ఇరుగు పొరుగు ఆకాశాలు

అన్నా అఖ్మతోవా

మార్చి 2013

ఆనా ఆఖ్మతోవా (23 జూన్ 1889 – 5 మార్చి 1966) రష్యన్ సాహిత్యంలో ప్రముఖ కవయిత్రి. ఆమె అసలు పేరు ఆనా అండ్రెయేవ్నా గోరెంకో. 11 ఏళ్ల ప్రాయం నుండి కవిత్వం రాయడం మొదలెట్టారు. కవిత్వం మూలాన, ఇంటిపేరుకు అపకీర్తి తీసుకురావద్దన్న తండ్రి కోపానికి, పదెహేడేళ్ల ప్రాయంలోనే, ఆనా ఆఖ్మతోవా గా మార్చుకున్న పేరే చివరివరకు స్థిరపడిపోయింది. ఆ పేరు ఆమె తల్లి ముత్తాతది. అప్పుడొస్తున్న కవిత్వంలోని గూఢత్వం, అస్పష్టత, సాంకేతికత, కృత్విమత్వాన్ని నిరసిస్తూ, సౌందర్యం, స్పష్టత, సాంద్రత, సరళత, సమగ్ర రూపంతో కూడుకున్న విభిన్న కవిత్వానికి ఆద్యుడైన నికోలయ్ గుమిల్యొవ్ ని 1910 లో వివాహం చేసుకున్నారు. 1918 లో విడాకులూ తీసుకున్నారు. వారికి ఒక కొడుకు లెవ్ గుమిల్యొవ్.

రష్యన్ విప్లవం మూలాన ఆమె జీవితంలో అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్నో కష్టాలు పడాల్సొచ్చింది. 1921 లో ఆమె భర్త దేశద్రోహం కింద, బోల్షెవిక్ల ద్వారా మరణశిక్షకు గురయారు.. 1938 లో కొడుకు నిర్బంధించబడ్డాడు. 1956 వరకూ అనేక మార్లు అనేక కారాగారాల్లో ఉంచబడ్డాడు. రష్యన్ ప్రభుత్వం, దోషులుగా పరిగణించిన వారి సంతానం కావడమే అతని అసలు నేరం. స్టాలిన్ ప్రభుత్వం ఆమెను శతృవుగా భావించి, ఆమె రచనల్ని 1925 నుండి 1940 వరకు నిషేదించింది.

ఆమె అతి ముఖ్యమైన కవిత REQUIEM ‘శ్రద్ధాంజలి’. స్టాలిన్ సమయంలొ స్త్రీల దురవస్థని – ఆమెతో బాటు జైలు బయట, అత్యంత దుఃఖంతో ఓపికగా నిస్సత్తువగా, వారి కోడుకుకోసమో, భర్తకోసమో, ప్రేమికుడికోసమో రొట్టె ముక్క అందించాలనో, చూడాలనో, చిరు సందేశం కోసమో గంటలకొద్దీ వేచి ఉన్న వైనాన్ని, ఒక స్త్రీ దృష్టితో కళ్లకు కట్టినట్టు వర్ణించిన అద్భుతమైన కవిత అది. ఈ కవిత 1935 నుండి 1940 మధ్య కాలంలో రాసింది. స్టాలిన్ బతికుండగా 1940 ప్రాంతంలో అది వెలుగు చూడడం, ఎంత ప్రమాదకరమో ఆమె గుర్తించి ప్రచురణకు పంపనేలేదు. స్టాలిన్ బాధితులకు ఆ కవిత అంకితమిచ్చారు. మ్యూనిక్ లో మొదటిసారిగా 1963 లో బయటి ప్రపంచం వెలుగు చూసింది. 1987 వరకూ ఈ దీర్ఘ కవిత రష్యాలో ప్రచురించబడనే లేదు. ఈ దీర్ఘ కవిత పది ఖండికలుగా రాయబడింది. వేదన నిస్పృహల మూలాన, అప్పటి ఉద్విగ్న క్షణాల్ని ఒక్కో ఖండికలో అతి సున్నితంగా పట్టుకోగలిగింది. నిజానికి ఈ కవిత పరిచయంతో బాటు, పదిహేను చిన్న కవితల వలయం, ఒక అనుక్రమం. ఆమె రచనల్లో సర్వోత్తమమైన బాధల స్మృతి కావ్యం. అంతకుముందు ప్రేమ కవిత్వం రాసిన ఛాయలెక్కడా ఇందులో కనపడవు. అక్కడక్కడ బైబిలు సంబందిత విషయాలు, శిలువ వేయటం, జీసస్ తల్లి మేరీ లాంటివి కనిపిస్తాయి. ఈ కవితతో బాటు, మరో దీర్ఘ కవిత Poem Without a Hero (నాయకుడు లేకుండా కవిత) ని కూడా ప్రముఖంగా చెప్పుకుంటారు. ఆమె కవితలన్నింటితో 1990 లో ఒక సమగ్ర సంకలనం The Complete Poems of Anna Akhmatova కూడా వెలువడింది.

