ప్రవాసీ బంధం

అమూల్య

జూన్ 2013

ఉదయం నుంచీ వాన ముసురులా కమ్ముకుంది. మనసంతా మహా చెడ్డ చిరాకుగా ఉంది. జోరున కురిసి పోకుండా, ఇలా చినుకు చినుకులా సాగే వానంటే నాకసలు ఇష్టం ఉండదు. విసుగ్గా బాధగా ఉంది… లోపలేదో కెలుకుతున్నట్టు.

అలుముకుంటున్న చీకట్లు గ్లాస్ విండోలో నుంచీ మరింత చిక్కగా కనిపిస్తున్నాయి. పగలంతా పారిపోయినా, రేయిలో వదలని సలపరాల రంగు నలుపేనేమో కదూ!

అమ్మ గొంతులోని జీర పదే పదే చెవుల్లో వినిపిస్తుంది. నాలో ఎన్ని జీరలు బొంగురు పోయాయో నాకు తప్ప ఎవరికి తెలుసు?

నాన్న వణికే కంఠం….. కాదనలేను. కానీ, క్షమించలేను.

చీ, ఈ వెధవ కన్నీరు. Iఐ హేట్ టియర్స్. ముసురులా కమ్ముకునే ఈ దుఖం. భోరున ఏడుపు రాదు, ఒక్కో చుక్క తలగడను ముద్ద చేసే ఈ చుక్కలు …ఐ హేట్ ఇట్.

ఇప్పుడంతా సర్దుకుంది కదా! (?), ఇంకా నాకెందుకీ బాధ?

అన్నీ వదిలించుకున్నాను కదా!(?), అయినా ఎందుకీ వెంపర్లాట?

“ఒక్కసారి ఆలోచించమ్మా”, అమ్మ అర్థింపు.

“అయిందేదో అయిపొయింది… అందరూ అలా వుండరు”, నాన్న సముదాయింపు.

నాకు మీపై కోపం నాన్న…. కోపం! అబ్బబ్బ మళ్ళి ఈ కన్నీరు….

నాన్న నా హీరో అనుకుంటూ పెరిగాను కదూ! నాకేం, నాన్న ఉన్నారు అనే ధైర్యం ఒక్కసారిగా నాపైనే కుప్ప కూలిపోయిన రోజున, మూడు ముళ్ళు కాదు పది పీట ముడులలో నా నమ్మకం చిక్కుకుపోయి చచ్చిపోయింది నాన్న.

“కార్డులు పంచితే పంచాం. అనివార్య కారణాల చేత పెళ్లి కాన్సిల్ అయిందని పేపర్లో ప్రకటన ఇచ్చేద్దాం అంటే వినకపోయాడు అన్నయ్య. “, పాలల్లో ముంచి తీసిన నా చేతిని వాళ్లకు అప్పగించిన తర్వాత బాబాయ్ ఎవరితోనో అంటుంటే వినిపించిన మాటలివి.

తాంబూలాలు మార్చుకుని, పిలుపులు అయ్యాక అబ్బాయి గురించి, ఆ కుటుంబం గురించి తేడాగా తెలిసినప్పుడు ఎందుకు పెళ్లి కాన్సిల్ చెయ్యలేకపోయారు? మరీ ముఖ్యంగా నాకు ఆ విషయాలన్నీ తెలీకూడదని ఎందుకు అతి జాగ్రత్త వహించారు? పొరపాటు జరిగితే తలరాత అనుకుందును. తెలిసి తెలిసి చేతులారా చేసారే?

అమ్ములూ అంటూ ఎంత ప్రేమగా పిలిసేవారు నాన్న మీరు. అలాంటి ఈ అమ్ములు కన్నా సమాజం, ఆ సమాజంలోని పరువు ఎక్కువైపోయింది కదూ మీకప్పుడు? పది రోజులు ప్రశ్నించే లోకం కోసం నా నమ్మకాన్ని పణంగా పెట్టారు కదా నాన్న… అందుకే నాకు కోపం మీ పై.

మర్యాదలు సరిగ్గా జరగలేదని, అబ్బాయికి పెట్టిన గొలుసు సన్నగా ఉందని, ఆడపడుచు కట్నం తక్కువయిందని…పెళ్ళిలో అడుగడుగుకీ రభసే. కొత్త పెళ్లి కూతురి మనసుపై ఇవన్ని ఎలా ముద్రించుకుంటాయో ఏనాడైనా ఆలోచించారా?

