సిలికాన్ లోయ సాక్షిగా

కాలేజీ కథ

09-ఆగస్ట్-2013

“కొమస్తాజ్?” స్పానిష్ లో “హౌ ఆర్యూ?” అంది మరియా.

షాపు నించి వస్తూనే బైట వరండాలో వాళ్ల అమ్మ తో బాటూ నిల్చుని కబుర్లు చెబ్తున్న నన్ను ఆప్యాయంగా కౌగలించుకుంది.

మరియా అలీసియా పెద్ద కూతురు. దగ్గర్లోని హోల్ ఫుడ్స్ లో పనిచేస్తూంది.

“ఇలా లోపలికి వచ్చి కూర్చుని మాట్లాడుకోండి” అని పిలిచింది మమ్మల్ని.

“ఫర్వాలేదులే ఇంట్లో కూర్చుని, కూర్చుని బోల్డు బోరుగా ఉంది” అన్నాను.

“అదృష్టం ప్రియా, రోజల్లా నిలబడి ఉద్యోగాలు చేసే నా లాంటి వాళ్లకి దొరకని జీవితం నీది” అంది ఇంగ్లీషులో.

మళ్లీ తనే “రోజుకి 8 గంటలు, గంటకి 8 డాలర్లు, ఆదివారం తో సహా వారమంతా కష్ట పడినా ఈ ఇద్దరి పిల్లలకూ పై చదువులెలా అనే బెంగగా ఉంటుంది” అంది.

“మరియాని, పిల్లల్నీ వదిలేసి అతను మరో అమ్మాయి తో వెళ్లిపోయి అయిదు సం||రాలు అవుతూంది. బయట ఉంటే ఈ పిల్లల్ని చూసిపెట్టడానికి ఎవరూ లేరని మాతోనే కలిసి ఉంటూంది. తన జీవిత ధ్యేయం ఈ పిల్లలు కాలేజీ గ్రాడ్యుయేట్లు కావాలని”. అంది అలీసియా.

“అదేమిటి? చదువు ఫ్రీ కదా ఇక్కడ” అన్నాను.

“12 తరగతుల వరకే ఫ్రీ. ఆ పై కాలేజీ చదువులంటే మా లాంటి వారి తరం కాదు, అయినా ఆశ ఎక్కువ నాకు” నిట్టూరుస్తూ అంది.

“మా పిల్లలు 12 క్లాసుల వరకే చదివారు, మేమే కాదు మాలా ఈ దేశానికి వచ్చిన మా బంధుమిత్రుల పిల్లలందరి పరిస్థితీ ఇంతే” అంది అలీసియా.

“పిల్లలు స్వంతంగా ఉద్యోగాలు చేసుకుంటూ కాలేజీలో చదూకుంటారని విన్నానే. అసలు 18 ఏళ్లు రాగానే ఇంట్లోనే ఉండకుండా బయటికి వెళ్లిపోతారని….”

నేనేదో చెప్పబోతూండగా మరియా కల్పించుకుంది.

“అన్ని కుటుంబాలూ అలా ఉండవు. మరీ ముఖ్యంగా కంబైండ్ ఫామిలీస్ అలవాటు అయిన మెక్సికన్ సమాజం నించి వచ్చిన మా ఇళ్లల్లో”

“మీకూ, మాకూ ఆచార వ్యవహారాల్లో భలే విచిత్రంగా చాలా దగ్గర పోలికలున్నాయి తెలుసా!” అని ఆశ్చర్యంగా అన్నాను.
సంధ్య వెలుతురు చివరి కిరణం కూడా మాయమయ్యేవరకు మా కబుర్లు కొనసాగుతూనే ఉన్నాయి.

****

“పాపం వాళ్లింట్లో వాళ్లెవ్వరూ ఇంటర్మీడియేట్ దాటి చదూకోలేదట.” అన్నాను సూర్య తో రాత్రి భోజనం దగ్గర.
“అన్నట్లు, నువ్వేదో కాలేజీ లో చేరతానన్నావ్, వివరాలు కనుక్కున్నావా” అన్నాడు.
“ఇంకా లేదు, రేపు ప్రశాంతి వస్తుంది. కాథరీన్ దగ్గరికి వెళదామనుకుంటున్నాము వాళ్ల కాలేజీ గురించి కనుక్కోవడానికి”
“ఇంతకీ ఏమి కోర్సులో చేరాలనుకుంటున్నావ్”
“అదే ఆలోచిస్తున్నాను. ఇంటర్మీడియేట్ లో ఎం.పీ.సీ కదా నాది, కంప్యూటర్ ఇంజనీరిగ్ చెయ్యనా?”
“అదేమిటి నువ్వాల్రెడీ పీజీ చేసేవు కదా, మరలా డిగ్రీ నుంచి ఎందుకు?” అన్నాడు.

