కవిత్వం

మాతృ వాక్యానికి ఆనవాళ్ళు లేవుగా!

15-మార్చి-2013

ఇప్పుడిక్కడంతా
ప్రమాద సూచికల కందని
మానవ మృగ సంచారం
జ్ఞాపకాలు పూయడం మానేసి
గర్భశోక ఆర్తనాదాల కచ్చేరీలు జరుగుతున్నాయి
అర్ధ్హాంతరంగా తెగిన మానవత్వం
మనిషి తనాన్ని వెక్కి రిస్తూ వెళ్తుంది.
బ్రతుకు బ్రతుకంతా రక్త స్రావమే ..
ఆడపిల్ల నిర్భయంగా తిరుగలేని తనం .
“ఇప్పుడు స్త్రీ మూర్తులంతా
శిలలుగా మారితే తప్ప శోకం తీరదా ?”
నిత్యం ఎవరి లోకం వారిది
ఢిల్లీ నగరం తన ఆదిమ వాంఛను ఇంకా మరువలేదు
అంతా మన వాళ్ళే
అందరూ మనుషులే
ఆనవాళ్ళు కనిపించని కొన్ని మానవ మృగాలు..అంతే..
ఎవరో ఒకడు
ఎక్కడో ఒక చోట
మాంసం మరిగిన మృగం మల్లే
బ్రతుకుల్ని చిదిమేస్తూ
నిర్భయంగా ..
అవశేషాల మాలికల్ని ధరించి తిరుగు తున్నాడు.
అసహ్యించు కొని ప్రపంచాన్ని చూడకుండా కళ్ళు మూసుకుంటే
కాలి పోతున్న నాగరికత మరలా తట్టి లేపుతుంది.
నిజమే ,ఇప్పుడు మాతృ వాక్యానికి ఆనవాళ్ళు లేవుగా
ఎందుకంటే ,స్త్రీ దేవతా మూర్తులు కూడా
గుడిని వదలి జనం లో ఊరేగడానికి
భయ పడ్తున్న రోజులు కదా?
అవును,నిజమే,ఇప్పుడు
నమోదవుతున్న మనిషి చరిత్ర అంతా రక్త చారికల మజిలీ లేగా…??