కవిత్వం

ప్రజలే విజేతలు

26-జూలై-2013

నా కనురెప్పల మీద పూచిన
ఒక ఆకుపచ్చని కల
శిశిరావరణంలో నేలరాలింది

అనేక వసంతాలుగా గట్టిపడ్డ
నాలుగుకోట్ల సామూహిక చిక్కటి ఆకాంక్ష
ఆధునిక శకుని అహంకార పాచికలకు
అడవి కాచిన వెన్నెలైంది

అవినీతి బురదలో మునిగి
అహంకార కళతో తంటుకొని
కుటిల ఇటలీ మన్మోహన గానం
అబద్దపు ఏకాభిప్రాయ చిదంబర రహస్యమైంది

మళ్లీ మళ్ళీ వంచించబడుతున్న నేల మీద
దారులెవ్వీ గమ్యాల్ని చేర్చడం లేదు
కులమతాల వెన్నెముక మీద గుద్ది
అవిప్పుడు పోరుపంక్తి భోజనశాలలైనవి

కాలం వసంతాల్ని కౌగలించుకునే వేళ
ధూంధాం దరువుల తెలంగానం తప్ప
కోయిల కూజితాల జాడ లేదు

జ్ఞానపు ఎన్నాద్రి కోసం
అక్షరాల్ని ఇరువాలు దున్నే విద్యాలయాలు
టిగ్గర్‌ మీద వేళ్ళతో
ఉద్యమ యుద్ధభూములైనవి

అన్యాయపు రాబందు రెక్కల్ని
నిత్యం వాదాల కరవాలాలతో నరికే నల్లకోటు
సామాజిక న్యాయం కోసం
పార్లమెంటు ముంగిట నిరసనల పిడికిళ్ళెత్తింది

అంటుకుంటున్న దేహాల కొలుముల్లో
సానపెట్టబడ్డ కళాల పాళీలను
మత్తడివడ్డ గుండె చెరువులో ముంచి
ఉద్యమ గీతాలల్లుతున్నరు
కవులు ఉద్వేగ దారుల్ల నడుస్తున్నరు
చరిత్ర పునాదులు తవ్వి
కొత్త సత్యాల్ని కనుగొంటున్నరు
తెలంగాణ వైతాళికుల్ని నిలబెడుతున్నరు

అణచివేత సాధనాలు
క్రొత్తగా హృదయాల్ని తొడుక్కొని
సహాయ నిరాకరణతో
రాజ్యాన్ని ధిక్కరించినవి

గోసిపోసి, గొంగడి భుజానేసి
పల్లె పోరు పట్టాలెక్కింది
మీసాలు మెలేసిన రైలు
ఉషారు ఉడిగి ఉట్టి బొమ్మైపోయింది

బారికేడ్లు బద్దలు కొట్టి
నిషేధాజ్ఞలు ధిక్కరించి
మిలియన్‌ మార్చ్‌
టాంకుబండును విముక్తం చేసింది

యుద్ధభూమిన నిలబడ్డ కాలం
తన అంతిమ తీర్పు ప్రకటిస్తున్నది
ప్రజలే విజేతలు
ప్రజలే చరిత్ర నిర్మాతలు
కొత్త పొద్దుకోసం
కొంత రక్తాన్ని ధారపోస్తరు
తెలంగాణ నూత్న శిశువుకు
పురుడు పోస్తరు.