గల్పిక

సహదేవుడికో ఉత్తరం

సెప్టెంబర్ 2013

సహదేవుడికి,

నీకు ఉత్తరం రాయాలనిపించాక నీపేరు గుర్తు చేసుకోడానికి మొదలుపెట్టిన ప్రయత్నం ఎన్నసార్లు విసుగొచ్చినా ఆపలేకపోయాను.

మీ దుకాణం నుంచి దొంగిలించి తెచ్చిన మిఠాయిలో (నువ్వు ఒప్పుకునేవాడివికాదు నాన్నకుతెలియకుండా మిఠాయితేవడం దొంగతనం కాదని డబ్బులు తెస్తేనే దొంగతనమౌతుందని డబాయించేవాడివి) ఆ తీపి ఇప్పుడు కూడా నానోటికి అనుభవమౌతున్నట్టే వుంది.

టీచరుగారు వచ్చేలోపల నువ్వు మొదలుపెట్టిన కథ, ఔటు బెల్లులోనూ, అన్నం బెల్లు అయ్యాక మధ్యాహ్నం ఫస్టుబెల్లు లోపలా అవగొట్టేసేవాడివి. పలకమీద బొమ్మగీసి, కథచెబుతూ, ఉమ్మితో పలకతుడిచి, కథచెబుతూ, కొత్తబొమ్మగీసి, కథచెబుతూ సినిమా చూపించేవాడివి.

లవకుశలో లక్ష్మణ స్వామి సీతమ్మోరి ని అడవిలో వదలటానికి వెళ్ళేటప్పుడు నీనోటితో వినిపించిన గుర్రపు డెక్కల చప్పుడు ఇంకావినిపిస్తూనేవుంది.

వజ్రాలవేటకు వెళ్ళిన రాకుమారుడు రాకాసిలోయలో దారితప్పి పులివాగులో చిక్కుకుని అటుగా వచ్చిన గండభేరుండ పక్షిని గమనించి ఒడుపుగా రెక్కలో దూరి తలపాగాతో బంధించుకుని పక్షితోబాటే దేవలోకం చేరుకుని, రాకుమారిని పెళ్ళాడిన కథని పలకమీద ఎంత వేగంగా చెప్పావో జ్ఞాపకమొచ్చి నేనే ఆ రాకుమారుణ్ణన్నంతగా వెంటు్రకలు నిక్కబొడుచుకునేవి.

అదేదో తిరనాళ్ళకి వెళ్ళినపుడు మెడపైకెత్తి చూసినంత ఎత్తుగావున్న అమ్మోరి బొమ్మ మమ్మల్ని భయపెట్టినపుడు, నువ్వొక్కడివే ఎంటీవోడి లాగా (లవకుశలో రాములోరు) కత్తి కాంతారావులాగా భలేగనిలబడివున్నావుకదా!

ఇన్నిగుర్తువస్తున్నా, నువ్వు గుర్తొస్తున్నా, బక్కపలచటి నీ ఆకారం గుర్తొస్తున్నా, మీ మిఠాయిదుకాణం, గుర్తొస్తున్నా నీ పేరు గుర్తురాకపోవడం చికాకుగావుంది.

నువ్వేమిచేస్తున్నావో తెలియదుగాని నేను మాత్రం చాలా ఎదిగిపోయాను. ఈ ఎదుగుదల వెనుక నీ స్పూర్తి వుందని ఒప్పుకోనేమోగాని, నిన్ను మించిపోవాలన్న ఆశమాత్రం వుంది.

ఆశేమిటి నువ్వు ఆశ్చర్యపోతున్న ఈ లోకపు అద్భుతాల వెనుక వున్నదినేనే.

నువ్వు పలకమీద గీసి, కథచెబుతూ, సన్నివేశానికి తగిన చప్పుళ్ళు నోటితో వినిపిస్తూచెప్పిన కథలో అన్నీ ఏకకాలంలో చేసే మల్టీమీడియా గురించి, యానిమేషన్ గురించి, త్రీడి గురించి, ఇవన్నీ చేతిలో పెట్టుకు చూడ్డానికి పలకలాంటి ఐపాడ్ గురించీ తెలుసుకదా!

టివిలు శాటిలైట్ టివిలు మొబైల్ ఫోన్లు వీడియోగేములు ఒకటేమిటి …కాసేపు వినోదంకావలసిన వ్యాపకం పెద్దా చిన్నాతేడాలేకుండా అందరికీ అదేపనైపోయింది. వదలలేనివ్యసనమైంది.

ఇవన్నీనానుంచి వచ్చినవే. ఈ అద్భుతాలముందు నువ్వెక్కడ?

అపుడు
నాముందు నువ్వు విశ్వరూపం…
ఇపుడు
నీ ముందు నేను సమస్తలోకం

స్ధాయిలోకాకపోయినా స్నేహంలో నాకు సాటివాడివనిపిస్తున్న నీ పేరుకోసం ఇక వెతకదలచుకోలేదు. నేనే నీకు ‘సహదేవుడు’ అని పేరు ఖాయం చేశాను. అంటే…నీకు నేను చాలా పెద్దహోదా యిచ్చానని నీకు పెట్టిన పేరునిబట్టే నువ్వు అర్ధంచేసుకోవాలి.

నీజ్ఞాపకాలునాకు వున్నప్పటికీ నీ ఊహకందని నా విస్తరణ రీత్యా నువ్వనన్ను గుర్తుపట్టే అవకాశంలేదనుకుంటున్నాను.

