సిలికాన్ లోయ సాక్షిగా

డ్రైవింగు- లైసెన్సు

సెప్టెంబర్ 2013

డ్రైవింగ్ లైసెన్స్ మాట ఎత్తేసరికి సూర్య ముఖం మళ్లీ కంద గడ్డలా తయారైంది.

అదెందుకో అర్థం కావాలంటే సూర్య డ్రైవింగ్ లైసెన్సు కథ తెలుసుకోవాలి.

సూర్య అమెరికాకు నా కంటే రెండు నెలల ముందు వచ్చాడు. వస్తూనే కారు లైసెన్సు కోసం ప్రయత్నం మొదలు పెట్టాడు. మూడు వారాలు ప్రైవేటు కోచింగ్ కూడా తీసుకున్నాడు. నిజానికి మేమిద్దరం ఇండియా లో అప్పటికి రెండు, మూడేళ్లుగా కారు డ్రైవ్ చేస్తున్నాం. అయినా కారు నడపడంలో ఇక్కడి రూల్స్ కి, ఇండియా రూల్స్ కి పొంతన ఉండదు కాబట్టి ఎందుకైనా మంచిదని కోచింగ్ కు వెళ్లానని చెప్పాడు.(నిజానికి సూర్య కి నాకున్న ధైర్యం ఏ విషయంలోనూ ఉండదని నా నమ్మకం, అదే ఇక్కడ కూడా కారణమని నా అనుమానం.)

ఇక్కడ డ్రైవింగ్ లైసెన్సు రావాలంటే విధిగా రిటెన్ టెస్టు, ఫీల్డ్ టెస్టు పాసవ్వాలి. రిటెన్ టెస్టు పాసయ్యిన తర్వాత ఒక టెంపరరీ లైసెన్సు ఇస్తారు. దాంతో డ్రైవింగ్ ప్రాక్టీసు చేసి ఫీల్డు టెస్టుకి వెళ్లాలి.

రిటెన్ టెస్టు లలో సూర్యని మించిన వాళ్లుండరు. టెక్ట్సు పుస్తకాల నాలెడ్జ్ మెండుగా ఉంటుంది తనకి. రిటెన్ టెస్టు అంతా మల్టిపుల్ ఛాయిస్. ప్రశ్నలు 20 వరకు ఉంటాయి. అందులో మూడు తప్పుల కంటే ఎక్కువ వస్తే ఫెయిల్ అన్నమాట. ఒక్క తప్పు లేకుండా ఆ పరీక్ష పాసయిన రోజు తను ఫోను చేసి ఎంత సంతోషంగా మాట్లాడేడో ఇప్పటికీ గుర్తుంది.

అయితే నేను వచ్చి నెల్లాళ్లవుతున్నా తన ఫీల్డు టెస్టు గురించి మాత్రం ఒక్క ముక్కా చెప్పలేదు. ఆ విషయమే కాదు, అసలు డ్రైవింగ్ లైసెన్సు విషయం ఎత్తితేనే సంగతి ఇదన్న మాట.

ఇండియా నుంచి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సులు మాతో తెచ్చుకున్నాం. కానీ అవి కొన్నాళ్ల వరకు మాత్రమే పనికి వస్తాయి.
ఇక ఆ రోజు చెప్పక తప్పదన్నట్టు మెల్లగా ప్రారంభించేడు.

“వాడు అసలేమీ సరిగా నేర్పించలేదురా.”

“ఎవరు?”

“అదే, ఆ చైనా ఇన్ స్ట్రక్టరు….గట్టిగా మూడు శనాదివారాలు అటూ ఇటూ తిప్పి, ఆ… వెళ్లిపోండి టెస్టుకి అన్నాడు. అంతే కాకుండా అసలు వాడి భాష నాకో పట్టాన అర్థమై చావలేదు, ఆ ఇంగ్లీషు చైనీ భాషలా ఉంది.”

“ఊ..”

