కవిత్వం

ఒక ఇసుక దారి

15-మార్చి-2013

నేను నడుస్తున్నప్పుడల్లా
నా పాదాల్ని అడుగుతాను

దారి నిన్ను చిరునవ్వుతో పలకరించిందా
ప్రేమగా ముద్దు పెట్టుకుందా

నీ పాదాల కింద దారి ఏమేమి పరిచి వెళ్ళింది
సుతి మెత్తని మంచుపూల పరిమళాల్నా
రాకాసి ముళ్ళ వనాల్నా, లేక
మనుష్యులు ఇక్కడ తమ జ్ఞాపకాలుగా
వదిలి వెళ్ళిన గులక రాళ్ళనా,

బతికి వున్నందుకు గుర్తుగా
భూమి తన ఉశ్వాస నిశ్వాసాలతో
నిన్ను వెచ్చగా చుట్టుకుందా?
ఎన్నెన్ని ప్రవ్నల జడివానలో
అలసి పాదాలు ఆగిపోతాయి

కానీ, దారి మాట్లాడినట్లు
అవి ఎన్నడూ, ఒక తీయని కబురునో
దాని ఆత్మ సందేశాన్నో చెప్పలేదు నాకు

ఇప్పటి వరకు ఎవరి పాదాలతో నన్నా
దారి మాట్లాడిందేమోనని దిగులుగా వెదుకుతాను
చెరగని పాద ముద్రల్ని ప్రేమగా తడుముతాను
మన అనాది ఆశల ఆకాశం నుండి
తెగిపడిన ఒక కలల ఇసుక మేఘపు
ముసుగు, మనల్ని కమ్ముకుంటుంది
ఒక ఇసుక దానిని, అది మనముందు పరిచి ఎగిరిపోయింది
నడుస్తున్నాం నడుస్తున్నాం
వందల ఏళ్ళుగా,పాతిక ,పదేళ్లుగా
కదలని మృతశిశువులా, దారి అట్లానే వుంది

గాలిని మోస్తూ మనుషులే కదులుతారు
ముందుకు, మునుముందుకు
తూర్పు పవనాన్నో, వేసవి వడగాల్పులనో
మలయమారుతాన్నో, తుఫాను నాటి పెనుగాలి కెరటాల్నో
మోసుకుంటూ, మనుష్యులే కదులుతారు
మెలమెల్లగా, గుంపులు గుంపులుగా, వంటరిగా
పూలదారులగుండా, పచ్చిక మైదానాల గుండా
సముద్రతీరాల గుండా, అడవి అంచుల గుండా
పర్వత సానువుల గుండా, బురద నేలల గుండా
మనుష్యులం మనమందరం అట్లా నడుస్తూనే వున్నాం

దారిపక్కన నిలబడిన పర్వత శ్రేణులన్నీ
అనాదిగా ఘనీభవించిన మనుష్యుల కన్నీటి చుక్కలు కాబోలు
మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన మనుష్యుల జాడలు
భూమి అడుగు పొరల్లోనో, బూడిద రంగు మేఘాల్లోనో
ఇంకా అట్లానే ప్రశ్నార్థకాల్లా మిగిలే వుంటాయి కాబోలు

దారి నుండి కొంచెం పక్కకు జరిగిన తర్వాత
గాలితో గుసగుసలాడుతాను
ఈ దారిన నడిచిన ఒక్కొక్కరికీ నువ్వు
మరల మరల పట్టుకొచ్చిన సందేశం ఏమిటని
నడక సాగే సమయాన
దారి మన పాదాలతో
ఇంకా సంభాషణ ప్రారంభించలేదనే సత్యం
గాలి చెబుతున్న నిజం
మనకి వినపడలేదెన్నడూ

దారి వదిలి పెట్టాకే
నిజాల్ని మనం అసలు ఎన్నడూ వినదలుచుకోలేదని
వినయంగా ఒప్పుకుంటాం