నగలన్నీ నా సూటుకేసులో సర్ది కొంగుతో కళ్ళు తుడుచుకున్న అమ్మ చేతకానితనమంటే నాకు కోపం. ఈ పాడు కన్నీరు వదిలిపెట్టవు….
అత్తమామలతో కలిసి వుండవు. ఎక్కడో పరాయి దేశంలో ఉంటారు మీరిద్దరూ, అంతా బాగానే ఉంటుందని పలాయనాన్ని మార్గంగా నూరిపోసిన బంధు వర్గమంటే కోపం.

అన్నింటికీ మించి నేనంటే నాకు కోపం. సర్దుకుపోవాలి, అణిగిమణిగి ఉండాలనే నీతులు విని వినీ, ఆ తీరులోనే బతకాలి అనే భ్రమలో, ప్రశ్నించటాన్ని మర్చిపోయి జీవితంలోని కొన్ని వసంతాలను వ్యర్ధం చేసుకున్నందుకు.

బహుశా, వ్యథా భరితంగా గడిచిన ఆ రోజులే జీవించాలి అనే కోరికను నాలో బలంగా నాటి ఉంటాయి.

అతని మాటలు భరించాను, నిరాదరణను సహించాను….కానీ, కానీ….

మనసుని తాకలేని అతని చేతులు శరీరాన్ని నలిపేస్తుంటే, “నీకేం హక్కుందని?” ప్రశ్నించాను. రిజిడ్ అన్నాడు. అవును రిజిడ్ నే…

ప్రేమ, నమ్మకం, గౌరవం లోపించిన చోట కేవలం మాంసం ముద్దను. నీకు అవసరం, నాకు ప్రేమకు పరాకాష్ట.

ఏ బలాత్కారపు చుక్క నన్ను దాటుకుని నాలో ప్రవేశించిందో, నా రక్తాన్ని పంచుకుని నాలో స్పందనలను తీసుకొచ్చింది.

బండి పట్టా లెక్కుతుందని అమ్మ ఆశ పడింది.

“బిడ్డ మొహం చూసి….. “, మరో కోణం జతయింది. ఎన్ని కోణాలలో ఇరుక్కుపోయి నలిగిపోను?
మొహంపై ఉమ్మేసిన క్షణాలను, సంఘటనలను నాన్న చొక్కాతోనో, అమ్మ కొంగుతోనో తుడుచుకోలేను కదా! ఈ అడుగు వెయ్యటానికి సంపాదన ఇచ్చిన ఆసరా కన్నా, కష్టం నేర్పించిన తెగువ నాకు ఊతమిచ్చింది.

IIT లో సీటు వచ్చినప్పుడు గర్వం తొణికిసలాడిన నాన్న కళ్ళు, “నా బతుకు నేను బతుకుతాను” అన్ననాడు పాతాళం లోనికి వాలిపోయాయి.

పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందని చెప్పినప్పుడు ఆనందం వినిపించిన అమ్మ గొంతు, “విడిపోవాలని నిర్ణయించు కున్నాను” అన్ననాడు విషాదంతో మూగబోయింది.

వద్దు వద్దు గతంలోనికి వెళ్లొద్దు. ఆ గోతులలో తడుముకుంటూ, చీకటిని నిందిస్తూ….. వొద్దు వొద్దు.
అమ్మతో ఫోన్ లో మాట్లాడిన దగ్గర నుంచీ ఇక్కడే కూర్చున్నాను. ఈ ఆలోచనలు నన్ను వదలట్లేదు.
నన్ను రక్షించటానికే అన్నట్టు మనార్ మెయిన్ డోర్ తాళం తీసుకుని లోపలి వచ్చింది.
“ఇంకా నిద్ర పోలేదా?”, అరబ్ ఆక్సెంట్ ఇంగ్లీష్ లో అడిగింది. పలకరింపుగా నవ్వాను.
సన్నటి పిన్నులను జాగ్రత్తగా తీసి, తలకు చుట్టుకున్న హిజాబ్ ను తొలిగిస్తుంది. నేను తననే చూస్తున్నాను.
“అర్ యు అల్ రైట్”, అడిగింది. మనార్ నా మోహంలోని భావాలను ఇట్టే చదివేస్తుంది. ఎంతైనా phd స్టూడెంట్ కదా.
“చాలా లేట్ అయింది, థీసిస్ ఎంత వరకు వచ్చింది?”
“ఆల్మోస్ట్ డన్. ఐదేళ్ళ కష్టం కొలిక్కి రాబోతుంది. అలా వున్నావ్? ఇంటికి కాల్ చేశావా?”
“అమ్మ నాన్న తో మాట్లాడాను. అదే అర్థింపు. వాళ్ళ ఆత్రుత అర్థం అవుతుంది. బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్”
“ఆక్సెప్ట్ చెయ్యటానికి వాళ్లకు కొంత సమయం పడుతుంది. కాస్త ఓపిక పట్టు”, అనునయంగా అంది.
“ఐ అమ్ ఓకే మనార్. ఏవో పాత జ్ఞాపకాలు… అంతే”
“అఖిల్ నిద్రపోయాడా?”
“ఊ”
“ఇన్నాళ్ళ నుంచీ కలిసి ఉంటున్నాం. ఒకరి కష్టాలు ఒకరికి చెప్పుకుని ఓదార్పు పొందాం. వ్యవస్థను నిందించావే కానీ, ఎప్పుడూ అతని గురించి మాట్లాడలేదు”