“ఇక పరీక్ష నాడు వచ్చిన పెద్ద మనిషి మరీ ఘోరం.” అని, పెద్దగా నిట్టూర్చి, “రోడ్డులో వెళ్తున్నపుడు హఠాత్తుగా “స్టాప్ హియర్” అంది. నాకు అదేమిటో అర్థమయ్యేలోగా నేను సడెన్ బ్రేక్ కొట్టడం, రోడ్డు మధ్యలో కారు ఆపడం వల్ల పరీక్ష ఫెయిల్ అవ్వడం,…..ఛీ..ఛీ….ఇంత వరకూ ఏ పరీక్షా ఫెయిల్ అవ్వలేదు.” నేను అనునయంగా చేతిని నిమిరేను.

“అంతేనా! నేర్పించిన ఇన్స్ ట్రక్టర్ కి అయిదు వందలు, కారు అద్దెకి తీసుకున్న ప్రతీసారీ యాభై చొప్పున మరో అయిదువందలూ వదిలేయి. ఇక నాకున్న ఆఫ్షన్ ఒకటే, నా టెంపరరీ లైసెన్సు ఎక్స్పైరీ అయిపోయే లోగా మరలా ఫీల్డు టెస్టు తీసుకోవాలి. ప్రియా! నువ్వూ త్వరగా రిటెన్ టెస్టు పాసయ్యేవనుకో. ఇద్దరం ఒకేసారి ఫీల్డు టెస్టు తీసుకుందాం.” అన్నాడు.

“అయ్యబాబోయ్, రాసే పరీక్షలు ఇక నా వల్ల కాదు” అన్నాను.

తనెంత చెప్పినా నన్ను కాస్త హాయిగా రెస్టు తీసుకోనీ, అని దాటవేసాను. నిజానికి నాకూ భయం పట్టుకుంది. “నేనూ ఫెయిల్ అయితే!” అని.

ఇండియాలో మేమిద్దరం డ్రైవింగు నేర్చుకోవడానికి, లైసెన్సు కు కలిపి బేరం కుదుర్చుకోవడం, అసలు మేం ఎటువంటి టెస్టులూ తీసుకోకుండానే మాకు లైసెన్సులు వచ్చేయడం గుర్తుకొచ్చాయి.

ఆ శనివారం ఉదయానే సూర్య ని నిద్రలేపి, దృఢంగా అన్నాను.

“పదా, కారు కొనుక్కొద్దాం.”

“ఏవిటీ, ఇవేళే… డబ్బులూ అవీ..”

“అవన్నీ చూద్దాం లే, నాకో ప్లానుంది”

“ఏవిటో”

“మనకు డ్రైవింగ్ లైసెన్సు రావాలంటే మనకు ముందు స్వంత కారుండాలి” అన్నాను.

“దానికీ, దీనికీ ఏమిటి సంబంధం?” ఆశ్చర్యంగా అన్నాడు.

“అక్కడే ఉంది కిటుకు”.

“నువ్వు డ్రెవింగ్ టెస్టు ఫెయిల్ అవ్వడానికి కారణం నువ్వు డ్రైవ్ చేస్తున్నావన్న విషయం నీకు తెల్సిపోవడం వల్ల” అన్నాను షెర్లాక్ హోంస్ లెవెల్లో కనిపెట్టేసిన ఫోజు పెట్టి.

