కవిత్వం

ఇష్ట యాతన

19-ఏప్రిల్-2013

గుండె మీద నిరంతరం
ఒక బరువైన దిమ్మ
కుమ్ములో చెక్కిన మనసు
సన్నని సెగ మీద ఆగదు కాలుతూ
బొమికల లోతుల్లో వెలితిక్రిమి
ఎప్పుడూ కొరుకుతూ కదుల్తూ
చంపదు చావనివ్వదు
తరగని దాహం తీరదు ఎంత తాగినా -
సగం నిండిన కప్పునీళ్ల కనపడని యాతన
ఖాళీగా వున్న మరో సగం వెక్కిరించే భూతం
చిన్న ఉల్లాసాల బుడగల్ని చిట్లజేసే
పెద్ద వైఫల్యపు సూది
శూన్య ఎడారులకవతల మరులు గొల్పుతూ
సీతాకోక చిలుకల పంట

రాయకపోవటం బాధ
రాయటం ఇంకా పెద్ద ప్రసూతి బాధ
రాస్తూ రాయక రాయాలనిపిస్తూ
ఇది ఎంతకూ తెగని యానం
ముళ్లకంపలు ఒరుసుకుపోతున్నా
ముందుకు సాగటమే ఇష్టమైన ప్రయాణం