“నేను అనుభవించిన క్షోభ మాత్రమే నాకు తెలుసు మనార్”

మనార్ నాకొక ఇన్స్పిరేషన్. కన్సర్వేటివ్ ఫ్యామిలీ నుంచీ వచ్చింది. మత ఛాందసుడైన అబ్బాయి తనను పెళ్లి చేసుకుంటానని వస్తే, మనార్ తల్లిదండ్రులు తమ కూతురి అదృష్టానికి మురిసిపోయారంట. చస్తానని బెదిరించి ఇంట్లో నుంచీ బయటకు వచ్చేసింది.
నేను ఇంటి కోసం డెస్పరేట్ గా చూస్తున్న సమయంలో నా స్నేహితురాలు మనార్ గురించి చెప్పింది. మొదట్లో మతం గురించి జంకాను. నాకప్పుడు మరో ఛాన్స్ లేక బాబుతో సహా వచ్చేసాను. అప్పటికే నా సంగతులు సూచాయిగా నా స్నేహితురాలి ద్వారా తనకు తెలిసినట్టుంది. ఎన్నాళ్ళ నుంచో పరిచయం ఉన్నట్టు నా చేతిని ఆప్యాయంగా పట్టుకుని ఇంట్లోకి ఆహ్వానించింది.

మనార్ కళ్ళలో కనిపించే వెలుగు, తన మాటల్లోని తెగువ నాకెంతో నచ్చేది. కొద్ది రోజుల్లోనే ఎంతో కాలంగా పరిచయమున్నంత స్నేహం కలిసింది మా ఇద్దరికీ. నాకెప్పుడైనా ఆఫీసులో ఆలస్యం అయితే బాబును డే కేర్ నుంచీ తనే తీసుకొచ్చి , నేను వచ్చే వరకు వాడి అవసరాలు శ్రద్ధగా చూసేది.

“మనార్, నువ్వెందుకు హిజాబ్ ధరిస్తావ్?”, అడిగానోసారి
“నవీనత్వంలో నేనెన్ని అడుగులు వేస్తున్నా, నా ముందు పరదా తెరలు ఉన్నాయన్న సత్యాన్ని మరిచిపోకుండా ఉండటానికి, ఇప్పుడా ఘోషాలు కనీకనిపించకుండా మోసం చేస్తున్నాయనే స్పృహలో ఉండటానికి”, నవ్వుతూ చెప్పింది.
మనార్ పెదవులైతే నవ్వుతున్నాయి, కానీ ఆమె కళ్ళలోని లోతులు నన్నేక్కడో తట్టాయి.

***

“అమ్మ నిన్ను చూడాలని గొడవ చేస్తుంది. ఈ వీకెండ్ వస్తావా అక్కా”, మేనత్త కూతురు రమ ఫోన్ చేసింది. రమ డెలివరీకి అత్త ఇండియా నుంచీ వచ్చింది.
నేను, అఖిల్ వెళ్ళాము.

అఖిల్ బుగ్గలను ముద్దాడి, నన్ను కౌగిలించుకుంది. అత్త కళ్ళలో సన్నటి తడి… నా కళ్ళలో కూడా…
కుశల ప్రశ్నలు, అక్కడి ఇక్కడి ముచ్చట్లు అయ్యాక…. అమ్మ పంపించిన ప్యాకెట్ నా చేతికందిస్తూ, “అమ్మా, నాన్నా చాలా బెంగపెట్టుకున్నారమ్మా”, అంది అత్త.

