కథ

చరిత్రహీనులు

జనవరి 2013

ఇంత ఉద్వేగాన్ని జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు, నేను. ఆవేశం, అసహాయత, ఆత్మ న్యూనత అన్నీ కలసికట్టుగా ఒకే సారి నా మస్తిష్కం లో చొరబడి నా వ్యక్తిత్వాన్నీ, నా అభిమానాన్నీ, గాయపరచి  నడి బజారులో నన్ను నిర్వస్త్రుడిగా చేసి నిలబెట్టినట్టుగా ఒక ఘాటైన భావన. “జానకి ఎందుకిలా చేసింది? ఎలా చెయ్యగలిగింది, నా జానకి?” ఇలా, ప్రశ్నలే తప్ప జవబులివ్వలేని ఉత్తరం నా ఎదురుకుండా పడి ఉంది. ఒకటా, రెండా, ఇరవయ్యేళ్ళ అనుబంధం మా ఇద్దరిదీ. తను క్యాన్సర్ తో  గత  నాలుగేళ్లగా పోరాడుతూ  అంతిమ  క్షణాలలో హాస్పిటల్ బెడ్ మీద పడి ఉందన్న విషయం కుడా మర్చి పోయేటట్లు చేసింది ఈ ఉత్తరం. ఉదయం, మాట్లాడలేని పరిస్థితుల్లో కుడా నన్ను దగ్గరకు పిలిచి, లాకర్లో భద్రంగా ఉంచిన పాత ఫోటోల కట్టలో  ఉన్న తమ ఇద్దరి పెళ్లి నాటి ఫోటోని కావాలని కోరింది, జానకి.  నేను ఆ ఫోటో కోసం అంతలా గాలించి  ఉండక పోతే ఈ ఉత్తరం బయటపడి కాదేమో! నేను చదివింది నిజమా కాదా అన్న విషయం ధ్రుడీకరించుకుందామని మళ్ళీ చదవటం మొదలెట్టాను.

ప్రియమైన రవి,

బహుశా ఈ పాటికి మీ కోపం తగ్గి ఉంటుందని ఆశిస్తున్నాను. మీకు చెప్పకుండా హటాత్తుగా కాకినాడ వదిలి హైదరాబాద్ వచ్చేయటం ఒక అనివార్యమైన పరిణామం లానే  భావిస్తున్నాను. ఆ రాత్రిని ఒక అందమైన అనుభవంగా మన జ్ఞాపాకాలలో  పదిలం చేసుకోవాలంటే , ఇంతకు మించి మార్గం లేదు మనిద్దరికీ కూడా. నా భర్త ఎంత తిరుగుబోతైనా నేను పతివ్రతగానే ఉండాలనుకొనే ఈ సమాజాన్ని  ఎదిరించే తెగువా , అలా అని మానసికంగా దగ్గరైన మీతో సమాజం దృష్టిలో అక్రమమైన  మన సంబంధాన్ని, రహస్యంగా కొనసాగించే తెగింపు లేక ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది. ఒక బలహీనమైన మానసిక స్థితి లో, నిగ్రహం కోల్పోయి జరిగిన ఈ తప్పు, పునరావృతం అయ్యి ఒక పీడకలగా మారక ముందే ముగిస్తే, ఇరువురికీ మంచిదన్న ఉద్దేశంతో, నేను తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం మీరు సహృదయంతో అర్ధం చేసుకుంటారని  భావిస్తున్నాను.

 

ఇట్లు,

జానకి.

పోస్టు చెయ్యని ఆ ఉత్తరం లోని విషయం నా కింకా నమ్మ బుద్ది కావట్లేదు. నా జానకి కళంకిత, నా జానకి ఒక చరిత్రహీనురాలు! ఈ ఇరవై ఏళ్ళ కాపురంలో నాకు ఒక్క సారి కుడా అనుమానం రాలేదు, అంతగా నమ్మాను నా జానకిని! ఇంత వంచన చేసిందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నాకు ఈ క్షణమే వెళ్లి జానకిని కడిగెయ్యాలని ఉంది. కానీ జవాబు చెప్పే శక్తి కుడా జానకికి లేదే! కనీసం నాకు తన రహస్యం తెలిసిపోయిందన్న విషయం అన్నా తెలియాలి. తన ఆఖరి క్షణాలలో అయినా పశ్చాత్తాపపు గుర్తులేమైనా కనపడతాయేమోనని తన కళ్ళలో వెతకాలి. జానకి అడిగిన మా పెళ్లి నాటి ఫోటో, ఈ ఉత్తరం చేతిలో పట్టుకొని, ఇంటి బయట పడ్డాను. రోడ్డున వెళ్తున్న ఒక ఆటోని ఆపి హాస్పిటల్ కి పోనీమని చెప్పి నా ఆలోచనలలో మునిగిపోయాను.

ఇరవై ఏళ్ల క్రితం పరస్పరాంగీకారం తోనే మా పెళ్లి జరిగింది. మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉండే వాళ్ళం. చిన్ని గిల్లికజ్జాల మినహా పెద్దగా ఎప్పుడూ కొట్టుకున్నట్లు కూడా గుర్తు లేదు. అలా అని అన్నీ సవ్యంగా ఉన్నాయనీ అనుకోటానికి లేదు. నాకు ఆఫీసు పని కారణంగా తెగ క్యాంపుల మీద తిరగాల్సి వచ్చేది. ఆ ఒంటరితనం ఇచ్చిన అలసు వల్లో, నా బలహీనత వల్లో తెలియదు కానీ, వేరే ఆడవాళ్ళ పొందు ఆశించటం, లభించటం జరిగిపోయేవి. జానకికి తెలియకుండానే జాగర్తపడేవాడిని. కానీ ఆ రోజు రానే వచ్చింది. ఆవేశంతో నన్ను కడిగేస్తుందనుకున్న జానకి అంత కంటే పెద్ద శిక్ష వేసింది. తన మనస్సుని నా కోసం మూసేసింది. సంసారాన్ని ఒక విద్యుక్తధర్మoలాగా నిర్వర్తించటం ప్రారంభించింది. చివరికి నేనే భరించలేక తన కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి, ఇంకెప్పుడూ తప్పు చెయ్యనని మా అబ్బాయి మీద ఒట్టేశాక మళ్ళీ కొంత స్వాంతన వచ్చింది, మా కాపురంలో.

