ముఖాముఖం

కొత్త విమర్శ పరికరాలు కావాలి:దర్భశయనం (రెండవ భాగం)

29-మార్చి-2013

కవి, విమర్శకుడు దర్భశయనంతో సంభాషణ… రెండవ భాగం
ఇంటర్వ్యూ: కోడూరి విజయ్ కుమార్

(8) స్త్రీ , దళిత వాద కవిత్వాల కాలం అయిపోయిందని ఒక అభిప్రాయం సాహిత్యం లో వుంది. కానీ, వాస్తవానికి దళితుల స్త్రీలస్థితిలో ఆ కవిత్వాల ముందు కాలానికీ, ఇప్పటికీ పెద్ద పురోగతి లేదని కూడా అంటున్నారు. ఒక విమర్శకునిగా ఎలా విశ్లేషిస్తారు ?

స్త్రీ, దళిత వాదాల కవిత్వం 90 లలో వొచ్చినంత ఉధృతంగా ఇప్పుడు లేదన్నది వాస్తవమే! అయితే, ఆ వాదాల కవిత్వాల కాలం అయిపోయిందనే అభిప్రాయం తో నాకు ఏకీ భావం లేదు. చిత్తశుద్దితో రాసే వాళ్ళు రాస్తూనే వున్నారు. ఇక దళితుల, స్త్రీల స్థితి అంటారా? …. ఏమంత మెరుగుపడ లేదు. వాళ్ళ మీద దాడులు కొనసాగుతూనే వున్నాయి. దాడుల్ని నిరసించే గొంతులూ, వేదికలూ లేవని కాదు. సాహిత్యంలో వాటి ప్రతిఫలనాలు వుండాల్సినంతగా లేవు. ఏదో ఒక దాడి జరగ గానే స్పందనగా కవిత్వం వొస్తోంది గానీ, అసలు దాడులకు మూలమైన రాజకీయ క్రీడలకు వ్యతిరేకంగా జరగాల్సినంత సాహిత్య సమీకరణ జరగలేదు. మొత్తంమీదనే బతుక్కి భద్రత లేకుండా పోతోంది. స్త్రీల విషయంలో ఇది మరింత బాధాకరంగా వుంది. వ్యవస్థ రాను, రానూ మరింత అవినీతిమయం అవుతున్నపుడు, అవినీతికీ-అధికారానికీ నడుమ ఒప్పందాలు కుడురుతున్నపుడు, వాటి పర్యవసానమే దాడులు. దాడుల్లో సామాన్యులే బలైపోతారు. సామాన్యుని మీద ధ్యాస పెట్టి, మరింత విస్తారమైన కవిత్వం రావాల్సిన అవసరం వుందని నేను భావిస్తున్నాను.

(9) చాలా జాతీయ వేదికల మీద కవిత్వం చదివారు. విశ్లేషణాత్మక ఉపన్యాసాలు ఇచ్చారు. మన తెలుగు సాహిత్య వాతావరణానికీ,యితర భాషల, ముఖ్యంగా మళయాళ, తమిళ, కన్నడ, బెంగాలీ లాంటి భాషల సాహిత్య వాతావరణానికీ తేడాలు మాతో పంచుకోగలరా?

ఇతర సాహిత్య వాతావరణాలకు భిన్నంగా మన సాహిత్య వాతావరణం వుందని చెప్పగలను. భాష పట్ల అక్కడి వాళ్ళకున్న ప్రేమ, సాహిత్య ఇనుమడింపు కోసం వాళ్ళు చేస్తోన్న సమిష్టి కృషి గణనీయమైనది. ఆయా భాషల సాహిత్యకారుల్లోనూ అభిప్రాయభేదాలున్నాయి. భేదాలున్నప్పటికీ వాళ్ళ భాషనూ, సాహిత్యాన్నీ ఇనుమడింప చేసుకోవడానికి అవి అడ్డుపడడం లేదు. మన తెలుగు సాహిత్య వాతావరణం లో కలిసిపోయే అంశాల మీద కన్నా, విభేదించే అంశాల మీద ఎక్కువ ధ్యాస పెడుతున్నాము. అభిప్రాయ భేదాలని దాదాపు శతృత్వ స్థాయికి తీసుకు వెళ్ళే ప్రమాదకర ధోరణులు స్థిరపడుతున్నాయి. మానవీయ అంశాల మీద స్థూలంగా ఏకీభవించే వాళ్ళు కలిసి సాహిత్య సంప్రదాయాన్ని పటిష్టం చేయ వలసిన తరుణంలో సాహిత్యకారులు చీలికలు పేలికలవడం మంచి పరిణామం కాదు. తమిళ, కన్నడ, మలయాళీ, బెంగాలీ సాహిత్యకారుల్లో చాలా మంది జాతీయ స్థాయిలో సుపరిచితులైనారు. ‘ఇండియన్ లిటరేచర్’ లాంటి జాతీయ సాహిత్య పత్రికలలో అచ్చయ్యే రచనల్లో సింహ భాగం వాళ్ళదే! మనకు వివాదాలేక్కువ – విస్తృతి తక్కువ!