“నాకొక్క ముక్క అర్థం కాలేదు”

“మిస్టర్ సూర్యా- ఆలోచించు. నువ్వు ప్రతీ సారీ అద్దెకి రకరకాల కార్లు తీసుకుంటావ్, డ్రైవ్ చేసిన ప్రతీ సారీ కొత్త కారు, కొత్త ఫీలింగు. ఇక టెస్టుకి వెళ్లే సమయంలో కారు ని హేండిల్ చెయ్యగలవో లేదో అనే విషయం మీదే నీ దృష్టి ఉంటుంది కానీ డ్రైవింగ్ మీద ఉండదు, ఇంకో విషయమేమిటంటే అలవోకగా డ్రెవ్ చెయ్యడం కూడా ప్రధానం. అదెప్పుడు వస్తుంది? రోజూ డ్రైవ్ చెయ్యడం వల్ల. నీ స్వంత కారు, నీకు అలవాటైన కారు లో పరీక్షకు వెళ్లడం వల్ల ఈజీ గా పరీక్ష పాసవ్వొచ్చు. ఏవంటావ్? ” అన్నాను కనుబొమలెగరేస్తూ.

“అయితే ఏమంటావ్”

“ఇప్పుడెళ్లి ఒక అద్దెకారు తీసుకుని రమ్మంటాను. మీ ఆఫీసుకెళ్లే దారిలో సెకండ్ హాండు కార్ల దుకాణం చూసేనన్నావుగా, అక్కడికెళ్లొద్దాం” అన్నాను.

ఆ సాయంత్రం మా స్వంత కారులో ఇంటికి వస్తున్నపుడు “ఇవేళే మనం కారు కొంటామని నమ్మలేక పోయాను సుమా!” అన్నాడు.
నిజానికి చేతిలో ఉన్న డబ్బులు కారు ఖరీదులో 30% మాత్రమే. అవి కట్టేసి మిగతాది లోన్ తీసుకున్నా, ఆ ఆనందం లో అవేమీ గుర్తు రాలేదు మాకు.

ఇక మర్నాడు పొద్దున్నే కాగితమ్మీద ప్లాను రాసి, నిద్ర పోతున్న సూర్య ముఖమ్మీద బోర్లించేను.

కాస్సేపటికి ఆ కాగితం నేల మీద దొర్లుతూంది.

ఇలా లాభం లేదని టాయిలెట్లో అద్దానికి అతికించేను, మళ్లీ తీసి తన లాప్ టాప్ మడత లో పెట్టేను.

ఇందాకట్నించి చూస్తున్నాను. “ఆ కాగితం తో కుస్తీ ఏవిటి?” అని లేచాడు సూర్య.

నా ఎగ్జయిట్మెంటు చూసి “ఆగాగు, అప్పుడే మొదలెట్టకు. నేనిప్పుడే వస్తాను” అని బాత్రూం లోకి పరుగెత్తాడు.

నాకిది బాగా ఒళ్లు మండించే విషయం. ఏదైనా విషయం సుదీర్ఘంగా చెప్పాలనుకున్నపుడు నేనిలా పాయింట్ల కాగితంతో తయారవ్వడం, అప్పుడే బాత్రూమని తను గంట సేపు బిడాయించుకోవడం…

ఇదంతా కొత్త కాకపోయినా ఉక్రోషం పట్టలేక తలుపు మీద నాలుగు బాదులు బాదేను.

“ఇదుగో, శ్రద్ధగా విను-ఇక్కడి నుంచే చదివేస్తున్నా. నంబర్ ఒన్- మనం ఇప్పుడు కాస్సేపట్లో బయటికెళ్తున్నాం, కారు డ్రైవింగ్ ప్రాక్టీసు చెయ్యడానికి.”

“ఏవిటీ, ఇంకేదో చాట భారతమనుకున్నాను.” అని, పదినిమిషాల్లో మొత్తం తయారై “రెడీ” అన్నాడు హుషారుగా.

“ఇంతకీ ఎక్కడికి ” అన్నాడు మళ్లీ.

“ఎక్కడికో నువ్వే చెప్పాలి.” అన్నాను.

తలూపి కారు స్టార్టు చేసేడు.

సరిగ్గా అరగంట లో డిపార్ట్ మెంట్ ఆఫ్ మోటార్ వెహికిల్స్ “DMV” ఆఫీసు ముందున్నాం.

