తలపోత

పాపం.. వాడు అమానుషుడు!

ఫిబ్రవరి 2013

మేధో హృదయమా
ఒకసారి అలా నడిచొద్దాం రా..

కరుడుగట్టిన క్రౌర్యంలో
మానవతా రేఖలు వెతుకుతున్న మహోన్నత్వమా..
త్వరగా చెప్పులు తొడుగు
అక్కడ రహదారి నెత్తురోడింది
మానవ దేహాలు ముక్కలయ్యాయి
మానవత్వ తీవ్రవాదికి
ఎరుపులో ఆనందపు మెరుపులు

***

ఎక్కడున్నాడో వెతకండి
పట్తుకుని ఇంత కారుణ్యపు వెన్నముద్దలు తినిపించాలి
కన్నీళ్ళతో చాయ్ చేసి విగత జీవుల దేహాల రొట్టె ముక్కలందించాలి

గ్రద్దలకు హంసల తొడుగు తయరు చేశారా..
మృత్యుహుంకారం లో పెనుగులాడే అమాయకత్వం
భళ్ళున బద్దలై మండిన రావణ కాష్టం
ఎన్ని పదాలు బంధించగలవు
ఆ విహ్వల ఆత్మల ఆర్త నాదాల్ని…

***

ఎడైనా
ఏమైనా

వాడూ మానవుడే
నేనో.. మానవతా వాదిని

దౌష్ట్యమైనా
కంకాళాలను కౌగిలించే కాఠిన్యమైనా

నేనో.. మానవతా వాదిని
అవును..

మరి వాడో..
వాడూ మనిషే
అమానుషుడు..పాపం

అణువణువునా మానవత్వం ఆదమరిచిన వాడు

నా నేత్రాలు నిద్ర నటించట్లేదు
త్వరగా పిలవండి

బోధించాలి వాడికి శాంతిని
ఎందుకంటే వాడూ మానవుడే… అమానవుడు..
వాడూ మనిషే… పాపం అమానుషుడు!