెలుసా
ఏమిటో తను వచ్చినట్టే ఉండదు, ఉన్నట్టే ఉండదు
ఈ ముదురాకుపచ్చటి తీగలు,
లేత ఆకుపచ్చటి నైట్ క్వీన్ పూలు
ఎంత చిన్నబుచ్చుకున్నాయో కదా
‘ఎప్పుడూ చెప్తూ ఉంటావే కానీ చూపించవు’ అని

ఈసారైనా గుర్తుగా ఒక్క అడుగు ఇటు వెయ్యాలి, సరేనా

నీకోసం కాచుకున్నంతసేపూ నా లోపల
ఒక పియానో బీజియం సాగుతూనే ఉంటుందిరా
దాన్ని నీకెలా వినిపించాలో తెలియదు.,
ఒక్కోసారి ఎంత గింజుకుంటుందో
అనుపల్లవిలో హెచ్చుస్వరం అందనట్టు

నువ్వంటావు కదా
‘ఏ పూల రంగులు అద్దుకున్నావ్
కనురెప్పలకీ, కనుబొమ్మలకీ మధ్యన ?’ అని,
అద్దం దగ్గరకి వెళ్ళినప్పుడు గుర్తొచ్చి వెదుకున్నాను
అలాంటిదేం లేదు, నిజంగానే
బహుశా నీతోపాటు మోసుకొచ్చిన ఆశల ఇంద్రధనస్సు
నా ముఖాన ప్రతిబింబిస్తోందేమో, నాకేం తెలుసు?

మళ్ళీ కన్నులకి పున్నమి ఎప్పుడో తెలీదు కానీ,
అల్లుకోనీ కాసిన్ని నీ తలపులని!