కరచాలనం

తెంపులేని దేవులాటే నా సాహిత్య విమర్శ: కాసుల ప్రతాపరెడ్డి

ఏప్రిల్ 2013

కాసుల ప్రతాప్ రెడ్డి నిక్కచ్చిగా మాట్లాడే సమకాలీన సాహిత్య విమర్శకుడు. ఎట్టి స్థితిలోనూ నీళ్ళు నమలడం అతని వల్ల కాదు. మొహమాటంగా మాట్లాడడం అంటే ఏమిటో తెలీదు. చాలా నిర్మొహమాటంగా నిష్టగా తన అభిప్రాయాల్ని పంచుకోవడం ప్రతాప్ విమర్శ మార్గం. ఈ ఏడాది అతని విమర్శ కృషికి గుర్తింపుగా తెలుగు యూనివర్సిటీ విమర్శ పురస్కారం లభించడం సమకాలీన సాహిత్య విమర్శకే గౌరవం ! ప్రతాప్ నేపధ్యం వినండి.

*

నిజానికి, నా బాల్యంలో నా చుట్టూ ఏ విధమైన సాహిత్య వాతావరణం లేదు. పాఠ్యపుస్తకాల్లోని గొప్ప వ్యక్తుల గురించి, వారి జీవితాల గురించి మబ్బు జామున మోట కొడుతూ ఆలోచిస్తూ ఉండేవాడిని. నా ఆలోచనలు అబ్రహం లింకన్ నుంచి గాంధీ వంటి ఉదాత్త పురుషుల చుట్టూ తిరుగుతూ ఉండేవి. మోట కొడుతూ వెనక్కీ ముందుకూ నడుస్తున్నప్పుడల్లా ఆలోచనా తరంగాలు పడి లేస్తూ ఉండేవి. వాస్తవానికి తొలి జాములో పాటలు అందుకోవాలి. కానీ, నా గొంతు పాటను పలికేది కాదు. అదే నన్ను సృజనాత్మకత వైపు తీసుకుని వెళ్లి ఉంటుందేమో తెలియదు.

మోట విడిచి బురద పొలంలో నాగలి నొగను పట్టి చిన్ని చిన్ని చేతులతో, నా కన్నా ఎత్తున్న కోడెలను, ఎద్దులను అదిలిస్తూ ఉంటే నన్ను చూసి చాలా మంది ఆశ్చర్యపడుతూ ఉండేవారు. బడికి వెళ్తూ వ్యవసాయం పనులు చేస్తూ బాల్యమంతా గడిచిపోతున్న క్రమంలోనే కవిత్వం రాయాలని ఉత్సాహపడుతూ ఉండేవాడిని. కానీ, దానికేమైనా ఛందస్సు ఉంటుందేమో తెలియదు. పాఠాల్లో వచన కవితలు కూడా ఉండేవి. వాటికి మీటర్ ఉంటుందేమో అనేది అనుమానం. నేను చిన్నప్పటి నుంచి సిగ్గరిని. అందువల్ల నా సందేహాన్ని తీర్చుకోవడానికి మా తెలుగు టీచర్‌ను కూడా పదో తరగతి పూర్తయిన తర్వాతనే కాదు, ఇంటర్మీడియట్‌లో కూడా అడగలేకపోయాను.

మా ఊళ్లో హైస్కూల్లో మాది రెండో బ్యాచ్. వేసవి సెలవుల్లో, ఇతర సెలవుల్లో నేను మా స్వగ్రామం బొందుగుల నుంచి ఆలేరు వస్తుండేవాడిని. ఆలేరు చిన్నపాటి పట్టణం. పైగా, రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ మా చిన్నమ్మ ఇంట్లో ఉండేవాడిని. మా చిన్న బాపు టీచర్, పెయింటర్ కూడా. ఆ రోజుల్లో అంటే 1970 చివరి దశకంలో ఆలేరు నిండా మా చిన్నబాపు రాజమల్లారెడ్డి రాసిన సైన్ బోర్డులే ఉండేవి. నిజానికి, జీవితానికి సంబంధించిన కటిక వాస్తవాలను మా అమ్మ సత్తెమ్మ చూపిస్తే, బయటి ప్రపంచాన్ని చూడడానికి మా చిన్నమ్మ ప్రేమ సహకరించింది. మా చిన్నమ్మకు ఇద్దరు కొడుకులు. వాళ్లిద్దరు కూడా నా కన్నా పై తరగతుల్లో ఉండేవారు. అక్కడో లైబ్రరీ ఉండేది. మా చిన్నమ్మ చిన్న కొడుకు రాజమహేంద్రా రెడ్డి (ఇప్పుడు సాక్షి దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు) దానికి తీసుకుని వెళ్లి చదవాల్సిన పుస్తకాలు తీసి ఇస్తుండేవాడు. అలా నేను బాకు అనే నవల చదివాను. అందులో నేలమాళిగ అనే పదమేమిటో నాకు అర్థం కాలేదు. పుస్తకం మాత్రం చాలా బాగుంది.

