కవిత్వం

ఇహ ఇంతే

15-మార్చి-2013

గాలి రెక్కల మీద వెన్నెల పరచుకుంటూ
ప్రవహించే స్వప్న సీమ
తేలిపోతున్న మబ్బు తునకలను తీగలు తీగలుగా
సాగదీసి
ఊపిరి వీవనతో మణిప్రవాళం పలికించే మనసు
పండి ఎండిన దూది మొగ్గల్లా ఒక్క అదాటున పేలి
ఏ తీరాలకో విసిరేసినట్టున్న చెల్లా చెదరయే విహ్వాలత్వం

దిగులుపడి మునగదీసుకున్న గడ్డకట్టిన నది
మౌనం మంచుముక్కైన నా అస్తిత్వం పైన
ఇవన్నీ ఒకే మారు దాడికి దిగేవేళ
నులి వెచ్చని పరామర్శ తొలకరింపు లో కరిగి కరిగి
కనురెప్పల వెనక అతలాకుతలమవుతూ

చెలియలి కట్టదాటని కడలిని
ముని వేళ్ళతో పెదవులపై అద్దుకు
ఎన్ని మూర్ఛనలు ఎన్ని
పరిమళ భరిత ఉషోదయాలు అక్షరాలుగా
అపురూప శిల్పాలుగా చెక్కుకున్నానో

లోలోపలే వెల్లువలై దహించి వేసే దుఃఖజ్వాలలనూ
సుతి మెత్తని జలతారు తలపై పోటెత్తే సునామీలకూ
పెదవుల వెనక పగ్గం వేసి
గుండె తడి ఆరని మైనపు బొమ్మనైనానో

ఎవరికైనా తెలుసా

ఇహ ఇంతే ఎదురు చూపుల పెనం మీద
ఎగిరెగిరిపడే నువ్వు గింజలా