1918 లో వివాహమాడిన వ్లాదిమిర్ శిలైకో ని 1928 లో విడాకులిచ్చింది. ఆ తరువాత వివాహమాడిన నికోలై పునిన్, సైబేరియన్ శిబిరంలో 1953 లో చంపబడ్డారు. నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ జీవాగో రచయిత బోరిస్ ఫాస్టర్నక్ వివాహితుడైయుండి కూడా ఆమెకు అనేకమార్లు పెళ్లి ప్రతిపాదన పంపారు. ‘బోరిస్ పాస్టర్నక్ కోసం’ అని ఒక కవిత కూడా ఆమె రాసారు. మరో నోబెల్ కవి జోసెఫ్ బ్రోడ్స్కీ కి రష్యాలో అదేవిధమైన కష్టాల్లో ఉన్నప్పుడు, అతనికి ఆమే ఒక పెద్ద దిక్కు.

విక్టర్ హూగో, రవీంద్రనాథ్ టాగోర్, గీకొమో లియోపర్డి, వివిధ ఆర్మేనియన్, కొరియా కవుల్ని అనువాదం చేసారు. ప్రతీకాత్మక రచయిత అలెక్సాండ్ర్ బ్లోక్, చిత్రకారుడు ఆమెడియొ మోడిగ్లియాని, తోటి కవి ఓసిప్ మండెల్ స్టాం జ్ఞాపకాల్నీ రాసారు.

1965 లో ఆమెకు ఆక్స్ ఫర్డ్ విశ్వవిధ్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది.

తనకోసం ఒక స్మృతి చిహ్నం నెలకొల్పుతారేమోనన్న ఆశ ఈ కవిత ‘శ్రద్ధాంజలి’లో కనిపిస్తుంది. ఆటువంటిదేమీ జరగకపోయినా , ప్రపంచ వ్యాప్తంగా ఈ కవితే ఆమెకు స్మృతి చిహ్నంగా మిగిలిపోయింది.

శ్రద్ధాంజలి
పరాయి ఆకాశం ఏదీ నన్ను కాపాడలేదు
అపరిచిత రెక్కలేవీ నా మొహాన్ని కప్పలేదు
ఆ సమయంలో, ఆ ప్రదేశంలో బ్రతికిపోయి
సామాన్య ప్రజల సాక్షిగా నేనున్నాను

ముందుమాటకు బదులు
భయంకరమైన యెజోవ్ భీతిగొల్పే సంవత్సరాల్లో, నేను పదిహేడు నెలలు లెనిన్ గ్రాడ్ కారాగారానికి ఎదురుగా బయట వరసలో వేచి ఉన్నాను. ఎవరో గుంపులో ఒక రోజు నన్ను గుర్తించారు. నా పేరుతో నన్ను పిలవడం ఎప్పుడూ వినని, చలికి నీలంగా మారిన పెదాలతో, నావెనక నిలుచున్న ఒకామె, మాకందరికీ సాధారణమైన తిమ్మిరిలోనే రహస్యంగా నన్నడిగింది (అక్కడ అందరూ రహస్యంగానే మాటాడుకుంటారు):
“ఇది నువ్వు వివరించగలవా?” అని.
“వివరించగలను” అన్నాను
ఆమె మొహం మీద అంతకుముందు లేని, నమ్మలేని ఒక చిర్నవ్వులాంటిదేదో , అప్పుడామెని దాటుకుంటూపోయింది.

