సమీక్ష

అపనమ్మకం ఆగిపోయే సందర్భం: ఆకుపచ్చ దేశం

07-జూన్-2013

కొన్ని పుస్తకాలుంటాయి. చదివాక ఎవరితోనైనా ఏమైనా చెప్పాలని బలమైన కోరిక పుడుతుంది. చెప్పకుండా ఉండడం కుదరదు. డాక్టర్ వి చంద్రశేఖర రావు ‘ఆకుపచ్చ దేశం’ చదివాక అలా అనిపించింది. అంతర్ బహిర్ స్వప్నభంగాల వల్ల నవలను ఒకేసారి చదవకపోవచ్చు నాలాగే ఎవరేనా. మూడు నాలుగు సార్లు ఆపి చదవొచ్చు. చదవకుండా ఉండలేరు. ఇది ఇలాంటి నవల రచన/పఠన పద్ధతిలోనే ఒక భాగం కావొచ్చు. కథ మొదలైనప్పట్నుంచి చివరి వరకు ఎక్కడా ఆగని ఒక ధార ఆశ్చర్యపరుస్తుంది.

రచయిత తన పనిలో తాను తన్మయుడై వుండే సమయాన్ని ‘సమాధ్యవస్థ’ అంటారనుకుంటా. తనదైన ఒక ‘సమాధి’ లోనికి వెళిపోయి ఇక అదే మూడ్ లో ఉండిపోయే ఒక అద్భుత సమయం. చంద్రశేఖర రావు అలాంటి అద్భుత సమయంలో నూట నలభై పేజీల పాటు ఉండిపోయాడని నాకు నమ్మకం కలిగింది. కొన్ని నవలలు అలా అనిపించవు. రచయిత రాయడం అక్కడక్కడ ఆపి, మళ్లీ దారం పట్టుకుని తిరిగి తిరిగి పయనించాడని అనిపిస్తుంది. చంద్రశేఖర రావు ‘ఆకుపచ్చ దేశం’ దానికి భిన్నం. ‘దేశ’మని అన్నాడు గాని, చదివినంత సేపూ ఒక ఊరిలో వున్నట్టుంటుంది. మనల్ని మనం మరిచిపోయి ఒక ఊరి బజార్లు తిరుగుతాం.

ఇలా ఉండడానికి కారణం శైలి. పునరావృతం, పునరావృత్తం అనిపించే దృశ్యాలు, పదాలు. ఆ దృశ్యాలు నిజంగా అడివిలో ఉంటాయా ఉండవా అని ఆగి వివాదపడ్డానికి, ఆగడానికి మనసు ఒప్పుకోదు. ఉదాహరణకు మిణుగురు పురుగులు పాడుతాయా? కీచురాళ్ల మాదిరి అవి అరుస్తాయా? నాకైతే తెలియదు. అరవవేమో. కాని, ప్రత్యేకించి ఆగి, ఆ సంగతి నిగ్గు తేల్చుకోవాలని అనిపించదు. పాడవేమో, పాడుతాయేమో; నాకెందుకు, ఆ మాట ఇక్కడ బాగుంది. మిణుగురు పురుగుల పాట మనకు వినిపిస్తుంది.

చెంచులు ఓ అరవై మంది అడివిని వదిలేసి అడివి సరిహద్దుల్లోని మైదానంలో బతకాలని అభివృద్ధి-రాజకీయులు (అలల సుందరం తదితరులు) శాసిస్తారు. గిరిజనులు వినరు. వినక అక్కడే గిరి గీసి తెగించరు. అడివిలో లోతట్టుకు, అక్కడి నుంచి వెళ్లగొడితే ఇంకా లోతట్టుకు పయనమై వెళిపోతారు. ఎంత లోతట్టుకు వెళ్లినా, తిరిగి అమ్మ పొట్టలోకి వెళ్లలేరు కదా. ఎంతటి లోతట్టూ వాళ్లకు నిజమైన, సురక్షితమైన లోతట్టు కాదు. ఎక్కడికైనా విస్తరించే పంజా ‘అలల సుందరం’దీ ఆయన వెనుక నున్న రకరకాల ముసుగు మనుషులదీ. అయినా, గిరిజనులు ఆగరు. నడవడం ఆపరు. ఎక్కడా ఆగక వెళిపోతారు. చనిపోతామని తెలిసీ వెళ్తారు. చనిపోతూ వెళ్తారు. ఈలోగా దొరికితే కంద మూలాలు, అవి లేకుంటే ఏమీ తినరు. వాళ్ల దగ్గరికి తెచ్చిన అన్నం కూడా తినరు. ఇదంతా తెగింపులా అనిపించదు. తెగింపు కాదనీ అనిపించదు. ఆ రెండూ కాని ఒక సహజ చేతన నడిపిస్తే నడుస్తారు వాళ్లు. నిరసన అనే మాట తెలియని సహజ సిద్ధమైన నిరసన అనొచ్చేమో దీన్ని. అలా తినకుండా, అడుగుకొకరు చనిపోతూ మనుషులు వెళ్తారా? బతికుండగా దీన్నుంచి తప్పించుకునే ఆశలు లేవని తెలిసీ మనుషులు నడుస్తారా? నవల చదువుతున్నంత సేపూ, ఆ తరువాత కూడా ఆ సందేహం రాదు. వచ్చినా, కథకు చదువరికి మధ్య అడ్డు తెరగా ఉండదు.

