ఎందుకట్లా అని నన్ను నువ్వు ప్రశ్నిస్తున్నావ్ . ఆ ప్రశ్నకు నేనేమీ సమాధానం చెప్పలేను. ఎందుకంటే సమాధానం నాకు తెలీనే తెలీదు. సమాధానం చెప్పలేక పోగా ఎందుకట్లా అని నేనే నిన్ను ప్రశ్నిస్తాను. నా పేరేమిటి అంటావా ? నా పేరుతో నీకేం పని ? నీవు ప్రశ్నిస్తున్న విషయానికి నా పేరే పెట్టాల్సిన పనిలేదు. ఈ లోకం లోని శతకోటి మందిలో నేనూ ఒకడిని , పోనీ పేరు నీకంత ప్రాముఖ్యమనుకుంటే ఏ రాజారాం అనో శరవణన్ అనో ఏదో ఒకటి వేసుకో , ఏ పేరు వేసుకున్నా నీవు రాయబోయే కథకి రంగు, రూపు ఏమీ పలుచబారదు. ఆ భరోసాని నీకివ్వగలను నేను.
మేం సంపన్నులమా, పేదవాళ్ళమా లేదా నేను కుసంస్కారినా సంస్కారినా ,విద్యావంతుడినా , చదువు రాని వాడినా కూడా నీ కథకేమీ పనికి రాదు. కావాలనుకుంటే డా. రాజారాం అనుకోవచ్చు లేదంటే రిక్షా శరవణన్ అనుకోవచ్చు నీ ఇష్టం. పోనీ ప్రస్తుతానికి నీ సౌలభ్యo కోసం డా. రాజారాం అనుకో . ఆ రకంగా కథ మొదలెడదాం .
నాకప్పుడు ఇరవై రెండేళ్ళు. ఇరవై రెండేళ్ళు వచ్చేవరకు విరివిగా చదవడం, క్రికెట్ ఆడటం, మంచి బట్టలు, మంచి మోటారు బండ్లు కొనుక్కోవడం నాకు అత్యంత ఆసక్తికరమైన విషయాలు. ఆ…. ఇంకోటి కూడా వుంది. నాకు కళలంటే అత్యంత ప్రీతి. ఈ నా ప్రీతిని మా ఇంట్లో వాళ్ళు గొప్పగా యేమీ ఆమోదించే వారు కాదు. అయినా వారి ఆమోద అనామోదాల్ని నేను పట్టించుకునేవాడ్ని కాదు. నా అభిరుచి ప్రకారం నేను ముందుకు నడిచేవాడిని.
అదిగో ఆ వయసులో నా సహవిద్యార్థినీ విద్యార్థులందరితో కలిసి భారతదేశ యాత్ర ఒకటి పెట్టుకున్నాం. దాదాపు రెండు నెలల యాత్ర అది. ప్రఖ్యాత ప్రదేశం దగ్గర ఒక్కో రోజు ఆగుతూ చూస్తూ మళ్ళీ ప్రయాణిస్తూ అట్లా వెళ్ళేవాళ్ళం. భారతదేశ నిజ సౌందర్యాన్ని నా రెండు కన్నుల నిండా చూస్తూ హృదయమారా అనుభవిస్తూ కొత్త కొత్త ప్రదేశాల నూత్న వినూత్న గాలులని ఆఘ్రాణిస్తూ వస్తున్నాను. అటు తిరిగి ఇటు తిరిగి తమిళనాడు రాష్ట్రానికి వచ్చాం.
నా పొరుగునే వున్న ఆ రాష్ట్రం అంత సౌందర్యం కలదని నాకెప్పుడూ తెలీదు. ప్రతి ఊరిలోనూ అల్లంత ఎత్తున తలలెత్తి ఆకాశంతో కబుర్లాడుతూ మందిరాలు… అంతటా ఒక పురాతన వాసన, ప్రపంచంలోనే అత్యంత పురాతనులా అనిపించే మనుషులు,ముఖ్యంగా ఆడవాళ్ళు …… అబ్బ ఏం చెప్పను ఒక్కో స్త్రీ ఇన్నేసి మూరల మొల్లల్నో, మల్లెల్నో ,చామంతుల్నో తలలో తురుముకుని, పసుపు రాసిన పచ్చటి ముఖాలతో సౌందర్యమై విరాజిల్లేది. మీకో విషయం చెప్పేదా ఈ ప్రపంచంలోనే పరిమళ భరితమైన స్త్రీ తమిళ స్త్రీనే ఏమో బహుశా. సరే ఈ సౌందర్య చర్చ పక్కన పెట్టి కథలోకి వద్దాం .