ఆదివారం కావడంలో ఖాళీ పార్కింగు లాటు మధ్య షెడ్డులా ఉన్న ఆఫీసు వెనక వైపుకు కారు పోనిచ్చి..

“ఇదో ఇక్కడి నుంచే నన్ను కారు పోనియ్యమన్నారు.” అన్నాడు.

***

అది మొదలు ప్రతీ శనాదివారాలు క్రమం తప్పకుండా ఇద్దరం ఒకరి తర్వాత ఒకరం గంట గంట సేపు చొ||న ఆ ఆఫీసు డ్రైవింగ్ ట్రాక్ దగ్గర్నించి ఆ పక్క పక్క వీధుల్లో తిరగడం, మధ్య మధ్య ఇద్దరిలో ఒకరం ఇన్స్ ట్రక్టరులా అక్కడ పార్కు చెయ్యి, ఇక్కడ మలుపు తిప్పు
అని అడగడం…ఇలా ప్రాక్టీసు చెయ్యడం మొదలు పెట్టాం.

ఇక నా డ్రైవింగ్ రిటెన్ టెస్టు లిస్ట్ లో ముందు జరగాల్సిన పని.

పగలూ రాత్రీ కష్టపడి, DMV వాళ్లు ఇచ్చిన పుస్తకాన్ని బట్టీయం వేసి, ఆన్ లైన్ లో కొన్ని ప్రాక్టీసు పరీక్షలు రాసి, ఎలాగైతేనేం పరీక్షకు ప్రిపేరయ్యాను.

ఎందుకైనా మంచిది కాస్త ధైర్యంగా ఉంటుందని అలీసియా ను కూడా తీసుకెళ్లాను.

నన్ను, అలీసియాను, నిధిని ఆఫీసు దగ్గర వదిలేసి తను ఆఫీసుకెళ్లొస్తానని వెళ్లిపోయాడు సూర్య.

ఆన్ లైన్ లో అపాయింట్ మెంట్ తీసుకున్నా కదా, పరీక్ష మహా అయితే అరగంట. ఇంతలోనే ఆఫీసు మునిగి పోయింది కామోసని తిట్టుకున్నాను.

తీరా తలుపు తెరుచుకుని లోపలికి అడుగు పెట్టేసరికి అర్థమైంది సూర్య ఎందుకు వెళ్లిపోయేడో. అక్కడ అన్ని పనుల మీద వచ్చిన వాళ్లు దాదాపు మూణ్ణాలుగు వందలమంది ఉండి ఉంటారు.

హైదరాబాద్ లో రెయిల్ రిజర్వేషన్ కౌంటర్లలో లా జనం ఉన్నారు. ఎంట్రన్సులోనే రెండు లైన్లు. అందులో అపాయింట్ మెంటు
వాళ్లకొకటి, అపాయింటుమెంటు లేకుండావచ్చిన వాళ్ల కొకటి. రెండూ పెద్ద లైన్లే.

ఇదంతా అయ్యేక ఒక నంబరు కాగితం ఇస్తారు. ఇక అది పుచ్చుకుని కౌంటర్లలో మన నంబరు వచ్చే వేళ కోసం వేచి చూడాలి.

అదొచ్చేక పరీక్ష రాసేందుకు వెళ్లాలి. అదీ అయ్యాక రాసేసిన పరీక్షా కాగితం పట్టుకుని మళ్లీ ఒక లైన్లో నిలబడాలి. ఆ లైన్లో కౌంటర్ దగ్గర అప్పటికప్పుడు దిద్దేసి పాసో, ఫెయిలో చెప్పేస్తారు. కానీ ప్రతి ఒక్కరికీ దిద్ది పంపడానికి కౌంటర్ల వెనుక మహా అయితే ఇద్దరుంటారు. ఆ లైన్లలో గంట తర్వాత బాగా విసుగెత్తడం మొదలైంది నాకు. పాపం, నిధి అలీసియా దగ్గర బుద్ధిగా కూచుని నా వైపే చూస్తూంది. నాకు జాలీ, నీరసం ముంచుకొచ్చాయి. మొత్తానికి నా వంతు వచ్చింది. కౌంటర్ లో దిద్దే ఆమె నా ప్రశ్న పత్రం తీసుకుని ఒకటో, రెండో దిద్దేసరికి వెనక మరెవరో వచ్చి ఆమెను దేనికో పిల్చుకుపోయారు. మరి కాస్త లేటు, టెన్షను…చివరికి ఆవిడ వచ్చి కంగ్రాట్స్ చెప్పేవరకు తల బద్దలైపోయింది. రెండు తప్పులతో గట్టెక్కింది నా పరీక్ష.

