కవిత్వం

విపర్యాయం

24-మే-2013

ప్రవాహంలో కొట్టుకుపోవడమే సుఖంగా వున్నప్పుడు
ఆగి తిరిగి చూడాలనుకోవడమెందుకు?
కెరటాలు వెనుదిరగనివ్వకుండా తోసుకెల్తున్నప్పుడు
చూపుల్ని మరల్చే ధ్యాసెందుకు?
మోసుకెళ్తున్న ప్రవాహానికి అంకితమవకుండా
నీడల్ని సారించే మేఘాలపైన మోజెందుకు?
కూలుతున్న యిసుక గట్టుపైన నిలబడి
నీటి వాలును హెచ్చరించాలన్న పిచ్చి కోరిక పుట్టేదెందుకు?

పవలించిన కొండచరియల పక్కన
స్వప్నమొక్కటి పరిమళిస్తోంది
స్వప్నపుష్ప పరాగంలో
వివిశత్వమొకటి శృతి కలుపుతోంది
స్వప్నవివిశత్వ వీవనలో కిరణమొకటి పదునెక్కుతోంది.

బుతుగుర్రానికి
రౌతై పర్వతాగ్రం చేరింది దీప్తి
స్వాతిశయ స్వాతంత్రం కోసం లోయలోకి జారింది తమస్సు
ముత్యపు చిప్ప కరగడంత్లో ప్రవాహంలో కలిసిపోయిందో బిందువు
హడావుడిగా జారిపోయిందో నీడ.

చీకటిగట్టుపైన్నుంచీ వెలుగు వాహినిలోకి సాగి
తామరల్ని పట్టుకున్న కొలనుల వెన్నుల్ని దువ్వి
కొండల నడుముల్ని చుట్టుకుంటూ లాలించి
మజితాలను వుపనదులుగా మలుస్తోంది విధానం.

వూరటనిచ్చిన విరాం ఆరామ మెక్కడో ఆగిపోయింది
వూరించే అగ్నిశిఖల డాలు కవ్విస్తోంది
రాత్రి చక్కిలిగింతలు పెట్టిన నక్షత్రం
తొలిజామునే సోలిపోయి పారిపోయింది
తొలికిరణ లాలనలో జత కలిసిన రేణువు
కళ్ళు నులుముకుంటుండగానే వరదలో కలిసి వలస వెళ్ళిపోయింది.

చిరు చిరు తరంగ విన్యాసాల్లోనే
సరికొత్తవన్నీ పాతవైపోతున్నాయి
లిప్తల జెముళ్ళనీడలో
వాహపు సాఖీ టకీలా అందిస్తోంది.

కర్మాసుర్మా పంతాల గుహల్లోపల
నిదాన విధానమేదో నిత్యనూతనతను సింగారిస్తోంది
మౌనవాహిని లోలోపల విస్ఫోటాలు
తుఫానుల గుండెల్లో విశోకాలు
ధవళాంతరాల్లో చీకటి ముసుర్లు
రాత్రితో లయించిన యేకాంత మిణుగుర్లు
బృంద పయనంలో పెనుగులాడిన యేకాంతం
ప్రళయ తాండవంలో జతకలిపిన అస్తిత్వం
యీ ప్రవాహగానపు శృతి చెదరదు
యీ నిస్సహాయ స్పృహగతి వీడదు
ప్రవాహంలో సాగిపోవడం పారంపర్యం
పర్యాలోకంలో పరితపించడం విపర్యాయం.