ఏ ఊరు అని పేరు నేను చెప్పను , ముందే చెప్పాకదా ఏ పేరైనా ఒకటే అని. మద్రాసు నుండి మూడొందల కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు అది. చరిత్రలో ఎప్పటినుండో ప్రస్తావించబడుతున్న ఊరు. ఆ ఊర్లో ఒక మందిరానికి వెళ్లాం మొదట మేము. చాలా అందమైన మందిరం. ఆ అక్కడే పురాతనమైన రాజమహల్ కూడా ఉంది . మొదట అమ్మ వారిని దర్శించుకుని తర్వాత మహల్ కి వెళ్లాం. కాలానికి నిలబడిన ఆ కట్టడపు సౌందర్యం యేమని చెప్పనూ! అణువణువూ తాకి తడిమి పరవశిస్తూ కనులు పట్టని ఆ సౌందర్యాన్ని ఏం చేసుకోవాలో తెలీక వెర్రివాడినవుతూ హృదయ పరితాపాన్ని పొందుతున్నాను. అదిగో అప్పుడు చూసాను ఆ వింత పిట్టని. చాలా ఎత్తుగా మినార్ లా వున్నకట్టడం ఒకటి వుంది అక్కడ .శత్రువుల రాకని దూరంలో ఉండగానే పసి కట్టడానికి ఉపయోగించే కట్టడం అది . అదిగో దానిపైన వాలి ఉండింది. అబ్బ ఏమని చెప్పను ఆ సౌందర్యాన్ని. ఏం వర్ణాలు అవి . ఆ వర్ణాలలో ఏదో దైవత్వం, మిలమిల మెరుపు. కిలకిల నవ్వినట్టు, కింకిణీధ్వనులు అన్నట్లు దాని పిలుపు. పరవశుడనై పోయాను. పిచ్చెక్కిపోయింది. ఒక పక్షి నన్ను అంతలా ఆకర్షిస్తుందని నాకు తెలీదు, ఎప్పుడూ తెలీదు. అంతకు మునుపు ఏ పక్షినీ నేను ఏకాగ్రంగా చూసిన పాపాన కూడా పోలేదు . కానీ ఈ పక్షి నా హృదయాన్ని ఏమో చేసేసింది .
అన్ని వర్ణాలను కలిపిన అమృత జలంతో ,తెల్ల కాగితం లాటి నా హృదయం పై ఎవరో దాడి చేసి విఘాత పరచినట్లు అనిపించింది. హృదయమంతా కల్లోలమైపోయింది. ఆనందమో ఇంకోటో తెలియని ఆ భావం నా హృదయాన్ని తన అనంతహస్తాలతో పట్టి నలిపేసేసరికి శ్వాస తీసుకోవడం కష్టమైపోయింది . ఒకలాటి గిడ్డీనెస్ నన్ను కమ్ముకుంది. అదిగో అప్పుడు నా స్నేహితుడన్నాడు ”రేయ్ ఏంటి ?ఏంటలా అయిపోతున్నావ్ , ఏంటలా అంతసేపటి నుండి అటువైపే చూస్తున్నావ్?” అన్నాడు. నేను మౌనంగా చేయి పైకెత్తి చూపుడు వేలుతో ఆ పక్షి ఉన్న దిశగా చూపించాను. నేను చూపించినప్పుడే ఆ పక్షి అనంత సముద్రాన్నో ,చిక్కటి అడవినో దాచుకున్నట్లున్న రెక్కల్ని ఒక్కసారిగా విదిల్చి ,నన్నుచూసి ,నిజంగా… నన్ను చూసి హేళన చేసినట్లు, అదిగో అప్పుడు మయసభలో ద్రౌపది దుర్యోధనుడ్ని చూసి నవ్విందే, అచ్చమట్లాగే .ఇదిగో నువ్వు నమ్ము నమ్మకపో నీ నమ్మకాలతో నాకు పనిలేదు నువ్వు ఇది విని నవ్వుకుంటానంటే నవ్వుకో అయినా నేను లెక్క చేయను, ఆ పక్షి నన్ను చూసి అలా నవ్వింది.
బహుశా ద్రౌపదికి దుర్యోధనుడిపై అముహూర్తంగా ఒక కామ వాంఛ వుండి వుంటుంది. బహుశా అది ఆమెకే తెలియక పోవచ్చు , నీళ్ళలో పడ్డ దుర్యోధనుడ్ని చూసి నవ్విన ఆ నవ్వు సరసపు నవ్వు , కామపు కవ్వింపు నవ్వు . బావను చూసి మరదలు నవ్వే అమాయకపు మోహావేశపు నవ్వు కావచ్చును అది. లేదంటే ద్రౌపది అంత తెలివైనది కదా ,ఒక మనిషిని అవమానించే నవ్వు నవ్వగలదా. తమ ఆత్మ గౌరవాన్ని అంతగా ప్రేమించుకునే వ్యక్తులెవరూ ఇతరుల ఆత్మ గౌరవాన్ని కించపరచలేరు. మూర్ఖుడు దుర్యోధనుడు, ఆ సరసాన్ని, ఆ మోహపు నవ్వుని అపార్థం చేసుకున్నాడు. తన స్త్రీ హృదయాన్ని అర్ధం చేసుకోలేని ఆ మూర్ఖుడ్ని ద్రౌపది తరువాత తరువాత మనసులో ఎంత శపించుకున్నదో. ఆ విరస శరాఘాతానికి గురై ఎంత అల్లాడి పోయిందో ,ఎంత అవమానపడిందో. సరే అదలా ఉంచు. అదిగో అప్పటి నా మానసిక స్థితికి నా స్నేహితుడు కలవర పడ్డాడు. “ఏంటిది స్థిమితపడు” అని మందలించాడు. అయినా నేను స్థిమితపడనూ లేదు ఆ మాయలోంచి బయటకీ రాలేదు. పైగా ఆ పక్షిని నా స్వంతం చేసుకోవాలనే భయంకరమైన వాంఛఒకటి ,నా హృదయంలో శతహస్తాలతో ఈదులాడటం మొదలు పెట్టింది. అంతే మా యాత్ర బృందంతో నా ప్రయాణం ఆగిపోయింది. నేను ఆ ఊళ్లోనే నిలబడిపోయాను.
