కిటికీలో ఆకాశం

వలను ప్రేమించిన స్త్రీల వేదన -నిర్మల పద్యం

సెప్టెంబర్ 2013

మొగుడి పనులతో, పిల్లల పనులతో, ఇంటి పనితో సతమతమయ్యే స్త్రీ కోరుకునేదేమిటి?
ఒక పలకరింపు … మరి కాస్త ముందుకు వెళ్లి చెప్పాలంటే, ‘ఒక తల్లి పలకరింపు లాంటి పలకరింపు’
తన లోని బాల్యాన్ని తట్టి లేపే ఒక మృదువైన పలకరింపు ….

మరి, కూతురి ఇంటికి ఎపుడో ఒక సారి చుట్టపు చూపుగా వొచ్చే తల్లి కూడా, ఆ స్త్రీ ‘గృహిణీత్వం’ పైనే ప్రశ్నల పరంపరని సంధిస్తే ఆ స్త్రీ వేదన ఇంకెంత భారంగా వుంటుందో మీ అనుభవం లోకి రావాలంటే, కొండేపూడి నిర్మల రాసిన ‘వలను ప్రేమించే పిట్టల జాబితా’ ఒక సారి చదవండి …

అప్పుడెప్పుడో ‘రేవతీ దేవి’ (‘శిలా లోలిత’ కవితల సంపుటి కవయిత్రి ) ‘స్త్రీ’ ని ఇలా నిర్వచించింది -

‘పురుషుడికి అపారమైన శక్తి సామర్థ్యాలున్నాయి
అందచందాలున్నాయి /గుణ గణాలున్నాయి /తెలివి తేటలున్నాయి
అవన్నీ పురుషుడికి
తల్లిగా/ప్రేయసిగా స్త్రీ యిస్తుంది
అన్నీ యిచ్చి చివరికి మగాడి చేతిలో ఆట బొమ్మవుతుంది’

తెలుగు సాహిత్యం లో స్త్రీ వాద కవిత్వం రేవతీదేవి ని దాటి మరింత ముందుకు ప్రయాణించినపుడు, నిర్మల గారి కవిత్వం ఒక దివిటీలా దారి చూపించింది … స్త్రీలకు (మాత్రమే ) సంబంధించిన ఒక్కొక్క బాధనీ, స్త్రీ వేదనావరణం లోని భాషతో, పద బంధాలతో నిర్మల గారు ఆర్తిగా రాసినపుడు తెలుగు సాహిత్యం ఉలిక్కిపడిన రోజులు, అపుడపుడే సాహిత్య లోకం లోకి అడుగుపెట్టిన నాకు ఇంకా జ్ఞాపకం వున్నాయి ….. కొంత కాలం తర్వాత ఎక్కడో ఆమెని ప్రత్యక్షంగా కలిసాక, ‘ఓస్! … ఈమేనా కొండేపూడి నిర్మల అంటే …. చాలా గంభీరంగా ఉంటుందని అనుకున్నానే … చూస్తే మనిషి ఇంత సరదాగా వుంది ‘ అని చకితున్నయిన రోజూ జ్ఞాపకం వుంది-

ఇంతకీ, ఈ ‘వలను ప్రేమించే పిట్టల జాబితా’ లో ఆమె ఏం వెళ్లబోసుకున్నారు?

‘గుమ్మంలో అడుగుపెడుతూనే నీ మొదటి ప్రశ్న – అల్లుడుగారేరీ
రెండో ప్రశ్న – పిల్లలింకా రాలేదా
మూడో ప్రశ్న-ఇల్లిలా వుందేం … సర్దుకోలేవూ
దిక్కుల్ని కలియపెడుతూ నువ్వు చూపు తిప్పిన చోటల్లా
నా మొహం అతికించాలని విశ్వ ప్రయత్నం చేస్తాను
లాభం లేదు
నీక్కూడా నా కంటే నా గృహిణీత్వం మీదే మక్కువ
గట్టుకొక పేరు చొప్పునా విభజించి పాలించబడే
నది నిట్టూర్పును అణచుకుంటూ
ఈ పిల్లల కోడి నీ ముందు మాటలు ఏరుకుంటుంది
నేను నీ బిడ్డనమ్మా … నువ్వయినా అనవూ
ఎందుకే అమ్మడూ అంత పెద్దయిపోయావప్పుడే …
మురిపాల నా వొడి దిగి పారిపోయావప్పుడే … అని
తెల్లబడుతున్న చెంపలూ / తటాకాలవుతున్న కనుపాపలూ
నన్నెప్పుడూ బెంగపెట్టలేదు
శాశ్వతంగా చెల్లుబాటయే సామాజిక న్యాయమూ
నన్నెపుడూ భయపెట్టలేదు

