ఇంకో పూవు

ఓ ఆలోచన… ఓ పదం… కొన్ని పంక్తులు

జనవరి 2013

కవిత్వం ఒక్కసారి పట్టుకుందంటే ఇక వదిలి పెట్టదు.
మరో లోకాలని సృష్టిస్తుంది.
మరో దృష్టిని ప్రసాదిస్తుంది.
నిజ జీవితానికి సమాంతరంగా మరో జీవితాన్ని నిర్మిస్తుంది.
మనసులో బందీ అయిన భావాల విడుదలకు మార్గాన్ని చూపిస్తుంది.
మామూలు మనుషులనుండి వేరు చేసి ఎక్కడో కూచోబెట్టి ,లేనిపోని భ్రమల్లో భ్రాంతుల్లో గిర్రున తిప్పుతూ తటాలున మళ్ళీ ఆ మనుషుల మధ్యే వదిలేసి పోతుంది.
వంట చేస్తుంటేనో,పుస్తకం చదువుకుంటుంటేనో, ఇంకేదో పని చేస్తుంటేనో లేక ఊరికే ఖాళీగా కూచుని కిటికీలోంచి చూస్తున్నా గబుక్కున ఏదో తడుతుంది.
ఓ ఆలోచన.
ఓ పదం.
కొన్ని పంక్తులు.
వెంటనే దాన్ని కాగితం మీద రాసుకోకపోతే ఎగిరి వెళ్ళిపోతుంది కాబట్టి వెంటనే ఏదో ఒకచోట రాసేసుకోవాలి.
ఇక అక్కడినించి ఆ పదమో పంక్తులో నన్ను, మమ్మల్ని కవితగా మార్చు మార్చు అని వెంటబడతాయి.
చెవి దగ్గర రొద పెడతాయి.
చేతి వేళ్ళ మీద వాలి రెక్కలార్చుతాయి.
అప్పుడు మళ్ళీ ఎప్పుడో కొత్త పంక్తులు, పదాలు మళ్ళీ గాలిలో అలా అల్లా తేలి వచ్చి కళ్ళ ముందు నిలబడతాయి.మమ్మల్నీ పాతవాటితో కలిపి అల్లమని.
ఇలాగే రోజులు గడుస్తాయి.
అర్ధ రాత్రో,తెల్లవారు ఝామునో,వెచ్చని మధ్యహ్నమో,చల్లని సాయంత్రమో కొత్త కొత్త కవితా పాదాలు తేలుతూ తేలుతూ వచ్చి పాత వాటికి అల్లుకుని,సొగసుగా చుట్టుకుని , చివరికి ఎప్పుడో పూల జడలాంటి కవిత ఒకటి ప్రత్యక్షమైతే
పది రోజులనుండి తిండి లేని మనిషి చేతిలో ఒక బుట్టెడు నేతి గారెలు పెట్టినట్టు, చిక్కి శల్యమైన ఋషికి భగవంతుడు ప్రత్యక్షమై జున్ను ముక్కలు తినిపించినట్టు బ్రహ్మానందం కలుగుతుంది.
ఎందుకింత ఆనందం? దీనివల్ల దమ్మిడీ ఆదాయం లేదే అని బుద్ధున్న వాళ్ళు ఎవరైనా అడగొచ్చు.
దమ్మిడీలు ఇచ్చే ఆనందం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆనందం.
ఇక మోక్షమే తరువాయి అన్నంత పారవశ్యం.
ఎందుకూ అంటే కవులైతేనే చెప్పగలరు.
కాగితాలు ముందేసుకుని,అటూ ఇటూ పచార్లు చేస్తూ,తేనీటి పొగల మధ్య రాసుకుంటూ దిద్దుకుంటూ గడిపే కవులైతేనే అనుభవించగలరు.

పిచ్చి వాడిని పిచ్చివాడు గుర్తించ లేక పోవచ్చు.కాని కవిని మాత్రం ఇంకో కవి ఇట్టే పోల్చుకోగలడు.