అంకితం
ఆ దుఃఖం బహుశా కొండల్నీ ఒంచుతాయి
ప్రవహించే నీటిని వెనక్కి మళ్ళిస్తాయి
కానీ కఠినమైన ఈ గడియలు పగలవు
కిక్కిరిసిన మానవ దుఃఖంతో ఉన్న
జైలు గదుల్నుండి మాకు అవి అడ్డంపడతాయి
గాలి స్వేచ్చగా కొందరికి వీస్తుండొచ్చు
సులువుగా సూర్యకాంతి కొందరికి క్షీణిస్తుండొచ్చు
కానీ మా భయానికి భాగస్వాములైన మేము
వినేది మాత్రం, తాళాల గీకుడు
బరువైన సైన్యం బూట్ల చప్పుడు
వేకువ ప్రార్ధనల కోసంలా గుంపుగా లేచి
మేము ప్రతీరోజూ నిశ్శబ్ద వీధులు, మలుపుల గుండా
చావడంకంటే కాస్త బతకడానికి, నిర్జనప్రదేశాల నడుస్తాం,
సూర్యు డు అస్తమించాక, నేవా నది అస్పష్టంగావుంది
నమ్మకం అనంతంగా ఇంకా గానం చేస్తూనే ఉంది.
ఎవరికి శిక్ష నిశ్చయించబడింది? … ఆ మూలుగు,
హఠాత్తుగా ఉబుకుతున్న స్త్రీ కన్నీరు,
తతిమావారికంటే విలక్షణం
ఆమెను వాళ్లు కిందికి తోసేసినట్టు,
ఆమె హృదయాన్ని బలవంతంగా లాక్కుపోతూ,
తలతిరిగేట్టు, ఆమె మానాన ఆమెను వదిలేసినట్టు -

నరకంలో నేను రెండేళ్లబాటు గడిపినప్పటి
నా అనామక మిత్రులు ఇప్పుడెక్కడున్నారు?
సైబేరియన్ మంచు తీవ్రతల మధ్య
చీడబట్టిన చంద్రవృత్తాలలో
ఏ దెయ్యాలు వాళ్లని వెక్కిరిస్తున్నాయిప్పుడు
వారికోసం నేను రోదిస్తాను,
సలాం, శలవు!

ప్రస్తావన
యుద్ధం నుండి విముక్తి పొంది
ఆ రోజుల్లో కేవలం నిర్జీవులే నవ్వేగలిగేవాళ్లు.
లెనిన్ గ్రాడ్ ఆనవాలు, ఆత్మ,
దాని చెరసాలకు బయట వేలాడేది;
దండించబడిన సైనికదళం
రైలింజను ఈలపాటకు ముడుచుకుని
మందలా ఇనుపదారి ఆవరణలో
జరగాల్సొచ్చేది “యజమానిలేని కుక్కల్లా, దూరం , దూరం”.
మాపైన మృత్యు నక్షత్రాలుండేవి
ప్రియమైన అమాయక రష్యా
కరకరమని నమిలే రక్తసిక్తమైన బూట్లకింద
నల్లని మారియాస్ చక్రాలకింద నలిగిపోయేది

1
వేకువజామునే వాళ్లొచ్చి నిన్ను తీసుకుపోయారు.
నువ్వు నాకు మరణించినట్టు: నేను వెనకెనక అనుసరించాను.
చీకటి గదిలో పిల్లలు ఏడుస్తున్నారు,
పవిత్రమైన కొవ్వొత్తి కొనవూపిరితో ఉంది
ప్రతిమ ముద్దుకి నీ పెదాలు చల్లబడ్డాయి
కనుబొమలమీద చెమట పూసింది – అవి మృత్యు పుష్పాలు!
రెడ్ స్క్వేర్ లో వట్టిపోయిన గుర్రపురౌతు భార్యల్లా
క్రెంలిన్ బురుజుల కింద నేను నిల్చుని అరుస్తాను

2
సాధువైన డాన్ నది శాంతంగా ప్రవహిస్తుంది;
పచ్చని చంద్రకాంతి నా ఇంటిలోకి జారుతుంది.

