కవిత్వం

వెలితి లేని వెన్నెల

జనవరి 2013

ఆలోచనలు మేల్కొన్న వేళ
ఒక వెలితి పలకరించింది
కలలు ఖాళీ చేసిన జాగా లాగ
మాటలపై అలిగిన మౌనం లాగ!

అనుభవాల్ని కొలుస్తున్న జీవితం
భావాల్న్ని మోస్తూన్న హృదయం
ఊహల మేడలు కట్టే మనసూ
ఇదో అంతరంగ మహరాజ మందిరం!

నాతో నేను చర్చిస్తున్నా
నాతో నేను స్నేహిస్తున్నా
నాతో నేను కోపిస్తున్నా
నాతో నేను ‘నా’కై ఎదురు చూస్తున్నా!

అనుకోని అతిధిలా నీవొచ్చిన వేళ
ఆ ఒక్క క్షణం కాలంలా కరిగింది!
ఊహలన్నీ తమను తామే తుడిచేసి
నీవిచ్చిన వెన్నెల్లో ఆత్మ సమర్పణమయ్యింది!

అర్థం అయిన వేదాంతమా
ఆర్తి లోని హృదయమా
లాలించే జీవన రహస్యమా
రహస్య క్షణాల ఆనందమా???

సంశయాలన్నీ సమాప్తమైన చోటే
సౌందర్యం పరిమళిస్తుంది
గుండె చప్పుడై వినిపించే నీతోనే
ప్రతి క్షణమూ సంగీతమవుతుంది

కలవాలని వున్నా
రాతిరికి ఉదయం దూరమే
తరగని దూరాలు కొలుస్తున్నా
తారా ధూళి నింపేది ఆకాశమే

నాకు నేనే ఒక ఉదయమయ్యాను
నీ ఆకాశంలో అనంతమయ్యాను
నన్ను నేను చూసుకున్న అద్దంలా
నాలోని నీలోనూ నేనే…

వెలితి లేని వెన్నెలని చూస్తున్నా
జ్ఞాపకపు దుప్పటి కప్పుకున్న గుండె
రెప్పల డిబ్బీల్లో దాచుకున్న కలలూ
దోసిట్లో పోగేస్తున్న నవ్వుల నావలూ.. ఆ వెన్నెలవే!