నాకు కార్పోరేట్ సంస్కృతి అంటే
ఇష్టం ఉండదు
కానీ అది చల్లగా ఉండాలని కోరిక
ఆ చత్రచ్చాయల్లోనే మా అబ్బాయి ఉద్యోగం కనుక.
కయ్యానికి కాలుదువ్వే
అమెరికా అంటే వ్యతిరేకత,
కానీ కాలిఫోర్నియాలో
అడవి కాలిపొయినా నాకు నిద్రపట్టదు
మా బంధువులంతా అక్కడే కనుక.
సెజ్జులన్నా, మాల్స్ అన్నా
నాకు పేదవాళ్ళే గుర్తుకొస్తారు.
అయినా ఎకరాలు ఎకరాల్లో
అమ్మకానికి పెట్టిన
అనంత వస్తు సంచయాన్ని చూసి
ముచ్చట పడతాను.
ఇక్కడి విద్యాలయాల్లో తెలుగును చంపేసి
అమెరికాలో వెలిగిస్తుంటే ఆశ్చర్యపడతాను.
ఆంగ్ల పదాలు లేకుండా మాట్లాడితే
తెలుగు బతుకుతుందంటే
మూగబోయి తిలకిస్తాను.
స్వదేశంలోని ఆస్తులను నిర్వహించడానికి
మాతృభాష పనికొస్తుందని గ్రహిస్తాను.
మధ్యలో ఈ చైనా గొడవేమిటి?
మరికొంత జాగా కోసం కాదు
సరుకులు అమ్ముకోడానికి చేసే
సందడిగా భావిస్తాను.
అమెరికా వారికి
జమా ఖర్చుల లెక్కలే ముఖ్యం
యుద్దానికి పెట్టిన డాలర్లే తప్ప
పోయిన ప్రాణాలకు విలువ లేదు.
మొత్తానికి నేను ఇరుక్కపోయాను
చిక్కిన విత్తనం లోంచి
భిన్నదిశలకు ఎక్కుపెట్టిన
రెండాకులుగా మిగిలిపోయాను.
ఇప్పుడు మార్కెట్ ఎడారిలో
కొత్తరకం సూఫీ వేదాంతానికి
వ్యాఖ్యానం రచిస్తున్నాను.
beauiful sir .. nijaalato charichi spruhaloki teesukoccinattundi mee kavita
//మొత్తానికి నేను ఇరుక్కపోయాను
చిక్కిన విత్తనం లోంచి
భిన్నదిశలకు ఎక్కుపెట్టిన
రెండాకులుగా మిగిలిపోయాను.
ఇప్పుడు మార్కెట్ ఎడారిలో
కొత్తరకం సూఫీ వేదాంతానికి
వ్యాఖ్యానం రచిస్తున్నాను.//
యెందుకో మీ అక్షర కూర్పు నాకు కవిత్వంలా కనపడట్లెనాకు. కాని చాలా బాగుంది సర్…. :” కార్పోరేట్ సంస్కృతి అంటే
ఇష్టం ఉండదు కానీ అది చల్లగా ఉండాలని కోరిక ఆ చత్రచ్చాయల్లోనే మా అబ్బాయి ఉద్యోగం కనుదు..) ”