దాని వంకర మూతితో, గడప దాటి,
ఆ పచ్చ చంద్రుడి నీడకు, ఆశ్చర్యంతో ఆగుతుంది.

పెద్దెముక రోగంతో పడున్న ఈ స్త్రీ,
బొత్తిగా ఒంటరిది.

మరణించిన భర్త,
కటకటాల్లో దూరంగా కొడుకు.
నాకోసం ప్రార్ధించు,
ప్రార్ధించు.

3
కాదు, నాది కాదు, అది మరొకరి గాయం
నేనైతే ఎన్నటికీ భరించలేకపోదును
అంచాత జరిగినదాన్ని తీసుకుపోయి, దాచి, భూమిలో పాతి
విసిరేయ్ దీపాల్ని అవతలికి …
రాత్రి

4
వాళ్లు నీకు హాస్యగాడ్ని చూపించి ఉండాల్సింది,
మిత్రుల హర్షం, హృదయపు దొంగ,
పుష్కిన్ నగరం కొంటె పిల్లని -
విధివశమైన సంవత్సరాల నీ ఈ చిత్రాన్ని
నువు నిల్చున్న కోపదృష్టితో ఉన్న గోడ కింద,
దరిద్రులు, మూడొందలమంది వరసలో,
నీ చేతిలో మూటను గట్టిగా పట్టుకుని,
నీ కన్నీళ్లు, కొత్త సంవత్సరపు మంచుని కరిగిస్తున్నాయి
చూడక్కడ, జైలుచెట్టు ఒంగుతోంది
శబ్దం లేదు, శబ్దం లేదు, అయినా ఎంతమంది
అమాయక ప్రాణాలు అంతమవుతున్నాయి

5
నీ ఇంటికి నిన్ను రమ్మంటూ, పదిహేడు నెలలుగా
నేను గట్టిగా ఏడుస్తూనే ఉన్నాను.
నేను ఉరితీసేవాడి కాళ్లమీద పడ్డాను
పీడకలగా మార్చబడ్డ నువ్వు నా కొడుకువన్నాను.
ప్రపంచాన్ని గందరగోళం ఆక్రమించాక,
చెప్పే శక్తి నాకు లేదు.
ఏదోకొంత మానవత్వంనుండి ఎవరో కౄరుడు
లేదా “చంపు” అని ఏరోజు చెప్పబడుతుందో
ధూళిపూలు తప్ప అప్పుడు ఏవీ మిగలవు

గలగలమను ధూపకలశం శబ్దాలు,
ఎక్కడకీ తీసుకుపోలేని కాలి గుర్తులు.
పాషానపు రాత్రి భారీ నక్షత్రం,
నా కళ్లలోకే తేరిపార చూస్తూ అంటోంది
మరణం తధ్యం,
అవును తోందర్లోనే అని.

6
మస్తిష్కం నుండి ఎగిరిపోయిన వారాలు
గడిచిపోయాయంటే నాకూ నమ్మకం కుదరడం లేదు:
నీ కారాగారంలోకి ఎలా బిడ్డా,
జ్వలిస్తూ, తేరిచూస్తూ, తెల్ల రాత్రులు;
నేను శ్వాస తీసుకునేలోగా
వారి డేగ కళ్లతో వాళ్లూ చూస్తారు.
ఈ మర ణించిన నీ శరీరానికి
ఉన్నతమైన శిలువ ఏమి చూపిస్తుందోనని

7
తీర్పు
ఇంకా సజీవంగా ఉన్న, హృదయం మీద
అప్పుడే రాయిలాంటి మాట.
అంగీకరిస్తున్నాను,
నేను సిద్ధపడే ఉన్నాను,
ఎలాగోలా దానికి సర్దుకుని నిబాయించుకుంటాను.