అది మొదలు కేవలం ఆ పక్షి కోసమే ప్రతిరోజూ ఆ కోటకి వెళ్ళేవాడిని, . ఒక మంచి బైనాక్యులర్ ఖరీదు చేసాను. దాంతో సుదూరంలో వున్న ఆ పక్షిని చూడటమే రోజంతా నా పని. అలాటి పక్షులు అక్కడ చాలానే వున్నాయని తెలుసుకున్నాను. కానీ అన్ని పక్షుల నుండి నా పక్షిని నేను వేరు చేయగలిగే వాడిని. అలా తనను తాను అదే వేరు చేసుకునేది . ఇతర పక్షులలో లేని ఒక అడవి నిర్లక్ష్యం దానిలో వుండేది,దేని పట్లా లక్ష్యం లేని నైర్మల్యం ఉండేది , ఒక్కటే కూర్చుని ఆకాశం లోకి తదేకం గా చూస్తూ ఏమిటో తనలో తాను పాడుకుంటున్నపుడు ఒక గొప్ప ఆత్మ విశ్వాసాన్ని అలవోకగా ప్రదర్శిస్తున్నట్లు అనిపించేది . ఒక్కోసారి అమాయకంగా దాని నల్లని మిరియం గింజలలాంటి కళ్ళని అటూఇటూ తిప్పుతూ ఏమిటో చూస్తూ ఉండేది. మరోసారి చాలా గడసరిగా తన కాలిగోర్లతో తలని విదిలించుకుంటూ కవ్విస్తున్నట్లుగా ఉండేది. ఇతర పక్షులకు లేని వైచిత్రి దానిలో ఏదో ఉండేది. నాకట్లా భ్రమ కలిగిందేమోనని మీరు భావిస్తున్నారేమో! కానే కాదు. కొన్ని వందలగంటలు నేనా పక్షిని పరిశీలించాను. దాని కంట్లో పడాలని అంగలార్చాను. అది నన్ను చూసేదో లేక దాని నిర్లక్ష్య స్వభావం వల్ల అలక్ష్యం చేసేదో నాకు తెలీదు ,నాపై ఏనాడూ దృష్టి సారించలేదు.
అంతలోనే నేను ఆ కోటలోని ఉద్యోగులందరికీ పరిచితుడనైపోయాను. మొదట నన్ను పిచ్చివాడిగా జమకట్టినా, తరువాత తరువాత నాపట్ల సానుభూతి చూపసాగారు .ఆ రోజుల్లో ఒక వెన్నెల రాత్రి ఆ కోట కాపలాదారుడి అనుమతితో నేను ఆ మినార్ పైకి ఎక్కాను. చంద్రుని విశ్వరూప సౌందర్యానికి భ్రమిసా అన్నట్లు, అంతటా ఆకు కూడా కదలని ఒక నిశ్శబ్ద సౌందర్యం అలుముకుని వుంది ,నా అలికిడిని ఎలా గమనించిందో ఆ పక్షి తన గూట్లో నుండి తల బయట పెట్టి చూసింది . నా ఆశలన్నీ నీరు కారి పోయాయి .అయినా దాని కోసం చేయి చాచాను . దాన్ని అందుకోవడానికి ఇంకా పైకి ఎక్కడం ప్రారంభించాను . నేను ఎంత ఎత్తుకి ఎక్కితే ఆ పక్షి విలాసంగా నన్ను చూస్తూ, కవ్విస్తున్నట్లు మరింత పైకి ఎక్కేది. కాళ్ళు పట్టు తప్పి జారిపోతున్నా పట్టుదలగా ప్రయత్నించి మరింత పైకి ఎక్కాను. అది రెక్కల్ని అలల్లా విదిలించి ఒక్కసారి తన పరిహాసపు దరహాసాన్ని నాపై వెదజల్లి మరింతపైకి వెళ్ళింది. ఇక చివరికి వచ్చేసాను . అది అక్కడి నుండి ఎగిరిపోగలదు. రెక్కలున్న పక్షి ఎగరదా అందులో సందేహమేముంది! అదిగో అప్పుడు, నువ్వు నన్ను నమ్ము నమ్మకపో ,నాకు అక్కడినుండి దూకి ప్రాణ త్యాగం చేయాలనిపించింది. బ్రతుకుపై విరక్తి కలిగింది . ఇంక ఒక్కటే ఒక నిముషంలో నా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోతాయనగా ఆ సహస్ర వర్ణపు పిట్ట ఆగి నావైపు చూసింది. ఒక్క నిముషం దీర్ఘంగా నా చూపులో చూపు కలిపింది. ఆ నయనపు మేళవింపు నుండి ఎన్నో భావాలు నాలోకి ప్రవహించినట్లనిపించింది. బహుశా నేను కూడా నా చూపులతో ఇవాళ నువ్వు లభ్యమవకుంటే నా తనువును ఇక్కడే బలిపెట్టేస్తా అని చెప్పే ఉంటాను. అప్పుడు ఆ పక్షి తన శరీరాన్ని ఒద్దికగా ముడుచుకుని ఒక మహార్ణవం చిన్ని గాజు కుప్పె లోకి జారినట్లు , నిదానంగా ,అతి నిదానంగా నడిచి వచ్చి ,దయగా నా భుజంపై కూర్చుంది. కూర్చుని నెమ్మదిగా, అతి మృదువుగా, నా చెవికొనను స్నేహంగా కొరికింది.