నాసంతకం చూశాక నేనెవరో నీకు అర్ధం కావచ్చు.

వుంటాను
ఇట్లు
డిజిటల్ దేవుడు

సహదేవుడూ!ఎన్ని బింకాలుపోయినా అసలు సంగతి చెప్పకుండా వుండలేకపోతున్నాను. ముందుగా గొప్పలు చెప్పేసుకున్నాను కనుక ఇక అసలు సంగతికొచ్చేస్తాను

నువ్వు అసలైతే నేను నకళ్ళు నకళ్ళు గా లోకమంతా విస్తరిస్తున్నాను.

కానీ! ప్రపంచమంతా నువ్వే వున్నప్పుడు నీతోపాటు కుతూహలాలు, ఆశ్చర్యాలు, వైవిధ్యాలు, అన్వేషణలు, బుద్ధివికాసాలు, జ్ఞానకేంద్రాలు మనిషిమనిషిలో వికసించేవి !విలసిల్లేవి సాధించుకున్ననన్న సంతృప్తి తదుపరితరాలకు ఉత్తేజభరితమైన స్ఫూర్తిగా మిగిలేది

నావిస్తరణ పెరిగేకొద్దీ జీవన వైవిధ్యం అంతరించి ప్రపంచమే ఇరుకిరుకు గదుల్లో ఒంటరిదైపోయింది…కిక్కిరిసిపోతున్న జనారణ్యంలో మనుషులు ఏకాంత జీవులైపోతున్నారు

అన్నిటికీ మించి బాల్యం ఆటపాటల సహజవికాసానికి దూరమై నేనే ప్రపంచంగా,నాదేలోకంగా మగ్గిపోతోంది.ఇది నాకుకూడా చాలా బాధాకరంగా వుంది

నన్ను నేను ఉపసంహరించుకోలేనంతగా వ్యాపించడం వల్ల ఏమీచేయలేని నిస్సహాయుణ్ణయిపోయాను. నన్ను న్యూట్రలీకరించడానికి వందలు వేలమంది సహదేవుళ్ళు కావాలి!

డిజిటలులోకంలో మగ్గిపోతున్న పిల్లల విముక్తికి నీలాగే మరుగున పడిపోయిన సహదేవుళ్ళను సమీకరిస్తావా?

పిల్లల మనసుల్లో సహజమైన సంతోషాల్ని పూయిస్తావా?



3 Responses to సహదేవుడికో ఉత్తరం

  1. sreedhar parupalli
    September 1, 2013 at 4:33 pm

    మనిషిలో మనిషితనం లేదిప్పుడు. మనుషుల్లో వుండీ మనిషి ఒంటరి వాడు. సాంకేతిక ఖైదులో సహజత్వం కోల్పోయాడు. పక్కనే వున్నా సెల్లులో ఏదో సొల్లు కురిపిస్తుంటాడు. తనలో తనే మాట్లాడుకుంటూ అందిరిలో ఉన్న ఏకాకి ఇతడు. చందమామలు ముఖం చాటేశాక బాల్య పరిమళాలేమి ఉంటాయి? కత్తి యుద్ధాలు, విజయా వారి సినిమాలు లేవిప్పుడు. వ్యసనం సమస్తమైంది. విశ్వవ్యాప్తమైంది. ఎకనమిక్సులో అప్పుడెప్పుడో మా మాస్టారు చెప్పారు.. ది లా ఆఫ్డ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ అట. క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతమట. సింపుల్ గా వెగటు థియరీ. దురదృష్ట వశాత్తూ సాంకేతిక విప్లవానికి ఇది వర్తించదు.రిఫ్రిజిరేటరు, మొబైల్ ఫోను కావాల్సినంత కరెంటే వాడుకుంటాయి. అదనంగా తీసుకోవు. పైగా తీసుకోవాటానికి నిరాకరిస్తాయి. మనిషి అలాకాదు. అదనాలకు అలవాటు పడి పరిమళాలు పోగొట్టుకుంటున్నాడు. వీడు సహదేవుడు కాదు. సహజత్వాన్ని చంపే సహరాక్షసుడు కావచ్చు. ఇంటికొచ్చిన వారితో రెండు పొడిమాటలు మాట్లాడి ఆ తర్వాత ఛానెల్స్ మారుస్తూ టీవీకి అతుక్కుపోతున్నాడు. ఎదురుగా కన్పించే మనిషి పాత్రలను దూరం చేసుకుని సీరియల్స్ వికృతాలు చూస్తూ ఆనందిస్తున్నాడు. నెట్ ఇచ్చిన, నెట్టిచ్చిన ఉత్సాహంతో అరచేతిలో ఐపాడులు ఆవిష్కరించాడు మానవుడు. ఇవన్నీ వద్దనం కానీ గోరటి వెంకన్న పాట మాయమైపోతున్నాడో మనిషన్నవాడు ..పాడుకునే పరిస్థితి రాకూడదు.

  2. September 1, 2013 at 6:20 pm

    జాలంలో తిరుగుతున్న “ద్వీపకల్పం” కి సహదేవుడే వంతెనఅని ఎందుకనుకోకూడదు?

  3. రెడ్డి రామకృష్ణ
    September 2, 2013 at 6:25 am

    sreedhar parupalli గారూ.’మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు,
    మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడూ.. “ఈ పాట రాసింది అందెశ్రీ గారు.

Leave a Reply to రెడ్డి రామకృష్ణ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)