(10) ‘కవిత’ సంపాదకునిగా ఎప్పటికప్పుడు కవిత్వాన్ని చదువుతూ వుంటారు. గత పదేళ్ళ కవిత్వం ఎలా వుంది?

2004 నుండి వెల్వడుతున్న’కవిత’ వార్షిక సంచికలకు సహ సంపాదకునిగా, కవిత్వాన్ని ధ్యాస పెట్టి చదివాను. స్థూలంగా చెప్పాలంటే, గత పదేళ్ళ కాలంలో చాలా కవిత్వం అచ్చయింది. అందులో శక్తివంతమయిన సృజన చెప్పుకోదగిందే! ముఖ్యంగా, సమకాలీన సామాజిక ఘటనల్ని తెలుగు కవిత్వం రికార్డు చేసింది. ఈ రకమైన కవిత్వంలో వస్తువు పలికినంతగా రూపం ప్రకాశించలేదు. జీవనానుభావాలు, జ్ఞాపకాలు, మారుతున్న మానవ సంబంధాలు – వీటిని తెలుగు కవులు ప్రధాన వస్తువులుగా స్వీకరించారు. కొందరు కొత్త కవులు తాజా గొంతులతో పలుకుతూ వుండడం ఆరోగ్యకరమైన అంశం! అయితే జీవితాన్ని రాజకీయాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నపుడు, వాటిని ప్రతిఫలించే, వ్యాఖ్యానించే బలమైన, గాడమైన కవిత్వం రావాల్సినంతగా రాలేదని నా అభిప్రాయం. శబ్ద ధ్యాస, అన్వయ ధ్యాస కూడా ఉండవలసినంతగా లేదని కూడా భావిస్తున్నాను. ఐతే, ఇతర భాషల కవిత్వంతో పోల్చి చూసినపుడు మన కవిత్వం ముందంజలో వుందని నా అధ్యయనానుభావం నుండి చెప్పగలను.

(11) తెలంగాణా ఊళ్ళు పోలీసు క్యాంపుల నడుమ మగ్గుతున్నపుడు, చాలా మంది తెలంగాణా కవులే ఈ స్థితిని కవిత్వం చేయని కాలంలో ‘ముఖాముఖం’ కవితా సంపుటిని తీసుకొచ్చారు .. ఇప్పుడు తెలంగాణా ఉద్యమ కవిత్వం ఎలా వుంది?

ప్రజా ఉద్యమాలని దగ్గర నుండి గమనించి కవిత్వం రాసాను. తెలంగాణా తనం ఏమిటో చాలా కవితల్లో చెప్పాను. మానవ చరిత్రలో ఉద్యమాలే జరగక పోయి వుంటే ఈ సమాజం ఎంత వెనకబడి ఉండేదో? అమానవ కాండలో తెలంగాణా పల్లెలు చిన్నాభిన్నమైన స్థితిని నాతో పాటు కొందరు తెలంగాణా కవులు రికార్డు చేసారు. ఈ కాలం లో నా కవిత్వ రచనకు ‘కాళోజీ’ గారు స్ఫూర్తి. విప్లవ కవిత్వ వారసత్వాన్ని అర్థం చేసుకోకుండా తెలంగాణా కవిత్వాన్ని అంచనా వేయలేము. క్రితం పదేళ్ళ కాలం లో వొచ్చిన తెలంగాణా ఉద్యమ కవిత్వాన్ని పరిశీలిస్తే రెండు అంశాలు బోధపడతాయి. ఒకటి-ఉద్యమ కాలంలో పాత దూసుకెల్లినంతగా వచన కవిత్వం వెళ్ళ లేదు. వెలువడిన వచన కవిత్వం తెలంగాణా ప్రజల ఆకాంక్షను, ప్రత్యేక తెలంగాణా కోసం జరుగుతున్న పోరునూ ప్రతిఫలించింది. ఐతే, దానిలో రాజకీయ భాష వొచ్చినంతగా, సాంస్కృతిక భాష రాలేదు. స్వతంత్ర, సాంస్కృతిక దృక్పథం తో రాసిన వాళ్ళు తక్కువ. 80 లలో, 90 లలో కొత్త తరం ప్రతిభావంతంగా వొచ్చినంతగా క్రితం దశాబ్దం లో రాలేదు. నిజానికి, ఉద్యమ కాలంలో కవిత్వానికి సంబంధించిన మౌలిక అంశాల మీద వర్క్ షాపులు గానీ, అర్థవంతమైన చర్చలు గానీ జరగకపోవడం ఒక పరిమితే!