“అదీ పాయింటే. తెలుగు లో పీ.హె.డీ కి అప్లై చెయ్యాలంటే అసలేదైనా యూనివర్శిటీ ఆఫర్ చేస్తూందో, లేదో. పోనీ మరేదైనా పీజీ చెయ్యాలంటే టెరమ్స్, కండిషన్సు ఏమిటో. చేసినా మరిక్కడ ఉద్యోగాలు వస్తాయో రావో”

“అదన్న మాట సంగతి. ఇలా చూడు ప్రియా! ఉద్యోగమే ప్రధానమనుకుని చదివే ఆలోచన మానెయ్యి. నీకేది ఇష్టమవుతుందో అది చదవడానికి ప్రయత్నం చెయ్యి.” అన్నాడు.

“నీకర్థం కాదులే” అన్నాను చప్పున మొహం పక్కకు తిప్పి.
“ఏవిటో, ఏదైనా అంటే నీకర్థం కాదు అంటావ్”
“సర్లే, మా ఆఫీసులో కూడా ఎవర్నైనా కనుక్కుని చూస్తాను. అలా కోపగించకు. అనునయంగా అన్నాడు”

సూర్య దగ్గర ఒక మంచి అలవాటు ఉంది. నా ముఖం నవ్వుతూ లేకపోతే దానిని వెంటనే మార్చడానికి ఏదైనా చేస్తాడు.
“అన్నట్లు, ఈ వీకెండ్ లాంగ్ వీకెండ్, శాంతా క్రూజ్ వెళ్దామా, అక్కడ నీకిష్టమైన సముద్రం ఉంది “అన్నాడు.
సముద్రం అనగానే నా ముఖంలో సంతోషం, హుషారు చూసి “అదీ అలా ఉండాలి హాపీగా.” అన్నాడు మళ్లీ.

కాథరీన్ ఫోనులో కలవలేదు. ఈ-మెయిల్ పెట్టాను. తనా వారం లో బిజీగా ఉన్నానని కాలేజీ వివరాలు వెబ్ సైటులో చూడమని లింక్ పంపించింది.
మొట్టమొదట కోర్సుల కంటే, ఫీజు పేజీ లోకి నా వేళ్ళు చక చకా కదిలాయి.

అక్కడి నంబర్లు చూసేక గొప్ప దిగులు చుట్టుకుంది నాకు. సెమిస్టర్ కి ఫారిన్ విద్యార్థులకి పదివేల డాలర్ల పైన. ఇక ఎలిజిబిలిటీ లో తప్పని సరిగా ఇంగ్లీషు లాంగ్వేజీ ప్రొఫిషిఎన్సీ ని నిర్థారించే టోఫెల్ పాసవ్వాలి. ఇక ఇంజనీరింగుకి SAT లేదా, ACT టెస్టులు, MBA లకైతే మరొకటి, మరోటైతే మరొకటి…

మధ్యాహ్నం ప్రశాంతి వచ్చింది.
“ఉదయం నుంచీ వెబ్ లో కాలేజీ వివరాలు చూస్తున్నాను” అన్నాను.
“వివరాలు ప్రస్ఫుటంగా మీ ముఖంలోనే కనిపిస్తున్నాయి” అంది నిరాశని కనిపెట్టేసి.
“అవును, బోల్డు ఫీజు- మేం ఖచ్చితంగా కట్టలేం” అన్నాను చిన్న గొంతుకతో.
“చూద్దాం, నిరాశ పడొద్దు.” భుజం తట్టింది.
“కమ్యూనిటీ కాలేజీల్లో అయితే ఫీజు బాగా తక్కువ ఉంటుందట, కనుక్కున్నాను” అంది.
“అవునా, అయినా ఎలాగైనా మీరు భలే కనుక్కుంటారు విషయాల్ని” సంతోషంగా అన్నాను.
“నేను టీ పెడతాను. ఈ లోగా ఆ వెబ్ పేజీ ఏదో ఓపెన్ చేసి చూసి చెప్పండి ప్రశాంతీ.” అని లేచాను.
తను ఒక్కొక్కటిగా చదూతూంది.
“వావ్, ఫీజు సెమిస్టర్కి దాదాపు మూడు వంతులు తక్కువ.”
“అయినా మనకు ఫారిన్ ఫీజు వర్తించేది ఈ ఒక్క సంవత్సరమే, తెలుసా?” అంది.
తల అడ్డంగా ఆడించి “అదెలా?” అన్నాను.