అదే కాలంలో మా ఊళ్లో నా కన్నా ఓ తరగతి పైన ఉండే ఓ అమ్మాయి వాళ్ల ఇంటికి ఆంధ్రజ్యోతివంటి వారపత్రికలు వస్తుండేవి. వాటిలో వచ్చే సీరియల్స్‌ను ఆ అమ్మాయివాళ్లు చించి, కుట్టేవారు. వాటిని తెచ్చుకుని చదువుతుండేవాడిని. అలాంటి సందర్భంలోనే రావిశాస్త్రి రాసిన గోవులొస్తున్నాయి జాగ్రత్త నవల చదివాను. ఆ నవలలోని చాలా పదాలు నాకు అర్థం కాలేదు. కానీ, నవల మాత్రం బాగా రుచించింది. బాకు నవలలోని నేలమాళిగ గురించి గానీ రావిశాస్త్రి నవలలోని పదాల గురించి గానీ అడిగి సందేహాలు తీర్చుకోవడానికి నేను ప్రయత్నించలేదు.

ఇంటర్మీడియట్ చదవడానికి హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్లీ రాజమహేంద్ర రెడ్డితోనూ, ఆయన అన్న రాజ నరేందర్ రెడ్డితోనూ సహవాసం చేసే అవకాశం లభించింది. పైగా, నేనూ మహేందర్ ఒక్కటే కాలేజీ. ఆ సమయంలోనే హైదరాబాద్ స్టేట్ లైబ్రరీ మాకు ప్రధాన కేంద్రంగా మారింది. కోఠీ ఫుట్‌పాత్‌ను ప్రతి ఆదివారం చూస్తుండేవాడిని. ఏ కవిత్వ పుస్తకం కనిపించినా కొనేసి చదువుతూ ఉండేవాడిని. ఆ సమయంలో రాజనరేందర్ రెడ్డి మిత్రులు సురేష్, ప్రకాశ్, ఇంకా కొంత మంది ఉండేవారు. వారికి సాహిత్యాభిరుచి మెండుగా ఉంది. వారి ద్వారా తెలుగులోని మంచి కవిత్వం, మంచి కథలు, నవలలు పరిచమయ్యాయి. సురేష్ మొదట్లో ఈనాడులో పనిచేసేవాడు. ఆ తర్వాత పిటిఐలో పనిచేసి, ఇప్పుడు ఏదో ఆంగ్లపత్రికకు పనిచేస్తున్నాడు. మంచి కవులూ రచయితలూ సురేష్ ద్వారా నాకు అందేవి. అటువంటి సందర్భంలోనే విడుదలై కాగానే త్రిపుర కథల పుస్తకం నా చేతికి వచ్చింది. ఇంటర్మీడియట్ అయిపోయేసరికే కోస్తాంధ్ర కథ, నవలా సాహిత్యాన్ని, కవిత్వాన్ని చదివేశాను. మా అన్న బుచ్చిరెడ్డి మా గదికి సినీ పత్రికలు, ఆంధ్రభూమి వార పత్రిక తెప్పించేవాడు. వాటిని అక్షరం పొల్లు పోకుండా చదవేవాడిని. నాకు చదువులో మార్గం చూపించింది, బాల్యంలో బాహ్య ప్రపంచం  నుంచి రక్షించింది ఆయనే. కానీ, ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం పూర్తిగా బలహీనుడిని చేసేశాడు.