(12) ‘వస్తువు’, ‘రూపము’ లాంటి మాటలు, విమర్శకు సంబంధించిన యితర సామాగ్రి యిప్పటి కవిత్వాన్ని అంచనా వేయడానికి ఎంతవరకూ సరిపోతాయి…?

ఏ కవిత్వాన్ని పరిశీలించాలన్నా అందులో చూసేది వస్తువూ, రూపమే! … ఇవి ఎప్పుడూ వుండేవే. ఐతే, వస్తువుని ఎలా చూడాలీ, రూపాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నవి ప్రధానాంశాలు. ఒకప్పటి విమర్శ పరికరాలతో ‘మాత్రమె’ ఇవాల్టి కవిత్వాన్ని అంచనా వేయలేము. విమర్శకులు ఎప్పటికప్పుడు కొత్త పరికరాలని సమకూర్చుకోవాలి. ఉదాహరణకు ప్రాచీన కవిత్వం లోని లయను అంచనా వేయడానికి ఛందస్సు ఒక ఉపకరణం. ఇవాల్టి ‘విముక్త కవిత్వం’ లోని లయని పట్టుకోవడానికి కొత్త పరికరాలు కావాలి. మారుతున్న సామాజిక, రాజకీయ స్థితులకు సంబంధించిన ఒక అవగాహన ఇవాల్టి విమర్శకునికి ఒక ప్రాథమిక అవసరం అయింది.

(13) భవిష్యత్తు లో తెలుగు కవిత్వం ఎలా ఉండబోతోందని ఊహిస్తున్నారు?…. ఒక వైపు, అంతరించబోయే భాషల్లో తెలుగు కూడా ఒకటని భయపెడుతున్నారు…

ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం లో చదువుకుంటున్న పిల్లలకు తెలుగులో పరిజ్ఞానం తక్కువే! పాటశాల స్థాయిలో తెలుగు భాషకు ప్రాధాన్యత తగ్గడం ఒక విషాదం. పిల్లలని ఆంగ్లం లో సుషిక్షితులుగా చేయడం కోసం తెలుగు అడ్డంకి అనుకోవడం లోనే తప్పిదం వుంది. రెండింటి నడుమ శత్రుత్వం వుండనుకోవడం లో ప్రమాదం వుంది. ఆంగ్లంతో సంపర్కం వుండి కూడా మాత్రు భాషను కాపాడుకుంటున్న జాతులు లేవా? లక్షలాది గ్రామాల్లో ఇవాళ ప్రజలు మాట్లాడుతున్న భాష తెలుగే! గ్రామాల్ని ధ్వంసం చేస్తోన్న రాజకీయాలే భాషను కూడా వెనక్కి నెడుతున్నాయి. ఐతే, క్రితం వెయ్యి సంవత్సరాల కాలం లో తెలుగు భాష ఎంతో వికసించింది. ఎన్నో ఒడిదుడుకులని తట్టుకుని నిలబడింది. కాబట్టి మన భాష అంతరిస్తుందని నేను భావించడం లేదు. ఐతే, తెలుగు సాహిత్యాన్ని పల్లెటూళ్ళ దాకా తీసుకు వెళ్లి విస్తారం చేసే ఒక ప్రక్రియ ప్రారంభం కావలసి వుంది. సాహిత్యకారులు ఈ దిశగా ఆలోచించాలి. పిల్లల సాంకేతిక జ్ఞానాభివ్రుద్దికీ, సాహిత్యానికీ నడుమ వైరుధ్యం లేదనే సత్యాన్ని బలంగా ప్రచారం చేయవలసిన అవసరం వుంది. ఇంతవరకూ వొచ్చిన సాహిత్యం లోని మేలిమి అంశాలని ప్రజా జీవితం లోకి తీసుకు వెళ్ళే మార్గాలని సాహిత్య, సాంస్కృతిక సంస్థలు అన్వేషించాలి. కవిత్వాన్ని విద్యాలయాల్లో గానం చేసే సంస్కృతి కోసం కృషి జరగాలి. జీవితానికి సంబంధించిన పలు పార్శ్వాలని అత్యద్భుతంగా ఆవిష్కరిస్తున్న తెలుగు కవిత్వానికి భవిష్యత్తు లోనూ వెలుతురు బాటే వుందని నేను బలంగానే నమ్ముతున్నాను.

– * –

మొదటి భాగం ఇక్కడ చదవండి.