నేడు చేయాల్సినవి చాలా ఉన్నాయి
జ్ఞాపకాల్ని తుడిచేయాలి బాధను చంపేయాలి
గుండెను రాయి చేసుకోవాలి
అయినా మళ్లీ బతకడానికి సన్నద్ధం కావాలి

పూర్తిగా కాదు. వేసవి కాలపు విందు
తప్పతాగినట్టు పుకార్లు తీసుకొస్తాయి
చాన్నాళ్ల ముందునుండే నాకు తెలుసు
ఈ ప్రకాశవంతమైన రోజు, ఈ ఖాళీ ఇల్లు?

8
మృత్యువుకు
ఎలా అయినా నువ్వొస్తావు, అది ఇప్పుడే ఎందుకు కాకూడదు?
ఎన్నాళ్లు నేను వేచి వేచి చూడాలి. చెడు రోజులు తొలగిపోతాయి.
నీ కోసం దీపం ఆర్పేసాను, తలుపులు తెరిచాను
నీకు నచ్చిన ఏ ఆకృతిలోనైనా మారి,
గురి చూసి, విషపురిత ఫిరంగితో నన్ను పేల్చు
లేదా సమర్దుడైన బందిపోటులా గొంతుపిసుకు
లేదా రోగం అంటించు – పూర్తీ విషజ్వరమేనా కానీయ్
లేదా నువు రాసిన కాల్పనిక కథలోంచి బయటపడేయ్
అదే రాత్రీ పగలూ వినీవినీ విసుగొచ్చి
టోపీమీద నీలం నాడా దళం
ముందున్న తెల్లమొహం రక్షకుడితో, మెట్ల వరకూ ఎలా అయితే కవాతు చేస్తోందో,
నేనూ అంతే.
యెనిసెయి నది వడివడిగా ప్రవహిస్తోంది
అనంతంగా మెరిసేటట్టు ధ్రువతార మెరుస్తోంది ;
నేను ప్రేమించినవారి కళ్లల్లో నీలంకాంతి
చివరి ఘోరానికి మసకబారుతోంది.

9
ఇప్పటికే ఉన్మాదపు రెక్క లేస్తోంది
నా సగం ఆత్మని కప్పడానికి.
మత్తెక్కించే ఆ మద్యపు రుచి!
చీకటి లోయ లంచం!

ఇప్పుడు ప్రతీవిషయమూ స్పష్టమే.
నా పరాజయాన్ని నేను అంగీకరిస్తున్నాను.
నా చెవిలో వెర్రికూతలు కూసే నా నాలుక
అపరిచితుని నాలుక

నా మోకాళ్లమీద నిలబడి
దయచూపించమని వేడుకోవడం వ్యర్ధం
నాది అని తీసుకుపోయేందుకు
ఏదీ నాదనుకోలేదు నా జీవితంలో

నా కొడుకు భయంకర నేత్రాలూ కాదు
వ్యాపించిన రాతి పూవు దుఃఖమూ కాదు
ముట్టడించే రోజూ కాదు,
సందర్శించే సమయాల విచారణా కాదు,

వాడి ప్రియమైన చేతుల చల్లదనమూ కాదు,
కలవరపెట్టే నిమ్మచెట్టు నీడా కాదు,
కీచురాయి బలహీన శబ్దపు
వీడ్కోలు మాటల ఓదార్పూ కాదు

10
శిలువ వేయటం (చిత్రవధ)
‘ నేను నా సమాధిలో ఉన్నపుడు
అమ్మా నాకోసం ఏడ్వద్దు ‘

I
దేవదూతల గాయకగణం సమయాన్ని కీర్తిస్తున్నాయి
స్వర్గసొరంగం మంటల్లో కరిగిపోయింది
“తండ్రీ, నీవు నన్ను ఎందుకిలా వదిలేసావు?
తల్లీ, నిన్ను ప్రాదేయపడుతున్నాను , నాకోసం ఏడ్వద్దు …”

II
మేరీ మాగ్డలిన గుండెలు బాడుకుని ఏడ్చింది,
అతని ప్రియ శిష్యుడు రాతి మొహంతో రెప్పవాల్చలేదు.
అతని తల్లి, దూరంగా నిల్చుంది. ఎవరూ ఆమె
రహస్యకళ్లలోకి చూడలేదు. ఎవరూ సాహసించలేదు.