ఆ సంతోషంలో నేనక్కడి నుండి పడిపోతానేమో అనిపించింది. ఎలాగో నెమ్మదిగా దిగి అప్పటికప్పుడే ఒక కారుని మాట్లాడుకుని రహస్యంగా ఆ పక్షిని మా ఇంటికి తెచ్చేశాను. ఆ విషయాన్ని నా స్నేహితులకు చుట్టాలకు పక్కాలకు సగర్వంగా తెలియబరిచాను. అందరూ దాన్ని చూడటానికి నా ఇంటికి బారులు తీరారు. నాకేమో దినమూ రాత్రి తెలియని మైమరపు , దాన్ని గుండెలపై పెట్టుకుని ఈక ఈక తడిమేవాడిని. దాని ప్రతి ఈకకి ఉన్న ప్రత్యేక వర్ణంపై కవిత్వం చెప్పేవాడిని, పాటలు కట్టేవాడిని. కుంచెని రంగులలో ముంచి చిత్రించేవాడిని. అట్లా కొన్ని రోజులకి ఆ పక్షి దానిలో ఉన్న అణువు పరమాణువుతో సహా నాకు తెలిసిపోయింది. తనని అంతగా ప్రేమిస్తున్నందుకు ఆ విహంగం అబ్బురపడేది. తనని తాను మరింతగా నాకు సులభతరం చేసేది. తన లోలోపలి వర్ణాలను కూడా విప్పి చూపేది. తెలియ చెప్పేది.
అదిగో అట్లా కాలం గడిచిపోతూ ఉంది. అట్లాంటి రోజుల్లో ఒక మధ్యాన్నం అది. భోజనం తరువాత ఒక కునుకు తీసి లేచి ,బడలికగా బాల్కనీలోని సోఫాలో కూర్చుని బయటికి చూస్తూ ఉన్నాను. నా పక్షి కూడా నా పక్కనే అటూ ఇటూ గున గున లాడుతూ, కువకువ మంటోంది. మధ్యాహ్నపు తాపం నెమ్మదిగా అణుగుతూ సంధ్యారాగం గాలిలో గింగుర్లాడుతూ ఉంది. వాతావరణం మొత్తం ఒకలాటి సౌందర్యంతో భారమై కాలాన్ని కదలకుండా కావలించుకున్నట్లు నిలబడిపోయి ఉంది. అదిగో అప్పుడు ఎక్కడి నుండో ఒక గోరువంక టప టపామని ఎగురుతూ వచ్చి అల్లంత దూరాన ఉన్న బాల్కనీ గోడపై వాలింది . నేనున్నానన్న భయం కొంతైనా లేకుండా ,అలక్ష్యంగా, బంగారు రంగు వెలుతురు ఆవరించి ఉన్న తన కళ్ళని అటూ ఇటూ తిప్పుతూ సంధ్యని అవలోకించడం మొదలు పెట్టింది. అదిగో అప్పుడు నా గుండె ఝల్లుమంది. ఆనాడు నా సహస్రవర్ణ రంజితమైన పక్షి…ఈనాడు నా పక్కన కువకువ లాడుతున్నదే అది కలిగించిన ఆ భావం నాలో మళ్ళీ ప్రవేశించింది. ఉత్తుత్తినే కాదు ,ఏడు తాటి చెట్ల ప్రమాణంతో సముద్రపు అల లేస్తే ఎట్లా వుంటుందో అలా కలిగింది ఆకర్షణ ఆ గోరువంకని చూడగానే , ఆ బంగారు కాంతి కన్నుల గోరువంకని ,స్వేచ్ఛగా, హాయిగా నా ఎదుట కూర్చున్న ఆ గోరువంకని చూడగానే . దాన్ని నా స్వంతం చేసుకోవాలనే కోరికతో తల్లడిల్లి పోయాను . సరే ఆ తరువాత ఏమైంది అంటారా, అలాటి ఆకర్షణలు నాలో బోలెడు కలిగాయి వెళ్ళాయి. ఆ ఆకర్షణల వెంట నేనూ పడి కొట్టుకుపోయాను.