చదివాక వచ్చే ఈ ప్రశ్నకు తోచే ఒక చిరు సమాధానం: గెలిచే అవకాశం లేదని తెలిసీ, చనిపోతామని తెలిసీ కొన్ని పోరాటాలలో…. ముఖ్యంగా గిరిజనులతో కూడిన పోరాటాలలో కొందరు మనుషులు నడవడం లేదూ? అడుగడుగున చనిపోతున్నా ఆగక పయనించడం లేదూ? దాన్ని ఏ హేతువాదం వివరించగలదు? అలాంటప్పుడు ‘ఆకుపచ్చ దేశం’ లోని అరవై మంది గిరిజనుల పయనం మీద సందేహమెందుకు? అంతటి బలమైన కోరిక మనకు లేదు, అంతే. అంతటి బలమైన కోరక మనకు అనుభవైక వేద్యం కాదంతే.

నవలలో వీర అనే అబ్బాయి పాత్ర మరొక అద్భుతం. ఇది పాట లోపలి పాట. పునః పునః పునరావృతమయ్యే పల్లవి. ఉస్మానియాలో ఎమ్మే, పిహెచ్ డి చేసిన యువకుడు వీర. తల్లిని… ఆమెకు తన కలల్లో తను పెట్టుకున్న పేరుతో ఒక ‘చామంతి’ని… వెదుక్కుంటూ వెళ్తాడు. తనకు గొప్ప యువ ప్రేమనిచ్చిన మోహిని వాళ్ల ‘ఎన్ జీ వో’ తరఫున పంపిస్తే వెళ్తాడు. కాని అతడి అసలు మోటివ్ అమ్మ, అమ్మ లాంటి అడివి. వెళ్లిన కొద్ది కాలంలోనే ‘లాభదాయక’మైన ఎన్ జీ వో పనిని వదిలేసి, అన్నాళ్లకు చేరువ అయిన గిరిజనులతో కలిసిపోయి, మొదట వాళ్లను తన హేతుబుద్ధితో ఒప్పించబోయి, తానే వాళ్ల హేత్వేతర బుద్ధికి తన్మయుడై , వాళ్ల దీర్ఘ పయనంలో ఒకడవుతాడు. తాటి మట్టను చీరినట్టు తన ఒంటిని చీరేసినా, బ్లేడ్లతో చర్మం వలిచేసినా తన వాళ్లను వదలక నడుస్తాడు.

అద్భుతం, అవాస్తవం అనిపించే మహా వాస్తవం వీర. వీర స్వయంగా గిరిజనుడు, చిన్న నాడే వేర్లు పోగొట్టుకున్నా వాటిని కలల్లో దాచుకున్న వాడు. తమదైన బతుకు మీద తీవ్ర కాంక్షతో చావు, పెళ్లి, జబ్బు దేన్నీ పట్టించుకోకుండా పయనించే గిరిజనులను చూశాక, కొన్నాళ్లు వాళ్లతో కలిసి నడిచాక, వీర గిరిజనేతర యువకుడై వుండినా అలాగే ప్రవర్తించే వాడని అనిపిస్తుంది. కొందరు అలా ప్రవర్తిస్తారు. అదంతే. దానికి ఉదాహరణలు కొల్లలు. ఇక, ‘వీర అలా చేస్తాడా’ అని సందేహమెందుకు?

చంద్రశేఖర రావు మిగతా నవలలు కథల్లోనూ ఉండే ఒక రకం కవిత్వ శైలి, ‘దుఃఖపు పాట’, ‘ఏడుపు పాట’ వంటి మెటఫర్లు అవే అవే పదే పదే వస్తాయి. ఈ నవల చదువుతున్నప్పుడు పదాల పునరావృతి మీద ఫిర్యాదు కలగదు. మీ మితృలు మీ పేరును పదే పదే ఉపయోగిస్తారు, వినడం విసుగనిపిస్తుందా మీకు? ఇదీ అలాంటిదే. ఔను అక్కడ ఉన్నది దుఃఖమే, ఆ దుఃఖం ఒక పాట లాగే ఉంటుంది. ఈ ఫీలింగ్ మనకు వుండటం వల్లనే అనుకుంటాను; అలాంటి మాటలను ఎన్ని సార్లు వాడినా విసుగేయదు. వాటిని వాడిన ప్రతిసారీ ఒక అపరిష్కృత సమస్య తిరిగి తిరిగి పడగ విప్పినట్టుంటుందే గాని, అదేమిటని అడగాలని అనిపించదు.

అడివి కావడం వల్ల, పాటకు చేరువ అయిన గిరిజనులు కావడం వల్ల, నవల ఒక పాటలా, దుఖపు పాటగా సాగిపోతుంది. కథలో బతుకు కలగలిసినట్టుంటుంది. రెండింటిని వేరు చేయలేం. ఇది ఫ్యాంటసీ ఇది నిజం అని విడదీయలేం. ఇది ‘అపనమ్మకాన్ని’ (డిస్ బిలీఫ్ ని) కాసేపు, కాదు, చాల సేపు, కాదు, ఎప్పటికీ ఆపేసే (సస్పెండ్ చేసే) నవల. ఇందులో నిజం ఉంది, ప్రయోజనమూ ఉంది. మీరూ నేనూ తరమబడడం లేదూ? ఇంకెక్కడికీ వెళ్ల లేక, ఏమీ చేయలేక చావు వంటి తీవ్ర విషయాల్లో కూడా నిర్లిప్తులమైపోవడం లేదూ? ఈ ఆరవై మంది గిరిజనుల కథ మనది కాదూ?

06-12-2012.