“మనం డిపెండెంటులమైనా మన పేర్న టాక్సు ఐడెంటిటీ నంబరు తీసుకోవచ్చు. ఇలా ఒక సంవత్సరం టాక్సు పే చేసేమంటే మనం ఇక్కడ రెసిడెంట్లమన్నమాట. దాదాపు అన్ని కాలేజీలు ఇక్కడి రెసిడెంట్లకి ఫారిన్ ఫీజు లో మూడవవంతుకే అడ్మిషన్ ఇస్తాయి.” అంది.
అంటే వచ్చే సంవత్సరం మనం జాయిన్ అయితే మంచిదన్నమాట. అదీగాక ఇప్పుడు మనం చూస్తున్న ఫారిన ఫీజు అంటే పన్నెండువేలలో మూడవ వంతు కడితే సరిపోతుందన్న మాట.” గబ గబా లెక్కేసి “అంటే సెమిస్టర్ కి నాలుగువేలు”" అని “అమ్మో, అదికూడా ఎక్కువేనండీ, అదీ కట్టలేం” అన్నాను.

నాకు హఠాత్తుగా మరియా దిగాలు ముఖం గుర్తుకొచ్చింది. తనెందుకు అంత బాధ పడిందో అర్థం అయ్యింది.
“ఏమిటాలోచిస్తున్నారు? చూసేరా స్టాన్ ఫర్డ్ లాంటి ప్రతిష్టాత్మక ప్రైవేటు యూనివర్శిటీ లో అయితే రెసిడెంటు ఫీజే సెమిస్టర్ కి పదమూడువేల పైనట. అసలెవరు చదూకోగలరు? ఎలా చదువుకోగలరు ఈ దేశంలో” అంది.

“స్కాలర్ షిప్పులు , కేంపస్ ఉద్యోగాలు వగైరా ఫారిన్ స్టూడెంట్స్ కి కొంతవరకు ఫీజు భారాన్ని తగ్గిస్తాయి, కానీ మన లాంటి డిపెండెంటు వీసా కు ఏవీ ఉండవు.” అంది మళ్లీ.

“ఈ దిక్కుమాలిన వీసా వల్ల మనకు ఉద్యోగాలు ఎలాగూ రావు, ఇక్కడా దారులు మూసుకుపోతున్నాయన్నమాట” పెదవి విరిచాను.
ఇంతలో కాథరీన్ ఫోన్ చేసింది. “హాయ్ ప్రియా, నేను ఇవేళ త్వరగా ఇంటికి వచ్చేసాను. పిల్లల్ని తీసుకుని పార్కుకి వస్తాను, నువ్వూ వస్తావా” అంటూ.

“ప్రశాంతి ఇక్కడే ఉందని చెబ్తే, ఇంకేం అందరం కబుర్లు చెప్పుకోవచ్చు” అంది.
మరో గంటలో అందరం కలిసాం.

పిల్లలు ఇసుకలో కూలబడి సంతోషంగా ఆడుకుంటున్నారు. సముద్రపు ఒడ్డున ఉండే ఇసుకలాంటి మంచి మెత్తని ఇసుక కావడంతో నాకూ ఆడాలని అనిపించింది.

“వాళ్లలా ఆడలేం కానీ కనీసం కాళ్లు ముంచి కూర్చుందాం” అని అందరం నవ్వుకున్నాం.

జూన్ నెల సాయంత్రపు వెల్తురు చెట్ల ఆకుల మధ్య నుంచి అకాశమంత దీపానికి చిల్లులు పడ్డట్లు చెల్లా చెదరుగా ముక్కలు ముక్కలుగా నేల మీద పర్చుకుంటూంది.

వాయవ్య దిశగా గాలి వీస్తూంది. అటు చలీ, ఇటు వేడిమీ లేకుండా మధ్యస్తంగా, ఆహ్లాదంగా ఉంది పార్కులో.
ఇంట్లో ఉన్నంత సేపు ఆలోచన్లతో వేడెక్కిన నా తలకు బయటి గాలి సోకంగానే కాస్త స్థిమితంగా అనిపించింది.

“యూ నో ప్రియా, మా కాలేజీలో 50 ఏళ్ల ప్రొఫెసర్ ఇంకా తన కాలేజీ చదువు కోసం చేసిన అప్పు తీరుస్తూ ఉందట.” అంది కాథరీన్ మా రీసెర్చి సంగతి విని.

