మాట్లాడుకుందాం

సినీ గీతం చక్కని కవిత్వం కావాలంటే?

05-ఏప్రిల్-2013

పోయిన సారి అడిగిన ప్రశ్న సినిమా పాట కవిత్వమేనా? కు స్పందించిన వారందరికీ కృతజ్ఞతలు.  వారి వ్యాఖ్యల వల్ల కొన్ని మంచి విషయాలు చర్చలోకి వచ్చాయి.

అన్ని రకాల ప్రక్రియల్లాగానే సినిమా పాటలలోకూడా మంచి చెడూ ఉన్నాయనీ, సాహిత్య విలువలువున్న పాటలు ఎన్నో కలవనీ,  వాటిలో చిక్కని కవిత్వం ఉందనీ ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.  కవిత్వానికి గీటురాయి ఏమిటి అన్న ప్రశ్న ఈ సందర్భంలో రావడం తప్పని సరి.  ఎన్నెస్ మూర్తి గారు కాలపరీక్షకు నిలబడడం ఒక గీటురాయి గా పరిగణిస్తే, ఎస్ నారాయణస్వామి గారు కాలపరీక్షకన్నా చిక్కదనం, గూఢత, సంపూర్ణత, మనసునో మెదడునో తాకే గుణం ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

సినిమా పాటలో కవిత్వాన్ని వెతకటమంటే..నీళ్ళతొట్టిలో ముత్యాలకోసం వెతికినట్లే అంటూ కర్లపాలెం హనుమంతరావు గారు అవేదన వ్యక్తం చేశారు.  దీనికి వీరు సూచించిన కారణాలు – ప్రస్తుతం సినీగీతం తయారయ్యే విధానంలో కవిత్వం కలిసే అవకాశం అతిస్వల్పం, గొప్ప పాటలు వచ్చినరోజుల్లో బైట సాహిత్యంలో నిష్ణాతులైన కవులు మాత్రమే వ్రాసేవారు, సన్నివేశం వివరించి మంచి పాట వాసే స్వేఛ్ఛ కవికి ఇచ్చేవారు .. – అని.

ఈ సందర్భంగా మల్లీశ్వరి పాటలు గుర్తు చేసుకుందాం.  కృష్ణశాస్త్రిగారి ప్రతిభతో పాటు బీఎన్ రెడ్డి గారి అభిరుచి, పట్టుదల, ఓపిక (శాస్త్రిగారు ఎంతకాలానికీ ఒక పాట రాయకపోతే బీఎన్ కోపంగా ‘ధీరసమీరే’ అష్టపది వాడుకుంటానని బెదిరించారట – ఆ మర్నాడు కృష్ణశాస్త్రిగారు వ్రాసుకొచ్చిన పాట ‘మనసున మల్లెల మాలలూగెనే’) కూడా ఆపాటల అజరామరత్వానికి కారణాలు.

శంకరాభరణం సినిమా ముహూర్తం రోజు దర్శకుడు విశ్వనాథ్ వేటూరి, మహదేవన్ లతో ‘నా సినిమాలలో హీరో అరవైఏళ్ళవాడు. అసలు హీరోలు మీరే’ అని ప్రారంభం వారిద్దరితో చేయించారట.

అలాగే విజయ వారి సినిమాల్లో పనిచేసిన రచయితలు నిర్మాత, స్వయంగా రచయిత అయిన చక్రపాణిగారికి చాలా క్రెడిట్ ఇస్తారు.  హాయిహాయిగా జాబిల్లి పాటలో ‘రేయి వెండి దారాలల్లి’ అన్న ప్రయోగం నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారికి ఎంతగానో నచ్చిందని శ్రీశ్రీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు.

ఇలా ఉత్తమ అభిరుచి కల నిర్మాత, దర్శకులు గొప్ప కవులు, రచయితలతో కలిసి పనిచేసినప్పుడు మంచి సాహిత్యవిలువలు వున్న పాటలు రావడం సహజం.