ఆ తర్వాత మళ్లీ లైను. ఈ సారి టెంపరరీ లైసెన్సు, ఫోటోల లైను.

ఎంతకీ తెమలని ఈ సిస్టమేమిట్రా భగవంతుడా అనిపించింది.

ఉదయం తొమ్మిదింటికి వెళ్లిన వాళ్లం మధ్యాహ్నం 2 గంటలకు బయట పడ్డాం.

అలీసియా నేను పాసయ్యేనని విని సంతోషంగా నా చెయ్యిపట్టుకుంది.

సూర్యకి ఫోన్ చేసి చెప్పేసి రిటన్ వచ్చేటప్పుడు బస్సెక్కేం.

నిధికి కాసిన్ని బిస్కెట్లు తెచ్చేను లక్కీగా. అవి తిని దారిలోనే నిద్రపోయింది.

ఇక బాగా ప్రాక్టీసు చేసి ఉన్నామేమో ఫీల్డు టెస్టు కష్టం కాలేదు. ఒకళ్ల తర్వాత మరొకళ్లం టెస్టు తీసుకుని మరో రెండు వారాల్లోనే లైసెన్సులు పుచ్చుకున్నాం.

ఫీల్డు టెస్టులో బొటా బొటీగా మార్కులొచ్చాయి నాకు. అయినా ఎక్కడా ఫెయిలవ్వకుండా మొదటి సారి పాసయిన గర్వం నా మొహం లో కనిపించనివ్వకుండా ఎంత జాగ్రత్తపడ్దామనుకున్నా వీలవ్వలేదనుకుంటా.

“పెద్ద గొప్పేలే” అన్నాడు నా చేతిలో పాస్ కాగితం చూసి సూర్య.

“నీకెన్నీ” అని నేనడుగుతూ ఉంటే “ఎన్నయితే ఎందుకు పాసయ్యా” అన్నాడు.

***

ఇక అప్పట్నించీ నా గొప్పకి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. డ్రైవింగ్ నాకొక్కదానికే వచ్చినట్లు అడిగిన వాళ్లకీ, అడగని వాళ్లకీ డ్రైవింగ్ టెస్టు ఎలా పాసవ్వాలో లెక్చర్లు ఇవ్వడం కూడా మొదలుపెట్టాను.

ఆగస్టు నెల మూడవ వారం, ఫాల్ లో నిధి స్కూల్ లో జాయిన్ అయ్యింది.

ఉదయం దిగబెట్టడం సూర్య వంతు, మధ్యాహ్నం స్కూల్ కాగానే తీసుకొచ్చుకోవడం నా వంతు డ్యూటీలుగా పెట్టుకున్నాం. కారు సూర్య పట్టుకెళ్తాడు. రోజూ నిధిని తీసుకు రావడానికి నేను నడిచి వెళ్లొస్తూంటాను. నిధి నడవనని పేచీ పెడుతుంది సాధారణంగా. తన బేబీ కార్ట్ ఇప్పటికీ ఇలా ఉపయోగపడ్తూంది. దారిలో కనబడ్డ కార్ల రంగులు చూస్తూ, వెనక నుంచి వచ్చే కారు రంగేమిటో చెప్పే దొంగాట ఆడతాం మేం రోజూ. తను చెప్పిన రంగు కారు వచ్చిందంటే ఆ పిల్ల ఆనందం చూడాలి. కిలకిలా నవ్వేసుకుంటుంది.