అదలా ఉంచితే, ఇంటర్మీడియట్‌లో ఆలియా కాలేజీ మ్యాగజైన్‌కు ఓ కవిత రాశా. అది అచ్చయింది. ఆ తర్వాత సికింద్రాబాదులోని ఎస్పీ కాలేజీలో బిఎస్సీ బిజడ్‌సి ఇంగ్లీషు మీడియంలో చేరా. అక్కడే నాకు రాజకీయాలు తెలిసి రావడం ప్రారంభమైంది. మా గురువు తిరుమల శ్రీనివాసాచార్య సాహచర్యంలో కవిత్వం, సాహిత్య విమర్శ పరిచయం ఏర్పడింది. సాహిత్య విమర్శకు అక్కడే నాకు పాదులు పడ్డాయి. డిగ్రీలో మొదటి సంవత్సరం కాలేజీ మ్యాగజైన్‌కు అసిస్టెంట్ ఎడిటర్‌గా, ఆ తర్వాత రెండేళ్లు ఎడిటర్‌గా పనిచేశా. రచనల ఎంపిక బాధ్యతను, సంపాదక బాధ్యతలను ఆచరణలో తిరుమల శ్రీనివాసాచార్య ఈ మూడేళ్లూ నాకే వదిలేశారు. సంపాదకీయంలో మార్పులు చేర్పులు కూడా చేయలేదు ఆయన. అంత స్వేచ్ఛను నాకు ఇచ్చారు.

ఇకపోతే, డిగ్రీ అయిపోయిన తర్వాత పట్టుబట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంఎ తెలుగు సాహిత్యంలో చేరా. ఇది నాకు సాహిత్య విమర్శను అధ్యయనం చేయడానికి మరింత అవకాశం ఇచ్చింది. సాహిత్య విమర్శలో కొత్త ప్రతిపాదనలు, కొత్త ఆలోచనలు ఎలా చేయాలో నాకు వేల్చేరు నారాయణరావు సిద్ధాంత గ్రంథం నేర్పింది. అప్పటికే కోస్తా కవిత్వాన్ని, వచన సాహిత్యాన్ని ఔపోషన పట్టిన నాకు తెలుగు ఎంఎ చాలా సులభమైంది, ఒక గ్రామర్ తప్ప.

ఎంఎలో ఉండగానే మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా భాషల మీద పత్రికలకు వ్యాసాలు రాశాను. నాయని కృష్ణకుమారి, ఎస్వీ రామారావు, ఎలూరి శివారెడ్డి, సుమతీ నరేంద్ర వంటి టీచర్ల సాహచర్యంలో విమర్శనా పద్ధతులు అలవడ్డాయి. వెలుదండ నిత్యానంద రావు, లలితావాణి, కెయన్ చారి వంటి తరగతి సహచరులు ప్రాచీన సాహిత్యాన్ని, ప్రాచీన సాహిత్య విమర్సనా పద్ధతులను నేర్చుకోవడానికి అవకాశం కల్పించారు. నిజానికి, సి నారాయణ రెడ్డి శ్రీశ్రీ మహాప్రస్థానం కవితలను విశ్లేషిస్తూ మాకు చెప్పిన పాఠం ఆధునిక కవిత్వ విమర్శనా విధానంలోని లోతులను తెలియజేసింది. తరగతి గదిలో మాకే సినారె చివరిగా పాఠం చెప్పారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వామపక్ష రాజకీయాలు, సాహిత్యాధ్యయనం జోడు గుర్రాల మాదిరిగా సాగుతుండేవి. ఓ ఏడాది ఆర్ట్ర్ కళాశాల మ్యాగజైన్‌కు సంపాదకుడిగా పనిచేశా. రెండో ఏడాది ఇష్టం లేక దాని జోలికి వెళ్లలేదు. ఈ క్రమంలోనే కొన్ని కథలు రాశాను. కవిత్వం మాత్రం డిగ్రీ నుంచి పుంఖానుపుంఖంగా రాశాను. కానీ, వాటిని నోటు పుస్తకాల్లో భద్రంగా దాచి పెట్టాను. కొన్ని వచనమై తేలిపోయినట్లు, మరికొన్ని అనుకరణలు అయినట్లూ అనిపించాయి. అందుకే, వాటిని ఏనాడు బయటకు తీయడానికి ఇష్టపడలేదు.

