కవిత్వం

చూపుల్లేని గీత

26-ఏప్రిల్-2013

కళ్ళ గుంతల్ని
నల్ల కళ్ళద్దాల్లో దాచుకున్నాడతను
కనుగుడ్లు లేవు
వెలుతురు దారులూ లేవు

చూపునిచ్చే కాంతులకు
ఏ పదం తెచ్చి అంటించాలి?
నిఘంటువుల్ని శోధించి
సమస్త లోకాన్నీ
వర్ణంగానో అవర్ణంగానో
చూడగలిగే పదాన్ని
టకటకలాడే ఊతకర్రతో
చూపుల్ని తడుముకుంటున్నాడతను.

రాత్రివేళయితే
ఎదుటివాడికి చూపునివ్వడానికి
వాడి బ్యాటరీ లైటు పహారా కాస్తుంది
మరిపుడు దాటుతున్నది
నదో లోయో కాదు
జనారణ్యపు రహదారిని
ఈ పట్టపగలు వేళ
ఏ దివిటీ వెలిగించాలి?

వాడి కళ్ళల్లో
తల్లి గర్భం లోనే
జిల్లేడు పాలు పోసి
ఇన్నాళ్ళూ నను తప్పించుకు తిరిగిన దేవుడు
తల వంచుకుని నా ముందు నిలబడ్డాడు
అంతే -
చూపుల్లేని పాట ఒకటి
గాయాల స్వరమై వినిపించింది
నాలోని గుండె తడిని
ఆకాశంలో ఆరవేసి
లోలోపలి హరితవనాన్ని దగ్ధం చేసుకుని
సమస్త వెలుతురునీ
మింగేసిన చీకటయ్యాను.

కన్నీటి చారికల్ని
దు:ఖాశ్రువుల చిహ్నంగా గుర్తించి
అపసవ్య గుండె సవ్వడుల్ని
వైకల్యాల కథగా చిత్రించుకుని
అవయవ లోపాల విలాపాన్ని
జాలి కలిగించేలా రాయలేను
తొలిసంజ వేళలో
విరిచోరులు
సౌందర్యమూ పరిమళమూ లేని
ఒట్టి బోడి మొక్కలుగా
మార్చినపుడూ అంతే.

పూజకు చేరిన పూలు
తిరిగి మొక్కకు చేరనట్టు
వాడి అంధత్వం
ఇక ఆజన్మాంతర బంధమేనా?

ఇక్కడెంత ఆకుపచ్చతనముందో
ఇక్కడెంత సంస్కార జీవితముందో
ఇక్కడెన్ని తడిగుడ్డలు కత్తులవుతున్నాయో
ఇక్కడెన్ని బహిరంగ నేరాలున్నాయో
వాడికెలా తెలిసేది
అద్దంలో తన చూపున్న కళ్ళను
ఏ లేపనం పూస్తే చూడగలడు.