నా కెంతో ఇష్టమైన అరిసలు, అఖిల్ కు బట్టలు పంపించింది అమ్మ.
“నీకు తెలియనిదేముంది అమ్ములు, పిల్లాడున్నాడని ఏ సంబంధాలు రావట్లేదు. రాక రాక వచ్చిన సంబంధాన్ని కాదంటున్నావంట కదా! అబ్బాయి గురించి వాకబు చేసాం. కుటుంబమూ మంచిదేనంట. మొదటి పెళ్ళిలోని అమ్మయికి ఏవో తేడాలున్నయంట. అబ్బాయి బుద్ధిమంతుడు. ఆలోచించమ్మా”

“అత్తా, ప్లీజ్”
“అఖిల్, మనిద్దరం పజిల్ ఆడుకుందాం రా”, రమ అఖిల్ ను తీసుకుని పక్క గదిలోకి వెళ్ళింది.
“అంత మొండి పట్టుదల ఉండకూడదు అమ్ములు. ఆడవాళ్ళం అన్నాక సర్దుకుపోవాలి. అందరూ నీలా పెళ్లి చేసుకోము అంటే సృష్టి సాగుతుందా?”, అత్త గొంతులో కోపం, అసహనం వినిపిస్తున్నాయి.
“సృష్టి భారమంతా నా పైనే ఉన్నట్టు త్యాగాల మూటను నా వీపుకు తగిలించకు అత్తా. నా భారాన్ని నన్ను సమర్థంగా మోసుకోనీ ముందు ”, నవ్వుతూనే అన్నాను.

“ఎప్పటికీ ఇలాగే ఉండిపోతావా?”, ఆర్తిగా అడిగింది అత్త.
“అలా ఏం లేదత్తా. మనసుని హత్తుకునే తోడు దొరికినప్పుడు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. పెళ్లి కోసం వ్యక్తిని వెతకటం, లాభనష్టాలు ఆలోచించి, బేరసారాలతో పడే ముడిని బంధమనుకునే భ్రమలో నేను లేను”
“దేశం కాని దేశంలో ఒంటరిగా ఉంటున్నావు”
“దేశం కాని దేశం కాబట్టే నా బతుకు నేను బతకగలుగుతున్నానేమో అత్తా! వ్యక్తిగత జీవితంలోకి ఎవరు చొచ్చుకు వచ్చేయ్యరు ఇక్కడ. అమ్మ నాన్న అక్కడకు వచ్చెయ్యమని ఎంత గొడవ చేసినా రానిది అందుకే”
“అమ్మా, ఇంక ఆపేశేయ్. అక్కకు తెలుసులే”, అఖిల్ ను పక్క గదిలో వదిలి వచ్చింది రమ.
“అత్త, మరోలా అనుకోకు. మీరందరూ నా మంచి కోరే ఇదంతా చెపుతున్నారని నాకు తెలుసు. మన సంస్కృతి, సంప్రదాయం, పెళ్లి, సంసారం అంటూ మీరెన్ని చెప్పినా నా అనుభవాల పాఠాలే నా నిర్ణయాలకు కారణం. అమ్మ నాన్నకు చెప్పు నేను ఇక్కడ బాగానే వున్నానని”, అత్త చేతిని నిమురుతూ అన్నాను.

“అమ్మ, అక్క ఇక్కడేదో కష్టాలు పడిపోతుంది అని అనుకోకండి. షి ఇస్ డూయింగ్ ప్రెట్టి గుడ్. ఇదిగో మీరిలా ఒత్తిడి తెచ్చినప్పుడు అత్తయ్య మామయ్యా తన మూలాన బాధ పడుతున్నారే అని తను కూడా అప్సేట్ అవుతుంది. ఇంక ఈ టాపిక్ ను వదిలెయ్యండమ్మా”, రమ ఆనకట్ట వేసింది.

అత్త ఏం చెప్పిందో, అమ్మా, నాన్నా మరెప్పుడూ పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు.

***

“లివ్ ఇన్ రిలేషన్ గురించి నీ అభిప్రాయం ఏంటి?”, మనార్ ఓ రోజు అడిగింది. యధాలాపంగా అడగలేదు, ఎదో ఆలోచనతోనే ప్రశ్నించింది.