ఈ ఝంఝ లొ పడి కొట్టుకుపోతున్నప్పుడు మరో ప్రపంచం నాకు తెలిసేది కాదు. నేను చాలా ముందుకు వెళ్ళిపోయాను.నా సహస్ర వర్ణపు పక్షి మాత్రం అక్కడే నిలబడిపోయింది. నేను మునుపటిలాగే తనపై కవిత్వం చెప్పాలని, పాటలు పాడాలని తన బొమ్మలు గీయాలని తపన పడేది. మునుపటిలానే తనని ప్రేమించాలని కోరుకునేది. నాక్కూడా దాన్ని చూసి జాలి కలిగేది. పోనిలే అని కుంచె తీసుకునేవాడిని బొమ్మగీయాలని. గీయడానికి ఏం వుంది అక్కడ వెలిసిపోయిన ఒకటే ఒక వర్ణం మాత్రమే నాకు గోచరమయ్యేది. నేను అశక్తుడనై కుంచె విసిరికొట్టి వెళ్ళిపోయేవాడిని. మునుపటిలాంటి నా ప్రేమకోసం అది ఎంత తపన పడి యాచించేదో నేను అంత లోభినై ,శూన్య హ్రుదయుడినై పోయే వాడిని, దాని పట్ల నా విముఖత వేల ఊడలతో హృదయమంతా విస్తరించేది. అదిగో అప్పుడు అది క్రుంగి కృశించి కొన్ని రోజులకి ప్రాణాలు విడిచింది. ఏమో నేను చెప్పేది నీకెట్లా అనిపిస్తుందో నాకు తెలీదు అది నిర్జీవమైన దినం నాకంటి నుండి ఒక్క చుక్క నీళ్ళు కూడా రాలేదు. ఎవరెవరో వచ్చారు . పాపం చిన్న వయసు ,ఎందుకలా అన్నారు. ఎంత సౌందర్యమో అన్నారు. ఎవరేం అన్నా నా హృదయం చలించలేదు.
ఇదిగో ఇప్పుడు ఏళ్ళూ ఊళ్లు గడిచిపోయాయి. నువ్వడిగావని ఎందుకో ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకున్నాను. అప్పట్లో నా కూతురు కూడా ప్రశ్నించేది వాళ్ళ దగ్గరా వీళ్ళ దగ్గరా ఆ పక్షితో నా ప్రేమకథ విన్నదేమో, చాలా ఆసక్తిగా అడిగేది. ” నాన్న !ఎందుకలా చేసారు మీరు ,ఎందుకు దాన్నట్లా నిరాదరించారు ఆఖర్న ఆఖర్న ” అని , ” మీరు చాలా మంచివారు కదా నాన్న ,మరి మీ ఆ ప్రవర్తన ఏమిటీ” అని అప్పుడు నాలోకి నేను తరచి తరచి చూసుకున్నాను, చాలా పరిశోధించుకున్నాను . చివరికి ఒక రోజు చెప్పాను. “అమ్ములూ ! అది నింగి, నేను నేల , నింగి యెట్లా ఉంటుంది? అందినట్లూ ఉంటుంది, అందనట్లూ ఉంటుంది, క్షణమాత్రం నీలంగానూ మరో క్షణం నిర్మలంగానూ ఉంటుంది, గర్జించగలదు , చంద్రుడ్నీ నక్షత్రాలని ఒడలంతా అలంకరించుకుని సౌందర్యంతో జ్వాజ్వలామానమై ప్రకాశించనూగలదు. అంబరమెప్పుడూ ఆశ్చర్యమే . బహుశా ఆ ఆశ్చర్యాన్ని, ఆ వైల్డ్ నెస్ ని నేను ప్రేమిస్తా ననుకుంటాను, ఆ సహస్ర వర్ణపు పక్షిని కూడా అందుకే ప్రేమించి ఉంటాను . కానీ రోజులు గడిచేకొద్దీ అది తనని నాలో కోల్పోయింది. నేను తప్ప మరో ప్రపంచం దానికి లేకుండాపోయింది. నా గదిలో ముడుచుకుని కూర్చున్న వెలిసిపోయిన ఆకాశo పై నాకేం ఆకర్షణ ? నాకు కావాల్సిన ఆకాశం అది కాదు , ఆశ్చర్యాన్ని నిబిడపరుచుకున్న స్వేచ్ఛావృతమైన రంగు రంగుల ఆకాశం కావాలి. నాలో లయమైపోయి విడిగా లేని విషయాన్ని ప్రత్యేకంగా ప్రేమించాల్సిన పనేమిటి నాకు? మధ్యాహ్నం పూట వినయంగా నీతో నడిచే నీ నీడని ఎన్ని సార్లు నువ్వు లక్ష్య పెట్టి ముద్దులాడి ఉంటావో చెప్పగలవా ?ఆ పక్షిని ఇచ్ఛా పూర్వకంగా నేనేం అలక్ష్యం చేయలేదు . అలాగని లక్ష్యమూ పెట్టలేదు . జస్ట్ నిర్లిప్తత . ఇదిగో నేను కూర్చున్న ఈ కుర్చీ మా నాన్న గారి హయాంది, ఇదంటే కూడా నాకు ప్రేమే , కానీ అట్లాగని దానిపై చెప్పడానికి కవిత్వం యెట్లా వస్తుంది నాకు? ఇది కూడా అంతే. అని చెప్పాను .