కేవీమహదేవన్ గారి దగ్గరకు పాటరాయడానికి ఒక కవికుమారుడు వెళ్ళి ట్యూన్ ఉందా అని అడిగితే దేనికి కట్టమంటారు ట్యూన్, మీ సాహిత్యం వల్ల కలిగిన ప్రేరణలోంచే వస్తుంది ట్యూన్ అన్నారట.  ఆత్రేయ మనకందించిన ఆణిముత్యాల్లో ఎక్కువభాగం మహదేవన్ స్వరబధ్ధం చేయడం ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు.

ఘంటసాలగారు కూడా ఎక్కువగా కవి వ్రాసినదానికే బాణీ చేసేవారని వింటుంటాం.  లవకుశ సినిమాపాటలకోసం కవి సముద్రాలతో కలసి కూర్చొని సంగీత సాహిత్యాలు సంయుక్తంగా రూపొందించామని ఘంటసాల చెప్పారు.

దర్శకుడు చెప్పిన ఒక సన్నివెశం తనను కదిలించి ఒక ఆలాపన అప్రయత్నంగా వచ్చిందని దానిని వినిపించి సి నారాయణరెడ్డి గారిని ఇన్స్పైర్ చేసి మల్లియలారా మాలికలారా పాట వ్రాయించారు ఘంటసాల.

రహస్యం సినిమాలోని గిరిజా కల్యాణం యక్షగానాన్ని మల్లాది మల్లాదిరామకృష్ణశాస్త్రిగారు నిర్దేశించిన రాగాల్లోనే స్వరపరచి కవిపట్ల తన అపారగౌరవాన్ని చాటుకున్న ఉత్తమ సంస్కారి ఘంటసాల.  ఆయన స్వయంగా గేయ రచయిత కావడం, కరుణశ్రీ పుష్పవిలాపం, శ్రీశ్రీ ప్రతిజ్ఞ, గురజాడ పుత్తడిబొమ్మ మొదలైన గొప్ప ఖండకావ్యాలకు బాణీలు కట్టి చిరస్మరణీయంగా గానం చేయడం కాకతాళీయం కాదు.

మల్లాదిరామకృష్ణశాస్త్రి గారు ఒకసారి వ్రాసిన పాటలను మళ్ళీ దిద్దవలసిన అవసరం ఉండేది కాదంటారు.  ఎవరైనా మార్చమంటే ఆయన ఒప్పుకునేవారుకాదు. అందుకు ఇష్టమైన వాళ్ళే ఆయన దగ్గరకు వెళ్ళేవారు.  రాశిలో తక్కువ పాటలు వ్రాసినా కవిగా తన స్వతంత్ర ప్రతిపత్తిని వదులుకోని కవిఆయన.  ఆయనను శ్రీశ్రీ ప్రస్తుతించడంతో పాటు ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి వంటి గొప్పకవులు గురువుగా భావించారు.

వేటూరిగారు సినీమాల్లో రాకముందు వ్రాసిన అద్భుత గేయాలు తరవాత సినిమాల్లో వచ్చాయి.  ‘ఏ కులము నీదంటే (సప్తపది)’, ‘పుచ్చాపూవుల విచ్చేతావుల వెచ్చావెన్నెలలు (మనోహరం)’ మొదలైనవి.  సినిమాకోసం కాకుండా కవి తనకోసం వ్రాసుకున్న గొప్ప సినిమాపాటలలో పైన చెప్పిన గిరిజా కల్యాణం యక్షగానం, చలన చిత్ర సీమ తొలినాళ్ళలో వచ్చిన బసవరాజు అప్పారావు పాటలు, ఎంకిపాటలు మొదలైనవి ఎన్నో కానవస్తాయి.

ఈ రకంగా గొప్ప సాహిత్యవిలువలున్న పాటలు కాలంకలసివస్తే ఎన్నో సందర్బాలలో  వస్తాయని మనం చూడవచ్చు.

ఇంకా గొప్ప సినీ కవిత్వం ఎటువంటి సందర్భాలలో వస్తుంది?  మనం గర్వపడే సాహిత్యం రావాలంటే ఎవరెవరు – నిర్మాతలు, దర్శకులు, సంగీతదర్శకులు, రచయితలు, శ్రోతలు -  ఏమేం చేయాలి?  మీ స్పందనలను వ్యాఖ్యలద్వారా తెలియ జేయమని అందరికీ మనవి.