ఎడతెగని తాపత్రయాల మూట భుజం మార్చుకుంటూ
మనిద్దరం ఎపుడు ఎదురైనా
గేట్లు పడిన దృశ్యమొకటే సజీవంగా కనిపిస్తుంది
పట్టాల కటూ యిటూ బాధతో రెపరెపలాడే మన నవ్వుల్ని
కోసుకుపోతూ రణ గొణ ధ్వనులబండి
రగిలిపోతూ నడుస్తుంది
మనవికాని శబ్దాలకలవాటు పడ్డ స్టేషన్లో
మన రక్తం పరుగులెత్తడం మరిచిపోతాం
రాస్తున్న ప్రతి ఉత్తరం లోనూ దిగులు మరక చిందకుండా
నేను జాగ్రత్తపడతాను
ముఖ్యమైన మూడు ప్రశ్నలకూ జవాబులందుకుని నువ్వేళ్ళిపోతావు
నా మాటలు నా నోట్లోనే కరిగిపోతాయి
నా బాల్యం నా లోనే చెరిగిపోతుంది
వలను ప్రేమించే పిట్టల జాబితాలో
నా పేరు మరో సారి నమోదవుతుంది’

‘మొగుడు-పిల్లలు-ఇల్లు -కుటుంబం’ అనే చట్రం లో ఇరుక్కుని, దానినే ప్రేమించే సగటు స్త్రీ స్థితిని ఉద్దేశిస్తూ, ఈ కవితకు ‘వలను ప్రేమించే పిట్టల జాబితా’ అని పేరు పెట్టడం లోనే కవయిత్రి చదువరిని మానసికంగా సిద్ధం చేసింది-
‘స్త్రీ’ ని నదితో పోల్చడం పాత విషయం … అయితే, ‘గట్టుకొక పేరు చొప్పునా విభజించి పాలించబడే నది’ అని ఆ పాత పోలికని నిర్మల ముందుకు తీసుకుపోయారు … ‘పురుషుడికి అన్నీ యిచ్చి అతడి చేతిలో ఆటబొమ్మయిన స్త్రీ’ అని రేవతీదేవి బాధపడితే, ఆ ఆట ఎన్ని రూపాలలో సాగుతున్నదో కొండేపూడి నిర్మల లాంటి కవయిత్రులు తమ బాధా శప్త నదుల రూపం లో కవిత్వీకరించారు-

కనీసం తల్లయినా తన బాధని అర్థం చేసుకోకుండా ప్రశ్నల వర్షం కురిపించినపుడు ‘ఈ పిల్లలకోడి నీ ముందు మాటలు ఏరుకుంటుంది’ అంటుంది … ‘మురిపాల నా వొడి దిగి అప్పుడే పారిపోయావెందుకమ్మా?’ అని ఒక ఓదార్పుని కోరుకుంటుంది …
కానీ, ఆ తల్లి కూడా పిల్లల కోడే కదా … ఆమె కూడా ‘వలని ప్రేమించిన పిట్టల జాబితా’ లో చోటు దక్కించుకున్న స్త్రీ యే కదా ! … అందుకే ఇక్కడ కవయిత్రి అంటోంది -’మనిద్దరం ఎపుడు ఎదురైనా గేట్లు పడిన దృశ్యమొకటే సజీవంగా కనిపిస్తుంది ‘ అని … ‘రాస్తున్న ప్రతి ఉత్తరం లోనూ దిగులు మరక చిందకుండా జాగ్రత్తపడతాను’ అని … చాలా సార్లు రక్తం చింద డాన్ని అయినా భరించగలమేమో గానీ, ‘దిగులు చింద డాన్ని’ భరించలేము కదా! … ముఖ్యంగా, పిల్లల కోడి అయిన స్త్రీ తన తల్లి ముందు దిగులు చింద డాన్ని అసలు భరించలేదు కదా … తన గురించి గాక తన గృహిణీత్వం గురించే పట్టించుకునే తల్లి అయినా సరే !

ఇదంతా సరే గానీ, కొండేపూడి నిర్మల లాంటి కవయిత్రులు సృజించిన ‘బాదాశాప్త నదుల’ లో మునకలేసిన తరువాత అయినా మన ‘మగ పురుషులలో’ స్త్రీత్వం కొంతయినా మొగ్గ తొడిగిందా ?

——————– * * * * * ————————