అదలా వుంచితే, సాహిత్య విమర్శలో కూడా కొత్త ఒరవడిని పెట్టాలనే ఉద్దేశం ఓవైపు, సామాజిక ప్రయోజనాన్ని ఆశించి రాసిన రచయితల నవలూ కథల్లో పఠనయోగ్యతను సంతరించుకోవడం లేదనే విమర్శలు మరో వైపు, నన్ను పాపులర్ సాహిత్యంపై ఎంఫిల్ చేయించడానికి ప్రేరేపించాయి. తెలుగులోని పాపులర్ నవలలపై నేను తెలుగు నవల- వ్యాపారధోరణి అనే ఎంఫిల్ సిద్ధాంత గ్రంథాన్ని రాశాను. అది పుస్తకంగా కూడా వచ్చింది. దాంట్లోని కొన్ని అధ్యాయాలు ఉదయం దినపత్రికలో సీరియల్‌గా వచ్చాయి. అప్పుడది తెలుగు సాహిత్య విమర్శనారంగంలో ఓ సంచలనం.

ఉదయం దినపత్రికలో చేరిన తర్వాత పరిధి విస్తరించింది. అవసరం కొద్దీ సాహిత్య వ్యాసాలు రాయాల్సి వచ్చేది, సమీక్షలు చేయాల్సి వచ్చేది. అలా ఎప్పటికప్పుడు నా విమర్శనా రీతులను మెరుగులు పెట్టుకుంటూ పని చేస్తూ వెళ్లాను. సాహిత్య విమర్శలో నేను చేసిన కొత్త ప్రతిపాదనలను నాకు చాలా మంది ఉద్ధండ కవి పండితులను శత్రువులను చేశాయనే విషయాన్ని చాలా ఆలస్యంగా గ్రహించాను. నాలో పిల్లవాడి మనస్తత్వమే ఉండేది. నేను రాస్తే సీరియస్‌గా ఎవరు తీసుకుంటారులే అనే కొంత నిర్లక్ష్య భావం కూడా ఉండేది. అలాంటి సందర్భంలోనే అలా కూర్చుండిపోయి ఉదయం వారపత్రిక ఉగాది స్పెషల్‌కు రక్తం చేత రాగాలాపన అనే వ్యాసం రాశాను. దానివల్ల ఇబ్బంది పడ్డవారు ఇప్పటికీ నాపై లోలోన మండిపోతూనే ఉన్నారు.

విమర్శనా సాహిత్యాన్ని సామాజిక పరిణామ క్రమాన్ని ఆధారం చేసుకుని నేను రాస్తూ వెళ్లాను. ఈ క్రమంలో వచ్చిన కొత్త ప్రతిపాదనలు తెలంగాణ అస్తిత్వ సాహిత్యం వరకు చాలానే ఉన్నాయి. వాటికి కొనసాగింపులు మాత్రం లేకుండా పోయాయి. ప్రతిపాదనలు, విమర్శలోని కొత్త రీతులే చాలా మందికి మింగుడు పడని స్థితిలో వాటి కొనసాగింపులు ఎంతటి తీవ్రతకు దారి తీస్తాయో కూడా నాకు అనుభవంలోకి వచ్చింది. ఆ అనుభవం ఒళ్లు చీరుకుపోయి, గుండె ఛిద్రమయ్యే స్థితికి కూడా తీసుకుని వెళ్లింది. దానికి నో రిగ్రెట్స్.  సామాజిక, రాజకీయ, సాహిత్య ఉద్యమాలను, ధోరణలను అధ్యయనం చేస్తున్న క్రమంలోనే కాల్పనిక సాహిత్యంపై నా అభిప్రాయం మారుతూ వచ్చింది. దానివల్లనే సైద్దాంతిక వాస్తవికత – కాల్పనిక వాస్తవికత అనే వ్యాసం వచ్చింది. ఇది కూడా నాపై దాడికి కారణమైన వ్యాసం.

