కవిత్వం

నాకవేమీ పట్టవుగా ….!!

05-ఏప్రిల్-2013

నొప్పి తెలియని గాయాల బాధని ఓర్చుకుంటూ
తీరం లేని దూరాలకి
తాపీగా నడుచుకుంటూ వెళ్ళే నాకు,

ముప్పూటలా
అవసరం లేని ఆకలి వేస్తుంది..
అనవసరమనిపించే దాహమూ వేస్తుంది ..
అర్హతలేని ఖర్చులతో
అన్ని అవసరాలనూ తీర్చుకుంటూ…

దిశ లేని ప్రయాణాన్నలా
కొనసాగిస్తూ ….
అలుపురాని చోట
అప్పుడప్పుడూ ఆగుతుంటాను ..

చేయని ప్రయత్నంలోని
నా చేవని చూసి పొంగిపోతూ
సాదించని గెలుపులని లెక్కిస్తూ
సాటిలేరు నాకెవ్వరూ అనే
సర్వోన్నతమైన ” భ్రమ ” ని బలపరుస్తూ

ఇసుకరేణువునై
సాగరాన్ని పూడ్చేద్దామనే సంకల్పంతో
అయాచితంగా వచ్చిపడే
పొగడ్తల మూటల్లోంచి రాలిపడే
మాటల కింద,
నా ఆత్మాభిమానాన్ని పాతిపెట్టి,

చివరకి,
ఆపాదించబడ్డ గొప్పదనమనే
గొయ్యి తీసుకుని అందులో దాదాపుగా
పడబోయే సమయంలో …

నాలో నిర్జీవంగా
పడి ఉన్న నన్ను నేను గుర్తించి
మంచుతాకిడికి ఆరిపోయే
మంటని మరోసారి రగిలించి
ముందడుగేస్తాను …

ఎదగాల్సిన వైపుకో
ఎటూకాని వైపుకో అన్నది
కాలమే నిర్ణయిస్తుంది ..

మందుకంటే తొందరగా దిగిపోయే
మరొకరి మాటల మత్తుకి
అనుకున్నంత తేలికగా బానిసైపోతే,
రూపాయి విలువచేయని
నాలోని అహం నొచ్చుకోదూ?

పోతే …. పోనీ….
మరికొన్ని లెక్కలేని
రాత్రులనీ, పగళ్ళనీ …

మహా అయితే,
గడిచిపోయి గతమవుతాయి..
నిలిచిపోయి గాయాలవుతాయి
నిరంతరం “నిద్ర” లో ఉండే
నాకవేమీ పట్టవుగా ….!!



4 Responses to నాకవేమీ పట్టవుగా ….!!

  1. kranthisrinivasarao
    April 5, 2013 at 5:18 am

    శతఘ్ని ….నీవు …ఎదిగి పోయావయ్యా …..ఇక పడే చాంసేలేదు బావుంది

    • Sataghni
      April 5, 2013 at 9:55 am

      Dhanyosmi guruji….

  2. వంశీ
    April 8, 2013 at 5:07 am

    బావుంది అన్నా.. :)

  3. Padma Sreeram
    April 18, 2013 at 11:54 am

    “పోతే …. పోనీ….మరికొన్ని లెక్కలేని రాత్రులనీ, పగళ్ళనీ …
    మహా అయితే,గడిచిపోయి గతమవుతాయి..నిలిచిపోయి గాయాలవుతాయి”

    ఓహ్! నీ భావాల పరిణతి గురించి ఆశ్చర్యపడ్డంలోనే నేనెరిగిన అక్షరాలన్ని అలిసిపోతున్నాయయ్యా! ఇంకేం చెప్పాలి నీ వ్రాతలకు నమో నమః అని తప్ప శతఘ్నీ!!!

Leave a Reply to వంశీ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)