నీరెండ మెరుపు

మేఘానికి మరోవైపు!

08-మార్చి-2013

పడిలేచే ప్రయత్నమే రాలిన ప్రతి చినుకుదీ. కదిలించే కన్నీరే రాలిన ప్రతి పూవుది. సాథారణ కవులెవరూ పసిగట్టలేని కదలికలు కూడా చూడగలిగే కవయిత్రే ప్రసూనా రవీంద్రన్. కాబట్టే, “మేఘానికి మరోవైపు” వ్రాయగలిగింది.

ప్రకృతి పారవశ్యంలో వ్రాసే కవితలు చాలానే ఉంటాయి. వానపాటల పకపకలు, మేఘమాల రెపరెపలు, పున్నమి వెన్నెల నవ్వులు, పూల రేకల గుసగుసలు, పిచ్చుకల కిచకిచలు, కప్పల బెకబెకలు. అందాన్ని అద్దంలా ఆవిష్కరించే కవితలే ఇవి. ఆకాశమంతా అలుముకున్న కవిత్వమే ఇది. చాలామందిని మెప్పించే కవిత్వమే ఇది. చాలామంది వ్రాస్తున్న కవిత్వమే ఇది.

“మేఘానికి మరోవైపు” మాత్రం కేవలం పరవశత్వంతో వ్రాసినది కాదు. తాదాత్మ్యం చెంది వ్రాసిన కవిత.

 

మేఘానికి మరోవైపు

ఆకాశం తలుపు తెరిచేదాకా
హృదయ భారాన్ని మోస్తూ
సంచరిస్తూనే ఉంటాను…

కొన్ని కోట్ల అశ్రు బిందువుల
వేడి నిట్టూర్పులకి
కదిలిపోతున్న నన్ను చూసి

పిచ్చి నెమలి
పురివిప్పుకుంటోంది…

నా నీడ స్పర్శకే
చిక్కబడిన ప్రకృతి రంగులకోసం
వెర్రి గాలి గుబాళిస్తూ
సాగిపోతోంది.

ఎన్ని కవితా హృదయాలు
భావోద్వేగపు చూపుల
బాణాలు విసిరినా…
ఇప్పుడు
నా మది కాలువలో
కాగితం పడవలై తేలిపోతూంటాయి

ఎదురుచూపుల్లోనే కరిగిపోయే
నా వేదాంతి నవ్వుకి కూడా
పులకించిపోతూ పుడమి.

 

* * *

భావాలు పంచుకోటానికి, ఒకరినొకరు అర్థం చేసుకోటానికి మనుషులకే భాష అవసరం. ప్రకృతిని అర్థం చేసుకోటానికి భాషకు అతీతమైన మాధ్యమం కావాలి. ఆ మాధ్యమం అందరికీ తెలీదు. తెలిసినా త్వరగా అంతుబట్టదు. ఎందుకంటే, ప్రకృతిపరంగా తనకు అర్ధమైన ఓ భావాన్ని, ఓ వేదనను, అదే ప్రకృతితో సమన్వయం చేస్తూ, జీవితానికి అన్వయిస్తూ పాఠకుల మనోభావాలను సైతం అనూహ్యంగా తన దారికి మళ్ళించి అనుభూతిని సార్వత్రికం చేయటం అంత తేలిక కాదు.

సగటు కవులైతే, ఇదే వేదనను తెగిపడిన శిరస్సులతోను, రక్త మాంసాలతోను భీభత్స, భయానక, రౌద్ర రసాలతో నింపిపారేసి ఉరి బిగించేవారే. స్వత: సిద్ధంగా కవులైనవాళ్ళే, దోసిట్లో నిండిన వర్షపు చినుకులలో గుండెను వొంపగలరు. ఆత్మీయ స్పర్శతో పూల గుండె లోతులు తడుమగలరు.  మేఘానికే కాదు, ప్రపంచానికే మరోవైపు చూడగలరు, చూపించగలరు.

ఈ కవితలో, గమ్యం తెలియని జీవితానికి ‘మేఘం’ ఒక ప్రతీక. పురి విప్పే నెమళ్ళు, గుబాళించే గాలి, పులకించే పుడమి – ప్రకృతి నుండి తీసుకున్న పోలికలే అయినా జీవితానికి ప్రతీకలే. ఇవన్నీ, కురుస్తున్న వానలో తెర మీద అందమైన అనుభవాలు పంచుతూ ఉండవచ్చు. తెర వెనుక మేఘాల  కదలికలే తెలియని కథలు చెబుతాయి.