ఉపసంహారం
I
మొహాలు ఎముకల్లా మారతాయని నేను చదివాను,
వణికే భయం శుష్కించిన నవ్వుల్లో.
కనురెప్పలకింద భయం ఎలా దాగుంటుందో
బుగ్గలమిద దుఃఖం ఎలా రాసుంటుందో
ఉలితోచెక్కిన గట్టి రాతల గీతలు,
ఎలా నిగనిగలాడుతూ నల్లబడతాయో లేదా
బూడిదరంగు తాళాలు రాత్రికిరాత్రే
కళతప్పిన వెండిలా మారిపోతాయో,
లొంగిన పెదాల నవ్వులు ఎలా వాడిపోతాయో -
నా ఒక్కరి కోసమే నేను ప్రార్ధించడం లేదు ..
గుడ్డిదైన ఎర్ర గోడకింద, జైలు బయట
కృరమైన చలిలోనో లేదా ఎండాకాలపు మంటల్లోనో
నాతోబాటు నిల్చున్న అందరికోసమూనూ.

II
ఏడాది గడిచేసరికి స్మృతి ఘడియ తిరిగొస్తుంది
నేను చూస్తాను, నేను వింటాను, దగ్గరకు తీసుకుని నిన్ను స్పర్శిస్తాను

ఈ విలువైన భూమిమీద ఇంకెప్పుడూ నడవలేని కాపలావాని పందిరి
మేము సాయపడాలనుకున్నదానిలో ఒకటి.

అందమైన జుత్తుని ఆమె ఎగరేస్తూ
“ఇది సరిగ్గా మళ్లీ ఇంటికి రావడం లాంటిది” అనే వారిని

నాకు ఆ అతిధుల అందరి పేర్లూ చెప్పాలని ఉంది
కానీ ఆ జాబితాని వాళ్లు లాక్కున్నారు, ఇప్పుడది పోయింది

నేను విన్న అల్ప పదజాలంతో
వారికి ఒక బట్ట నేశాను

కొత్త దుర్దశలో సైతం నా అన్ని దినాలూ
ప్రతీ పదాన్నీ చూసి పట్టుకు వేలాడతాను

హింసించబడ్డ నా నోటిని మూసేసినా
దాని ద్వారానే వందల వేలమంది అరుస్తారు

స్మరించుకునే ఈ దినాన వారిని నా కోసం ప్రార్ధించనీ,
వారి కోసం నేను ప్రార్ధిస్తున్నట్టు.

నే దేశం ఎప్పటికైనా నా పేరుమీద
ఒక స్మృతిచిహ్నాన్ని తయారుచేస్తే,

స్మృతిచిహ్నమే గనక నెలకొల్పుతే
నా జ్ఞాపకాన్ని గౌరవించినందుకు గర్వపడతాను

నేను కళ్లు తెరిచినప్పటి సముద్రానికి దగ్గర కాదు
సముద్రంతో నా చివరి సంబంధం ఎప్పుడో తెగిపోయింది –

లేక పవిత్రమైన మోడుకు దగ్గర త్సార్ తోటలో, ఎక్కడో
ఒక గాయపడ్డ నీడ నా శరీర వెచ్చదనం కోసం వెతుకుతుంది

కానీ ఇక్కడే, ఇక్కడే అనివార్యమైన ఇనప ఊచల ముందు
మూడువందల గంటలు నేను వరసలో నిల్చునే ఉన్నాను

ఎందుకంటే ఆహ్లాదకరమైన మృత్యువులోనైనా నాకు అనుమానమే
నల్ల మారియాస్ నది ప్రతిధ్వని కోల్పోతుందేమోనని

లేకపోతే ఆ రోతైన గేటు మోత
గాయపడ్డ మృగంలా పాత ముసలి కూత

నా నిశ్చలమైన కంచు మూతల గిన్నెనుండి కరుగుతున్న మంచు,
కన్నీరులా, బొట్లు బొట్లుగా నెమ్మదిగా కారనీ

ప్రవహిస్తున్న నేవా నదిలో పడవలు మెత్తగా సాగుతూ ఉంటే
జైలు పావురం ఎక్కడో మళ్లీ మళ్లీ కూయనీ