నీకు కూడా అదే చెప్తున్నా. నింగికీ నేలకీ మధ్య ఒక దూరం ఉంది. ఆ దూరంలోనే ఆకర్షణ మొత్తం వుంది. నింగి నింగి గానే వుండాలి ,నేల నేల లాగానే ఉండాలి. సముద్రపు ఆ ఒడ్డు ఈ ఒడ్డు పట్టి ఉంచేది ఒక్కటే జలాన్ని కావచ్చు కానీ ఆ తీరం దానికదే ప్రత్యేకం ,ఈ తీరం దీనికదే ప్రత్యేకం . బహుశా ఈ అనంత యుగాలనుండీ సముద్రంపట్ల మన ఆకర్షణకి అదే కారణం కావచ్చును. పగలూ రాత్రి కలిసి ఒక రోజవుతుంది . కానీ పగలూ ,రాత్రి రెండూ దేనికవే విడి వ్యక్తిత్వం కలిగి వుండటం లేదా ?పగటిది వెలుతురు వర్ణం ,రేయిది కాటుక వర్ణం . ఒక దానిలో ఒకటి లయమవకనే అవి రోజుని పరిపూర్ణం చేయటం లేదా .
ఏం ఆ పక్షి నన్ను ఎడమకాలితో తన్ని నా మీదుగా ఎగిరిపోకూడదా , ఈ అనంత విశ్వంలో దానికి చోటే లేదా ?అప్పుడు దానికోసం నేను పరితపించే వాడినేమో, అది విడిచిపోయిన ఖాళీలో దాని లోటును వెతుక్కునేవాడినేమో, దాని పాదాలపై పడి యాచించేవాడినేమో . అదేమీ చేయకుండా ,కొంచెమన్నా ఆత్మ గౌరవం లేకుండా నా పాదక్రాంత మైపోయిన ఒక వెల్ల వెలిసిన గోడలాటి ఆ పక్షిని ప్రత్యేకంగా నేనెందుకు ప్రేమిస్తాను . నింగిని ప్రేమించేవాడిని ,రంగుని ప్రేమించేవాడిని నిర్వర్ణాన్ని ఎలా ప్రేమించగలను చెప్పూ ? ఇదే నా కథ . ఇంతకన్నా ఏమీలేదు . మరి నేను ఉండనా ఇక …
‘నా ప్రియ ప్రవక్త ఖలీల్ జీబ్రాన్ కి ‘ *
ప్రతి ప్రేమలోనూ అదే జరుగుతుందేమో…
యుగయుగాల ప్రేమచరిత్ర ల ముగింపులుఇవే! ఇప్పుడు కూడా ఇంతే !!!
చాలా బాగుంది! అదే జరుగుతుంది, కాదు. అలాగే జరగాలి. నెక్స్ట్లె లెవెల్‌కు తీసుకెళ్ళని ప్రేమా, అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్నీ పూర్తిగా కొల్పోయిన ప్రేమికా, ఏం స్ఫూర్తినిస్తారు?
Just read a tweet:
@RGVaditya: Relationships are like birds.
If you hold them tightly they will die..
If you hold them loosely they will fly..”
Nice Story.
*** ఏం ఆ పక్షి నన్ను ఎడమకాలితో తన్ని నా మీదుగా ఎగిరిపోకూడదా , ఈ అనంత విశ్వంలో దానికి చోటే లేదా ?
పాదాక్రాంతమైన ప్రేమ ని నచ్చని వ్యక్తిత్వాలు అరుదు. రంగు వెలిసిన గోడని వద్దనుకోవడంలో ఎంతో అర్ధం ఉంది “రంగుని ప్రేమించేవాడిని నిర్వర్ణాన్ని ఎలా ప్రేమించగలను చెప్పు ” ?
ఈ ఒక్క వాక్యం చాలు.
ఒక మంచి కథని విభిన్నంగా మీదైన శైలిలో ఆసక్తిగా చదివించారు. చానాళ్ళు వెంటాడే కథ ఇది
చెప్ప దలిచిన విషయాన్ని అద్భుతంగా చెప్పే అరుదైన కథలు మీవి. Hats off!
ఎంతో పురాతనమైన సమస్యని కొత్తగా పరిమళభరితమైన కథగా చెప్పి చక్కని పరిష్కారాన్ని అంతర్లీనంగా సూచించారు.చాలా బావుంది !
సామాన్య గారు
చాలా అద్బుతాం గా రాస్తున్నారు—
స్టైల్ –చెప్పే తీరు—సూపర్–
————————
బుచ్చి రెడ్డి గంగుల
సామాన్య గారూ,
చాలా బావుంది. ఆకర్షణకి ప్రేమకి మధ్య తేడా కనుక్కోలేక శలభాల్లా మాడిపోయిన వారెందరో చరిత్రలో. ప్రేమ అని పేరు పెట్టుకొనేదెందుకో ఈ మాత్రపు దానికి. పైగా ఆత్మగౌరవం కోల్పోయిందనడం. ఇక్కడ ఆత్మగౌరవం కోల్పోయింది ఎవరు?
ద్రౌపది నవ్వినట్లు నవ్విన పక్షిని ప్రేమించి, దాని కరుణతో అది స్వాధీనమైతే ఆనందించి,కవిత్వం చెప్పి, మరొక అందమైన పిట్ట లేదా పిట్టలు కనపడితే వాటికోసం వెంపర్లాడి— చివరకు పసిపిల్లకు కూడా అందులో అన్యాయం కనిపించింది. కని,గుండెలపై పెట్టుకొని పెంచి, తనువు మనసు, బుద్ధి నైపుణ్యం ఇచ్చిన నాన్నగారి కాలంనాటి కుర్చీ పై భావించడానికి ఏమీ ఉండదా. బుద్ధిలేని పిట్టకే అంత అనుబంధమైతే మనసు, బుద్ధి, భావుకత, సున్నితత్వం గల మనిషికి?