కానీ మా ఇద్దరికీ తెలుసు, ఎక్కడో ఒకరిని ఒకరు కోల్పోయామని. తరవాత పిల్లల పెంపకం లోను, వాళ్ళ చదువులతోను బిజీ అయిపోయిన మా జీవితాలలో ఏమి కోల్పోయామో కూడా గుర్తించే సమయం లేకుండా పోయింది.

 

జానకికి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోలేకపోయాను. కానీ మళ్ళీ ఎప్పుడూ జానకికి పట్టుబడలేదు. కానీ, ఇప్పుడు ఆలోచిస్తే జానకే నన్ను వదిలేసి నన్ను పట్టుకొనే ప్రయత్నం చేయలేదేమోనని అనుమానం కుడా వస్తోంది. ఏమైతేనేం! అధికారికంగా ఒక్క సారి తప్పు చేసాను, క్షమాపణ అడిగి అది కడిగేసుకున్నాను. జానకి తప్పు చేసి కుడా ఏమీ ఎరగనిదాని లాగా నటిస్తూ గడిపింది ఇన్నాళ్ళూ. తనను నిలదీయకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. దానికి సమయం కుడా ఎక్కువ మిగలలేదు.

ఆటో ఆగింది, హాస్పిటల్ ముందర. హాడావిడిగా డబ్బులు కట్టేసి జానకి రూమ్ చేరుకున్నాను. జానకి పరిస్థితి విషమించిందని, డాక్టర్ పరిశీలిస్తున్నారని చెప్పి నర్సు నన్ను బయటే ఆపింది. ఆ అద్దపు గోడ లోంచి కనిపిస్తున్న జానకి రూపం చూస్తూనే నా గుండె ఎవరో పిండేసినట్లుగా అయిపోయింది.  ఇన్నేళ్ళుగా నా కోసం, మా పిల్లల కోసం ఎంతో కష్టపడి, నా తప్పిదాలనన్నిటినీ చూసీచూడనట్లుగా పోయి, నన్ను ఇంత కాలం భరించి, అంతిమ క్షణాలలో ఉన్న,  నా జానకినా నేను నిలదీయాలనుకున్నది, అన్న ఆ భావన హటాత్తుగా నన్ను దహించటం మొదలయ్యింది. అంతే! ఒక నిర్ణయానికొచ్చేశాను. తను చేసిన తప్పు, నాకు తెలిసిపోయిందన్న విషయం, తనకు తెలియనివ్వకుండానే, తనని పంపించెయ్యటం, భర్త గా నేను నిర్వర్తించగలిగిన కనీస ధర్మం అని. ఒక్కసారిగా నా మీద నాకే ఒక తెలియనటువంటి గర్వం కలిగింది. తలుపు నెమ్మదిగా తోసుకొని రూమ్ లోకి అడుగు పెట్టాను. నేను చెయ్యబోతున్న ఈ ఒక్క పనితో, నన్ను నేను ఒక ఉత్తమ భర్త స్థాయిలో ఊహించుకుంటూ జానకి పక్కకి చేరాను. డాక్టర్ ఎక్కువ సమయం లేదని హెచ్చరించి మా ఇద్దరినీ వదలి బయటకు వెళ్ళాడు. జానకి తల నిమిరి ఫోటో చేతిలో పెట్టి తన నుదుటి పైన ఒక ముద్దు పెట్టాను. జానకి, ఎదో మాట్లాడాలి, దగ్గరకు రామ్మనట్లుగా సైగ చేసింది.

 

“నేను పోయేలోపలైనా నేను దాచి ఉంచిన ఒక నిజాన్ని మీకు చెప్పాలి…..” నాకు తేరుకొనే సమయం కుడా లేకుండానే తాను చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పి, నిశ్చింతగా కనులు మూసేసింది జానకి. నిజమైన చరిత్రహీనుడిగా మిగిలిపోయిన నేను ఆమె కాళ్ళకు ఆఖరి సారిగా నమస్కరించటం తప్ప ఏమీ చెయ్యలేని ఆశక్తుడిగా మిగిలిపోయాను.

***

 

రచయిత వివరాలు:

పేరు: శివ సోమయాజుల

కలం పేరు: యాజి

వృత్తి: సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Amazon)

నివాసం: San Francisco

సినిమా కధలు, స్క్రిప్టులు వ్రాయటం నా హాబీ. “My Heart is Beating Adola…” అని ఈ మధ్య విడుదలైన తెలుగు సినిమాకి డైలాగులు వ్రాసాను. అది కాక, రెండు షార్ట్ ఫిల్మ్స్ (Youtube) కి స్క్రిప్ట్ వ్రాసాను. “Story Lines for Tollywood” అనే ఫేస్ బుక్ గ్రూపు ని కుడా నడుపుతూ ఉంటాను. ఇది ఔత్సాహిక సినీ రచయితలను ప్రోత్సహించటానికి ఏర్పరచిన గ్రూపు.