కొద్దిసేపట్లోనే చినుకులన్నీ కురిసిపోతాయి. కొన్నిరోజుల్లోనే పూలన్నీ రాలిపోతాయి. మరో వర్షానికి మరో మేఘం సిద్ధమౌతుంది. మసక చీకట్లో మరో మొగ్గ విచ్చుకుంటుంది. మరో మనసుతో విన్నప్పుడే మబ్బుపాటలో మరో రాగం వినపడుతుంది. పూల భాషలో కొత్త భావాలు అర్ధమవుతాయి. స్థూలంగా “మేఘానికి మరోవైపు” చెబుతున్న జీవిత సత్యం ఇదే!



7 Responses to మేఘానికి మరోవైపు!

  1. March 7, 2013 at 8:26 pm

    Very neatly explained the nature of this poem Kiran garu.
    ఈలైన్ చాలా నచ్చింది “మరో వర్షానికి మరో మేఘం సిద్ధమౌతుంది”

  2. ns murty
    March 8, 2013 at 2:45 am

    సాయికిరణ్ కుమార్ గారూ,

    చక్కని కవిత్వాన్నీ, కొత్త(నాకు)కవయిత్రినీ పరిచయం చేశారు. మీరు ఉదహరించిన కవిత రసవత్తరంగా ఉంది. ఆమెకి ఏదైన బ్లాగు ఉందా అన్న విషయం కూడా అన్న విషయం తెలియజేసి ఉంటే నాలాంటి వాళ్ళకి ఆమె ఇతర రచనలు చదివే అవకాశం ఉండేది. అయినా ఫర్వాలేదు. వెతుక్కోవచ్చు. మరొక్కసారి మీకు కృతజ్ఞతలూ, అభినందనలూ.

  3. March 8, 2013 at 5:09 am

    ఇంత చక్కగా నా కవితను పరిచయం చేసినందుకు చాలా ధన్యవాదాలు కిరణ్ జీ. నాకు ఇది చాలా చాలా ఇష్టమైన కవిత.

    మూర్తి గారూ, ధన్యవాదాలు. నా బ్లాగ్ లింక్ ఇస్తున్నాను. http://rekkalasavvadi.blogspot.com

  4. Sireesha Angara
    March 8, 2013 at 8:14 am

    ప్రసూన ,
    నీ కవిత నేను ఇదే మొదటి సారి ప్రచురించాక చదవడం. చాలా చాలా సున్నితంగా ఉంది నీ మనసు లాగే.
    నువ్వు నా స్నేహితురాలివి అయ్యినందుకు గర్వంగా ఉంది రా.

  5. March 13, 2013 at 1:10 pm

    కొన్ని కవితలు చదివాక ఆ అనుభూతిలో మమేకమవ్వడం తప్ప ఆ కవిత గురించి ఇంకేమీ చెప్పలేము.. చెప్పినా ఆ కవితకి న్యాయం చేయలేమనిపిస్తుందు! ప్రసూన కవితలు నాకెప్పుడూ అలానే అనిపిస్తాయి! చదివి ‘చాలా బావుందే!’ అనుకోవడం మించి నేనేమీ చెప్పలేను..
    కానీ మీరు ఈ కవితని పరిచయం చేసిన విధానం ఆ కవితకి పూర్తి న్యాయం చేకూర్చింది, సాయికిరణ్ గారు!

    ఇది బాగా చెప్పారు!

    “ప్రకృతిపరంగా తనకు అర్ధమైన ఓ భావాన్ని, ఓ వేదనను, అదే ప్రకృతితో సమన్వయం చేస్తూ, జీవితానికి అన్వయిస్తూ పాఠకుల మనోభావాలను సైతం అనూహ్యంగా తన దారికి మళ్ళించి అనుభూతిని సార్వత్రికం చేయటం అంత తేలిక కాదు.”

  6. March 16, 2013 at 5:31 pm

    ekkediki pothundee megham..malla purudu posukovalsinde..pichi nemali munde kuganthulu veyalsinde…

  7. sasikala
    March 21, 2013 at 3:08 pm

    very nice.felt very happy to read

Leave a Reply to sasikala Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)