అయితే, పఠన యోగ్యత సామాజిక ప్రయోజనం సాధించే రచనల్లో ఎలా సాధించవచ్చునో నా అనుభవంలోకి తెచ్చుకోవడానికి నేను కథా రచన ప్రారంభించాను. అలా కథా రచయితగా కూడా నాకో గుర్తింపు వచ్చింది. ఎల్లమ్మ ఇతర కథలు అనే కథా సంకలనానికి సురమౌళి అవార్డు లభించింది. చాలా కథలు వివాదాస్పదమయ్యాయి కూడా. మిగతా తెలుగు రచయితలంతా తమకన్నా సామాజిక హోదాలో, ఆర్థిక స్థితిగతుల్లో కింద ఉన్నవారిని చైతన్య పరచడానికి రచనలు చేస్తుంటే నేను, నా చుట్టూ ఉన్నవారి జీవితాల్లోని వైరుధ్యాలను, అసంబద్ధతను చెప్పడానికి నేను కథారచనను ఎన్నుకున్నాను. ఏదో ఒక్కవాదానికి కట్టుబడి రాయకుండా ఏ కథకా కథ ప్రత్యేకమైందిగా ఉండేలా రాశాను. అందుకే ఎక్కువగా కథలు రాయలేకపోయాను. తొలుత చలం ప్రభావంతో రాసిన రెండు మూడు కథలను సూట్‌కేసులో పడేసి తాళం వేశాను. వాటిని ఇప్పటికీ తీయడం ఇష్టం లేదు.

ఇక, కవిత్వానికి వస్తే, ఉదయం దినపత్రికలో పనిచేసిన కాలంలో కొన్ని కవితలు రాశాను. అవి అచ్చు కూడా అయ్యాయి. ఉదయం పత్రికలో వచ్చిన ఓ కవితను చదివిన శివారెడ్డి నన్ను కోఠీ ఫుట్‌పాత్ మీద కౌగిలించుకున్నారు. కె. శివారెడ్డితో అదే నాకు తొలి పరిచయం. ఆ తర్వాత శివారెడ్డి మెచ్చుకున్న భూమిస్పప్నం కవితను ఎక్కడో పోగొట్టుకున్నాను. ఆ ధోరణిని కూడా వదిలేశాను. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలోనే భావాలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే, వాటిని కథల్లో పొందు పరచలేక కవిత్వం రాశాను. అలా వెలువడిందే గుక్క దీర్ఘ కవిత, ఇతర కవితలు. అవన్నీ తెలంగాణ కవిత్వానికి ఒరవడి దిద్దాయనే అనుకుంటున్నాను. ఈ క్రమంలోనే తెలంగాణ సాహిత్యంపై విరివిగా వ్యాసాలు రాశాను.

తెలంగాణ తోవలు అనే గ్రంథానికి వ్యాసాలు రాయించి, సంపాదకత్వం నెరిపిన క్రమంలోనే తెలంగాణ అస్తిత్వ ఉద్యమ సాహిత్యాన్నే కాదు, పాత తెలంగాణ రచనలను ఎలా అధ్యయనం చేయాలనే విషయం నేర్చుకున్నాను. తీవ్ర ఆలోచనలు, అన్వేషణ, మీమాంస మధ్య తెలంగాణ సాహిత్యాన్ని విమర్శించే ధోరణులను పట్టుకున్నాను. ఇంత వరకు ఎవరూ తొక్కని మార్గంలో వ్యాసాలు రాశాను. ఆ వ్యాసాలు భౌగోళిక సందర్భం పేరుతో పుస్తకంగా వచ్చింది. అది తెలంగాణ సాహిత్యాధ్యయనానికి దారులు వేసింది. తెలంగాణ సాహిత్యాన్ని వెలికి తీసే పని సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సుజాతా రెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్ వంటి వాళ్లు చేస్తుంటే, తెలంగాణ సాహిత్య విశ్లేషణ, విమర్శ, పరిశీలన వంటివాటికి నేను ప్రాధాన్యం ఇచ్చాను. అంతకు ముందు కొత్త ప్రతిపాదనలు చేసిన కొన్ని ముఖ్యమైన వ్యాసాలతో కొలుపు పుస్తకం, ఆ తర్వాత తెలంగాణ సాహిత్యంపై కొత్త విశ్లేషణలు, ప్రతిపాదనలు చేసిన వ్యాసాలతో ఇరుసు పుస్తకం వచ్చాయి. తెలంగాణ కోణంలో రాజకీయాలను విశ్లేషించిన కొన్ని వ్యాసాలతో తెలంగాణ సందర్భాలు అనే పుస్తకం వచ్చింది. ఈ పుస్తకాలన్నీ కాపీ మిగలకుండా, నాకు కూడా దక్కకుండా పాఠకులకు చేరాయి.

