కవిత్వం

విగ్రహాల్నిపగలగొట్టే వాడి కోసం…

07-జూన్-2013

1

నాకు సాయంత్రమూ
నీకు ఉదయమూ అయిన సమయంలో,

ముఖమూ కాని,
పుస్తకమూ లేని
ఒకా నొక చీకటి స్థలంలో ,

నువ్వు లేవన్న వార్త విని

దుఃఖమూ కాని వ్యథా లేని
లుంగలు చుట్టిన బాధతో
లిప్త పాటు నిశ్శబ్దమయ్యాను.

2

తీరని బాధా కాదు ఎడతెగని శోకమూ లేదు
యేదో సన్నగా కోస్తున్న నెత్తుటి పొడి రాల్తున్న చప్పుడు.

యెడతెగని కంఠధారల పాటల వర్షమై,
నిర్నిద్ర కవిత్వపు కెరటాల సముద్రమై,
యెప్పుడూ శబ్దమైన నువ్వు ఇట్లా హఠాత్తుగా నిశ్సబ్దమయితే
భరించడం కష్టంగా ఉంది – చెవులు చిల్లులు పడుతున్నయి.

3

అయినా నువ్వెప్పుడో కదా వెళ్ళిపోయావు
మా భద్రలోక జీవితాల్లోంచి, మడి కట్టుకున్న మా విలువల్లోంచి,

బహురూపుల బతుకును దాచుకుంటూ
మోసకారిగా బతికే మా ముసుగుల్లోంచి
యెప్పుడో కాదూ వెళ్ళిపోయావు విస విసా …..

వ్యవస్థీకృత వ్యూహాల్లో అంటరానివాడివై
ఆధిపత్యాన్ని ఆత్మహననంతో ధిక్కరిస్తూ
యెప్పుడో కాదూ వెళ్ళిపోయావు రుస రుసా….

కాలి బూడిదవుతున్న కాంక్షాగ్రహాల్తో
పాతుకుపోయిన ‘బ్రాహ్మనీకపు’ వెయ్యిపడగల్ని యెడంకాలితో తన్నేసి
కమిలిపోతున్న నిజాయితీ తో ‘చిన్నదేవుళ్ళ’ ని నిలబెడుతూ
యెక్కడికో వచ్చేసావు కదూ వడి వడిగా ….

4

యెందుకో నువ్వున్నప్పుడు,
పలకరించాలంటే బుగులేసేది
యేదో అడ్డమొచ్చేది గొంతుకు -
యేదో గుచ్చుకునేది భద్రత ముళ్ళ కంచెలు అలవాటైన కనుపాపలకు …
యెక్కడో అనుమానం భరించలేనేమోనని
భగ్గుమనే సాయంత్రాల తొట్లలోని అనాచ్చాదిత మల్లెపూలని …..

5

యిప్పుడింక

యెవరు పిలుస్తారు లోనికి
లోలోపల సుళ్ళు తిరిగే నువ్వు లేనితనాన్ని

యెవరు ఊడ్చేస్తారు బయటికి
నువ్వున్నా పలకరించని మా మర్యాదల్ని

యెవరు ఖననం చేస్తారు నగరం నడిబొడ్డులో
వూరి బయట కరెన్సీ నోట్లమంటల్లో సారాయి కాచుకునే కలల బైరాగి శిథిల శరీరాన్ని

యెవరు చెప్తారు వూరంతా గుండెలవిసేటట్టు
నువ్విక్కడే యెక్కడో
యేవో విగ్రహాలని పగలగొడ్తనే ఉన్నవని

యెవరు ఊదుతారు ఊపిరితిత్తులు పగిలేటట్టు
నువ్వొదిలి పోయిన అపురూపమైన ఈ వెదురు బొంగుల్ని