ఆ రోజు సూర్యకి ఉదయానే ఫోన్ లో మీటింగ్ ఉండడంతో తొమ్మిది వరకు ఇంట్లోనే ఉండవలిసి వచ్చింది.

“నిధిని ఇవేళ నువ్వు దిగబెట్టగలవా, కారు తీసుకెళ్లు.” అన్నాడు తన పని లోంచి తలెత్తకుండానే.

ఇంటి నుంచి మహా అయితే మూడు సిగ్నళ్ల దూరం స్కూలు. అయినా నడవడానికి ఎక్కువ సమయం పడుతుంది.

సరిగ్గా కారులోకి వెళ్లేసరికి జ్ఞాపకం వచ్చింది. సూర్యకి కాఫీ కలిపి పెట్టి చెప్పడం మరిచిపోయాను. తను పనిలోపడి చూసుకుంటాడో లేదో. వెనక్కి వెళదామా అనుకునే లోగా “మమ్మీ!” అంటూ నిధి చిటికెన వేలు చూపించింది.

“ఇప్పుడా! అంటూ వెనక్కి ఇద్దరం రెండస్తులూ ఎక్కి వెనక్కి వచ్చేం. ఎలాగూ వచ్చేను కదా అని సూర్య తో మాట్లాడబోతే అప్పటికే ఫోన్లో మాట్లాడుతూ కనిపించాడు.”

ఇక కాఫీ మైక్రో ఓవెన్ లో ఒక్క నిమిషం పాటు వేడి చేసి తెచ్చి తన టేబుల్ మీద పెట్టి గబగబా కిందికి నిధి చెయ్యి పట్టుకుని పరుగెత్తాను.
అప్పటికే ఆలస్యం అయిపోయింది. “స్కూలుకి మూడు బెల్లులూ కొట్టేసి ఉంటారు, అవునా పాపాయ్” అన్నాను.

చిన్న పిల్లకు తెలీదని తెల్సినా నా ఆదుర్దాలో పైకి మాట్లాడేను.

ఇక మరో సిగ్నల్ లో స్కూల్ ఉందనగా ఇక లాభం లేదని స్పీడు పెంచాను.

సరిగ్గా స్కూల్ గేట్ లోకి తిరగబోతుండగా ఎక్కడి నించో “బొయ్ బొయ్” అని గట్టిగా పోలీసు హారన్ వినిపించింది.

ఇక్కడసలెవరూ సాధారణం గా హారన్ కొట్టరు. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా డ్రెవ్ అలవాటైన చోట ఈ శబ్దం మరీ భయంకరంగా అనిపించింది.
అసలు నాకు అర్థమయ్యేలోగా వెనక నించి మోటార్ బైకు మీద లైట్లు వెలిగించుకుంటూ, హారన్ మోగించుకుంటూ పోలీసు నన్ను ఉన్న పళంగా రోడ్డు పక్కకు కారు ఆపమని సిగ్నల్స్ ఇస్తున్నాడు.

అంతలోనే కారు కిటికీ దగ్గరికొచ్చి అద్దం దించమని “స్కూల్ రోడ్డు లో స్పీడు ఎంతో తెలుసా?” అనడిగేడు.
కారు డోరు తియ్యబోతుంటే “నో.. నో..మీరక్కడే కదలకుండా కూర్చోవాలి” అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది. ఇక్కడ పోలీసులు ఇలా కార్లు ఆపితే మన సీటు లో నుంచి కదలకుండా మాట్లాడాలి.

“ఆదుర్దాగా, అయాం సారీ……పాప స్కూల్ కి టైం అవుతుంటే….” అని ఏదో చెప్పబోయాను.

