కవిత్వం

ఎన్నాళ్ళయిందో

28-జూన్-2013

ఉదయపు నిద్రలో జోగే ఆ బాల్యపు తార్రోడ్డు నిలువెల్లా
కెరటాల్లా పరచిన వలిపెపు మంచు తెరలపై
చినుకుల్లా రాలిపడే పున్నాగ దరహాసాలను
మసక చీకటి ఏకాంతాన మనసారా ఏరుకుని
ఎన్నాళ్ళయిందో

అనాది కాలపు ఆత్మవంచనలు పీల్చుకుంటూ
గొంతు దిగని అవమాన గరళాల్లో దహించుకుంటూ
తాగివాగే ప్రేలాపనల అంపశయ్యపై వెల్లకిలా పరచుకుంటూ
ఈ మధ్య కాలాన కాకెంగిలి చూపుల కల్మషాల్లో అభిషిక్తమైన
ఆత్మాభిమానం ప్రక్షాళించుకుంటూ
దిగంతాల వరకూ వెదజల్లిన పూరెక్కల సౌకుమార్యం
రాత్రికి రాత్రే కంటికి కనిపించకుండా
కడుపారా ఆరగిస్తున్నగొంగడి పురుగుల పిల్లలకు
బలిచేస్తూ ఎన్నాళ్ళిలాగ ?

అడుగడుగునా అల్లుకుపోయిన
అపహాస్యపు ముళ్ళతీగలను పెకిలించుకుంటూ
పాదాలకింద మొలిచే తుమ్మ చెట్ల నాగరికుల
మాటల చురకత్తి మొనల గాయాలను ఊదుకుంటూ
నరికేసినా మళ్ళీ మళ్ళీ మొలిచే
రెండు తలలపాములను తప్పుకుంటూ
వశం తప్పిన సహనం

వానపాముల సౌమ్యం వదిలి పడగలు మొలిచే వరకూ
కొండలై నీడనిచ్చే బదులు
రాతిపాదాలకింద సమాధులు కట్టే వరకూ
ప్రళయ భీకర వరద వెల్లువలై ప్రవాహాలవండి
ఎన్నాళ్ళిలాగ ఊట బావులై దాహార్తిని తీర్చే
అమృత ఝరులై అరచేతి స్వర్గాలై ………
పచ్చిక బయళ్ళలా పక్షులకు రెక్కలిస్తారు
బూతులు స్రవించే నాలుకలు నరికేందుకు
కాఠిన్యం పదును పెట్టుకునే ఆకురాయి ముక్కలు కండి
ఒక విభ్రమలోంచి మిమ్మల్ని మీరు నిర్వచించుకొండి
ఎన్నాళ్ళకయినా