“లివ్ ఇన్ రేలేషన్ అయినా, పెళ్ళైనా జనరలైజ్ చేసి ఇది మంచి ఇది చెడు అని తేల్చేయ్యలేం. ఆయా వ్యక్తులపై, వారి బంధంపై ఆదారపడే విషయం ఇది”

“జెఫ్ ప్రపోస్ చేసాడు. ఐ లవ్ హిం టూ ”, అంది మనార్.

“మరేంటి ఆలోచన?”, అడిగాను.

“రిలేషన్ ను లీగలైజ్ చెయ్యటం ఎందుకు అని ఏదో ఆలోచన….అంతే”, మనార్ కళ్ళు నవ్వుతున్నాయి.

“మరీ ఎక్కువ ఆలోచించి బుర్రపాడు చేసుకోకు. ఒకరిపై ఒకరికి ప్రేమ, నమ్మకం, గౌరవం ఉంటే చాలు…నీకు తెలీనిదేమీ కాదుగా”

“జెఫ్ పెళ్లి చేసుకుందాం అన్నాడు. బాబా (నాన్న) నాతో మాట్లాడరు. మామాకు (అమ్మకు) కాల్ చేసి చెప్పాను. నా కారణంగా వెలివేయబడ్డారంట. మామా శాపనార్ధాలు పెట్టింది.”

“పోన్లే మనార్. ఈ ఇల్లే నీ పుట్టిల్లనుకో. పుట్టింటివారు పెళ్లి కూతురికి ఏమేం పెడతారో చెప్పు. నేను ఉన్నాను కదా”, మనార్ చేతిని అందుకుంటూ అన్నాను.

“యు నో వాట్! మా మతంలో అమ్మాయిలు కట్నాలు ఇవ్వరు తెలుసా. బట్టల దగ్గర నుంచీ సామాను వరకు జెఫ్ కొనాలి”, నవ్వేసింది.

***

రోజులు వేగంగా గడిచిపోతున్నాయి.

సింగల్ మదర్ అనే సెల్ఫ్ సింపతీ నా దరికి చేరకుండా ఎంత జాగ్రత్త పడుతున్నా , తల్లి పాత్రను సరిగ్గా నిర్వహిస్తున్నానా అనే సంశయం నన్ను వేధిస్తూ ఉండేది. తండ్రి పాత్ర లేదనే గిల్టీ ఫీలింగ్ నాలో ఏమూలనో ఉండేది అనుకుంటా! ప్రేమ, బాధ్యత పదింతలుగా నా దినచర్య అఖిల్ చుట్టూ తిరిగేది.

మదర్స్ డే రోజున స్కూల్లో వక్తృత్వ పోటీ నిర్వహించారు. పని ఒత్తిడి వలన అఖిల్ ను ఆ కాంపిటిషన్ కు ప్రిపేర్ చెయ్యలేక పోయాను.
అ రోజు ఒక అర్జెంట్ మీటింగ్ లో ఉండగా అఖిల్ టీచర్ ఫోన్ చేసారు. ఏమైందో అనుకుంటూ కంగారుగా ఫోన్ ఎత్తాను.

“Your son gave an extraordinary speech on you, we all had tears “

నా ఆనందమంత కప్పును తీసుకొచ్చి నా ఒళ్లో పెట్టాడు, “అమ్మా నేను గెలిచాను”, అనుకుంటూ.

“నేను నేర్పించలేకపోయానురా కన్నా”, కప్పును నిమురుతూ అన్నాను.

“కొత్తగా నేర్చుకునేదేముంది మామ్. రోజూ నిన్ను చూస్తూనే ఉన్నానుగా “, ఆ క్షణం వాడిని కౌగలించుకుని మనసారా ఏడ్చేసాను .

ఆ చిన్న సంఘటన నాలోని భయాలను, సంశయాలను దూరం చేసేసింది.

***

రెండేళ్ళు గిర్రున తిరిగిపోయాయి. నాన్న కాలం చేసారు. ఇప్పుడు అమ్మ నాతోనే ఉంటుంది. జెఫ్ ఉద్యోగరీత్యా వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయినా, మనార్ తో రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాను. ఎందుకో ఈ మధ్య మనార్ డల్ గా మాట్లాడుతుంది.