ఈ క్రమంలోనే నన్ను బహిరంగంగా నా ప్రతిపాదనలపై, వాదనలపై చర్చ పెట్టడం ఇష్టం లేనివారు నాకు బలమైన శత్రువులుగా మారుతూ వచ్చారు, అదే స్థాయిలో నన్ను ప్రేమించేవాళ్లూ పెరుగుతూ వచ్చారు. నేను చెప్పదలుచుకున్నదేమంటే తెలుగులో సాహిత్య విమర్శ చేయడమంటే శత్రుత్వాన్ని పెంచుకోవడమేనని. అది పగ తీర్చుకునే దశకు వెళ్లడాన్ని కూడా నేను అనుభవించాను. నేను ప్రచారం కోసం, పేరు కోసమే వాదనలు ముందుకు తీసుకుని వస్తున్నానని చాపకింద నీరులా నాపై దుష్ప్రచారం సాగించారు. అది ఫలితం ఇవ్వకపోవడంతో దొడ్డిదారిన నాపై దాడికి దిగారు. అందువల్ల నేను చాలా మంది యువ సాహిత్యకారులకు తెలుగులో సాహిత్య విమర్శ జోలికి వెళ్లవద్దని సలహా ఇస్తుంటాను. మా తమ్ముడు కాసుల లింగారెడ్డికి కూడా నేను అదే సలహా ఇచ్చాను. మంచికవిగా ముందుకు వచ్చిన స్థితిలో విమర్సనా వ్యాసాలు రాయడం వల్ల మొదటికే మోసం వస్తుందని హెచ్చరించాను.

నిశ్చిత నిశ్చితాలను బద్దలుకొట్టే పని నేను చేశాను. శాశ్వత సత్యం ఏదీ ఉండదని నమ్మి సాహిత్య విమర్శ చేశాను. సత్యం కూడా కాలాన్ని, ప్రాంతాన్ని, కులాన్ని, మతాన్ని బట్టి మారుతూ ఉంటుందని చెప్పాను. ఆ క్రమంలోనే అన్ని అస్తిత్వ ఉద్యమాలను సమర్థిస్తూ వ్యాసాలు రాశాను. పేరు ప్రఖ్యాతులు పెందిన కవులను, రచయితలను కాకుండా వాటికి నోచుకోనివారి ఉత్తమ రచలను తీసుకుని విశ్లేషించాను. అయితే, నా దేవులాట తెంపు లేకుండా సాగుతూనే ఉన్నది. ఆ తెంపులేని దేవులాటనే నా సాహిత్య విమర్శగా, సామాజిక విశ్లేషణగా ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే, నా కథలూ కవిత్వంతోనే కాదు, సాహిత్య విమర్శతోనూ ఎవరినీ ఏకీభవించాలని నేను అడుగను. నాలోని ఆలోచలను పది మందితో పంచుకోవడానికి మాత్రమే రాశా. నాలాగే ఆలోచించేవారికి అవి నచ్చాయి. నాకు అది చాలు…

ఇంకా వందలాది సాహిత్య వ్యాసాలు, సమీక్షలు, పరిశీలనలు పత్రికల పేజీల్లో ఉండిపోయాయి. వాటిని ఓ పుస్తకంగా తెస్తే నేను ఏ ప్రచారం ఆశించకుండా చేసిన కృషిని కొద్దిమందైనా గుర్తిస్తారనే ఆశ ఉంది. ఇప్పటికి గుర్తించినవారున్నారు. వారికి మరింత మంది తోడైతే నా నిష్కామకర్మ ఫలించినట్లే…

అయితే, నా కోరిక ఏమిటంటే – బాకు నవల సంపాదించి మళ్లీ ఓసారి చదవాలని… నేను ఇప్పటికే మొదలు పెట్టిన ఓ నవల రాయాలని…

(పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అబ్బూరి రామకృష్ణారావు – అబ్బూరి వరదరాజేశ్వర రావు కీర్తి పురస్కారం అందుకున్న సందర్భంగా..)

- కాసుల ప్రతాపరెడ్డి, ఎడిటర్ వన్ ఇండియా తెలుగు