కవిత్వం

వానపాము

26-జూలై-2013

ఈ నిదానపు మధ్యాహ్నం, ఒక మబ్బు పట్టిన గాలి. కూర్చుంటే నువ్వు
నీ గదిలో, మరి ఎక్కడి నుంచో ఒక కోయిల గానం-

నిన్న రాత్రి కురిసిన వానకి, ఆ నీటి కాంతికీ, ఇంకా మెరుస్తాయి
అశోకా ఆకులు. వాటి కింద నువ్వు నడుస్తూ ఉంటే
పచ్చటి పొదల వాసన. తల ఎత్తి చూస్తే, పొదల్లోంచి
తటాలున దూకి పారిపోయిన కుందేలు ఒకటి ఆకాశంలో.

ఈ సమయంలో ఇక్కడ ఒక తెల్లటి మేఘం కనిపించడం ఆశ్చర్యమే కానీ
ఏం చేస్తావు నువ్వు, కొద్దిపాటి చల్లదనంలో
మరి కొంత మెత్తటి వెలుతురులో, మసక
మసకగా నీ లోపల గూడు కట్టుకుంటున్న ఒక తెల్లటి ఒంటరితనానికి
తన ముఖం గుర్తుకు వచ్చినప్పుడు? నీ ముందు
క్షణకాలం మెరిసి తిరిగి అంతలోనే నీ పాదాల కింద
వేగంగా వ్యాపించే నీడలలోకి ఆ తెల్లటి మేఘమూ
ఆ తెల్లటి కుందేలూ కనుమరుగు అయినప్పుడూ?

ఇక, రాలే ఆకులనీ, రాలిపోయిన పూవులనీ ఏరుకునేందుకు, నీ
గది బయటకు అడుగు పెడతావు నువ్వు. నీ కళ్ళల్లో
వలయాలుగా గాలి. అరచేతుల్లో ముడుచుకు పోయే
తడి. కాలి బొటన వేలికి అంటుకుని, నిన్ను ఒకసారి
జలదరింపుకు గురి చేసే, తడచిన మట్టీ, వానానూ-

ఆఖరికి, చేతులు కట్టుకుని నడుస్తూ, నువ్వు నీ తల పక్కకి తిప్పి చూస్తే
ఒక వానపాము, మెలికలు తిరుగుతో, తనని తాను
తవ్వుకుంటున్నట్టూ, భూమిలోకి ఇంకిపోయేందుకు
ఒక తపనతో, ఆదుర్ధాతో, హడావిడిగా, కంగారుగా-

ఇక ప్రత్యేకంగా చెప్పాలా నేను నీకు, ఆ తరువాత నేనేం చేసానో?