హఠాత్తుగా ఒక అర్థరాత్రి మనార్ తలుపు తట్టింది. తన కళ్ళలో ఎర్ర జీరలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బయట చలి తీవ్రంగా ఉంది. మంచు తుఫాను సూచనలనుకుంటా.

“ధృఢమైన వ్యక్తిత్వం……”, చెప్పబోతున్నది ఆపేసి ముఖాన్ని అరచేతుల్లో దాచుకుంది. ఏడుస్తుందేమోనని తన భుజంపై చెయ్యి వేసాను ఓదార్పుగా.

మనార్ దుఃఖించట్లేదు, భంగపడిన తన ఆశలను ఓదార్చుకుంటుంది.

“నా హిజాబ్…”, తన స్కార్ఫ్ ను చూపిస్తూ, “ఈ పరదా ముస్లిం స్త్రీలు మాత్రమే ధరించట్లేదు అమూల్య. తమకంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పరుచుకున్నా కూడా ఈ నాటికీ స్త్రీలు మోస్తున్న భారం ఇది. ఈ భారానికి మత, ప్రాంత బేధాలు లేవని జెఫ్ నిరూపించాడు. ఒకప్పుడు నా ధైర్యాన్ని, తెలివితేటలను, చదువును చూసి ప్రేమించిన జెఫ్, ఇప్పుడు ఇన్ఫీరియారిటి కాంప్లెక్స్ తోనో లేక ఇన్సెక్యూరిటీతోనో బాధపడుతున్నాడు. ప్రేమగా లాలిద్దామని ప్రయత్నించాను. అతని అహం ఇనుపగోడలను కట్టేసింది.”, అంది మనార్.

ఈ మంచు తుఫాన్ నన్ను కుదిపేసింది. ఒకప్పటి నా ప్రశ్నలు నన్ను ఎదురు ప్రశ్నించాయి. అమ్మ ఒళ్లో తలపెట్టి చాలా సేపు ఉండిపోయాను. ఆనాటి నా కోపాలు నన్ను వెక్కిరించాయి….జాలిగా చూసాయి!

“ఎవర్ని తప్పుపడదాం మనార్?”

“నువ్వే చెప్పు అమూల్య….. వ్యవస్థనా? మనుష్యులనా?”

ప్రశ్నను ప్రశ్నించే మరో ప్రశ్నకు ఏం సమాధానం చెప్పను?

“వ్యవస్థ తయారు చేసిన మనుష్యులను, వ్యవస్థను తయారు చేసిన మనుష్యులను”, రాజ్ ఏ విషయాన్నైనా తేలికగా చెప్పేస్తాడు.
“అందర్నీ కట్టగట్టి తిట్టేసావ్. ఇంక మిగిలిందెవరు?” రాజ్ సీరియస్ గా అంటాడో, జోక్ చేస్తాడో ఒక పట్టాన అర్థం కాదు.

“ఎవరినీ పూర్తిగా తప్పు పట్టలేదు. అందర్నీ కొంత విమర్శించాను. మార్పు అందరిలోనూ, అన్నిట్లోనూ మొదలైంది”.

రాజ్ ఎప్పుడు పరిచయం అయ్యాడో గుర్తు లేదు. వీక్ ఎండ్ పార్టీలలో చాలాసార్లు చూసాను అతన్ని. ఢిల్లీ లో పుట్టి పెరిగాడు. స్టూడెంట్ గా వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యాడు.

ఒకానొక చర్చలో, “స్త్రీ కష్టం సమాజానికి కనిపిస్తుంది, అదే పురుషుడి కష్టం ఎవరికీ పట్టదు”, అన్నాడు. మొదటిసారి అతన్ని నిశితంగా చూసాను. అతని అభిప్రాయాన్ని విభేదిస్తూ, “స్త్రీల కష్టాలను అసలు కష్టాలుగా గుర్తించదు ఈ సమాజం” అన్నాను.

ఆ చర్చ తర్వాత అనుకోకుండా ఒకటి రెండుసార్లు కలిసాను అతన్ని. రాజ్ తో సంభాషణ ఆసక్తికరంగా ఉంటుంది. అతని మాటలు సూటిగా, నిక్కచ్చిగా ఉంటాయి. తెలిసిన విషయాలనే కొత్త కోణాలలో చూపిస్తాడు.