“స్పీడు 25 మైళ్లకు మించకూడదు. కానీ మీరు 40 మైళ్ల నిషిద్ధ స్పీడుతో వెళ్తున్నారు.” అంటూ “డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు ఇలా ఇస్తారా” అన్నాడు.

చేతిలో గులాబీ రంగు టిక్కెట్టు కాగితంపెట్టి, “దీని మీద ఉన్న వెబ్ సైటుకి ఓ వారం పోయాక వెళ్లితే మీరు ఎంత ఫైన్ కట్టాలో తెలుస్తుంది. ఇంటికి ఉత్తరమూ వస్తుంది. అంతే కాకుండా ఇక్కడ ఉన్న సెంటర్ కు వెళ్లి…” అంటూ ఎడాపెడా ఏదో చెప్పాడు.
అసలు నా బుర్ర పనిచేస్తేగా.

అప్పటికే అవ్వాల్సిన ఆలస్యం అయ్యింది. అయిదు నిమిషాల లేటు కాదు కదా, పదిహేను నిమిషాల లేటయ్యింది.

ఇక స్కూల్ కి వెళ్లడం అక్కడ ఆఫీసు వాళ్లకి కథ చెప్పడం ఇష్టం లేక వెనక్కి తిప్పాను కారుని.

నా దు:ఖపు ముఖం చూసి ఏమనుకున్నాడో ఏమో అవతలి వాళ్లకు ఏదో అర్జెన్సీ, కాస్సేపు తను ఆఫ్ అవుతున్నానని చెప్పి గబ గబా దగ్గరకి వచ్చాడు సూర్య.

ఇక నాకు ఏడుపు ఆగలేదు. బిక్క మొహం వేసుకుని చూస్తున్న నిధిని చూస్తూ “ఏమైంది, ఆలస్య మైందని ఇంటికి వెళ్లిపోమన్నారా? ఇంతకే ఇలా ఏడిస్తే ఎలా? ఇందాక మీరు వెనక్కి వచ్చినపుడే అనుకున్నాను…” అని ఇంకేదో అనబోతుండగా నా చేతిలోని కాగితం తన చేతిలో పెట్టాను.

“ఓ మై గాడ్, పోలీస్ టిక్కెట్టా!” అనరిచాడు.

“అయిపోయామురా. ఈ దేశం లో టిక్కెట్టంటే ఫైన్ తో బాటూ, డ్రైవింగ్ హిస్టరీ లో చెరగని మచ్చ, అదీగాక ఇన్సూరెన్సు ప్రీమియం కూడా పెరిగి పోతుంది” అని పుండు మీద కారం జల్లినట్లు ఏకరువు పెట్టాడు.

అసలే పోలీసుకి పట్టుబడడం ఒక షేం గా కుతకుతా ఉడికి పోతున్న నాకు ఈ మాటలు వినేసరికి విపరీతమైన కోపం వచ్చింది.
“అసలు నువ్వే చేసేవిదంతా. దిక్కుమాలిన మీటింగంటూ ఉదయానే నాకసలు అలవాటు లేని పని అప్పగించావు. ఇప్పుడు చూడు ఏమైందో” అన్నాను బాధ, ఏడుపు మిళితమైన స్వరంతో.

సూర్య తల పట్టుకుని కూచున్నాడు మాట్లాడకుండా.

ఆ సాయంత్రం తిరిగి ఆఫీసు నించి తనొచ్చినా పలకరించకపోవడం చూసి, “ఇంకా పోలీసు గోలేనా?” అన్నాడు.

“అయినా లైటు తీసుకోలే. ఇక్కడి ట్రాఫిక్ పోలీసోళ్లు నెలాఖర్లో కోటాకి తక్కువ కేసులుంటే బాగా విజిలెంటుగా కాపుగాసి ఇలా ఫైన్లు వేస్తారట. మన దురదృష్టం, నువ్వు దొరికేవు” అని నిట్టూర్చేడు.