“ఈ దేశపు దౌర్భాగ్యాల్లో ఇదొకటి. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న కాలేజీ ఫీజుల్ని ఆపడం ఎవరి తరమూ కావడం లేదు. మొత్తం యంత్రాంగం భ్రష్టు పట్టి పోయింది. గత పదేళ్లలో పబ్లిక్ కాలేజీల ఫీజులు రెండింతలయ్యాయి. ప్రైవేటు కాలేజీలు ఎప్పుడూ ఆకాశం లో చుక్కల్లాంటివే. అయినా అవీ మూడవ వంతు పెరిగాయి. ఇక మిగిలినవి కమ్యూనిటీ కాలేజీలు. అవీ పెరిగినా, మిగతా వీటితో పోలిస్తే చవకే. కానీ అవి నాలుగు సం||రాల డిగ్రీని ఇవ్వవు. కేవలం రెండు సం||రాల డిప్లొమా లాంటి కోర్సులని ఆఫర్ చేస్తాయి. కావాలంటే ఈ రెండు సం||రాల తర్వాత మూడు, నాలుగు మరెక్కడైనా పబ్లిక్ యూనివర్శిటీ కి ట్రాన్స్ ఫర్ చేసుకుని డిగ్రీ పూర్తిచెయ్యొచ్చు. అయితే మంచి కాలేజీ లోచదివిన వాళ్ల విద్యాప్రమాణాల మీదే అన్ని కంపెనీల గురి. ఉద్యోగాలు సత్వరంగా రావడం కోసం డబ్బు ఖర్చు అధికమైనా ఈ “మంచి” అనిపించుకునే ఖరీదైన కాలేజీల్లో చేరక తప్పదు.” అని,
“సారీ- చాలా సేపు చెప్పేనా?” అంది.
“మీ దేశపు పరిస్థితి ఏమిటి?”అంది మళ్లీ.
“ఇక్కడిలా కాలేజీ ఫీజులుంటే మేమిద్దరం పీజీలు చేసే వాళ్లం కాదు.” అన్నాం.

“నా వరకు నేను ముప్ఫై అయిదేళ్లు వచ్చేవరకు కనీసం గ్రాడ్యుయేషన్ చెయ్యలేక పోయానంటే కారణాలు ఇవన్నీ. విక్టర్ ని పెళ్లి చేసుకునే వరకు నేను చదూకునే ఆలోచనే మానుకున్నాను. హైస్కూలు చదువుతోనే సరిపెట్టుకుని చాన్నాళ్లు రకరకాల చోట్ల రిసెప్షనిస్టుగా చేసాను” అని చెప్పుకొచ్చింది.

“మరి మీ ప్రభుత్వం ఏం చేస్తూంది?”,”విద్యార్థులంతా ఏం చేస్తున్నారు?” అంది ప్రశాంతి.
సమాధానంగా చిరునవ్వు నవ్వింది. “విద్యార్థులు చేయగలిగేది చేస్తారు, ప్రభుత్వం చేసేది చేస్తుంది.”
“ఏ దేశమైనా ఒక్కటే ఇలాంటి విషయాల్లో” నిట్టూర్చింది ప్రశాంతి.

“విక్టర్ వచ్చేవేళ అవుతూంది. ఆరూ, ఆరున్నరకల్లా డిన్నర్ చెయ్యక పోతే మర్నాడు రోజంతా స్పాయిల్ అవుతుంది” అని లేచింది కాథరీన్.

మేం ఇప్పటికీ 12 గంటలకు లంచ్, ఆరు గంటలకి డిన్నర్లకి అలవాటు పడనందున అక్కడే ఇంకాస్సేపు ఉండెళతామని చెప్పాం.
నిధి ఒక్కతే ఆడుతూంది ఈ సారి.

ఎన్ని సార్లు ఇసుక గుడి పడిపోయినా దీక్షగా మరలా కడుతూంది.
“నీళ్లు లేకుండా ఉత్తి ఇసుకతో ఎన్ని సార్లు కట్టినా గుడి నిలవదురా!” అన్నాను.

ఏదో అర్థమైనట్లు ప్రశాంతి నా వైపు తలపంకించి నవ్వుతూ
“అననుకూల పరిస్థితుల్లోనూ ప్రయత్నం మానని గొప్ప లక్షణమే లేకపోతే మనిషి కొత్త ఆవిష్కరణలు చేసేవాడు కాదేమో.” అంది.