Law of utility dimention laga undi pakshi dorikevarku una prema ..chevari varaku lekunda poyendi manusyulante.
Ditto to Kameswari gaaru
అసలు పక్షి నవ్వడమేమిటో.. దానికి ద్రౌపది కారెక్టర్ని అసాసినేట్ చేయడమేమిటో నాకు అస్సలు అర్ధం కాని విషయం!!!
ఇప్పటికి మూడు నాలుగు సార్లు ప్రయత్నించాను కథను పూర్తిగా చదువుదామని.
ఎందుకో చదవలేకపోతున్నా.
ముందుగా మనసులోని మాటని చెప్తాను..
కధంతా చదివాక , ఎడిట్ చేసే హక్కే ఉండి ఉంటే…మడగాస్కర్ సినిమాలో పెంగ్విన్ కాలితో ఒక్క తన్ను తన్ని కోతిని నేల కరిపించినట్టు గా …ఈ కధలో హీరోని వేధించి వెంటపడి..పడిగాపులు కాచి…ధ్వజం ఎక్కి పక్షిని అందుకోటానికి ప్రయత్నించినప్పుడు ఆ పక్షి ఎడమకాలితో ఒక్క తన్ను తన్నించి మట్టి కరిపించే సీను పెట్టి ఉండేదాన్ని. వెల్, దట్స్ మీ దో !!
అసలు కధలో ఏం వర్ణించాలనుకున్నారో…ఏం చెప్పాలనుకున్నారో, కధని రెండు సార్లు చదివినా అర్ధం కాలెదు ( ఇంకో సారి చదివే ఓపిక లేక ఊరుకున్నా) నింగీ నేలా కలవవు అని చెప్పాలనుకున్నారా?? లేక ప్రేమ అనేది ఆకర్షణ మాత్రమే, ఒక పంతం మాత్రమే, ఆ పంతం నెగ్గాక దానిలో థ్రిల్ మిస్ అవుతుందని చెప్పాలనుకున్నారా?? క్లారిటీ లేని కధ ఇది.
ఇక చివరిగా, పక్షి నవ్వటం ఏంటి? ఆ నవ్వుని ద్రౌపది తో పోల్చటం ఏంటి?? ద్రౌపది ని సీన్ లోకి అసందర్భం గా లాగారు అక్కడ. మామూలుగా నవ్వింది…కుల్లింది పొడిచింది అని సరళమైన భాషలో చెప్పేసుంటే సరిపోయేదేమో. ద్రౌపదిని సీను లోకి లాగటం , ఎప్పటినుండో ఆ అక్కసు ఎక్కడైనా రాయాలి…ఇక్కడ ఇరికించేద్దాం అన్నత్తు గా అనిపించింది.
వెరసి ఈ కధ అంతా చదివాక నాకు మా పక్కింటావిడ మేడపైకి వెల్తే , గుడ్లు పొదిగి పిల్లలు పెట్టీన కాకి నెత్తి మీద టపా టపా ముక్కుతో నాలుగు సార్లు పొడిచిందన్న కాన్వర్సేషను కధలా చెప్పటం గుర్తు చేసింది. ఆవిడ చెప్పినప్పుడు దీన్ని కూడ భలే వివరం గా, వర్ణించి మరీ చెప్పిందనిపించింది, కాని ఇక్కడ చదివాక ..ఒహో …ఇలంటివి కూడా ఇలా రాసేసుకోవొచ్చన్నమాట అన్న జ్ఞానోదయం కలిగింది !!!
Ramayananm lo kothulu matladaga lenidi kathalo pakshi navvithe surprise avutunnara???
Bharatam lo Draupadi kattukunna chirane neechamga lagaru telusu kada? ikkada pakshi(Bahusha oka yuvathi/mahila) manasu cheppadaniki chakkaga Draupadi ni udaharincharu!
yugayugala dukkamedo pongi kallunidipoyayi.ee sthithulu anbavinchadam enthakastam?
“”"బహుశా ద్రౌపదికి దుర్యోధనుడిపై అముహూర్తంగా ఒక కామ వాంఛ వుండి వుంటుంది. బహుశా అది ఆమెకే తెలియక పోవచ్చు , నీళ్ళలో పడ్డ దుర్యోధనుడ్ని చూసి నవ్విన ఆ నవ్వు సరసపు నవ్వు , కామపు కవ్వింపు నవ్వు . బావను చూసి మరదలు నవ్వే అమాయకపు మోహావేశపు నవ్వు కావచ్చును అది. లేదంటే ద్రౌపది అంత తెలివైనది కదా ,ఒక మనిషిని అవమానించే నవ్వు నవ్వగలదా. తమ ఆత్మ గౌరవాన్ని అంతగా ప్రేమించుకునే వ్యక్తులెవరూ ఇతరుల ఆత్మ గౌరవాన్ని కించపరచలేరు. మూర్ఖుడు దుర్యోధనుడు, ఆ సరసాన్ని, ఆ మోహపు నవ్వుని అపార్థం చేసుకున్నాడు.”"”
