దారేదైనా గానీ
అడుగులేవైనా గానీ
చేదువో తీపివో
కళ్ళ సముద్రాలనుంచో
చెంపల మైదానాలపైనుంచో
వెచ్చగా ఉప్పగా జారుతున్నవో
మెత్తని చేతివేళ్ళ స్పర్శలాంటివో
కొన్ని జ్ఞాపకాలు
మనల్ని నడిపించే పాదాలవుతాయి.
హృదయాలింగనం లాంటి
కరచాలనం లాంటి
ప్రియతమ ఒడిలో తలవాల్చి సేదతీరుతున్నట్టూ
చీకటికుహరంలో ముఖంపెట్టి చితిలా కాలిపోతున్నట్టూ
అప్పుడే కొలిమిలోంచి తీసిన నాగలి కర్రులానో
అప్పుడే తీగలో విచ్చుకున్న పువ్వులానో
నిప్పులు చెరుగుతూనో
పుప్పొడి చల్లుతూనో
ఒక కుదుపు కుదిపి
ఇంత ఊరడింపును పూసి
నిలబెట్టడానికీ
నిలబడ్డ చోటినుంచి
పడిపోకుండా నడవడానికి
జ్ఞాపకాల ఊతం అవసరం.
మనిషి ఒక జ్ఞాపకాల పిట్టై ఎగురుతూ ఎగురుతూ
ఏ కొమ్మపై వాలినా
ముక్కుతో గుర్తులని గీసిపోవడమో
చిగుళ్లను జ్ఞాపకంగా తీసుకెళ్లడమో
అనివార్యమయ్యాక
నడుస్తున్న జ్ఞాపకాలమే మనమెవరిమైనా
జ్ఞాపకాల వూటై ప్రవహిస్తున్నవాళ్ళమే ఎప్పటికైనా…
మనం నడుస్తున్న జ్ఞాపకాలం.. మనల్ని నడిపించేవి జ్ఞాపకాలు.. బాగుందండి.
ధన్యవాదాలుసర్
జ్ఙాపకాలు అవి చేదువైనా తీపివైనా జీవితానుభవాలే. ఆ అనుభవాలను ఇతరులతో పంచుకున్నప్పుడె అవి రసాత్మకం అవుతాయి. కథలో విలను బాధపడుతుంటే ప్రేక్షకుడు ఆనందిస్తుంటాడు. బురఖాలు వేసుకున్న జ్ఙాపకాలు ఎన్ని ఎదురైనా నిరుపయోగమేగదా
ధన్యవాదాలు సర్
మనిషి ఒక జ్ఞాపకాల పిట్టై ఎగురుతూ ఏ కొమ్మపై వాలినా ముక్కుతో గుర్తులను గీసిపోవటం
Nice andi
జ్ఞాపకాలను చాలా బాగా పోల్చారు సర్
నేను ఇదే చెప్పాలనుకునే వాణ్ణి. నాగరాజు gaaru చెప్పారిప్పుడు.