నేనిక మౌన ముని లాగా కూర్చుని విన్నాను.

ఇక సరిగ్గా వారం తర్వాత పోస్టు లో వచ్చిన ఫైన్ చూడగానే పుండు రేగినంతగా బాధ తో గుండె కలుక్కుమంది.

అందులో ఉన్న ఫైను “అక్షరాలా మూడువందల డెబ్భై ఒక్క డాలర్లు”

అంటే దాదాపు పదిహేడు వేలు ఇండియాలో.

“ఇంత చిన్న పొరబాటుకి అంత శిక్షా!” నాకు నోట మాట రాలేదు. దు:ఖం తో, అవమానంతో గొంతు పూడుకుపోయింది.
సరిగ్గా గంట తర్వాత సూర్య గొంతు వినబడడం తో ఈ లోకంలోకి వచ్చాను.

“ఇందులో మూడు ఆప్షన్లు ఉన్నాయి చూసేవా! అన్నాడు.

నువ్వు కావాలంటే కోర్టు లో కేసు పెట్టుకోవచ్చు. నువ్వు నెగ్గేవనుకో నీ ఫైన్ మాఫీ చేస్తారు. ఓడిపోయావనుకో నీకిక విముక్తి లేదు.
అంత ఫీజూ ఫైను కట్టి, మరలా మరో కొంత డబ్బు కట్టి మూడు రోజుల పాటు వాళ్ల ట్రైనింగు సెషన్సుకి అటెండ్ అయ్యి, చివరగా పరీక్ష మరలా పాసైతే ఈ మచ్చ ని డ్రైవింగ్ లైసెన్సులో నుంచి అసలంత వరకూ ఏమీ జరగనట్లు తీసేస్తారట.

ఒక వేళ ఫైనొక్కటే కట్టి ఈ సెషన్సుకి అటెండ్ కాకాపోతే యథావిధిగా నీ హిస్టరీ లో ఈ విషయం నమోదు చెయ్యబడుతుంది.”
నేనేదీ వినే స్థితిలో లేను. ఏం చెయ్యాలో చెప్పు అన్నాను హీనమైన గొంతుకతో.

“ముందు లేచిరా. కాస్త టీ పెట్టి ఇస్తాను.” అని నా తల నిమిరి, “సర్లే పొరబాట్లు జరగకుండా ఉంటాయా!” తర్వాత చూద్దాం. ఇంకా నెల రోజుల సమయం ఉందిలే” అన్నాడు.

కోర్టుకి వెళ్లి ఇంత ఫైను న్యాయమా అనడగాలని ఉన్నా, “కొత్త దేశం, కొత్త రూల్సు…మనకెందుకులే..కష్టమో, నష్టమో డబ్బు కట్టేసి, ట్రైనింగు తీసుకో” అని సూర్య సలహా పాటించి వీలైనంత త్వరగా ఆ మచ్చని మాపుకునే ప్రయత్నం చేసాను.
అసలే పరీక్షలంటే విసుగెత్తిన నాకు ఇది ఒక అగ్ని పరీక్ష అయ్యింది. ఏదైనా తన దాకా వస్తే గానీ తెలీదని, నాకున్న ధైర్యం అంతా ఏమైపోయిందో అర్థం కాలేదు.

అనుకోకుండా ఒకరోజు సూర్య డైవింగ్ ఫీల్డు టెస్టు రిజల్టు కాగితం కనబడింది. అది మేమిద్దరం కలిసి తీసుకున్న టెస్టు. ఆశ్చర్యంగా ఒక్క తప్పు లేదు తనకి.

కారణం అదో, నేననుభవించిన పోలీసు టిక్కెట్టు బాధో తెలీదు కానీ ఇక అప్పటి నుంచీ పోలీసుల్ని చూసినా, డ్రైవింగ్ లైసెన్సు మాటెత్తినా ఎవరి ముఖం కందగడ్డలా మారుతూందో వేరే చెప్పాలా!