సామాన్య గారు మీ వ్యాసం మొత్తం చదవలేదు.. కానీ పై పేరా కాస్త అభ్యంతరకరం గా అనిపించింది కనుక ఈ కామెంట్ రాస్తున్నాను…
ద్రౌపది దుర్యోధనుణ్ణి చూసి నవ్వితే కామ వాంఛ ఉండి ఉంటుందా???
ఓహ్… మరి అలాగయితే
అందరి అభిమాన హాస్య నటుడు బ్రహ్మానందాన్ని మనందరూ ఆడా, మగా, చిన్నా పెద్దా లేకుండా కామించినట్టేనా???..
చార్లీ చాప్లిన్ అవస్తలు చూసి ప్రపంచం అంతా నవ్వుకుంది అంటే ప్రపంచమంతా (పసిపిల్లల నుంచీ పండు ముసలి వరకు ) చార్లీ చాప్లిన్ ని కామించింది అనుకోవచ్చా???
ఎవరినైనా / ఎవరి గురించైనా ఇలా సొంత అభిప్రాయం వ్యక్తపరచేముందు(ముఖ్యంగా ఇలా అందరితో పంచుకునేముందు) కాస్త ఆలోచించాలి .
ఇంకా నేను చెప్పింది సరిగా అర్ధమవడం కోసం ఈ కింది ఉదాహరణ ని ఇస్తున్నాను.. దయ చేసి అర్ధం చేసుకోగలరు..
ఉదా:
సందర్భం:: చార్లీ చాప్లిన్ కామెడీ సీరియల్ చూసి టీవీ ముందు కూర్చున్న అవ్వ ఫకాలున ఒకటే నవ్వు…
——————————-సొంత భాష్యం——————————–
“”"బహుశా అవ్వకి చార్లీ చాప్లిన్ పై అముహూర్తంగా ఒక కామ వాంఛ వుండి వుంటుంది. బహుశా అది ఆమెకే తెలియక పోవచ్చు , టీవీ లో అవస్తలు పడుతున్న చాప్లిన్ ని చూసి నవ్విన ఆ నవ్వు సరసపు నవ్వు , కామపు కవ్వింపు నవ్వు . బావను చూసి మరదలు నవ్వే అమాయకపు మోహావేశపు నవ్వు కావచ్చును అది. లేదంటే అవ్వ అంత తెలివైనది(వయసు తెచ్చే అనుభవం) కదా ,ఒక మనిషిని అవమానించే నవ్వు నవ్వగలదా. “”"”"”
పై భాష్యం మీకు ఎంత అసంబద్ధంగా అనిపించి ఉంటుందో అర్ధం చేసుకోగలను.. పైన మీరు ద్రౌపది గురించి చెప్పిన భాష్యం/ఊహాగానం/అభిప్రాయం/ఊహ కూడా అంతకంటే ఎన్నో రెట్లు అసంబద్ధం గా అనిపిస్తోంది.
చివరికి చెప్పొచ్చేదేంటంటే సొంత భాష్యం చెప్పాలనుకున్నప్పుడు ఆ పాత్ర యొక్క ఔన్నత్యాన్ని,ప్రాశస్త్యాన్ని కూలంకషంగా అర్ధం చేసుకుని రాస్తే ఆ పాత్రకి సరైన భాష్యం అనబడుతుంది..
అలా కాకుండా ఏ కాస్తో కూస్తో తెలుసుకుని చేసే భాష్యం కేవలం “వక్రీకరణ” మాత్రమే అవుతుంది తప్ప ఇంకేం కాదు…
**పెద్దలు,విజ్ఞులు తప్పులుంటే సరిదిద్దగలరు.
#సుష@4U4ever@
రచయిత్రి ఈ కథలో అంతర్లీనంగా, కుటుంబ జీవితంలో స్థ్రీకి వుండవలసిన ఆత్మాభిమానం, నిలుపుకోవలసిన వ్యక్తిత్వం ( అది ప్రేమ వివాహమైనా సరే) గురించి సింబాలిక్ గా కథనం చెశారనిపిస్తుంది. ఆకర్షణకి, మోహానికి స్త్రీ, పురుషులు అతీతులుకాదన్న భావన కూడా హీరో మరియు ద్రౌపది పాత్రల ద్వారా చెప్పినట్టు అనిపించింది.
సామాన్య గారు,
పక్షిని స్త్రీకి ప్రతీకగా తీసుకుని కథను నడిపించిన తీరు అద్భుతంగా ఉంది. అందే దాకా అందంగా కనిపించినదేదైనా అందినాక ఆకర్షణ కోల్పోతుంది. నిజమే.
అయితే కథలో తమిళ స్త్రీ ప్రసక్తి, ద్రౌపది ప్రసక్తి ఎందుకు తీసుకొచ్చారో కథా రచయిత్రిగా మీరు వివరిస్తే బాగుంటుంది.
బిఎన్ శర్మ
కథ బాగుంది. చెప్పిన విధానం ఇంక బాగుంది. కాని ఖలీల్ జిబ్రాన్ ప్రవక్త కాదు.