“కాపురం చెడితే మొగాడ్ని కౄరుడుగా చిత్రిస్తారు. పెళ్ళాం సానుభూతితో ఓదార్పు పొందుతుంది. నాణానికి మరో వైపు కూడా ఉంటుంది”, అన్నాడోసారి. నేను మౌనంగా అతను చెప్పింది విన్నాను.

రాజ్ ఎప్పుడు ఇంత దగ్గరయ్యడో గమనించనే లేదు, కష్టసుఖాలు పంచుకునే స్నేహం మా మధ్యన ఉంది.

***

ఆ రోజు వీక్లీ గ్రోసరీ షాపింగ్ ముగించుకుని కారు దగ్గరకు వెళ్లేసరికి, చిద్విలాసంగా నవ్వుతూ నా కారుకు ఆనుకుని నుంచుని ఉన్నాడు రాజ్.
“నువ్వేంటి ఇక్కడున్నావ్”, ఆశ్చర్యంగా అడిగాను.

“నీతో అర్జెంటుగా మాట్లాడాలి అమూల్య. chat చాట్ తింటూ మాట్లాడుకుందామా”, సుడిగాలికి మరో రూపం రాజ్.

“ Is everything ok raj?”, chat చాట్ ప్లేట్ అందుకుంటూ ఆందోళనగా అడిగాను.

“అల్ ఇస్ వెల్”, ఒక్క నిమిషం ఆగాడు… “మీతో ఒక విషయం మాట్లాడాలని ఇక్కడకు తీసుకొచ్చాను”.

“నీకు తెలుసు కదా, ముప్పై దాటి మూడేళ్ళు ఇంకా నిండనే లేదు, వయసు దాటిపోతుంది అని మా ఇంట్లో తెగ కంగారు పడిపోతున్నారు. యుద్ధ ప్రాతిపదికన పెళ్లి చేసెయ్యాలని కంకణం కట్టుకున్నారు.”

“నా రికమండేషన్ ఏమన్నా కావాలా ఏంటి?”, నవ్వుతూ అడిగాను.

“అందుకేగా నీ దగ్గకు వచ్చింది. లెట్స్ బి సీరియస్”

“అబ్బో..హహ్హ, చెప్పు ఏం చెయ్యమంటావో?”

“అమూల్య…. ఎప్పుడు నాలో ఈ ఫీలింగ్ మొదలైందో తెలీదు. I am in love with you, నీకు ఇష్టమైతే, లెట్స్ గెట్ మారీడ్”, నా కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు.

ఒక్క క్షణం బిత్తరపోయాను.

“నువ్వు నాకంటే చిన్నవాడివి రాజ్”

“తెలుసు, మూడేళ్ళ చిన్నవాడిని. అదో పేద్ద విషయం కాదు”, అతన్ని ఆశ్చర్యంగా చూస్తున్నాను.

“టెల్ మి వన్ థింగ్ అమ్ములు. నీకు నేనంటే ఇష్టం లేదూ?”, సూటిగా నా కళ్ళలోకి చూస్తూ అడిగాడు. మనసుకు దగ్గరగా మాట్లాడుతున్నప్పుడు అమ్ములు అంటాడు.
అతని కళ్ళలో కనిపించే ప్రేమ నాకు తెలియందా? అతని సాంగత్యంలో సేద తీరే నా మనసు అతనిని కోరుకోలేదూ? అట్టడుగు పొరలలో నిక్షిప్తమైన భావాలలో చిన్నపాటి కదలిక.

“అఖిల్…”

“నేనూ మంచివాడినే ”, నా మాటను మధ్యలోనే ఆపేస్తూ అన్నాడు.

“అలసిన శరీరంతో మంచంపై వాలాక, నిద్రలోకి జారుకునే లోపు ఒక చిన్నపాటి ఒంటరితనం వుంటుంది. ఇట్స్ నాట్ అబౌట్….”, నా మాట పూర్తవనే లేదు.

“ఐ నో అమూల్య. నీ లైఫ్ నీ చాయిస్. ఆ చాయిస్ లోని చిన్నపాటి లోటుని నన్ను పూరించనీ. అందులో నా స్వార్థం కూడా ఉంది. మగాడు చెప్పుకోడు కానీ స్త్రీ ప్రేమ లేకుండా మనలేడు”

చిన్నగా మొదలైన కదలిక వెల్లువై నన్ను ముంచెత్తింది. ప్రేమగా, మనస్ఫూర్తిగా రాజ్ చేతిని ముద్దాడాను.