కవిత్వం

స్వాగతం చెప్పవలసిందే!

21-జూన్-2013

కలం కన్నీరు పెట్టుకుంది.
అవును నిజమే!
కాగితం మీద తన నాట్యం ఆగి పోయిందని
కలం కన్నీరు పెట్టుకుంది.
చిట్టెలుక శరం ధరించి
గాజు తెర మీద చిందులు వేస్తుంటే
బిత్తర పోయి కలం కన్నీరు పెట్టుకుంది.
క్షరం లేదనకున్న అక్షరాలు
కాగితం మీద క్షరించి
అంతర్జాలంలో ప్రత్యక్షమైతే
కలం కన్నీరు పెట్టుకుంది.
ఆటంకం లేదనుకున్న ఘంటం
నీ రాకతో నాడు చిత్తై పోలేదా?
గతం ఎప్పుడైనా కాల గర్భంలో కలిసి పోవలసిందే
క్రొత్తకు గొంగ్రొత్తగా స్వాగతం చెప్ప వలసిందే!